పాటల భైరవి కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాటల భైరవి కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, డిసెంబర్ 2024, మంగళవారం

మనసే జతగా పాడిందిలే - 28 - కవలపాటలు - ఉన్నోడ నడందా ... కల్లాన కాడు...పూచేటి పూవనమాయెనులే!


ఆ రెండు కనులవ్వి - ఇద్దరివి కలిసి
మది పాటయ్యి సాగీ - ఇద్దరితో చేరి
పాడింది ఆ వనమే...
జతిలో - పాడింది ఆ వనమే!

ఎన్నెన్నో కలలయ్యి - ఇద్దరిలో మెరిసి 
ఎద పదమయ్యి కదిలీ - ఇద్దరిని కూడి
ఊగింది ఆ వనమే...
జతగా - ఊగింది ఆ వనమే!


మిణుగురుల మిలమిలలే
ఇద్దరి - కనులల్లో మెరిసే
కన్నుల్లో - వెన్నెల్ల జల్లయ్యి కురిసే

ఆ రెండు కనులవ్వి - ఇద్దరివి కలిసి
పాడింది ఆ వనమే...
జతిలో - పాడింది ఆ వనమే!
రాగాల వనమాయే...
ఆ రాల వనమే!

సెలయేటి కలకలలే
అద్దరి - కలలల్లో మెరిసే
కలల్లో - వలపు వెల్లువయ్యి విరిసే

ఎన్నెన్నో కలలయ్యి - ఇద్దరిలో మెరిసి 
ఊగింది ఆ వనమే...
జతగా - ఊగింది ఆ వనమే!
పూచేటి వనమాయే...
ఆ రాలు వనమే!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పాటలు ఎప్పుడూ బావుంటాయి. 

    అందమైన మాటలు పేర్చి - వినసొంపైన రాగం కూర్చి - కట్టిన పాటలు - కదలనీయక కట్టిపడేస్తాయి. పదేపదే వినమంటాయి. వింటూనే వుండమంటాయి. 

    అలాంటి పాటలు ఎన్నో ఇంతకు ముందూ వున్నాయి. ఇవాళా వస్తున్నాయి. ఇక ముందూ రాబోతాయి. 

    కాకపోతే ఇంతకు ముందున్న, ఇప్పుడొస్తున్న, ముందు రాబోతున్న అన్ని పాటలూ వింటామా లేదా అనేది - విన్న తర్వాత అవి మనకు నచ్చుతాయా లేదా అన్నది - ఆయా విన్నప్పటి క్షణాన ఆయా చెవులు చేసుకున్న పుణ్యఫలం. 

    ఒక్కో వేళ అనుకోకుండా ఓ మంచి పాట నాకు తారసబడటం అన్నది నా తారాబలాన్ని బట్టే అని నాకొక బలీయమైన నమ్మకం. 

    కిందటి మంగళవారం అనగా డిసెంబర్ 10 వ తారీఖు, 2024 వ సంవత్సరం - మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు - నా పాట-తారాబలం బహు బాగా వున్నట్టుంది. 

    ఓ మాంఛి పాటొకటి విన్నాను, చూశాను. 

    వినడానికి అలనల్లన అలల మీద తేలుతున్నట్టు, చూడడానికి గాలితో తూలుతున్నట్టు గానూ వున్న ఆ పాట "విడుదలై-1" అనే ఓ తమిళ డబ్బింగ్ సినిమా లోనిది. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    శీతాకాలపు సాయంత్రం. పొద్దు తొందరగా వాలిపోయింది. 

    సాయంత్రం భోజనం కాగానే కాలక్షేపం వెతుక్కుంటూ వుంటే బద్రికి విజయ్ సేతుపతి సినిమా "విడుదలై-1" గుర్తొచ్చింది. ఈ మధ్యే ఎక్కడో దాని గురించి చదివారట. బావుంటుందని చదివినట్టు గుర్తుందట. 

    బద్రికి, నాకూ కూడా విజయ్ సేతుపతి సినిమాలు ఇష్టం. 

    బావుంటాయి.  మేమిప్పటి వరకు చూసినవి కొన్నే అయినా చూసినవన్నీ నచ్చాయి. 

    ఈ మధ్యే చూసిన "మహారాజా" అయితే మరీ నచ్చేసింది. అది చూసినప్పట్నుంచి అతని పాత సినిమాలు అన్నీ వెతుక్కుని చూడాలనుకుంటూ వున్నాము. 

    అంతే కాకుండా నాకు పెద్దగా విజయ్ సేతుపతి గురించి ఏమీ తెలియకపోయినా - అతని గురించి చదివిన ఒక వార్త వల్ల నాకు అతనంటే గౌరవం. 

    అతను హీరోగా వున్న ఒక సినిమాలో కృతిషెట్టి అనే అమ్మాయిని హీరోయిన్‌గా పెడదామనుకుంటే విజయ్ సేతుపతి ఒప్పుకోలేదట. ఎందుకంటే అంతకు ముందు "ఉప్పెన" అనే తెలుగు సినిమాలో కృతిషెట్టి అతని కూతురుగా నటించింది. కూతురుగా చేసిన అమ్మాయితో romance చేయడానికి ఒప్పుకోలేదు విజయ్ సేతుపతి. నటన ఒక వృత్తే అయినా అందులో తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకున్న విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళని గౌరవించి precious గా చూసుకుంటే - వాళ్ళలా ఇంకొంతమంది మంచివాళ్ళు తయారయ్యే అవకాశం వుంటుంది. అందుకే అతనంటే  మహా గౌరవం. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అందుకే "విడుదలై-1" గురించి బద్రి గుర్తు చేయగానే చూడడం మొదలుపెట్టాము. సినిమా మొదలవుతూనే ఇంతకు ముందు సగం చూసినట్టు గుర్తొచ్చింది బద్రికి. సరే! ఇప్పుడు పూర్తి చేద్దాంలే అనుకుని continue చేశాం. 

    సినిమా మొదలైనప్పట్నుంచీ కుమరేశన్ అనే ఓ పరోపకారి పాపన్న పోలీసు, అతన్నిష్టపడే ఓ అమ్మాయి , ఇంకా మిగిలిన బోల్డంత మంది పోలీసులూ - వీళ్ళ చుట్టూనే కథ తిరుగుతూ వుంది. 

    మధ్యలో ఎక్కడో గానీ విజయ్ సేతుపతి రాలేదు. 

    అయినా సినిమా బావుండడం వల్ల ఇవేమీ పెద్ద పట్టించుకోదగిన విషయాలు అనిపించలేదు. పైగా ఆ కుమరేశన్‌గా చేసిన సూరి అనే అతను, ఆ అమ్మాయి భవానీ శ్రీ అందరూ చాలా బాగా నటిస్తున్నారు. 


    సినిమా అంతా కూడా ఎంతో సహజమైన పరిసరాల్లో, వాతావరణంలో చక్కగా సాగుతోంది. అక్కడక్కడా కొంచెం హింస వున్నా కూడా అలాంటి చోట్ల చూడకుండా forward చేసుకుంటూ చూసేస్తున్నాము. 

    ఇంతలో ఓ పాట వచ్చింది. 

    అదెలాంటి పాటంటే ... అలాంటిలాంటి పాట కాదు. 

నేనింతకు ముందు అన్నట్టు ... 
వినడానికి అలనల్లన అలల మీద తేలుతున్నట్టున్న పాట
చూడడానికి మెలమెల్లగ గాలితో తూలుతున్నట్టున్న పాట
మిణుగురులు మూగిన పాట
మురిపాలు మోసులు సాగిన పాట
కనుల కలయికలో నెయ్యాలు పూచిన పాట
తనువుల యెడమై డెందముల చేరువైన పాట

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



    తెర మీద చూస్తున్నప్పుడు కుమరేశన్ (సూరి), పాప (భవానీ శ్రీ ) ఒక లాంతరు పట్టుకుని అడవి మధ్యలో - ఆ వెలుతురు-చుట్టులో - వాళ్ళని చుట్టుముట్టిన వలపు-మెరుపుతో - గాలిలో తేలుతున్నట్టుగా అడుగులు వేస్తూ (slow-motion లో తీశారు ఈ పాటంతా) వుండగా - నేపథ్యంలో ఉరుములు మువ్వలని అనుకరిస్తే ఎలా వుంటుందీ?! - అలాంటి drum sound - పాట వెనకాల మోగుతూ వుంటుంది. 

    అనుపల్లవిలో "ఈ వింత మాయంతా... నీ మహత్యమే!" అన్న వాక్యం దగ్గర వాళ్ళిద్దరి చుట్టూ ముసిరి మెరుస్తున్న మిణుగురుల మినుమించులు కళ్ళకి మిరుమిట్లు గొలుపుతాయి. 

    అనుపల్లవి ముగిసి - మొదటి చరణానికి ముందు వచ్చే interlude దగ్గర మెరిసేటి నీళ్ళ సెలయేరు ఒక అద్భుతం! 

     చిమ్మ చీకటి
చీకటి కమ్ముకున్న రేయి
రేయి మూగిన రాల కొండలు
కొండల మీద చిక్కగా పరుచుకున్న అడవి
అడవి నడుమ రాల బాట
రాల మీదుగా నీటి కాలవ
    అమ్మాయి చేతి లాంతరు వెలుగు 
    ఆ వెలుగులో మెరిసిన అబ్బాయి కళ్ళు
ఆ మెరుపుకి విరిసి సోలిన అమ్మాయి కళ్ళు
    మిలమిల మూగిన మిణుగురులు 
    జలజల పారిన సెలయేర్లు

     చూడడానికి ఈ పాట ఒక painting-in-motion లా అనిపించింది నాకు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    చూపుకి అబ్బురపు చిత్తరువనిపించిన ఈ పాటని చెవులకి అచ్చెరువపు పదమనిపించేటట్టు కట్టినది - 
ఇలకి అమృతాన్ని స్వరాల రూపంలో పంచడానికి వచ్చిన ఇళయరాజా. 
    
    తెలుగులో ఈ పాట కార్తీక్ - అనన్య భట్ పాడారు. తెలుగులో పాటని రాసినవారు చైతన్య ప్రసాద్.

    తమిళంలో కూడా విందామని వెతికాను. ముందు వినగానే ఇళయరాజానే పాడారేమో అనుకున్నాను. కానీ కాదట. తమిళంలో పాడిందెవరో తెలుసా? ధనుష్ - అనన్య భట్. తమిళంలో పాటని రాసిందేమో శుక అట. 

    ధనుష్ అంటే ఎవరో వేరే "పాటక్కార్" అనుకున్నా కానీ  మన వేలై-ఇల్లద-పట్టక్కారన్ (VIP) హీరో అని తెలిసి భలే ఆశ్చర్యపడిపోయేశా! 


    భలే! "Why this కొలవెరి" అంటూ ఏదో సరదా పాటొకటి పాడాడు అని మాత్రమే తెలుసు కానీ సినిమాల్లో వేరే నటులకి కూడా పాడతాడని ఈ "ఉన్నోడ నడందా... కల్లాన కాడు - పూత్తాడుం పూవనం ఆగిడుమే" పాట విన్నాకే తెలిసింది. 

    అసలు ముందు తమిళ పాట విన్నప్పుడు ఇళయరాజా కొంచెం గొంతు మార్చి పాడారేమో అనుకున్నా. యూట్యూబ్‌లో ధనుష్ పాడుతుండగా తీసిన shorts చూడకపోతే ఈ పాట ధనుష్ పాడాడంటే నమ్మేదాన్ని కాదేమో! కానీ పాడింది ఖచ్చితంగా ధనుష్షే.

    కాకపోతే తెలుగులో పాట కార్తీక్ గొంతులో ఒక చిన్న నవ్వుతో కలిపి వినిపిస్తే తమిళంలో ధనుష్ పాట మాత్రం ఓ పిసరు పొగులుతో సాగినట్టుంటుంది.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అన్నట్టు ఈ పాటా, ఈ పాటలో నటించిన వారి వివరాల గురించి వెతుకుతున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన tidbits దొరికాయి. 

    అవేంటంటే...

    విడుదలై-1 లో కుమరేశన్‌గా ప్రధానపాత్రధారిగా నటించిన సూరి అనే తమిళ నటుడు ఇంతకు ముందు నటించినవన్నీ హాస్యపాత్రలే నట. కానీ ఈ సినిమాలో అతన్ని చూస్తే కుమరేశన్‌గా సూరి తప్ప ఇంకెవ్వరూ అంత బాగా చెయ్యరేమో అనిపించింది. 

    ఇక కుమరేశన్‌కి ఇష్టమై, అతన్ని ఇష్టపడ్డ పాప(తమిళరసి)గా నటించిన భవానీశ్రీ సంగీతదర్శకుడు రెహమాన్‌కి మేనకోడలు. ఇంకో సంగీతదర్శకుడు G.V.ప్రకాష్‌కి చెల్లెలు అట. 

    పాట మొదలైనప్పుడు పల్లవిలో అమ్మాయి చరణాలకి చెప్పులున్నాయి - కానీ పాట చరణానికి వచ్చేటప్పటికి అవెక్కడో పడేసుకున్నట్టుంది. ఉట్టికాళ్ళతో నడుస్తూ వుంటుంది. 

    అమ్మాయి చేతనున్న లాంతరు వెలుగులో అబ్బాయి కళ్ళే కాదు ఆ పోలీసు చొక్కాకి వున్న స్టీలుబొత్తాలు కూడా మెరుస్తుంటాయి 

    చాలా చాలా రోజుల తర్వాత ఓ పాటని వెతుక్కుంటూ వెళ్ళి దాని కథా-కమామీషూ కనుక్కోవడం బోల్డంత బాగా అనిపించింది. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    
    మళ్ళీ వెనక్కి మళ్ళి పాట దగ్గరికొస్తే ఈ పాట సందర్భం ఏంటంటే ఊరికి భయపడి తన ఉనికిని బయట పెట్టుకోలేకపోతున్న అమ్మాయికి ఆ వూరే నీ గురించి మంచిమాటలు చెప్పే మంచి రోజులొస్తాయి అని అబ్బాయి ధైర్యం చెబుతున్నట్టున్నట్టుంటుంది. అందుకే తెలుగు పాట పాడిన కార్తీక్ నవ్వుగొంతులో ఆ భరోసా వినిపించింది - తమిళపాట ధనుష్ గొంతులో కించిత్ బాధగా సాగింది. 

    తమిళంలో రాసిన పాటకి మక్కీకి మక్కీ అనువాదంలా వుంటుంది తెలుగు పాట. 

    కానీ మొట్టమొదటి వాక్యం దగ్గర మాత్రం "పిల్లా ...నువ్ నడిస్తే ... ఈ రాళ్ళదారే పూచేటి పూవనమాయెనులే" అనే కన్నా "పిల్లా...నీతో నడిస్తే ఈ రాళ్ళదారే పూచేటి పూవనమాయెనులే" అనుంటే ఇంకొంచెం అసలు-పాటకి  దగ్గరగా వుండేది (ఉన్నోడ నడందా ...కల్లాన కాడు పూత్తాడుం పూవనం ఆగిడుమే) అనిపించింది.

    ఎలాగూ నేపథ్యంలో వచ్చే పాటే కాబట్టి - పెదవుల కదలికకి అనుగుణంగా రాయక్కర్లేదు కాబట్టి - తెలుగులో ఇంకొంచెం స్వేచ్ఛగా చక్కటి మాటలు వాడి న-డబ్బింగ్ పాటలా రాసుంటే బావుండేది. 

    ఏదేమైనా ఎలా రాసినా  విన్న పాట విన్నట్టుగా, వున్నట్టుగా నాకు మాత్రం నచ్చేసింది - తమిళంలో, తెలుగులో కూడా. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అంత నచ్చిన ఆ పాటని ఈ కింద రాసి పెట్టుకున్నా. తెలుగు పాట మాత్రమే రాశాను. తమిళ పాట చూస్తూ  వినడానికి  యూట్యూబ్ లింక్ మాత్రం పెట్టాను. 

తెలుగు పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=nCtt3fbpzZE
తమిళ పాట యూట్యూబ్ లింక్:  https://www.youtube.com/watch?v=TeB3Vw7rEMU


    
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

 

పిల్లా! నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!

నీ కాళ్లు తాకి... ఈ ముళ్లదారే
బంగారుబాటగా మారెనులే!

పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!
నీ కాళ్లు తాకి... ఈ ముళ్లదారే
బంగారుబాటగా మారెనులే!

చూశావా - నీ వల్లే ఆకాశం మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే

చూశాను - ఆకాశం నీ వల్ల మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
ఈ వింత మాయంతా... నీ మహత్యమే!

పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!


గాలి తెచ్చే దూళి వలే - ఇట్టా గేలి చేసే ఊరు ఇదే!
దుఃఖమొచ్చి సోలిపోతే - అది ఊరడించ ఇటు రాదే!
నువ్ సాగిపోగా - అడ్డమేది లేదు - నువ్ వెనక్కి పోరాదే...
నీకు దిక్కు నేనే - నాకు దిక్కు నీవే - ఎన్నడిది మారదులే!
ఈ మాట ఊరంతా చెప్పే క్షణం - వస్తుంది తానా - పోతారు ఈ తిట్టే జనం

ఈ రాళ్ల దారి పిల్లోడు నడిస్తే... పూచేటి పూవనమాయెనులే!
పూచేటి పూవనమాయెనులే!


హారతిచ్చే దీపముంది - ఒక్క దేవుడైన చూడడులే!
పేర్చుకున్న కలలు ఇవి - నెరవేర్చువారు లేనే లేరులే!
చిక్కేది కాదు - ఆగేటి కాలం - ఆ వేగమాగేదా?!
పేదోళ్ళు స్వర్గం - చూసేటి మార్గం - చూపించలేనందా?
నమ్మేటి అందరికి దారే వేస్తూ - గుండెల్లో ఎంతెంతో - సంతోషం పొంగిస్తుంది

ఈ రాళ్ల దారి పిల్లోడు నడిస్తే... పూచేటి పూవనమాయెనులే!


చూశావా - నీ వల్లే ఆకాశం మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
చూశాను - ఆకాశం నీ వల్ల మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
ఈ వింత మాయంతా... నీ మహత్యమే!

పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!
పూచేటి పూవనమాయెనులే!



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


నాకు నచ్చిన పాట - మీతో పంచుకుని 
పూచింది నా మనమే
పువ్వై నవ్వింది నా మనమే!

~పాటల భైరవి 



24, ఫిబ్రవరి 2024, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 17 - ఈ పాట విన్న - దిల్ వో చలా... ఆ గాలిలో అలా...అలా...

ఈలపాటల గాలి ఆగి ఆగి వీచె
తూలు గాలి అలల మీద 
మెఱుపంచు కోక గట్టి
తువ్వర మువ్వ గజ్జె కట్టి
తూగి సోలుతున్నదెవరది?

చిందులేయు చిన్నారి 
చినుకుదారి చిఱుతుక
నీలిమబ్బు తునక కాక
ఇంకెవరది?
ఆగి ఆగి వీచు గాలి తోన తానె సాగివచ్చె

పాట వినగోరు వీనులకి
గాలి అలల ఈలపాట...
గాలి పాడు పదమది ముందో?
గాలి యీల విన్న మబ్బుకన్నె తానాడెనో?!

ఆట కనగోరు కనులకి
నీలిమబ్బు తునక ఆట...
చింది కదులు పదమది ముందో?
మొయిలు చిందు కన్న గాలి పాట పాడెనో!?

గాలిమబ్బుల వెనకముందుల పంతాల్లో
ఆటపాటల వేడుకలు నా సొంతాలే!
నే జెప్పబోవు ఊసుపోని ఉదంతాలు 
ఆ సంగతుల-గతుల సంగతులే!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఎప్పట్నుంచో - ప్రతి వారం వారం - "స్మర వారంవారం" - అనుకుంటూ వింటుంటున్నా - వింటూ వింటూ ఆ పాటలో లీనమై తేలిపోతూ వుంటున్నా - ఇప్పటి దాకా ఆ పాట గురించి చెప్పాలనుకున్నది చెప్పడానికి కుదరలేదు - కుదురూ చిక్కలేదు. 

    ఇవాళ మాత్రం - ఎలాహైనా రాహెయ్యాలంతే! - అని కూర్చున్నా. 

    సూద్దారి... ఈ దారి నెంత మాత్రం సాగుతానో మరి!

    అస్సలిదీ... - ఇదంటే - ఈ పాట వుందే - ఇది నిజ్జంగా ఓ గాలిపాట. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    గాలికి మొదలు ఎక్కడైనా వుండొచ్చు కదా! 

అప్పటిదాకా 
సద్దు లేకుండా 
స్తబ్దుగా వున్న గాలి 
అలలు అలలుగా 
కదలి మెదలి
ఒక్కసారిగా 
పాలుమాలిక వీడి
పడి లేచే కెరటమైతే
ఎక్కడ సడి అడుగులు పడితే
అక్కడే మొదలనుకుంటే

    అదుగో...అచ్చంగా అల్లాగే వున్నట్టుండి వున్నపాటున మొదలైన పాట గాలిపాట కాక ఇంకేంటి మరీ?!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మరసలు ...కుదురైన పాటంటే ఏమిటీ...?

    తాళాలూ, కాలాలూ, స్వరాలూ, రాగాలూ, జతులూ, శ్రుతులూ, గతులూ,  సంగతులూ - ఇన్ని వరసలూ వ్యవహారాలూ వున్నదే కదా... !


    పలకరింపు లాంటి పల్లవి
    వెనువెంటనే చిరునవ్వు చిలకరింపు లాటి అనుపల్లవి
    ఆ తర్వాత వడివడిగా కలివిడిగా సాగే కబుర్ల లాంటి చరణాలు
    కదా! 

    కానీ అదే - 
    తొరపడో, తడబడో - 
    వాక మార్చి వరస విడిచి -
    పల్లవిని దాటి వురికి 
    అనుపల్లవి మాటే మరిచి 
    సరాసరి చరణానికి చరచరలాడితే ?!
    అది ఖచ్చితంగా గాలి తోడైన పాటే! 
    గాలికీడూజోడైన పాటే! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఈ పాటికి ఆ పాటేదో చెప్పెయ్యకుండా - 
    ఇప్పటి దాకా - 
    ఇదిగో పాటా, అదో గాలిపాటా - 
    అని ఆకుకి అందకుండా, పోకకి పొందకుండా - 
    గాలికబుర్లాడడమే తప్ప - 
    అసలా పాటేదో చెప్పడానికి పాటు పడకుండా - 
    అలాగని మా పాటికి మమ్మల్నొదిలేసి 
    మా పాట్లేవో మమ్మల్ని పడనీకుండా - 
    ఈ పాట-పోటు మాకేమిటి బాబోయ్!" 

    అని పాట కట్టి పాడేసుకోవాలనిపిస్తోందా? 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇంతసేపు ఎలాగూ ఆగారు - ఇంతవరకు ఎలాగోలా చదివారు. 

    ఇంకో గాలిపాట గురించి ఇంకొన్ని మాటలు కూడా చదివేస్తే - పాటమర్యాద పాటించినవారవుతారు.  

    అప్పుడెప్పుడో - బోల్డంత కథున్నా కూడా - "ఇది కథ కాదు" అనే ఓ సిన్మా వచ్చింది. 

    దాన్ని తీసింది బాధే చందమనే బాలచందర్. 

    అందులో "గాలికదుపు లేదు... కడలికంతు లేదు" అనే పాటొకటుంది. 

    నేనీ రోజు రాయబోతున్న హిందీ పాటుందే... అది విన్నప్పుడల్లా - వెంటనే ఈ తెలుగు పాట కూడా గుర్తొస్తుంది. 

    ఆ పాటలో కొన్ని వాక్యాలు....

    ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో...
    ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో...
    తుళ్ళితుళ్ళి గంతులు వేసే లేడికేది కట్టుబాటు...?
    మళ్ళిమళ్ళి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు...?

    ఆ పైన రాసిన  తెలుగు పాట చరణం అచ్చు ఈ కింద రాసిన హిందీ పాట చరణం లాగానే అనిపిస్తుంది నాకు.... 

    విన్న ప్రతిసారీ మాటలు కొంచెం అటూ-ఇటూగా వున్నా - మొత్తమ్మీద రెండిట్లో వున్న పాటాత్మ ఒకటేలా వుంటుంది. 

కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో... కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో...ఫూల్ హీ ఫూల్  - జిందగీ బహార్ హై
తయ్ కర్ లియా ఆ... ఆ... ఆ...



    ఇహిప్పుడు అసలు విషయానికొస్తా! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మన స్వామీ, వాడి స్నేహితుల గురించి మాల్గుడి కబుర్లు చెప్పిన ఆర్కే నారాయణ్ రాసిన "The Guide" అనే నవల ఆధారంగా తీసిన హిందీ సినిమా "గైడ్" అని ఒకటుంది. 

    బావుంటుంది. 

    యూట్యూబ్‌లో వుంటుంది. 

    ఇప్పటిదాకా చూసుండకపోతే ఓ పాలి చూసొచ్చేస్తే కూడా బావుంటుంది. 

    దాంట్లో కథానాయకుడు దేవానంద్. దానికి దర్శకుడు ఆతని తమ్ముడు విజయ్ ఆనంద్. కథానాయిక వహీదా రెహమాన్. 

    అన్నట్టు ఈ సినిమాని అమెరికాలో ఇంగ్లీషులో కూడా తీశారట. కానీ అందులో వహీదా లేదట. ఫ్లాప్ అయిందంటే అవదా మరి?!

    సరి! ఆ సినిమా ఇంగ్లీషులో హిట్టు కాదు ఫట్టు అని చెప్పేసుకున్నాం కదా!  

    హిందీ సినిమాలో బావుండే అన్ని పాటల్లోంచి అన్నిటి కన్నా నాకు బాగా అనిపించే పాట గురించి - హమ్మయ్య! - ఇహిప్పుడు చెప్తా. 

    ఆ పాట "కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్".
    రాసింది శైలేంద్ర.
    పాట కట్టింది సచిన్ దేవ్ (SD ) బర్మన్. 
    పాడింది లతా మంగేష్కర్.
    పాటకు ముందు మాట్లాడింది దేవానంద్.
    పాటలో ఆట్లాడింది వహీదా.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాటలో అన్నిటి కన్నా ముందు, వెనక, ఆ తర్వాత కూడా వహీదా గురించి చెప్పుకోవాలబ్బా!

    మెరుపుతళుకులు కుట్టిన పచ్చనీలపు చీరా...
   
    జడ మొదట్లో మువ్వల జడబిళ్ళా...
    ఆ కింద జడ మధ్యలో పొదిగిన ఓ మువ్వ
     పొడుగాటి జడకి వేలాడుతూ జడకుచ్చులూ...

    చెవులకి లోలకాల్లా వూగుతున్న లోలాకులూ...
    కంబువంటి కంబువున తాల్చిన మిలమిలలదౌరు
    మోచేతిని తాకుతున్న చోళీ చేతులకి తళతళ మెరుస్తున్న గాజులు 
    ఎడమచేతి ఉంగరంవేలికో పూలవుంగరం 
    
    చీర మీదున్న మెరుపులని మించి తళతళలాడుతూ తళుకులీనే కళ్ళూ...
    ఆ కళ్ళని వెలిగించి - వాటిని మించి - పెదవుల మీద మించిమించారిన నవ్వులూ... 
    ఆ నడకలో లయలూ - నటనలో హొయలూ...
    చిత్తోడ్‌ఘర్ కోట మీద గాలి అలలలో అలలా - కలలోని కలికిలా - చిలికించిన అలవోక కదలికలూ...






    బావుంది వహీదా...

    ఎండుగడ్డిలో దొర్లుతూ
    కుండ ఎత్తి బద్దలుగొడుతూ
    ఒంటె మీద ముసుగులో కులుకుతూ
    కోటగోడల మీద కెరటంలా ఉరుకుతూ
    "కహీ న ఖో న జాఊ..." అని పరిసరాలు మరిచి మైమరచిపోతూ
    గుడి గోడల మీదున్న నాట్యాంగనల్లా భంగిమలు పెడుతూ
    అల్లా-ఉద్దీన్-ఖిల్జీ చూసిన రాణీ పద్మినిలా అద్దంలో కనిపిస్తూ
    కాదనుకున్న నిన్నని వదిలి రేపటి ఆమని నాదేనని ధీమాగా చెప్తూ... 

    దాక్కుంటూ ... దోబూచులాడుతూ... 
    ఎగురుతూ....గెంతుతూ... పరిగెడుతూ...
    పాదాలు గాలిలో తేలుతున్నట్టు సోలుతూ ... 
    
    ఎలా చూసినా - ఎన్నిసార్లు చూసినా 
    పాట ప్రతి frame లో 
    ఎంత బావుందో... వహీదా... 

   నాకు ఈ పాట చూసినప్పుడు కనిపించేది వహీదా మాత్రమే! 

   ఊపిరి సలపని బంధనాలు దాటి బయటపడిన గాలి సంబరంగా వేసే చిందులు  - కళ్ళకి కట్టినట్టు నర్తించి చూపిన వహీదా నటన ఎంత బావుందో చూసే కళ్ళకి రాయడం వస్తేనే సరిగ్గా చెప్పడానికి కుదురుతుంది. 

   కెమెరా కూడా వహీదాని ఎంత అందంగా చూపిద్దామా అని తహతహలాడినట్టనిపిస్తుంది.  

    ఆ కెమెరాని పట్టుకుని వహీదా ఎటెళ్తే  అటు - ఆమె చుట్టూ తిప్పిన  - ఫాలి మిస్త్రీకి కోటి దండాలు!
    


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    

      అప్పుడే జీవించాలనే ఆశ - 
    అలా జీవిస్తూనే మరణించాలనే లాలస -
    అదే .... ఈ పాటలో వినిపించే స్వేచ్ఛాన్వేషిత లిలీష!

    అవన్నీ కలిసున్న ఈ  పాట ఇష్టం. 
    ఈ పాటలో వహీదాని చూడడం ఇష్టం. 
    ఈ పాటలో వహీదానే పాడిందా అనిపించేంత లలితంగా పాట పాడిన లతా మంగేష్కర్ గొంతు ఇష్టం. 
    ఈ పాటలో వినిపించే వేణునాదం ఇష్టం, 

    ఈ పాటకి వున్న ప్రత్యేకత - పల్లవితో కాకుండా చరణంతో మొదలవడం. 

    ఈ పాటలో పల్లవి "ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... ". 

    కానీ మొదలవడం "కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్" అనే చరణంతోనే మొదలవుతుందనేమో -
ఎదురు చూడనపుడు వీచడం మొదలు పెట్టే కుదురు లేని గాలిలా అనిపిస్తుంది ఈ పాట.

    
   
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


ఈ పాటకి యూట్యూబ్ లింక్: 

పాట కూడా రాసి పెట్టా ఈ కింద! 

కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్
తోడ్‌కే బంధన్ - బాంధీ పాయల్
హో...కోఈ న రోకో - దిల్ కీ - ఉడాన్ కో
దిల్ వో చలా...  ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

అప్‌నే హీ బస్ మే - నహీ మై
దిల్ హై కహీ - తో - హూ కహీ మై
హో...అప్‌నే హీ బస్ మే - నహీ మై
దిల్ హై కహీ - తో - హూ కహీ మై
హో... జానే క్యా పాకే - మేరీ జిందగీ నే
హస్‌కర్ కహా... హా... హా... హా...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

మై హూ గుబార్ - యా - తూఫాన్ హూ
కోఈ బతాయే - మై కహా హూ
హో... మై హూ గుబార్ - యా - తూఫాన్ హూ
కోఈ బతాయే - మై కహా హూ
హో... డర్ హై - సఫర్ మే - కహీ ఖో న జాఊ మై
రస్తా నయా... ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో... కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో...ఫూల్ హీ ఫూల్  - జిందగీ బహార్ హై
తయ్ కర్ లియా ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ముందు వెనకైన గాలిపాట 

గాలి లాగా అదాటుగా తేలి వచ్చి 
చెవికి సోకె ఈ పాట 

  ఈ పాట విన్న  - దిల్ వో చలా...  ఆ గాలిలో అలా...అలా...


~ పాటల భైరవి 

30, ఏప్రిల్ 2023, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 16 - బంగరు సంజె పొద్దుల్లో ఓ పాట విన్నా... "పొన్ మాలైప్ పొళుదు"




జిలుగుల ముగ్గులేసే 
మలిసంజ వెలుగులు

కిలకిలమని పాటలాడే 
పులుగు ఎలుగులు

బిరబిరమని నేల చేరే 
కడలి పొర్లింతలు

కలకలమని నింగికెగసే 
పిల్లల కేరింతలు

వీటన్నిటికీ తోడుగా...

"హే...ఓ....మ్మ్...లల్లల్లా" మంటూ 
పాటే ప్రాణమన్నట్టున్న 
ప్రాణమే పాటైనట్టున్న 
"బాల" గంధర్వుడి 
ప్రాణస్వరం 


అలలు అలలుగా నీటిపై తేలుతున్నట్టు
అల్లరల్లరిగా గాలిలో తూలుతున్నట్టు
పువ్వుల పుప్పొడిని అద్దుకున్నట్టు 
నవ్వులో ముంచి తీసినట్టు 
తళుక్కుమన్న తమిళ తేనె పదాలు 
కూనిరాగాలు... 
హాయిగానాలు... 

ఇలాతలంపై 
ఈ పాటని ఇంకెవరు పాడినా 
ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... 
అలాగని నే రాసిస్తానండీ!
ఒట్టండీ! 
ఒప్పుకోవాలండీ!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ఇల కోడి కూతతో తెల్లవారి మెలకువలైనది మొదలు 
ఇలకోడి సద్దుతో సద్దుమణిగి కలలూరు వేళల వరకు... 

చెప్పాలంటే - నాకది మామూలే! 

తలచిన తలపుకి నవ్వొస్తే ఆ నవ్వుకి ఇంకో నవ్వు కలుపుకోవడానికో -
ఏదో గుర్తొచ్చి ఎదలో ఎక్కడో ఏదో గుచ్చిన కంటి తడుపుకి తుడుపుగానో -
ఓ పాటని తోడు తెచ్చుకోవడం...
ఆ పాటలో నవ్వు పెంచుకోవడం...
ఆ పాటతో నొవ్వు తుంచుకోవడం...
చెప్పానుగా... నాకిది మామూలే! 

ఏ నాటికీ - పాటకది పరిపాటే!

ఒక్కోసారి - ఒక పాట - పాతనేస్తమల్లే చేరి - వాడుకగా - అందేస్తుంది. 
అంది - అప్పటికి మురిపించి - మళ్ళొస్తానని - మనసు మఱగున - ఒదుగుతుంది. 
ఇంకో మాటు - ఒక పాట - అనుకోని అతిథిలా వచ్చి - వేడుకగా - అలరిస్తుంది. 
అలరించి - ఎప్పటికీ మరవకని - నను వీడనని - మదిని నెయ్యమై - ఒద్దికౌతుంది. 
ఏనాటికైనా ... పాటకిది పరిపాటే!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    సరిగ్గా నెల క్రితం - పైన నే చెప్పినట్టు - అచ్చు అలానే - అనుకోని అతిథిలా - నాకో పాట దొరికింది. 

    అదెలాగో - అదేం పాటో - ఆ పాట ఊసులే ఈనాటి నా కబుర్లు. 

    ఇళయరాజా పాటలు ఇప్పటివి కాదు కానీ 80 లు - 90 ల నుంచి వెతుక్కుని వినడం - ఆ nostalgia తో ఒకప్పుడు వుండొచ్చిన వూళ్ళన్నిటిలో నడిచొచ్చిన దారుల్లో ఆ పాటల్ని విన్న మొట్టమొదటి క్షణాల్ని గుర్తు చేసుకోవడం నాకిష్టమైన వ్యాపకం. 

    ఓ రోజలాగే ఇళయరాజా పాటల్ని వెతుక్కుంటున్న నేను - యూట్యూబ్లో "SPB | Ilaiyaraja song" అన్న మాటలు చూసి అనుకోకుండా ఓ పాట మీద click చేశాను. 

    ముందు కొన్ని పిట్ట కుహుకుహూలు - వెంటనే ఇళయరాజా గిలిగింతల జంత్ర గతులు - ఆ వెంటనే.... "హే... ఓ.... మ్మ్... లలల్లా... అంటూ సుబ్బయ్య గొంతూ... విన్నాను. 

    అంతే! 

    అప్పట్నుంచీ ఇప్పటి దాకా ఆ పాట ఎన్నిసార్లు  మళ్లీ మళ్లీ విన్నానో లెక్కలేదు. 

    విన్నకొద్దీ చెవులకి చవులూరించే పాట. 

    వినకపోతే "నన్ను వినవా?!" అంటూ వీనుల చేరే పాట. 

    ఇంత ఆరాట పెడుతున్న పాట పుట్టుపూర్వోత్తరాలు ఏంటా అని ఆరా తీస్తే తెలిసింది ఏమిటీ అంటే ఇది వైరముత్తు రాసిన మొట్టమొదటి పాటట. భారతీరాజా తీసిన నిళగళ్  (1980) అనే సినిమా లోది. ఈ పాటలో కనిపించిన S. రాజశేఖర్‌కి ఇది మొదటి సినిమాలాగా అనిపించింది. 

    ఈ పాటలో సముద్రపుటొడ్డు  దగ్గర మొదలుపెట్టి, సరివి తోటలు దాటి, రోడ్డు మీద చెట్ల దాకా పరిగెడుతూ - మధ్యమధ్యలో డాబా ఎక్కి ఆకాశం కేసి కళ్ళు తిప్పి చూస్తూ ఈ ఎస్రాజశేఖరుడు చేసిన అభినయం రొంబ నల్లా ఇరుక్కు! 

    పాడింది ఎస్పీబీ, పాడించింది ఇళయరాజా కాకపొతే ఈ పాట గురించి ఈ నాటి ఈ రాతే లేదు కాబట్టి వాళ్ళ గురించి ముందే చెప్పేశా కదా! 

    పైన చెప్పిన పెద్ద వాళ్లందరికీ పేరుపేరునా దండాలెట్టుకుంటూ ఇహిప్పుడు అసలు పాట గురించి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాట వినగానే - ఇందులో చప్పున అర్థమైన ఒక వాక్యం "వానమ్ ఎనక్కొరు  బోధి మరమ్". ఇంతకు ముందు విన్న కొన్ని తమిళ పాటల వల్ల నాకు "వానమ్***" అంటే ఆకాశం అని తెలుసు. 

    కన్నడ "మర" పరిచయం వుండడం వల్ల "మరమ్" అంటే తరువు అనిన్నీ తెలుసు. 

    "ఎనక్కు", "ఒరు" - అంతమంది తమిళ నన్బర్గళ్ ఉన్న నాకు ఈ మాటలు తెలీవంటే ఎల్లాగూ?!

    మొత్తానికి ""వానమ్  ఎనక్కొరు  బోధి మరమ్" అనగా "ఆకాశం నాకొక బోధి తరువు" అన్న తాత్పర్యం బోధపడింది. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఆ ఒక్క వాక్యం అర్థం కాగానే నాకమాంతం ఆ పాట మీద అభిమానం అంతై ఇంతై ఎంతెంతో ఐపోయింది. 

    దాంతో పాటలో మాటమాటనీ పలకడమెలాగో నేర్చుకుని - మాటమాటకీ తెలుగు పలుకేదో రాసుకుందామనుకున్నా. 

    ఇదిగో - ఇప్పుడదే చేస్తున్నా!

    ముందుగా పాట చూస్తూ   వినడానికి వీలుగా యూట్యూబ్ లింక్ ఇస్తున్నా:  https://www.youtube.com/watch?v=Ux0LERGc1cc

    ఆ తర్వాత ఆ కింద పాటలో మాటలు - మాటమాటకీ తెలుగు మాటలు కూడా రాసుకున్నా. 

    అన్నట్టు ఇక్కడో మాట చెప్పాలి. 

    ఈ పాటలో పల్లవీ, మొదటి చరణం అర్థమయ్యాయి - నాకు చాలా నచ్చాయి. 

    రెండో చరణంలో మాటలు తమిళంలో వినడానికి చాలా బావున్నాయి కానీ వాటి అర్థం పూర్తిగా తెలియాలంటే "నిళగళ్"సినిమా అయినా చూడాలి లేకపోతే తమిళ పాటలు బాగా వినే స్నేహితులని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ కబుర్లు update చేసుకోవాలి. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





హే... ఓ.... మ్మ్... లలల్లా... 

పొన్ మాలైప్ పొళుదు - బంగరు సంజె పొద్దు
ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు - ఇది ఒక ...బంగరు సంజె పొద్దు
వానమగళ్ - నానగిరాళ్ - నింగికన్నె సిగ్గుపడుతోంది
వేరు ఉడయ్ - పూనగిరాళ్ - వేరే (రంగు) వలువ కట్టుకుంటోంది  

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు
  మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... 

ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ 
రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ 
ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ - వేల రంగులు మాయ చేస్తాయి 
రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ - రాత్రి వాకిట ముగ్గులేస్తాయి 
వానమ్ ఇరవుక్కుప్  పాలమిడుమ్ - నింగి రాత్రికి వంతెన వేస్తోంది
పాడుమ్ పరవైగళ్ తాళమిడుమ్ - పాడే పక్షులు తాళమేస్తున్నాయి
పూ మరంగళ్ - సామరంగళ్ - వీసాదో?! - పూల తరువులు చామరలు వీచవో?

ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు
వానమగళ్ - నానగిరాళ్
వేరు ఉడయ్ - పూనగిరాళ్

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు

వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ 
నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ 
వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ - నింగి నాకొక బోధి తరువు
నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ - రేపు నాకది సుద్ది (కబురు) తెస్తుంది
ఒరు నాళ్ ఉలగం నీది పెరుమ్ - ఒక నాటికి లోకం న్యాయం పొందు 
తిరునాళ్ నిగళుమ్ తేది వరుమ్ - మంచి జరిగే రోజు వచ్చు
కేళ్విగళాల్ వేళ్విగళై నాన్ సెయ్‌వెన్ - అడుగుటతో నా విన్నపం నేను చేస్తాను

ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు
వానమగళ్ - నానగిరాళ్
వేరు ఉడయ్ - పూనగిరాళ్

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు

ఆ... హే... ఓ... లలల్లా... 
మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మళ్ళీ అదే చెప్తున్నా... చెప్పకుండా వుండలేకపోతున్నా... 

ఇలాతలంపై 
ఈ పాటని ఇంకెవరు పాడినా 
ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... 
అలాగని నే రాసిస్తానండీ!
ఒట్టండీ! 
ఒప్పుకోవాలండీ!
ఆయ్! అంతేనండి మరీ!

~ పాటల భైరవి 



12, మార్చి 2023, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 27 - కవలపాటలు - మలరే...! మౌనమా...? అని పలుకుతున్నది ప్రాణమా?

 

గాయమైన ఎదకి హాయి పూయ
గేయమొకటి తోడువచ్చె
మోయలేని బాధ మాపు సేయ
మాయ యేదొ తోడ తెచ్చె

తోడు వచ్చిన పాట పొదవుకుంది
పదము పదమున -
మది తుళ్ళే పూలబాసలు... 
ఊరడించిన గీతి ఒదుగుకుంది 
అడుగు అడుగున -
ఎద గిల్లే గాలిఊసులు... 

గుసగుసలుగ... 
హాయి తెచ్చిన పదము 
పొలుపున -
ఎద గాయమది... 
మాయమయ్యె

ఉసురుసురున...  
మాయ జేసిన పాట 
నెఱవున -
మది హాయియది... 
సోలుపయ్యె 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పూవు తూగేది గాలిలో ... 
    పూవు నేల రాలేది గాలితో... 
గాలి తోటి చెప్పేదెలా జోరొద్దని?

    మనసు విరిసేది మాటతో ...
    మనసు విరిగేది మాటతో... 
మాట తోటి చెప్పేదెలా మీరొద్దని?

 గాలి జోరెక్కకుండా ఆపడమెవ్వరి తరం?  
మాట మీరొద్దని అనగలమెవ్వరం? 

అందుకే.... జరిగేది జరగనీ అనుకుంటా... 
జరిగేది ఏదీ ఆపబోననుకుంటా.... 

గాలికి రాలిన పూలకి దోసిలొగ్గుతా... 
మాటకి చెదిరిన గుండెకి పాట నేర్పుకుంటా!  
    
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పూటకి నే ఏరికోరి తెచ్చుకున్న పాట - "మలరే ... మౌనమా!".  పాటున్న సినిమా తమిళ "కర్ణ".  పాటలో వున్నవారు - అర్జున్, రంజిత. 

    ఇది  ఒక తీపిరాగాల మధుమంత్రం. ఎదను గిల్లు గాలిగానాల హాయిజంత్రం. 

    ఈ పాటకి సంగీత దర్శకుడు - తెలుగులో అంతగా ఎవరూ తలుచుకోని విద్యాసాగర్. 

    విద్యాసాగర్ ఎవరబ్బా అని కదా? అప్పుడెప్పుడో "ముగ్గురు మొనగాళ్ళు" లాంటి కొన్ని తెలుగు సినిమాలకి వృత్తిధర్మ-మాత్ర సంగీతం చేసి ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో మనోధర్మ-పాత్రమైన అద్భుతమైన పాటలు కూర్చిన సంగీత-స్వర-మాంత్రికుడు. 

    ఇంకా చప్పున ఈయనెవరో తలచుకుని-గుర్తు పెట్టుకోవాలంటే - ఇంకో పాట గురించి చెప్తా. 

    నయనతార గాలిపటాలెగరేసి, రజనీకాంత్ పిల్లిగడ్డమెట్టుకుని లకలకలాడిన సినిమా ఒకటుంది చూశారూ? 

    అదే... అందులో జ్యోతిక టార్చ్‌లైట్లలా వెలుగుతున్న కళ్ళ చుట్టూ ఇంత కాటుక పూసుకుని, జుట్టంతా పీక్కుని వినీత్‌తో కలిసి డాన్స్ చేస్తుందే - "రారా సరసకు రారా" అంటూ - గుర్తుందా? ఆ సిన్మా ఏదో మీరే కనుక్కోండి. ఆ పాటకు జాతీయపురస్కారం కూడా దక్కింది మన సంగీత-విద్యాసముద్రుడికి. 

    అదే కాదు - కాశీనాథుని విశ్వనాథుడి "స్వరాభిషేకం" సిన్మాకి కూడా విద్యాసాగరుడే సంగీత-గంగావతరణ-భగీరథుడు. సంగీతం బావుంటుంది - కాకపోతే ఆ సినిమా నాకంతగా సొక్కలేదు. 

    ఇవే కాకుండా - ఇంకో ఊరూపేరూ లేని రీలుముక్క లాగా గాలికెటో కొట్టుకుపోయిన ఒకానొక  సినిమాలో ఒక అద్భుతమైన పాట వుంది ఈ విద్యాసాగర్‌దే. దాని గురించిన కబుర్లు మళ్ళింకోసారి చెప్తా. ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఓ రెండు ముక్కలు చెప్పేసి ఆ ఇష్టాన్ని కొంచెపఱచుకోవడం నాకిష్టం లేదు. 

    అన్నట్టు ఈ విద్యాసాగర్‌గారిది మా అమలాపురమేనట. భలే! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇహిప్పుడు - అసలు పాట పాట గురించి. 

    నేనిన్ని కబుర్లు చెప్తుంటాను కానీ - మా ఇంట్లో లేస్తూనే పాట వింటూ - చెవికి నచ్చిన పాటనల్లా పాడుకుంటూ - రాత్రి పాట వింటూ నిద్ర లోకి జారుకుంటూ - ఎప్పటికైనా తనకు నచ్చిన పాటలన్నీ పాడుకోవాలనుకునే వీర-పాటాభిమాని బద్రి. 

    తను రకరకాల పాటలు వింటూ అందులో అనుకోకుండా దొరికిన మిణుకు-చుక్కల్లాంటి పాటల్ని పట్టి నాకిస్తూ వుంటారు. అలా దొరికిన బాల-గంధర్వ-జానకీ-మధురయుగళజనిత-గానమే ఈ "మలరే...మౌనమా?" పాట. 

    వేణుగానంతో మొదలయ్యే విద్యాసాగరుడి మధుర సంగీతం...
    చెవికింపైన వైరముత్తు రాసిన తమిళ-పలుకులు... 
    పాలూ-తేనె-మీగడ-పంచదార-నవ్వు-అచ్చర పరిచే అచ్చరపు పలుకు... అన్నీ కలిపి చిలికిన హాయిపాటల మా సుబ్బయ్య గొంతు... 
    తోడుగా పాటకి తళుకు అద్ది, బెళుకు తొడిగి, జిలుగు కూర్చే ఎస్జానకి స్వరం...

    ఇన్ని కుదిరిన పాట ఇంపుగా కాక ఇంకెలాగుండగలదు?

    తమిళసలు పాటలో వున్న ఈ పూల-గాలి మాటలు నాకు బోల్డు నచ్చాయి. 

కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... 
(గాలీ! నన్ను గిల్లెయ్యకూ ...)
పూవే! ఎన్నై తళ్ళాదిరు... 
(పూవా! నన్ను తోసెయ్యకూ!)

    కాకపోతే ఈ పాటలో వినిపించే "అన్బే" అన్న మాట అనునాసిక / అనుస్వార సూత్రానికి విరుద్ధంగా అనిపించింది. లెక్కప్రకారం అది "అమ్బే" అన్నట్టు పలకాలి - కానీ ఎస్జానకి తమిళ ఉచ్చారణలో "అన్బే" అన్నట్టు వినిపిస్తుంది.

    "అమ్బే" అనే ఎందుకు పలకాలని నాకెందుకు అనిపించిందో ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తే ఇదోమాటు చదవండి: సున్నాలెయ్ ...బోల్డు సున్నాలెయ్!

    అన్నట్టు ఈ పాటకి వెన్నెలకంటి రాసిన తెలుగు-డబ్బింగు కూడా బాగానే కుదిరింది. తెలుగులో పాడిన మనో గొంతులో కూడా చాలా బావుంటుంది. 

    సర్సరే! ముందుగా తమిళసలుపాటకి, తెలుక్కొసరుపాటకి యూట్యూబు లింకులు ఇవిగో... 

    మలరే... మౌనమా?!: https://www.youtube.com/watch?v=gRjKULlhot4
    పలికే మౌనమా! : https://www.youtube.com/watch?v=Q1CR6a1_o2w


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    
   


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

మలరే...! మౌనమా...?
మౌనమే...  వేదమా...?!

మలర్‌గళ్ - పేశుమా... ?
పేశినాళ్ ఓయుమా... అన్బే!

మలరే...! మౌనమా... ?
మౌనమే...  వేదమా... ?!

ఆ... 

పాది జీవన్ కొండు దేగం వాళ్న్దు వందదో...ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ!
మీది జీవన్ ఎన్నై పార్థ  పోదు వందదో...?

ఏదో సుగం - ఉళ్ళూరుదే...!
ఏనో మనం - తళ్ళాడుదే...!
ఏదో సుగం - ఉళ్ళూరుదే...!
ఏనో మనం - తళ్ళాడుదే...!

విరళ్‌గళ్ తొడవా?
విరుందై పెరవా?
మార్బోడు కంగళ్ మూడవా...?!

మలరే...! మౌనమా...?
మలర్‌గళ్ - పేశుమా... ?

కనవు కండె ఎందన్ కంగళ్ మూడి కిడందేన్... 
కాట్రై పోల వందు కంగళ్ మెల్ల తిరందేన్... 

కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... 
పూవే! ఎన్నై తళ్ళాదిరు... 
కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు... 
పూవే! ఎన్నై తళ్ళాదిరు... 

ఉరవిల్  ఉరవే... 
ఉయిరిన్ ఉయిరే... 
పుదు వాళ్కై తంద వళ్ళలే....!

మలరే...! మౌనమా...?
మౌనమే...  వేదమా...?!

మలర్‌గళ్ - పేశుమా... ?
పేశినాళ్ ఓయుమా... అన్బే!

మలరే...! 
మ్మ్ ... 
మౌనమా?
మ్మ్... 
మౌనమే... 
మ్మ్ ... 
వేదమా?!
ఆ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***






*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

పలికే మౌనమా...
మౌనమే వేదమా...

పలుకే ప్రాణమా... 
ప్రాణమే బంధమా...ప్రియా!

పలికే మౌనమా...
మౌనమే వేదమా...

ఆ... 

మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో - ఆ ..ఆ ఆ.. ఆ ..ఆ!
మనసు నీదే అని మరులు పూలు విచ్చెనో!

ఏదో సుఖం శృతించగా...
ఏదో స్వరం లిఖించగా...
ఏదో సుఖం శృతించగా...
ఏదో స్వరం లిఖించగా...

ఒకటే ఎదగా ... 
ఒదిగే కధగా... 
ఒడిలోన ఊయలూగగా!

పలికే మౌనమా...
పలుకే ప్రాణమా... 

కలలు కన్న నా కనులు మూసుకొనెనే!
కలిసిపోతే వయసింక మాట వినదే!

గాలే ఎదే గిల్లేనిలా...
పూలే సుధే చల్లేనిలా...
గాలే ఎదే గిల్లేనిలా...
పూలే సుధే చల్లేనిలా...

చొరవే విడవా...?
మనవే వినవా...?
మధు మంత్రమేదో పాడవా!

పలికే మౌనమా...
మౌనమే వేదమా...

పలుకే ప్రాణమా... 
ప్రాణమే బంధమా...ప్రియా!

పలికే... 
మ్మ్ ... 
మౌనమా...
మ్మ్ ... 
మౌనమే... 
మ్మ్ ... 
వేదమా...
ఆ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పాటలు వింటూ, నే రాసిన పాటల-మాటలని మీ గొంతుతో పాడుకుంటూ పాటల-పండగ చేసుకుంటారని అనుకుంటూ.... 

~ పాటల భైరవి