1, ఏప్రిల్ 2012, ఆదివారం

అవసరమా...అంతర్జాతీయ మహిళా దినోత్సవం?

మార్చ్ "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


మార్చ్ "విహంగ"  పత్రికకి వ్యాసం పంపించాలి - గడువు దగ్గర పడుతోంది - ఏ విషయం మీద వ్రాద్దామా, అంత ఆసక్తి కలిగించే విషయాలు ప్రపంచం లో ఏం జరుగుతున్నాయా అని ఆలోచిస్తూ వుండగా ప్రక్క నుంచి ఫోన్ మ్రోగుతున్న శబ్దం వినిపించింది. కాలర్ ఐడీ లో నా ప్రియ నేస్తం పేరు కనిపించగానే ఒకసారి "హాయ్ హాయ్" అనుకుని ఫోన్ తీశాను. ఎప్పటిలాగే "బావున్నావా" అంటే "బావున్నావా" అనుకుని నెమ్మదిగా సన్నటి వాన జల్లులా మొదలైన మా సంభాషణ జడివాన స్థాయి వడిని అందుకని ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి పరుగులు పెడుతూ వున్నప్పుడు అలవాటు ప్రకారం మా మాటలు, మనసులు మాకెంతో ఇష్టమైన మేము కలిసి చదువుకున్న మహిళా విశ్వ విద్యాలయం వైపుగా మళ్ళాయి. వెంటనే అన్ని విషయాలతో బాటుగా మార్చ్ లో వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము పాల్గొని గెలిచిన పోటీలు, డిబేట్ పేరుతో జరిగిన సరదా వాదోపవాదాలు గుర్తుకొచ్చాయి. అంతే...అరెరే..ఇంత మంచి విషయం పెట్టుకుని ఏంటబ్బా ఇంత ఆలోచిస్తున్నాను. సరి అయిన సమయం లో ఎంత మంచి టాపిక్ గుర్తుకొచ్చింది కదా - నా మార్చ్ వ్యాసానికి  "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" కన్నా మంచి విషయం ఏముంటుంది కదా అనే తెగ మురిసిపోయాను. నా నేస్తం తో మాట్లాడడం అయి ఫోన్ పెట్టేయగానే అతి ఉత్సాహంగా వ్రాసేద్దామని (అదే టైపు చేసేద్దామని) అనుకుని లాప్టాప్ తీసుకోగానే మొట్ట మొదటగా నాకై నాకే అడగాలి అనిపించిన ప్రశ్నలు ...అవునూ ఇంతకీ "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అంటే ఏంటి? అసలెందుకు చేసుకుంటారు? చెప్పద్దూ...కొంచెం అని మొహమాటానికి చెప్తున్నాను కానీ కొంచెం "బాగానే" సిగ్గుగా అనిపించింది - ఇంట్లో మొదటి ఆడపిల్లగా పుట్టి, ఇంకో ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన నేను, మహిళా విశ్వ విద్యాలయం లో చదివిన నేను, బోల్డంత మంది మంచి అమ్మాయిలకి స్నేహితురాలనయ్యే అదృష్టం కలిగిన నేను - గంభీరం గా చెప్పాలంటే ఒక మహిళకి పుట్టి, ఇంకో మహిళ ఇంటిని మెట్టి, అనేక మహిళా స్నేహిత బృందాదృష్ట సంహితనైన నాకు  (ఇది మహా దుష్ట సమాసం అయి ఉండొచ్చు...చదువరులూ - ఈ ఒక్కసారికీ క్షమించేయండి!) మహిళలకి అంత ముఖ్యమైన, అంతర్జాతీయ స్థాయి దినోత్సవం గురించి అసలేమీ తెలియనందుకు. 

వెంటనే గబా గబా గూగుల్ శోధనా పేటిక లో "International Women's day" అని టైపు చేశాను. వచ్చిన ఫలితాల్లో ఐదవ లింక్ అయిన వికీపీడియా మీద క్లిక్ చేసి అక్కడ వున్న విషయమంతా చదివాను. హ్మ్...ఎందుకో మరి అంత గొప్పగా అనిపించలేదు. 

 "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర  దేవతః" - అని చెప్తూ సర్వ మానవులకూ జీవనావసరమైన శక్తికి స్త్రీ రూపమిచ్చిన భారత దేశం లో పుట్టి అంత బేలగా మారి -  నన్ను గుర్తించండి, నాకు వనరులు కూర్చండి, వసతులు కల్పించండి - అంటూ అదేదో మహిళ అంటే ఒక రక్షిత పథకం లో పరిగణన లోకి తీసుకోవాల్సిన జాతిగా అనుకుంటూ, అందులో నేనూ ఒక భాగంగా - మహిళా దినోత్సవం అని ఒక రోజుని అనుకుని, దానికిఅభినందనలు తెలుపుకుని, అందుకుని, బహుమతులు తీసుకుని మురిసిపోవాలి అనిపించలేదు. అలా అని నాకు బాధిత మహిళల మీద, వాళ్ళు పడే బాధల మీద చిన్న చూపూ లేదు, వీళ్ళేమీ చేయకపోతే ఎందుకిలా అవుతుంది - చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అనుకునే ఏక పక్ష దురభిప్రాయమూ లేదు. వీలైతే అలాంటి వాళ్లకి సానుభూతి చూపడంతో ఆగిపోకుండా చేతనైనంత సహాయం చేయాలనీ వుంటుంది. వాళ్ళనలా భయం భయంగా పెంచిన తల్లులని తలుచుకుని బాధ, ఆ స్త్రీల భయాలని, బలహీనతలని ఆసరాగా తీసుకుని తమకి అనుకూలంగా ఉపయోగించుకునే వారిని  చూసి కోపం వస్తూ వుంటాయి. అలా ఉపయోగించుకునే వారిలో వారి సాటి స్త్రీలే వుండడం వింతగా అనిపిస్తుంది. 

నేనేంటో మరీ సీరియస్ గా ఏదేదో ప్రసంగ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టు వున్నాను...బాబోయ్...బయటికి వచ్చేస్తున్నాను...నాదైన దారిలోకి...

అసలు ఎప్పట్నుంచో మన దేశం లో - కడుపు నింపే అన్నపూర్ణ, చదువులిచ్చే సరస్వతి, సంపద నిచ్చే లక్ష్మి - ఇలా మనిషికి కనీసావసారాలు తీర్చే ఆహార, విద్యా, ధనాలు అన్నీ స్త్రీ రూపాలే. గొప్పగా విద్వత్తు ప్రదర్శించే పురుషులని "పుంభావ సరస్వతి" అని పిలుస్తారు కదా! మరి మనం ఆడవారిగా పుట్టినందుకు గొప్పగా అనుకోక మనమేంటి, మనకి మనమే తక్కువ చేసేసుకుని సమానత్వం-సమాన హక్కులు అని నినాదాలు చేయడమేంటి, దినోత్సవాలు జరుపుకోవడం ఏంటి?

ఏ ఇంట్లో పని చేసే పని అమ్మాయినో, ప్రతి బిల్డింగ్ దగ్గర ఇటుకలు మోసే కూలీ యువతినో కదిపి చూడండి. వారికి తామూ సంపాదించాలి అన్న ఆలోచన, ఈ పని పోతే వేరే పని దొరుకుతుంది అన్న ధీమా తప్ప ఏ సమానత్వ వాదనకూ టైమూ, తీరికా వున్నట్టు అనిపించదు.

అదే ఏ సెలెబ్రిటి వనితనో తీసుకుంటే తన వృత్తి, అందులో తాను ఎక్కగలిగే సోపానాలు, పొందిన అర్హతలని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప తాము ఎవరి కన్నానో తక్కువేమో అనుకునే భావనే కనిపించదు.

 అసలు ఆలోచిస్తే ఈ సమానత్వం గొడవలు మనుషుల్లో తప్ప ఇంక ఏ జీవ రాశిలోనూ వున్నట్టు అనిపించదు- శరీర ధర్మానికి తగినట్టు విధులు నిర్వర్తించడం తప్ప ఇంకే జీవులూ ఆడ - మగ భేదాలకి  అంత ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపించవు. సర్లెండి! నేను పరకాయ ప్రవేశం  చేయలేను కాబట్టి ఇంత కన్నా నొక్కి క్కాణింలేను. ఇప్పటికి ఇది ఇలా వదిలేసి అసలు మహిళా దినోత్సవం మనస్పూర్తిగా జరుపుకోవడానికి ఒక గొప్ప కారణమేదైనా కనపడుతుందేమో చూడాలి.

రండి, రండి! ఇక్కడేదో పార్టీ జరుగుతున్నట్టుంది - రకరకాల చీరలు, లేటెస్ట్ నగలూ కనిపిస్తున్నాయి - పదండి మరి చూసొచ్చేద్దాము...
ఆ అమ్మాయి ఎంత బాగా అలంకరించుకుంది! ప్రక్కనే వున్న ఆవిడ తో కబుర్లు చెప్తోంది - కళ్ళల్లో మెఱుపులు మెరిపిస్తూ...ఒక చెవి అలా వేద్దామా (అవునండీ...నాకూ తెలుసు ఇంకొకళ్ళ మాటలు వినకూడదని - కానీ మనమిక్కడ ఎలాగైనా సరే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒక్క మంచి కారణమైనా వెతుక్కోవాలి కదా....)

హాయ్! ఎలా వున్నారు మీరు?
బావున్నామండీ...మీరెలా వున్నారు?
మళ్ళీ ఏదో లేటెస్ట్ జుయెలరి కొనుక్కున్నట్టు వున్నారు...
అవునండీ ...మొన్ననే ఇండియా నుంచి మా అత్తగారు తెచ్చారు...
(అర్రే! అదేంటి ఆ వినే ఆవిడ మొహం అలా అయిపోయింది - ఓహో...అత్తగారితో అన్యోన్యంగా వుండడం, అత్త అమ్మలా ఆభరణం పంపడం నచ్చలేదేమో !!!??? ఎలా మాట మార్చేస్తోందో చూడండి )
ఓ అలాగా! అది సరే కానీండి. అదిగో అక్కడ నుంచున్న వనితని చూసారా? మీకు ఆవిడ తెలుసా?
వనిత, నేను ఒక టీం లోనే చేస్తున్నామండీ...నాకు మంచి ఫ్రెండ్.
నిజమా! ఆవిడ ఎంత సింపుల్ గా వున్నారో చూడండి. ఎలా అయినా తెలివైన వాళ్ళు అంతే అండీ మనలాగా డ్రెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళలో ఆ నాచురల్ గ్లో వుంటుంది ఏ నగలూ పెట్టుకోకపోయినా....
(:( మీరూ కనిపెట్టారా - పాపం ఆ అమ్మాయి మొహం ఎలా చిన్నబోయిందో...సర్లెండి....ఇంకిక్కడ మనకేమీ దొరకదు - ఎంత చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా బయట పడకుండా ఉండలేని అసూయా విహారం తప్ప...పదండి, పదండి...)

అదిగదిగో అక్కడ ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు - విందామా? (నేను వినేది మీరు వినలేరు కాబట్టి - మీరు చదవండి దయచేసి...)

ఏంటో  వదిన గారు! నల్ల పూసైపోయారు ఈ మధ్య...ఏంటి విశేషం?
కలవకూడదని ఏం లేదండీ ...ఇదిగో మా కోడలు నీళ్లోసుకుంది. చంటి పిల్ల వుంటే హడావిడి మీకు తెలియనిదేముంది. 
చంటి పిల్ల అంటున్నారు, వదినగారూ! మళ్ళీ మైనస్సేనా అయితే!
ఎంత మాటండీ ! దుర్గా, లక్ష్మీ, సరస్వతుల్లాగా ముగ్గురు మనవరాళ్ళు నాకు. అందరినీ కూడుకు కలుపుకు పోయే వాళ్ళే కానీ తీసివేయదగిన వాళ్ళు కాదు సుమండీ!

ఎంత చక్కని మాట చెప్పారు కదండీ - ఆ ముగ్గురు మనవరాళ్ళ మామ్మగారు?! అంత ఉన్నత వ్యక్తిత్వ ఛాయలో పెరిగిన ఆ ఆడపిల్లలు ఇంకెన్ని గొప్ప ఆలోచనల కొమ్మలకి అంట్లు కడతారో కదా! ఇద్దీ ...ఇదే మరి నాకు కావాల్సిన ఒక మంచి సందర్భం....

అసలు మన ఆడ వాళ్ళందరికీ వ్యక్తిత్వ వికాసపు తరగతులు తప్పనిసరి అయితే బాగుండును. ఆ తరగతిలో పాఠ్యాన్శంగా - ఇదిగో ఇవన్నీ వుండాలి...

- అసూయ కూడదు
- మాట్లాడే మాటకి అర్థమే తప్ప అపార్థాలు వుండకూడదు 
- చదువంటే కళాశాలలోనే కాదు - ఇంటిలోనూ, వంటింటి లోనూ చదవాలి 
- ఉద్యోగాలలోనే కాదు ఇంట్లోనూ గెలవాలి 
- పెళ్ళవగానే  ఒక ఆరు నెలలు తప్పకుండా అత్తా-కోడలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి, సంతోషంగా కలిసి ఉండడానికి ఒకరినొకరు మన్నించుకోవాలి
- అమ్మ అయితే ఆడ పిల్ల కావాలనుకోవాలి
- మగ పిల్లవాడు పుడితే నడిచొచ్చే కూతురు (కోడలు) వస్తుందని మురవాలి 

అసలివన్నీ చెప్తున్నానని ఇప్పటికే చాల మందికి నా మీద బోల్డంత కోపం వచ్చేసి వుంటుంది - మరీ పాత చింత కాయ పచ్చడి  కబుర్లు చెబ్తున్నానని. 

కానీ - అమ్మలూ, అమ్మాయిలూ.....- చిన్నప్పట్నుంచీ మీరూ వినలేదూ? పెద్దల మాట చద్ది మూట అని....అందరితో కలిసి, అందరినీ కలుపుకుని బ్రతుకు చల్లగా సాగిపోవడానికి అది చాలదూ...

సరే ...ఇంకో మాట చెప్తాను ....

ఇదివరకటిలా కాక  - ఇది నా ఊహ మాత్రమే సుమండీ - ఇప్పటికన్నా అప్పటి ఆడవారే సుఖంగా వున్నారేమో తెలీదు - ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవారు ఇంటిపట్టున వుండి ఇంటికి పరిమితమైన పనులు చేస్తూ, శారీరక, మానసిక సున్నితత్వాన్ని కోల్పోకుండా జీవితాన్ని సాఫీగా గడిపారేమో అనిపిస్తూ వుంటుంది. అందరూ సుఖమే చూశారు, బాధలు పడ్డవారు లేరని కాదు. కాకపోతే ఆ బాధలకి తోడు ఈనాటి ఉద్యోగ బాధ్యతలు, అన్నీ తామే చూసుకోవాలనే "సూపర్ వుమన్ సిండ్రోములూ" లాంటివి ఉండేవి కాదు.  కాని- పుస్తకాల్లో చదివి, సినిమాల్లో చూసి ఊహించేసుకుని ఏర్పరచుకున్న భావాల ఆధారంగా - ఆ రోజులతో పోల్చుకుంటే  ఈ రోజుల్లో చాలా వరకూ ఆంక్షలు తగ్గి అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా విదేశాలకి కూడా ఒంటరిగా వెళ్లగలుగుతూ స్వేచ్ఛని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు కదా ...

అలాగే మన అందరికి "అప్ గ్రేడ్స్ " అంటే ఇష్టం కదా...
అందుకని International Women's Day ని International Humans Day గా అప్ గ్రేడ్ చేసేసుకుందామా? 
అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి అంతర్జాతీయ "మానవ" దినోత్సవం గా మార్చేసుకుందామా?
ఏం ఆడవారికేనా  అవసరం - అంతర్జాతీయ దినోత్సవం?

~లలితా TS

4 కామెంట్‌లు:

  1. అంతర్జాతీయ మానవ దినోత్సవం బావుంది నీ ఆలోచన ఆ పదానికి ఆ ఆలోచనకి లక్ష లైకులు!అక్కా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదింకో మహా పాత పోస్ట్ - చదివినందుకు థాంక్స్, హనుమాన్ !

      ఇక్కడ నేను కొంచెం వివరణ ఇవ్వాలి - ఎందుకు ఈ పోస్ట్ రాశానో. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం or అసలు ఇంకే దినోత్సవమైనా ఏదో ఒక పర్పస్ తో మొదలవుతాయి - అవంటే నాకు ఎలాంటి ఇష్టాయిష్టాలు లేవు.

      రీసెంట్ పాస్ట్ లో ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న తీరు ఎలా వుందంటే - కొన్ని చోట్ల - అసలు కష్టమంటే తెలియకుండా పెరిగిన ఆడవాళ్లు -లక్షలలో సంపాదిస్తున్నవాళ్ళు - ఇంట్లో & ఇరుగుపొరుగున వున్న తోటి ఆడవాళ్ళని అర్థం చేసుకోకుండా బాధ పెడ్తున్నవాళ్ళు - ఇలాంటివాళ్ళందరూ - ఏదో ఫ్యాషన్ పరేడ్ లాగా ఆఫీసుల్లో పార్టీలా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లని చూశాక - కొంచెం ఉక్రోషంతో రాసింది ఇది.

      ఇప్పుడైతే అలాంటివి చూసినా నవ్వుకుని వదిలేస్తున్నాను - కుంచెం పెద్దయ్యాను కదా ! ;)

      తొలగించండి
  2. ఇంట్లో మొదటి ఆడపిల్లగా పుట్టి, ఇంకో ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన నేను, మహిళా విశ్వ విద్యాలయం లో చదివిన నేను, బోల్డంత మంది మంచి అమ్మాయిలకి స్నేహితురాలనయ్యే అదృష్టం కలిగిన నేను - గంభీరం గా చెప్పాలంటే ఒక మహిళకి పుట్టి, ఇంకో మహిళ ఇంటిని మెట్టి, అనేక మహిళా స్నేహిత బృందాదృష్ట సంహితనైన నాకు (ఇది మహా దుష్ట సమాసం అయి ఉండొచ్చు...చదువరులూ - ఈ ఒక్కసారికీ క్షమించేయండి!)

    కుంచెం పెద్దయ్యాను కదా ! ;)

    ఇవి నాకు నచ్చిన హై లైట్స్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా ఈ పురాతన-పోస్ట్ ని ఓపికగా చదివి మెచ్చుకుంటున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి