19, మే 2019, ఆదివారం

త్వామనురజామి - 36 - కొరియరు పోస్టులో... పక్షి బొమ్మలొచ్చాయి...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 35 - భలే భలే మంచి రోజులులే! మళ్ళీమళ్ళీ ఇక రావులే!

గుంటూర్లో ఎండాకాలం
గుండులు మండేకాలం
ఇంటి కిటికీలకి వట్టివేళ్ల పరదాలు
ఇంటి పట్టునున్న మా అక్కాచెల్లెళ్ల కబుర్ల సరదాలు
మామిడిపళ్ళ బుట్టలు
తాటాకుల్లో చుట్టిన ముంజల  కట్టలు
చేతికి నూనె రాసుకుని నేను మాత్రమే తీసే పనసతొనలు
ఎండవేళ చలవని అమ్మ కాచిచ్చే నిమ్మకాయ పిండిన బియ్యపురవ్వ జావలు
నాన్నతో కబుర్లు, అమ్మతో వేళాకోళాలు
మేం ముగ్గురం పాడుకునే పాటలు, నవ్వుకునే నవ్వులు
ఇంటికి వచ్చేపోయే బంధువులు, స్నేహితులూ
ఎప్పట్లాగే ఇల్లంతా సందడి
పీకి వెయ్యని సరదాల పందిరి

అంతట్లో ఓ రోజు రామారావు అంకుల్ ఒచ్చి అమ్మతో "కిందటి మాటు మా ఆల్ఫ్రెడ్ సార్ వాళ్ళ పాపకి మీ పెద్దపాప లెక్కల క్లాసు చెప్పింది కదా! ఆ పాపకి బాగా ఇంప్రూవ్‌మెంట్ కనిపించిందట. ఈసారి కూడా వేసవి సెలవులకి వాళ్ళు గుంటూరొస్తున్నారు. పెద్ద పాపా ఇంకా ఇంట్లో ఉంటుంది కదా ప్రాజెక్టువర్కు కెళ్లే లోగా! ఓ నెల్రోజులు లెక్కలు చెప్పమనండి" అంటూ.

అలా మళ్ళీ సంగీతా ఆల్ఫ్రెడ్ వాళ్ళ చెల్లెలు అనహితతో కలిసి రోజూ పొద్దున్నే పదింటికి లెక్కలు చెప్పించుకోవడం కోసం నా దగ్గరికి రావడం మొదలయింది. ఓ నలభై ఐదు నిముషాలు లెక్కలు, ఆ తర్వాత నా దగ్గరున్న పుస్తకాల్లో తనకి నచ్సిన ఏ ఎనిడ్ బ్లైటన్ పుస్తకమో, టామ్ సాయరో - ఏదో ఒకటి అడిగి తీసుకెళ్లి, చదివి దాని గురించి మాట్లాడడమో చేసేది సంగీత. అనహిత మాత్రం ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ళ అక్క నాతో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండేది.

జూన్ రెండో తారీఖు. అమ్మానాన్నల పెళ్లిరోజు.  పులిహోర, సగ్గుబియ్యం పరవాణ్ణం, వేయించిన గుమ్మడొడియాలు కలిపిన వంకాయ-బంగాళాదుంప కూర, మామిడికాయ పప్పు, కొబ్బరికాయ తియ్య పచ్చడి, అల్లం పెరుగుపచ్చడి - ఇలాంటి పసందైన మెనూతో మా అమ్మ పెట్టిన బ్రహ్మాండమైన పెళ్లిరోజు భోజనంతో మాకు బ్రహ్మానందం కలిగింది. భోంచేసిం తర్వాత మన్-చాహే గీత్ వింటూ ఆ బహ్మానందాన్ని కంటిన్యూ చేస్తూ వున్నాము. ఇంతలో ఓ అబ్బాయి ఒక ప్యాకెట్టు పట్టుకుని "కామేశ్వరరావుగారు ఎవరండి ఇక్కడ?" అంటూ వచ్చాడు. నాన్న అప్పుడే భోంచేసి పడుక్కున్నారు. అదే చెప్తే ఆ అబ్బాయి "ఆయనకి ఓ కొరియర్ వచ్చిందండి. మీరు సంతకం చేసి తీసుకుంటారా?" అనడిగాడు. సరేనని నేను సంతకం పెట్టగానే తాను తెచ్చిన పాకెట్టు నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడా అబ్బాయి.

నాన్న మామూలుగానే రెండు గంటలకి లేచి అమ్మ పెట్టివ్వబోయే కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. నేనెళ్ళి "నాన్నా! మీకేదో కొరియర్ వచ్చింది" అంటూ ఆ పాకెట్టు చేతికందివ్వగానే "కొరియరా? నాకా? ఇప్పుడెవరు పంపిస్తారు? ఎందుకు పంపిస్తారు?" అంటూనే దాన్ని విప్పి చూశారు. లోపల మంచి లేత రంగుల్లో గీసిన ఓ కొమ్మ మీద వాలిన రెండు పక్షి బొమ్మలున్న పెయింటింగ్ వుంది. అందులో ఒక గ్రీటింగ్ కార్డు - Wish you a very happy Wedding Anniversary - W. Besil అనుంది.

అది చూడగానే నాన్నకి అదెవరు పంపించారో అసలర్థం కాలేదు. ఆయనకి ఆ W. Besil అన్న పేరుతో ఫ్రెండ్స్ కానీ, తెల్సినవాళ్లు కానీ ఎవరూ లేరు. ఆయన ఎవరు పంపించారా అనాలోచిస్తూ, అసలా కొరియర్ ఎక్కణ్ణించి వచ్చిందో అని from address చూశారు. అక్కడ కూడా W. Besil  అన్న పేరు తప్ప ఇంటి నంబరూ అవేమీ లేవు. నాకూ అదెవరు పంపించారో అస్సలు ఊహించడానికి కూడా చేతకాలేదు.

ఆ రోజు మా నాన్న పడిన తికమక అచ్చు దాసరి వారి వరసలో పాటగా పాడుకోదగింది... (దీని అసలు పాట పట్టుకుని నాకు చెప్తారా? :) )

కొరియరు పోస్టులో... ఓ... ఓ... ఓ...హొయ్!
కొరియరు పోస్టులో... పక్షి బొమ్మలొచ్చాయి
వాళ్ళు పంపారా? వీళ్ళు పంపారా?
నాకు వాళ్ళు పంపారా?
వీళ్ళు నాకు పంపారా?

అలా సరదా పాటలేవో రాసేశాను కానీ నాన్నలో అసహనం చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ రెండో రోజు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చినప్పుడు నాన్న నెమ్మదిగా "అసలే ఆ తిరుపతి గొడవతో చాలా చిరాగ్గా వుంది నాకు. మధ్యలో ఈ బెసిల్ ఎవడో అర్థం కావట్లేదు. నేను రెండో లైనూ, మూడో లైనూ  మోటార్ సైకిల్ మీద రౌండ్లు వేసొచ్చాను. అదెవరు పంపించారో అంతు పట్టట్లేదు. వాడెవడో నాకు దొరికాడో వాడి సంగత్తేలుస్తాను" అనడం వినిపించింది.

నాకెందుకో మొదటిసారిగా ఇదేదో తిరిగి తిరిగి నా మీదకొచ్చేలా ఉందని అనిపించింది. ఆ W. Besil ఎవరో తెలిస్తే నాన్న కోపాన్ని ఆ బెసిల్ మీదకి తిప్పచ్చు అనుకున్నాను కూడా. కానీ ఎలా?  నాక్కొంచెం ఏదో జరగబోతోంది అన్న inkling, uneasiness.  కాకపోతే నేనకున్నట్టుగా ఏమీ జరిగిపోలేదు.

నేను బెంగుళూరుకి వెళ్ళే దాకా నాతో ఉందామని కుట్టి కూడా వైజాగ్ నుంచి వచ్చింది. అది వైజాగ్‌లో లలితత్తయ్య ఇంట్లో ఉండి కంప్యూటర్ కోర్సేదో చేస్తూ, బండారు చిట్టిబాబుగారి దగ్గర లలితసంగీతం నేర్చుకుంటూ వుంది. దాంతో ఉంటే కబుర్లకి కొదవేముంది?! దానికి తోడుగా పప్పి ఉంటే నవ్వులకి కొరతేముంది?!

ఓ రోజు మధ్యాహ్నం మేం ముగ్గురమే ఇంట్లో వున్నాం. నాన్న ఆఫీసుకి వెళ్తూ అమ్మకేదో పనుందని అమ్మాజీ ఆంటీ వాళ్ళింటి దగ్గర దింపి వెళ్లారు. నేను నా పుస్తకాలు పెట్టుకునే కిటికీ అర కింద కూర్చుని వున్నాను. నాకెదురుగుండా అద్దాల షెల్ఫుకి ఆనుకుని కుట్టి కూర్చుని వుంది. నా కుడిపక్కనున్న గోడకి అతికించి వున్న Boney-M పోస్టర్ కింద పప్పి కూర్చుని వుంది. ముగ్గురం ట్రయాంగులర్‌గాకూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ వున్నాము.

"మొన్నో రోజు నేను మోపెడ్ మీద వెళ్తుంటే బీచ్ రోడ్డు అప్పులో ఆగిపోయింది. తోసుకుంటూ వెళ్ళాను రాయుడు బాగ్‌కి. తల ప్రాణం తోకకొచ్చిందనుకో. మేడ మీంచి చూస్తూ సాయి ఒకటే నవ్వడం. సరిగ్గా టైంకి సతీష్ ఇంట్లో లేడేమో ఆ వెర్రికుక్క పార్థని కట్టేశారు. లేకపోతే దాని అరుపులకి ఆ తోకలో వున్న ప్రాణం కూడా పోయేది." వైజాగ్‌లో జరిగిందేదో తలపోసుకుంటూ వాపోతోంది కుట్టి.

"అద్సరే కానీ ... నీ కంప్యూటర్ కోర్స్ ఏంటి? ఎంతవరకూ వచ్చింది?" నా ఏరియా అదే కదా అందుకే ఆ ఆరా.

"ఏం కోర్సే లల్లెమ్మా! నాకసలే ఏసీ పడదు. చలేసేస్తూ ఉంటుంది. మొన్నోసారి ఇలాగే కంప్యూటర్ సెంటర్లో ఎవరూ లేరు. నేనొక్కదాన్నే వున్నాను. అటూఇటూ చూసి కాసేపు ఏసీ లేకపోతే ఇవేం పేలిపోవులే అన్జెప్పి ఏసీ మిషన్ పక్కనున్న ప్లగ్గు లాగేశా. మా ఇన్స్ట్రక్టరు లోపలికొచ్చి ఒకటే గొడవ - అది ఏసీ ప్లగ్గు కాదు - కంప్యూటర్లకి పవర్ సప్ప్లై అంటూ లబోదిబోమన్నాడు. నేనేం మాట్లాడకుండా నా పుస్తకాలు సర్దుకుని బండెక్కి ఇంటికొచ్చేశా. నాకూ ఆ కోర్సుకీ ఇంక రాం-రాం!"

అది చెప్పింది వింటూ అసలక్కడ జరిగింది ఊహించుకుంటూ చాలా సేపు నవ్వుకున్నాం. మామూలుగా ఓ పదినిముషాల తర్వాత ఇంకేదో టాపిక్ మొదలై వేరే విషయాలేవో మాట్లాడుకునేవాళ్ళం. కానీ కుట్టి, నేనూ ఆ కంప్యూటర్ సెంటర్లో అది చేసిన పని గురించి తల్చుకుని, తల్చుకుని నవ్వుతూనే వున్నాం. మా ఇద్దరికీ మధ్యలో కూర్చున్న పప్పి ఆపకుండా నవ్వుతున్న మా ఇద్దర్నీ చూసి "బాబోయ్! మీ ఇద్దరికీ ఇవాళ ఏదో అయ్యింది. నేను బయటికెళ్లి కూర్చుంటా. మీ నవ్వులయ్యాకే లోపలికొస్తా" అని పారిపోయింది.

రోజులలా మూడు కబుర్లు-ఆరు నవ్వులుగా జరిగిపోతున్నాయి.

ఈలోగా NAL నుంచి లెటర్ వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ కోసం నేను పంపించిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేశామూ, ఆగస్టులో వచ్చి చేరమని. నాన్న నాకూ, అమ్మకీ, ఆయనకీ విజయవాడ నుంచి బెంగుళూరుకి ట్రెయిన్ టికెట్లు బుక్ చేశారు. మేం బయల్దేరే రోజు లోగా హైదరాబాదు నుంచి లక్ష్మి దొడ్డని రమ్మని చెప్పారు పప్పి, కుట్టీలకి తోడుగా ఉండేందుకు.

ఇంకో పది రోజుల్లో ప్రయాణం. ఆ రోజు పొద్దున్నించీ నాన్న కొంచెం సీరియస్‌గా వున్నారు. భోజనం దగ్గర కూడా ఏదో ఆలోచిస్తున్నట్లు మాట్లాడకుండా గబగబా తినేసి లేచేశారు. ఆ రోజు రాత్రి టీవీలో ఇంగ్లీష్ న్యూస్ అయిపోగానే అమ్మ కలిపిచ్చిన పాలు తాగి పడుకోబోతున్నాను. ఇంతలో నాన్న వాళ్ళ బెడ్రూం లోంచి "లల్లీ! ఓ సారిలా రా!" అన్నారు. నాతో పాటు అమ్మ కూడా వచ్చి, వస్తూనే బెడ్రూం తలుపు వేసేసింది. నాకెందుకో ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లంది - ఇవాళ ఏదో జరగబోతోంది అన్నట్లు.

అంతలోనే మళ్ళీ అనిపించింది - దీని కోసమే కదా ఎదురు చూస్తున్నానూ - అని. నాన్న నాతోనే డైరెక్టుగా మాట్లాడుదాం అనుకోవడం చాలా హాయిగా అనిపించింది. చిన్నప్పట్నుంచీ నన్ను ఏదైనా అడిగే అధికారం, నాకు చెప్పే అవకాశం ఇద్దరికే - అమ్మకి, నాన్నకి. కాకపోతే ఇప్పటిదాకా చెప్పించుకునే అవసరం కల్పించుకోలేదు నేను - నేనాడింది ఆట, పాడింది పాటగానే సాగింది ఇప్పటిదాకా. ఇప్పుడింక తప్పదు. నాన్న నా గురించి ఎంత కోపాన్ని ఆపుకుంటున్నారో, అమ్మ ఎంత బాధ పడుతోందో నాకు తెలుస్తూనే వుంది - కానీ ... నేనేం వాళ్ళని కాదని వెళ్ళబోవట్లేదుగా! వాళ్ళని ఎలా అయినా ఒప్పించగలననే నా నమ్మకం. కానీ...ఎలా? ఆలోచన సాగుతూనే వుంది.

"ఇలా మంచం మీద కూర్చో" అంటూ తన పక్కన చోటు చూపించారు నాన్న.

తరగడ కానుకుని ఆయనకెదురుగా కూర్చున్నాను.

"ఆ తిరుపతి అబ్బాయి - అదే బదరి - ఇప్పుడెక్కడున్నాడు అతను? ఏం చేస్తున్నాడు?"

హమ్మయ్య! కొంచెం సామరస్యంగానే మాట్లాడుతున్నారు నాన్న. కొంచెం ధైర్యంగా అనిపించింది.

"తన MBA అయిపోయింది. ఉద్యోగం కోసం చూస్తున్నారు." అని నా సమాధానం.

"ఆహా..." నాన్నేదో ఆలోచిస్తున్నారు.

నేను అంతటితో ఆపొచ్చుగా! ఉహూ... నాన్న అంత నెమ్మదిగా ఉండడం చూసి ఉత్సాహ పడ్డా!

"అదే నాన్నా! మీరన్నారట కదా తిరుపతిలో కలిసినప్పుడు... ఇంకా చదువు పూర్తి కాలేదు, ఉద్యోగం సద్యోగం లేదు, మా లల్లి వెంట పడుతున్నావెందుకు? - అని. అందుకని ఉద్యోగం వచ్చాకే మిమ్మల్ని కలుస్తానన్నారు." గుక్క తిప్పుకోకుండా అనేశా.

అది వినగానే నాన్న వెంటనే "నేనన్నది అలా అర్థమయ్యిందా? తిరుపతి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి క్లియర్‌గా చెప్పాను ఇల్లాంటివేవీ కుదరవని. నీకూ అర్థమయ్యిందనుకుంటాను."

"... .... ... "

"నువ్వు నా మాట వింటానంటే మన వాళ్లలో  ఇంజినీర్లు, డాక్టర్లు బోల్డు మంది వున్నారు. నీకెవరిష్టమౌతారో చూద్దాం. వాళ్ళతోనే నీ పెళ్లి. నీకిష్టం లేకుండా ఏదీ జరగదు. కావాలంటే ఐఏఎస్ కూడా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం.  ఏదైనా నీక్కావల్సినట్టే చేద్దాం." నాన్న చాలా అనునయంగా చెప్తున్నా - ఇంకాస్సేపట్లో జటాజూటాన్ని విప్పబోయే - లుంగీ,చొక్కా వేసుకున్న తాండవ-శివుళ్లా చెప్తున్నారు.

".... ... ..."

అమ్మక్కోపం వచ్చేసింది. "ఏంటి? నాన్న అంతడుగుతుంటే ఏమ్మాట్లాడవ్? సమాధానం చెప్పు!" గద్దించింది.

అమ్మ కేసి చూడకుండా "నాన్నా! తనంటే నాకిష్టం. తనతో ఉంటే నాకు మీతోనూ, అమ్మతోనూ వున్నట్లే ఉంటుంది. మీకు తెలుసా? నాకు బస్సు పడదు కదా! నాకోసారి తిరుపతిలో బస్సు దిగగానే వామిటింగ్ అయితే తనసలు విసుక్కోకుండా గబగబా వెళ్ళి షోడా తెచ్చి నా మొహం కడిగారు - అచ్చు అమ్మలాగే!  మొన్నా మధ్య తిరుపతిలో ఎవరో అబ్బాయిలు నా విషయంలో గొడవ చేస్తే బదరి, తన ఫ్రెండ్స్ వాళ్ళని బెదిరించి ఇంకెప్పుడూ నా వెంట పడకుండా చేశారు కూడా. నేనంటే తనకి కూడా చాలా ఇష్టం." అని బోల్డు convincing గా మాట్లాడుతున్నానూ అనుకుంటూ గబగబా చెప్పేశాను.

నా మాటలు వింటున్న నాన్నకి  ఆ సమయంలో వచ్చిన కోపాన్ని అంత ఆపుకోగలిగారంటే అది కచ్చితంగా మా అమ్మ వల్లే! ఆవిడ నాన్నని మా ఈ సంభాషణకి ముందు ఎంతగా ప్రిపేర్ చేసి ఉంటుందో! కానీ నా మాటలు వినగానే అమ్మకి అప్పటివరకూ ఆపుకున్న బాధ, కోపం బయటికి వచ్చేశాయి.

"నీకు అమ్మా-బాబూ అని చెప్తే అర్థం అయ్యేలా లేదు. నీకో సంగత్తెలుసా? ఆ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువట. వాళ్ళింటి ముందే మన మణి ఆంటీ వాళ్ళున్నారు. వాళ్ళు చెప్పారు. చూడబోతే ఆ అబ్బాయి అంత మంచివాళ్ళా లేడు" మా అమ్మ ఆవిడ చేసిన డిటెక్షన్ బైట పెట్టేసింది.

సరే! అది మా అమ్మ నాకు చెప్పాలా? SBM బిజ్-బీమ్ అని జరిగిన ఎంబీఏ వాళ్ళ ఇంటర్-కాలేజియేట్ మీట్ కోసమని వచ్చి బదరికి ఉత్తరాలు రాసిన హైదరాబాదు అమ్మాయి గురించీ, తను కనిపిస్తేనే కళ్ళు మెరిసే అమ్మాయిల గురించీ, తను మాట్లాడితే మెలికలు తిరిగే అమ్మాయిల గురించీ, మేమిద్దరం కలిసి కనిపించినప్పుడు తనతో మాత్రం మాట్లాడి నన్ను చూసి మొహం తిప్పుకునే అమ్మాయిల గురించీ చెబ్దామనుకుని అమ్మ కోపం ఇంకా పెంచడమెందుకని ఊరుకున్నాను.

ఇంతలో నాన్న "చెప్పు లల్లీ! ఏమాలోచిస్తున్నావ్? నీ తర్వాత ఇంకా ఇద్దరున్నారు నాకు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. నీ ఇష్టమొచ్చినట్లు చేస్తే తర్వాత్తర్వాత మాకెంత ఇబ్బంది అవుతుందో నీకసలేమైనా అర్థమౌతోందా,  లేదా?" అని కొంచెం గట్టిగానే అడిగారు. అంతకు ముందు తిరుపతిలో వున్నప్పుడు బెంగుళూరు నుంచి కిరణ్‌ని రమ్మని పప్పి గురించి మాట్లాడానని, నా వల్ల ఇంట్లో ఎవ్వరికీ ఇబ్బంది కలక్కుండా వుండాలని నేనూ ఆలోచిస్తున్నానని చెబ్దామనుకుని మళ్ళీ ఒద్దులే అని ఊరుకున్నాను.

నాన్న అలా గట్టిగా మాట్లాడగానే - ఆశ్చర్యం! ఇదే ఇంకో ఇంకో విషయంలో అయితే వెంటనే ఏడ్చేసి నాకున్న అమృతవర్షిణి అన్న పేరుని సార్థకం చేసుకుని ఉండేదాన్ని - కానీ ఇప్పుడు చాలా స్థిరంగా, నాన్న కేసి చూస్తూ "నాన్నా! మీకు కష్టం కలిగించే పని నేనెప్పుడూ చెయ్యను. మీరు వద్దంటే నాకిష్టమున్న పని మానేస్తాను కానీ నాకిష్టం లేని పని చెయ్యమని మాత్రం నన్నడక్కండి" అని చెప్పి ఆపాను. (నేనూ, అపర్ణ ఎప్పుడూ అనుకునేవాళ్ళం - మా ఇద్దరికీ శంతనుడికి షరతులు పెట్టిన గంగ ఆదర్శం అని. ఎక్కడో sub-conscious లో వున్న ఆ ఆలోచన నన్ను మా నాన్నతో అలా మాట్లాడేలా చేసింది.)

అది వినగానే ఇంక నాన్న ఏం మాట్లాడలేదు. అమ్మకి మాత్రం చా...లా కోపం వచ్చింది. "నువ్వెంత రాయిలా తయారయ్యావు? ఇంతలేసి మాటలంటున్నా అసలు నీ కంట్లో నీళ్ళే రావేం? ఎంత sensitive, delicate అనుకున్నాను నీ గురించి?? గోముఖవ్యాఘ్రానివి!" అని తిట్టేసింది. నన్ను మా అమ్మ తిట్టిన అతి పెద్ద తిట్టు అదే :))

కనురెప్పల కీవల చనవైన ఆ రూపు
గురుతుగా కమ్మిన చిరునవ్వుల తలపు
కనుపాపలకి అండయై వుండగ కాపు 
నీరెలా పొరలు దాటి ఆ కంటి అదుపు?

నాకెందుకు ఏడుపు రావట్లేదో నన్ను నేనే అడిగిన ప్రశ్నకి నాకు నాకే సమాధానం దొరికేసింది. మా అమ్మకీ చెబ్దామనుకుని అసలే మాట వినట్లేదని నా మీద కోపంగా వుంది, కవితలు కూడా పాడతావా అని తిట్టడానికి సంస్కృతంలో ఏమీ గుర్తు రాక తెలుగులో తిడితే ఆ తిట్ల సౌండ్ నాకు నచ్చకపోవచ్చు. ఈ మాత్త్రం మర్యాద దక్కింది చాలు అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాను.

నేనలా ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి అమ్మ నాన్నతో కోపంగా "దీనికి చెప్పి లాభం లేదు. చూడబోతే ఆ అబ్బాయే మంచివాడిలా వున్నాడు. నేవెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పిల్లాడికి నచ్చ చెప్పుకోమని చెప్తాను." అనేసి నాకేసి తిరిగి "ఇవాళ్టికిక్కడే పడుకో1" అని కసిరింది.

నేను వెంటనే అమ్మ పక్కనే ఓ పక్కకి తిరిగి మంచం అంచుకి జరిగి - ఇవాళ్టికి ఇవాళ బానే గడిచింది. రేపెప్పుడూ ఉంటుంది - బావుంటుంది - అని రోజూ లాగే అనుకుని "ఇంతకీ బదరి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అని ఇంకో ఆర్నెల్ల దాకా - అంటే నా ప్రాజెక్టు అయిపోయే దాకా ఆలోచించను" అని నాకు నేను చెప్పుకుని పడుకున్నాను.



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

21 కామెంట్‌లు:

  1. "మీకు కష్టం కలిగించే పని నేనెప్పుడూ చెయ్యను. మీరు వద్దంటే నాకిష్టమున్న పని మానేస్తాను కానీ నాకిష్టం లేని పని చెయ్యమని మాత్రం నన్నడక్కండి."-ఎంత బాగా చెప్పారు లల్లమ్మా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనన్నానని రాసిందాన్ని ఎంత బాగా చదివి మెచ్చారు, చెల్లెమ్మా! :) థాంక్ యూ!

      తొలగించండి
  2. చాలా బాగా రాశారు లలిత గారు.

    ఇక మీ సిస్టర్ ప్లగ్ పీకేసిన విషయం చదివినప్పుడు భలే నవ్వొచ్చింది.

    రిప్లయితొలగించండి
  3. సిత్తరాల తోటలో ....ఓ...ఓ...ఓ. హొయ్
    సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి
    నువ్వు రాశావా? నేను రాశానా?
    నాకు నువ్వు రాశావా? నీకు నేను రాశానా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాటని భలే పట్టేశారు, దీపగారు! నా బ్లాగ్ చదువుతున్నందుకు చాలా థాంక్స్!

      తొలగించండి
  4. కధ, కధనం అధ్బుతం!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత పిన్నీ! నా బ్లాగ్ చదివి, కమెంట్ పెట్టినందుకు థాంక్స్ ఎ లాట్!

      తొలగించండి
  5. త్వామనురజామి సిరీస్ లో ఇది, ఇంతకు ముందుది మాత్రమే చదివాను అనుకుంటాను. మొత్తం అన్నీ చదవాలని అనుకుంటున్నాను. నాకు తెలుగే ఆట్టే రాదు. సంస్కృతం అసలే రాదు. ఇంతకీ త్వామనురజామి అంటే ఏమిటో? అన్నీ చదివితే అర్ధం అవుతుందేమో చూస్తాను.

    మీ జ్ఞాపకాలు బాగున్నాయి. అవి చెప్పే తీరు ఇంకా బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు నా త్వామనురజామి సిరీస్ చదవబోతున్నందుకు బోల్డన్ని ధన్యవాదాలు, సుబ్రహ్మణ్యం గారు!

      తొలగించండి
  6. లలిత గారికి నమస్కారం .
    త్వామనురజామి -36 వ భాగం ఈ మధ్యే చూసి చదివి ఓహో ఇది ఇంకా 35 భాగాలుందా ! అనుకుని గత వారం రోజులనుండి రోజుకి 5 భాగాల చొప్పున ఇప్పుడే అన్ని భాగాలు చదివాను . మీ రచన శైలి , తెలుగు పద ప్రయోగాలు అత్యద్బుతం. ఏక బిగిన రోజుల తరబడి చదువుతూ కూర్చోవచ్చు. వృత్తి రీత్యా నేను తరచూ హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళి వస్తుంటాను. మీ బ్లాగ్ చదివిన తరువాత గుంటూరు మరింత అందంగా కనిపిస్తోంది . మీ అల్లరి, వ్యక్తిత్వం, ప్రేమ, ధైర్యం ,చదువు , సినిమా లంటే పిచ్చి , జీవితం ఫై స్పష్టత అన్నీ చాలా బాగున్నాయి . సెల్ ఫోన్ లేని ఆ తరాలన్నీ ఇంత బాగుండేవా అనిపిస్తోంది. నాకు తెలిసి ఆంధ్ర ప్రాతం వారికి ఇప్పటికి కూడా హిందీ మాట్లాడటం సరిగ్గా రాదు . కాని మీ హిందీ పాటలు, సినిమాలు గురించి చెప్తోంటే ఆశ్చర్యం వేస్తోంది .
    మీ పేరు (లల్లి) కుడా నాకు భలే నచ్చేసిందందడోయ్ . ఒక వేల నాకు కూతురు పుడితే తనని లల్లి అనే పిలుస్తాను.
    మరో త్వామనురజామి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్రావారికి హిందీ వచ్చిందే సినిమాల వల్ల. ఇప్పటిలాగా బోల్డన్ని చానెళ్ళు లేవు. దూరదర్శన్ ఒక్కటే దిక్కు, ఎన్నెన్ని సినిమాలు చూసామో? రేడియోలో ఇప్పటికీ పాత హిందీ పాటలు వస్తుంటాయి. ఖాళీ సమయం దొరికితే బిరియానీ వండుకుందామా, చక్కిలాలు వండుకు తిందామా అనేవారు కొందరైతే, పాటలు పాడుకునే వారు కొందరు.

      తొలగించండి
    2. లేతమనసులు సినిమాలో లల్లి, పప్పీ ఉండేవారు.జమున హరినాధ్ నటించారు. అప్పట్లో పిల్లలందరికీ అవే పేర్లు.

      తొలగించండి
    3. నరేందర్ రెడ్డి గారు! మీ కమెంట్ చూసి చాలా సంతోషించాను. హిందీ నా సెకండ్ లాంగ్వేజ్ మూడో తరగతి నుంచి డిగ్రీ దాకా :) దానికి తోడు బోల్డన్ని హిందీ సినిమాలకి తీసుకెళ్ళేవారు, పంపించేవారు ఇంట్లో. త్వామనురజామి చదువుతున్నందుకు థాంక్ యూ!

      తొలగించండి
    4. "లల్లి, పప్పి" పేర్ల గురించి మీర్రాసింది కరెక్టండి, నీహారికా! మాకు "లేతమనసులు" cinema చూసే ఆ పేర్లు పెట్టారు. అందులోనూ నా పేరు లలిత కావడంతో "లల్లి" సరిగ్గా సరిపోయింది. Thanks for your comments!

      తొలగించండి
    5. సరిగ్గా చెప్పారు నీహారిక గారు.
      ఇప్పుడే లేతమనసులు సినిమాలోని
      "పిల్లలూ దేవుడూ చల్లని వారే, కల్లకపటమెరుగనీ కరుణా మయులే" పాట యూ ట్యూబ్ లో చూశాను. చాలా బాగుంది.

      తొలగించండి
    6. గత మూడు సంత్సరాలుగా ఇంత ఓపికతో రాస్తున్నందుకు
      మీకు డబుల్ థాంక్సండీ. త్వామనురజామి ఇప్పుడప్పుడే అవగొట్టకండి. కనీసం ఓ వంద భాగాలైనా రాయండి.

      తొలగించండి
  7. బావుంది లల్లి ఇంతకీ కొరియర్ ఎవరు పంపించారు? Waiting for next episode.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమో శ్యామలా! నాకూ ఇంకా తెలీదు. ముందుముందు తెలుస్తుందేమో చూద్దాం :)

      తొలగించండి
  8. Wow...ఏదో మీ ఇంట్లో ఉండి దగ్గర నుంచి చూస్తున్నట్లు ఉంది.

    రిప్లయితొలగించండి