జులై 4 వ తారీఖు - ఇండిపెండెన్స్ డే - ఉత్తర అమెరికా అంతటా ఆకాశంలో రంగు రంగుల "తారా" జువ్వలు వెలిగే రోజు. భలే మంచి రోజు - అదనపు శలవు వచ్చు రోజు.
ఇండిపెండెన్స్ డే వచ్చే వారం - వీకెండ్ ఒక్క రోజు సా.....గి - లాం ....గ్ వీకెండ్ అయ్యి మేము ఎక్కడికైనా ఏగువారం లేక పొద్దున్నే లేవడానికి సాగువారం అయ్యే వారం.
దాదాపు రెండు-మూడు వారాల ముందు నుంచే నేను కౌంట్-డౌన్ మొదలుపెడతాను - లాంగ్ వీకెండ్ వస్తోందని. తీరా అది రానూ వస్తుంది, ఎలా వచ్చిందో అలాగే గడిచిపోతుంది.
ఆ ముత్యం మూడు రోజులు వుండే లాంగ్ వీకెండ్-
ఇవాళ్టికి వుండే రేపు ఎల్లుండి
తోసుకుని త్వరపడి
రేపటికి నిన్నా రేపై
అంతలోనే కడపటి మాపై
వేళ్ల సందుల ఇసకలా జారిపోతుంది
శుక్రవారపు సాయంత్రానికి అదేదో రెక్కలు మొలిచినట్టుంటుంది
ఊరికూరికే నవ్వొచ్చేస్తూ వుంటుంది
ఎవరు వద్దన్నా - వినలేమని వేడుకున్నా పాటలు పాడేయాలనిపిస్తుంది
పేరడీలు కట్టేసి - ఎవరినైనా కట్టేసి వినిపించాలనిపిస్తుంది
అదిగో అలా కట్టిందే ఇది - ఆ వారపు పేరడీ
[అసలు పాట: రావణుడే రాముడైతే సినిమాలోని ప్రేమంటే తెలుసా నీకు]
వంటంటే తెలుసా నీకూ
తెలియందే వడ్డించకూ
ఉప్పేశాననీ - కారం లేదనీ
చిక్కగా పులుసును కాచకూ
కూరను నల్లగా మాడ్చకూ
పేరడీలు రెండు రకాలు - నాకు తెలిసి :)
అసంకల్పిత పేరడీలు - అంటే అసలు పాటలోని ఏదో ఒక మాట సరిగా వినపడకో, వినపడినా అర్థం కాకో - నోటికొచ్చిందో, నాకు నచ్చిందో - ఒక మాట ప్రతిక్షేపించేసుకుని నేను పాడేసుకునేవన్నమాట.
డిగ్రీ చదివేటప్పుడు మాకెంతో ఇష్టమైన గులేబకావళికథ సినిమాలోని పాట - నన్ను దోచుకుందువటే - పాటలో మొదటి చరణం లోని
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
అనే వాక్యం మొదట సరిగా వినపడక - వినపడిన తర్వాత నచ్చక
తరియింతును నీ చల్లని తెర నవ్వుల నీడలోన
అని పాడుకునే వాళ్లం - నేనూ, అపర్ణ. అది తలుచుకుని ఇప్పుడు మాకు మేమే - హైట్ ఆఫ్ ఫెమినిజం - అని నవ్వుకుంటాము.
సంకల్పిత పేరడీలు - అంటే నేను కావాలని అనుకుని చేసేవి - అంటే పైన వున్న నా "వంట" పాటలాంటిదన్నమాట.
ముందు ఒకటో రెండో అసంకల్పిత పేరడీలు
యూనివర్సిటీ రోజుల్లో మా సీనియర్ ఒకమ్మాయి తడియారడాన్ని గడియారం చేసేసింది ఒక పాటలో ఇలా :
[అసలు పాట: మాయదారి మల్లిగాడు సినిమాలోని తలకి నీళ్లోసుకుని... కురులారబెట్టుకుని]
తలకి నీళ్లోసుకుని గడియారమెట్టుకుని
నిలుసుంటే - నువ్వు నిలుచుంటే
నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్నా నిన్నిడిచి రానంటది
చిన్నప్పుడు కుంపటిలో అమ్మ కాచే పాలు మరగడం చూసిన నాకు మానవుడు-దానవుడు లోని పాటలో మణి దీపాలు మరిగే పాల లాగే వినిపించేవి.
[అసలు పాట: మానవుడు-దానవుడు సినిమాలోని పచ్చని మన కాపురం ....మణి దీపాల వెలుగై]
పచ్చని మన కాపురం
పాల వెలుగై - మరిగే పాల వెలుగై
కలకాలం నిలవాలి
కళ కళలాడాలి
ఇప్పుడింక ... సంకల్పిత పేరడీలు
చిన్నప్పుడు తిరుపతో, అన్నవరమో వెళ్లి అప్పుడే గుండు చేయించుకున్న తర్వాత స్నానం చేసేవేళ గంతులేసే పిల్లలని నవ్వించడానికి నాన్న చేసిన పేరడీ:
[అసలు పాట: కథానాయకురాలు సినిమాలోని తనువా ... హరి చందనమే]
జుట్టా! అది కత్తెరాయెలే
గుండా! అది తలకాయలే
చన్నీళ్ళు తాకగనే - మండేను కాదా ఈ గుండూ
మండేను కాదా ఈ గుండూ
నిర్ణయం సినిమా వచ్చిన కొత్తలో - హీరో హీరోయిన్ ని ఏడిపిస్తూ పాడే ఒక పాటకి మా కుట్టి చేసిన - ఒక పూర్తి సంకల్పిత పేరడీ:
[అసలు పాట: నిర్ణయం సినిమాలోని హలో! గురూ...]
హలో గురూ! ప్రేమ కోసమేనా జీవితం
ఆడపిల్లకై ఎందుకింతలా వెదకటం
ప్రేమించావా నన్ను - కాదంటాను నిన్ను
మహా మహా అందగాళ్ళకే అందలేని వాళ్ళం - హార్నీ
ఉట్టి ఫోజు కొట్టువాడా - ఉద్యోగం లేనివాడా
ఉంగరాల జుట్టు ఏమి పర్మనెంటా?
రోజుకొక్క పిల్లకైనా సైటు కొట్టు చిన్నవాడా
రోడ్డు మీద బీటు కొట్టే నీకు ప్రేమలా
నాకన్న నీకున్న తాకీదులేంటయ్యా
నా బ్యూటీ నా లెవెలు నీ కన్నా మోరయ్యా
నీకన్నా హైటున్న మొనగాళ్లే వున్నారోయ్
IAS అబ్బాయే I love you అన్నాడోయ్
This is not the way to love
You can't make my heart move
ఇలాగెన్ని పాట్లు పడ్డా నీకు నేను దక్కనయ్యో
కట్టుకుంటే నిన్ను తప్ప ఎవరినైన కట్టుకుంటా
ఒట్టు పెట్టుకొంటినయ్యా ఫోజు కొట్టకు
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నవాడా
వెంట పడకు రోజు నువ్వు జిడ్డుబాబులా
నీ చేతే పాడిస్తా సంతాప సంగీతం
నా చేత్తో తినిపిస్తా నా దెబ్బ ఊతప్పం
ఆహా! నీ పెళ్ళంటా - నాకొళ్ళుమంటంటా
నా కాలికి ఉంది హై హీలు జోడంటా
అఛ్చా-తూ నే ప్యార్ కియా
లుచ్చా కామ్ బహుత్ కియా
ఇసీలియే నేను నిన్ను తిరస్కరిస్తా
పైన రాసిన హలో గురూ పేరడీ ఇవాళ అనుకోకుండా దొరికిన ఒక పాత పాటల పుస్తకం లోని ఒక సరదా-పాట-జ్ఞాపకం.
సంకల్పితమో - ఆసంకల్పితమో
అసలు పాట - ఒక ఒరవడి
పేరడీ - ఒక మాటల గారడీ
కనుల విందన చదువుడి
వీనులు "బంద"వ పాడుడి :))
వీనులు "బంద"వ పాడుడి :))
రిప్లయితొలగించండిSuper !
Thank you !
తొలగించండితెరనవ్వులు,
రిప్లయితొలగించండినాకన్నా నీకున్న తాకీదులేంటోయ్
నా బ్యూటీ నా లెవలు నీకన్నా మోరోయ్
నీకన్నా హైటున్న మగాళ్ళెందరో ఉన్నారోయ్
This is not the way to love
You can't make my heart move
ఎలాగెన్ని పాట్లుపడ్డా నేను నీకు దక్కనయ్యోయ్ !
మీకు మరిన్ని శెలవలు వస్తే మాకు మరిన్ని మంచి పాటలు వస్తాయి. భలే ఎంజాయ్ చేసాను.
:) thanks for taking time to read my blog & comment.
తొలగించండినా పేరడీలు నచ్చినందుకు సంతోషం :)
తొలగించండిమీ కుట్టి పేరడీ పాట, నీ ముక్తాయింపు చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండినీ వంట పేరడీ ఇంకా మీ నాన్న గారి గుండు పేరడీ కూడా.
:) థాంక్స్!
తొలగించండిరోజు రోజూ - మూడ్ కి తగ్గట్టు ఏదో ఒక పేరడీకి రెడీ-రెడీ-ఎవర్ రెడీ :))
తొలగించండిమీరు చెప్పే సినిమా పాటలే కాదండీ.. పేరడీ పాటలు కూడా బాగున్నాయ్ :)
రిప్లయితొలగించండిఅది పాటల గొప్పదనం -మీ మాటల మంచిదనం :)
తొలగించండి
రిప్లయితొలగించండిఇచ్చట మరో జిలేబి పాకాన పడుతోంది :)
చీర్స్
జిలేబి
ఎంత మాట :)
రిప్లయితొలగించండిసరి లేరు జిలేబికెవ్వరు
ఈ బ్లాగ్లోకాన - సరి లేరు జిలేబికెవ్వరు
పద్య పేరడిలోన - గద్య గారడి లోన
సరి లేరు జిలేబికెవ్వరు
[అసలు పాట: కంచుకోట సినిమా లోని "సరి లేరు నీకెవ్వరు- నరపాల సుధాకర"]
రిప్లయితొలగించండిఆహా !
మీ జిలేబి పేరడి వీనుల విందుగా భల్ పసందు గా ఉంది !
చీర్స్ సహిత
జిలేబి