పగలూ రాత్రీ ఏ టైం లో అయినా ఆకలి అంటే చాలు హడావిడి పడిపోతూ వండి పెట్టే అమ్మలు వున్నా కూడా అదేంటో మరి - వాళ్ళెంత వండేశారో వార్చేశారో ఎవరం చూడలేదు కానీ నలుడూ, భీముడూ గో.... ప్ప వంటలు రుచిగా చేసే వాళ్లనే పేరు కొట్టేశారు. దానికి మళ్లీ పేటెంట్ తీస్కున్నట్టు నలభీమపాకమని ఒక పేరు పెట్టించేసుకున్నారు.
అది అసలు అయితే గియితే బాహుక-వలల పాకం అయివుండాలి కానీ నలభీమపాకం ఎలా అయిందో నాకిప్పటికీ మిలియన్ "పాకర్"ల ప్రశ్న (పాకర్ అంటే పాకం చేసేవాడని - పాకేవాడని కాదు).
అంటే అంతగా గుర్తింపు లేని ఆ మారు వేషాల పేర్లు పెడితే ఎవరూ పట్టించుకోరని వాళ్ళు చేసిన ఎవరూ-ఎప్పుడూ రుచి చూసిన "పాకాన" పోని ఆ ఇంతోటి కాల్పనిక వంటలకి నలభీమ పాకం అని పేరు పెట్టడం లోనే వాళ్ళ గుర్తింపు సంక్షోభం - అదే - ఐడెంటిటీ క్రైసిస్ తెలిసిపోతోంది.
సరే - ఇంతకీ ఆ బాహుకుడూ-వలలుడూ వండిన వంటలు ఎలా వుంటాయో కనీసం ఎక్కడా మచ్చుకి ఒక రెసిపీ కూడా నాకు తటస్థ పడలేదు కానీ మా నాన్న మాత్రం దగ్గర బోల్డన్ని రెసిపీలు వున్నాయి.
మా అమ్మ - పాపం - అడిగిందే తడవు అన్నీ చేసి పెట్టేదా - అయినా సరే అమ్మ వంటెప్పుడూ - టేకెన్ ఫర్ గ్రాంటెడ్ (taken for granted).
ఏ వసంత కోకిలలానో, వర్షం చూసిన నెమలిలానో అప్పుడప్పుడూ నాన్న చేసే వంట మాత్రం - లాడెడ్ విత్ ప్రైడ్ (lauded with pride).
ఆ వరసలో రాసిందే ఒకప్పటి నా పోస్ట్: మా నాన్న గారు నేర్పిన "సకల పప్పు సహిత ఓట్స్ పాకం"
మళ్లీ ఈ వారానికి కబుర్లేంటా అని ఆలోచిస్తూ వుంటే మెరుపై మెరిసింది మెదడులో - మా నాన్న రాసిన ఓ వంటోత్తరం.
వెంటనే మనసులో - ముందడుగులో శోభన్ బాబు - 'నాకొక శ్రీమతి కావాలి' - అని పాడుకున్న వరసలో
నాబ్లాగ్కొక టాపికు కావాలి
మీ అనుమతి దానికి కావాలి
- అని పాడేసుకుని మా నాన్నకి ఫోన్ చేశాను.
"హలో! నాన్నా!"
"ఆ! లల్లీ! చెప్పు"
"బావున్నారా నాన్నా?"
"అందరం బావున్నాము"
"ఏం చేస్తున్నారు నాన్నా ?"
"ఏం చేస్తాం? నేను టీవీ చూస్తున్నాను - మీ అమ్మ తొలేకాదశి కదా - ఏదో పూజ చేస్తోంది"
"ఏం టీవీ చూస్తున్నారు నాన్నా?"
"ఏం చూస్తాను ?! ఏదో చూస్తున్నాను " - కొంచెం విసుగు గొంతులో
"చూశారా - మూడో ప్రశ్నకే విసుగొచ్చేస్తోంది మీకు "
"హ హ హ హ " - నవ్వేశారు
"సరే! ఇంతకీ ఎందుకు చేశానంటే - అప్పుడెప్పుడో నాకొక ఉత్తరం రాశారు గుర్తుందా? విశేషాలు రాయండి నాన్నా అంటే వంటలు రాశారూ - అది - నా బ్లాగ్ లో పోస్ట్ చేసుకోనా ?"
"ఓహో ! 'కాపీ' కి రైట్-రైట్ అనాలా?" - గొంతులో హుషారు
"అదే మరి - కాపీరైటంటేనే - ఎ రైట్ టు కాపీ - కాదా మరి?!"
"కదా మరి! మరింకెందుకు ఆలశ్యం - రాసేసుకో నీ బ్లాగులో"
నాన్న అనుమతి ఇవ్వడమేంటి - ఆయన రాసిన ఇన్లాండ్ లెటర్ తీసుకుని - అందులో వున్నది వున్నట్టు నా పోస్ట్ లోకి చూసి-టైపు చేసేశాను.
మా నాన్న రాసిన పాక-లేఖ:
Safe RJY
Dt. 02.8.2011
Dear Lalli, Badari, Suhas & Kiran,
ఇ||క్షే||. అ||క్షే|| అని తలుస్తాను. అనాతవరం, కాకినాడ, శివకోడు, విశాఖ, హైదరాబాదు, బెంగుళూరు - అంతా క్షేమం. గత లేఖలో నా డైరీ మొత్తం వ్రాశాను. కాబట్టి ఇంక ఎక్కువ విశేషాలు లేవు.
ఈసారి "సప్తధాతుచూర్ణము" తయారీ విధానము మరియు వాడకము గురించి విషయాలు.
సప్తధాతువులు - కావలసిన కొలతలు:
1) ధనియాలు 25 గ్రా (2) జీలకర్ర 25 గ్రా (3) వాము 25 గ్రా (4) మిరియాలు 10 గ్రా
(5) మెంతులు 10 గ్రా (6) సోంప్ 15 గ్రా (7)దాల్చిన చెక్క 15 గ్రా
పై దినుసులు నూనె లేకుండా ఒకసారి వేయించి, మిక్సీలో వేసి మెత్తగా చూర్ణము చేసి గాలి తగలని సీసాలో భద్రపరచవలెను.
Airtight చేస్తే చాలా కాలము నిల్వ ఉంటుంది. పై వాటిలో 5 గ్రా పసుపు కలపవలెను.
ఆ చూర్ణము ప్రతిరోజు 1 స్పూను రైస్ లో కలుపుకునే కూరలో గాని, చట్నీలో గాని, రసంలో గాని, పెరుగులో గాని కలుపుకు తినవచ్చు. దానివల్ల అరుగుదల బాగుంటుంది. Body లో Resistance Power పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి. దాల్చించెక్కలో Fibre ఎక్కువగా ఉంటుంది.
మసాలా పొడి:
1) ఏలకులు 10 గ్రా (2) లవంగాలు 15 గ్రా (3) దాల్చించెక్క 15 గ్రా.
పై దినుసులు ఒకసారి నూనె లేకుండా వేయించి మిక్సీ లో వేసి మెత్తటి పొడి చేసుకుని Airtight సీసాలో నిలువ చేసుకొనవచ్చు. ఇది ఉప్మాలోకి, Veg బిరియాని లోకి చాల బాగుంటుంది.
నువ్వులపప్పు:
50 గ్రా నూనె లేకుండా వేయించి మిక్సీలో పొడి చేసి నిల్వ చేసుకుని అన్ని కూరలలో వాడవచ్చు మంచి Calcium food.
వేరుశనగపప్పు:
50 గ్రా పైన నువ్వులపొడిలా చేసుకుని చట్నీలలో వాడుకొనవచ్చు. మంచి Protein food.
1) పెసరపప్పు (2) మినపప్పు (3) పచ్చిశనగపప్పు Each 100 గ్రా నూనె లేకుండా వేయించి మిక్సీలో వేసి - ఇష్టమైతే 6 వెల్లుల్లి రేకలు వేయించి మిక్సీలో వేసి ఇందులో కలపవచ్చు. ఇది కూడ అన్ని రసాలలోకి, సాంబారు, పెరుగులోకి కలపవచ్చు.
ఈ సారి ఇంతే.
నాన్న Uncle తాతాతూ!
--------------------------------------------------------------------------------
దీనితో నా బ్లాగు-పోస్టు-కార్యం, పాకవిధానం-భద్ర పరచు-కార్యం - రెండూ నెరవేరాయి.
ఆ నలభీములే వచ్చి వండినా వాళ్ళ పాకం కన్నా పిల్లలకి నచ్చేలా నాన్నలే (ఎప్పుడూ కాకపోయినా - అప్పుడప్పుడు మాత్రమే వండినా) వండగలరు అని నాకైతే గట్టి నమ్మకం.
అప్పుడెప్పుడో హనుమాన్ అన్నట్లు : జయహో - పాకపితా!
'అమ్మ' and all the things that she does are taken for granted, always! కదా!
రిప్లయితొలగించండిమీ నాన్న గారి recipe ల పేర్లు మాత్రం బ్రహ్మాండం.
ఇ।।క్షే।। . అ।।క్షే।। మాత్రం నాకు భలే నచ్చేశాయి.
Just ఊరి పేర్లతో అందరి క్షేమ సమాచారాలు తెలియచేయడం..... :)
థాంక్స్! అసలు ఈరోజు పోస్ట్ నాన్నదే - నువ్విక్కడ రాసిన పొగడిక చేరవేస్తా :)
తొలగించండిబాబీ గారు వ్రాసే లెటర్ కూడా మాంచి సున్నితమైన హాస్య చతురత తో ఉన్నాయి క్షేమ సమాచార పదాలు భలే,,మీ ఫామిలీ...ఫామిలీ ఇంతేనా ?ఫామిలీ పాకేజి అంటే ఇదే కామోసు !!!ఒకరు పాకపిత ఇంకొకరు కవితా కథల దిట్ట పాటల పుట్ట అమ్మో!నువ్వు సూపర్ అక్కా ఏ మేటర్ ఐనా స్క్రీన్ ప్లే రాసేస్తున్నవు మన తెలుగు సినిమా మాంచి ధర్శకురాల్ని మిస్సయింది ....
రిప్లయితొలగించండిఅయ్యబాబోయ్, హనుమాన్! మరీ మొహమాట పెట్టేస్తున్నావ్ నన్ను - నీ అభిమానంతో. ఏదో ఆటవిడుపుకి నాలుగు కబుర్లు రాసుకునే నాకు సినీ దర్శకత్వానికి స్పెల్లింగ్ కూడా తెలీదు కానీ - మన అనాతవరం భాషలో "మోసెయ్యకు, బాబూ !!"
తొలగించండిఅనాతవరం-అ పేరు చూస్తేనే/వింటేనే ఓ పులకరింత
రిప్లయితొలగించండిఇ।।క్షే।। . అ।।క్షే।। - భలే
కదండీ - ద వన్ ఎండ్ ఓన్లీ 'అనాతవరం' మరి :) మీ కమెంట్ చూసిన వెంటనే - అనాతవరం వీధులన్నీ మళ్ళీ కళ్ల ముందు మెదిలాయి. థాంక్స్ :)
తొలగించండి
రిప్లయితొలగించండిఇట్జ్ ట్రూ !
ది ఒన్ అండ్ ఓన్లీ అనాతవరం !
చీర్స్
జిలేబి
జిలేబి గారు,
రిప్లయితొలగించండిమీ కమెంట్ చూసి బోల్డంత సంతోషం వేసింది - మీకు మా అనాతవరం తెలుసాండీ?
Oh - reading it again - I see it now - I should have typed it in English as "The One and Only" instead of typo-ing as ద వన్ ఎండ్ ఓన్లీ ???? :)
తొలగించండి
రిప్లయితొలగించండిలలిత గారు ,
టైపో గురించి కాదండి ! అనాతవరం గురించే ది వన్ అండ్ ఓన్లీ అన్నా !
అనాత వరం గురించి తెలియక పోతే గోజీ వారల మెట్లా ?
మా కష్టే ఫలే వారి టపాలో కూడా చెప్పా అనాతవరం గురించి శర్మ గారు వ్రాసేరు -; ఇంకా లలిత గారు రాక పోతే ఎట్లా అని :)
ఇంతకీ మా శర్మ గారే మయ్యారబ్బా ? మబ్బుల చాటున దాక్కున్నారు ?
చీర్స్
జిలేబి
ధన్యవాదాలండీ - మా వూరి పేరును బట్టి గుర్తు పెట్టుకున్నందుకు :)
తొలగించండికష్టేఫలే శర్మ గారు - అవును - ఈ మధ్య అంత తరచుగా పోస్ట్ చేయట్లేదు - ఒకసారి పలకరించాలి - ఎలా వున్నారో?!
ఏప్పుడో విన్నాం గోదావరిలో సాహిత్యం గల గలా పారుతుందని కానీ ఆ వారసులే ఈ మాత్రంగా ఊపి (రాసి) పారేస్తుంటే అయ్ బాబోయ్ ఏంటీస్పీడు అనేసుకుంటున్నాను.....పుట్టింది రాజమండ్రీ అయినా ఆ వాసనామాత్రం కూడా తెలీకుండా హైదరాబాదులో పెరిగిన వాళ్ళం కనుక ఈ ప్రవాహానికి చాలా అలవాటు పడవలిసే ఉంది. చాలా బాగా వ్రాస్తారు మీరు ఇది ఎంతో మంది ఈ పాటికే మీకు చెప్పేసి ఉంటే ఇంకోమాటుంటే చెప్పు అనేకండేం
రిప్లయితొలగించండిఎంత మాట!
తొలగించండివిన్న (చదివిన) మాట మంచిదయితే గమ్మున అట్టేపెట్టేసుకోవడం, కానిదయితే తలపు నుంచి నెట్టేసి కిమ్మనక వుండడం - తప్ప - "ఇంకో మాట చెప్పండి" అన్న మాట అనడం రానే రాదు.
మీ మంచి మాటకి ధన్యవాదాలు :)
లలిత గారు Ramana vamaraju గారి మాటే నా మాట కూడా. అందుకే అసలు ప్రత్యేకించి ఏ వ్యాఖ్య కూడా చెయ్యట్లేదు నేను :)
తొలగించండిచంద్రిక గారు - నా టైం-పాస్ కబుర్లని ఇంతగా మెచ్చుకుంటున్నందుకు బోల్డన్న్ని థాంక్స్!
తొలగించండి