అమ్మాయిలూ!
మీరంతా చాలా మంచి రెసిపీలు చెప్పారు (ఇప్పటివరకూ చెప్పినవాళ్ళు) మరియు చెప్పగలరు (ఇంకా చెప్పవలసినవాళ్ళు) - . నేనూ ఏదో వ్రాద్దామనుకున్నాను. కానీ ఎంత ఆలోచించినా ఏదో మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిల కోసం వండే ఇంగువ పప్పులూ, బంగాళ దుంప, చేమదుంప వేపడాలు, నేను ఇష్టంగా తినే టమాటా బండ పచ్చడి (బండ అంటే బండలా వుండే టమాటా తో చేసేది కాదు - అప్పటికప్పుడు తాజా టమాటాలతో చేసేదన్నమాట!) తప్ప ఇంకేమీ తట్టట్లేదు. మా అమ్మ పుణ్యమాని (నిజ్జంగా ! పాపం ఆవిడ చేసిన ఏ పూర్వ పుణ్యమో - ఎంత మంది వచ్చినా పగలు, రాత్రి అనకుండా వేడి వేడిగా వండి పెట్టగలిగే ఓపిక ఆవిడకి, ఇటు పెట్టిన మంచి నీళ్ళ గ్లాసు అటు పెట్టకుండా ఆవిడ చేసిన వంటలు తిని పెరిగే భాగ్యం ఆవిడ ముగ్గురాడపిల్లలకీ దక్కింది) "మావూరి వంటలే" కాదు ఏ వూరి వంటలూ రాకుండానే గడిపేస్తున్నాను.
నా అదృష్టం కొద్దీ
- నేను ఉట్టి పప్పు (అంటే ముద్ద పప్పు) చేసినా - "మామా! యు ఆర్ ది బెస్ట్ పప్పు కుకర్ " అని తినేసే బుజ్జిగాళ్ల మంచితనంతో,
- బంగాళ దుంప తో ఏ వంటకం చేసినా కళ్ళు మూసుకుని (తన్మయత్వం తో) "చాలా బావుంది బుజ్జాయ్!!" అని ప్రశంసా పూర్వకం గా కళ్ళేగరేస్తూ మరుసటి రోజే కాకుండా ప్రతీ రోజూ బంగాళ దుంపలు చేసేద్దామా అనిపించేలా చేసే నా ప్రియ పతి ఇచ్చే పాక-స్ఫూర్తితో,
- అంతే కాకుండా నేను చేసే కోనసీమ-కర్నాటక కాక్టైలు వంటలు తిని మురిసిపోతూ "లలితా! ఆ ముద్ద ఉప్మా చేస్తావూ ఇవాళ" అని నా ఫేవరేట్ జారు-జారు పెళ్లుప్మా (అదే - బిర్యానీలు, టొమేటో బాతులు రాకముందు తెలుగు వారి పెళ్లి పందిళ్ళలో ఆప్యాయంగా రాజ్యమేలిన ఉల్లిపాయ-రహిత ఉప్మా) అడిగి మరీ చేయించుకుని తినే అత్తగారి ప్రోత్సాహం తో.....
నేను తరిగిందే కూర - వండిందే వంటగా కాలం గడిపేస్తున్నాను.
ఇంతలో ఒకసారి మన అన్నపూర్ణ "నేను చేసిన పెకాన్ పై (pecan pie) అందరికీ ఇష్టం లలితా! ఎన్ని చేసినా అందరూ ఇష్టంగా తింటారు" అంటే నేర్చేసుకుందామన్న ఉత్సాహంతో మన యాహూ గ్రూప్ లో ఆ రెసిపీ పోస్ట్ చేయమన్నాను. తను పోస్ట్ చేసిన వెంటనే అమృతవల్లి పంపిన మాస్టర్ రెసిపీ కూడా చదివాను.
నేనేం వ్రాయాలా అని అప్పట్నుంచీ ఆలోచిస్తూ వున్నాను. నేను దోశ వేయడమే ఒక ప్రహసనమైన నా వంటింటి పాక-కళాకౌశలంతో ఏం వంటకం గురించి చెప్పాలో తట్టట్లేదు.
(దోశ-ప్రహసనం అంటే ఏం లేదు- నేను పిండి రుబ్బి పొద్దున్నే స్టవ్ ని భక్తిగా తుడిచి, నా అస్త్ర-శస్త్రాలైన పెనం-అట్లకాడ తో హారతి ఇస్తున్నట్లుగా తిప్పి, మనసులో మా ఆయన్ని తలచుకొని గరిటతో పిండి తీసుకుని పెనం మీద వేసీ వేయగానే - అదేదో ఎవరైనా దీపావళి బాంబు వెలిగిస్తుంటే దూరం గా నుంచుని అది పేలుతుందో లేదోఅని టెన్షన్ గా చూస్తూ వుంటామే - అలా బదరి వంటింటికి దూరంగా లివింగ్ రూం లో నుంచుని - దోశ వస్తోందా? వస్తోందా? - అని అడుగుతూ వుంటే వణికే చేతులతో దోశలు వేసిన వారాంతపు ఉదయాలెన్నో!!)
ఇలా నేనింత వంటింటి-మథన పడుతూ వుండగా ఆపద్బాంధవిలా మా నాన్నగారు చెప్పిన "సకల పప్పు సహిత ఓట్స్ పాకం" గుర్తుకి వచ్చింది.
అదేంటో వివరం గా వ్రాస్తాను - చదవండి :)
క్రిందటి శనివారం అలవాటుగా ఇంటికి (రాజమండ్రి) కి ఫోన్ చేస్తే ...అబ్బే అలా చెప్పేస్తే మజా ఎలా...చదవండి క్రింద ఇలా...
"హలో! నాన్నా! బావున్నారా?"
"బ్రహ్మాండంగా వున్నాను. అది సరే గానీ లల్లీ! ఓ పెన్నూ పేపరూ తీసుకో. నీకో ప్రోటీన్-రిచ్ స్వీటు చెప్తాను. రాసుకో"
"అదేంటి నాన్నా!"
"ముందు రాసుకో- పెన్నూ పేపరూ తెచ్చావా"
"......."
"నిన్న మధ్యాన్నం బాలూ వాళ్లకి చేసి పెట్టాను. బ్రహ్మాండం గా వచ్చింది. మాంచి ఫైబర్ ఫుడ్డు - ఇంక రాసుకో"
"సరే నాన్నా! చెప్పండి"
"ఓట్సు 200 గ్రాములు, బెల్లం 180 నుంచి 200 గ్రాములు, జీడిపప్పు 25 గ్రాములు, బాదం 25 గ్రాములు, పిస్తా 25 గ్రాములు, నూపప్పు 15 గ్రాములు, వేరుశనగ పప్పు 25 గ్రాములు - ఇవన్నీ తీసుకో.
ఓ బూర్లి మూకుడులో వేయించి పక్కన పెట్టుకో - ఓట్స్ కూడా వేయించుకో నెయ్యి వేసి.
బెల్లం కోరి పడేయ్. నీళ్ళు పోయ్.
ముదురుపాకం తీయ్. పాకం స్టవ్ మీంచి దించేసి దాంట్లో ఇవన్నీ పోసెయ్.
మొత్తం కలియబెట్టి బాగా కలిసిన తర్వాత పెద్ద కంచం లో వేసి, వేడి మీద చాకుతో కోసేయ్.
ఫ్లేవర్ కావాలంటే ఏలకుల పొడి వేసేయ్. ఇది పెట్టి చూడు. బదరీకి, పిల్లలకీ కూడా నచ్చుతుంది"
అదీ మా నాన్నగారు చెప్పిన "సకల పప్పు సహిత ఓట్స్ పాకం" రెసిపీ.
(మా నాన్నగారు జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజుకి ఒక రోజు ముందు పుట్టారు - కొన్ని సంవత్సరాల తేడాతో. అందుకే నెహ్రు గారు ఇందిరా గాంధీకి వ్రాసినట్లు నాకూ ఉత్తరాలు వ్రాస్తూ వుంటారు - అలా పంపిన రెసిపీలు చాలా వున్నాయి కానీ ప్రస్తుతానికి ఇది చదివేసేయండి :) ఈ మధ్య ఇంకా ఉద్యోగం ఎందుకు నాన్నా రెస్ట్ తీసుకోండి అంటే పొద్దున్న మాత్రం ఆఫీసు కి వెళ్లి వచ్చి మధ్యాహ్నాలు ఇలా పాక-శాస్త్ర ప్రయోగాలు చేస్తున్నారు.)
జై పాక-మాతా! జయహో ఔత్సాహిక కుకర్లూ!
~లలిత
జయహో పాక పితా!అక్కా ఇంతకీ సకల పప్పు ఓట్స్ పాకం రుచి ఎలా ఉందో చెప్పలేదు.
రిప్లయితొలగించండిరాసీ, చేసీ దాదాపు ఆరేళ్ళు అవుతోంది కదా - అంతగా గుర్తు లేదు కానీ - స్వీట్ కాబట్టి తియ్యగా వున్నట్టే గుర్తుంది ;)
తొలగించండి