19, జులై 2016, మంగళవారం

త్వామనురజామి - 3 - పాడమని నన్నడగ తగునా...



కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ 

    అలా రిక్షా దిగి కుట్టిని కోపంగా చూస్తూ వేలుతో "నీ పని చెప్తానుండు" అని బెదిరిస్తూ - మధ్యాంటీ వాళ్ళ పోర్షన్ దాటి - సందుకి కుడి పక్కగా వున్న మా ఇంట్లోకి వెళ్ళానో లేదో - అక్కడ కేన్ కుర్చీల్లో కూర్చుని మధ్యాంటీతో కబుర్లు చెప్తున్న అమ్మ నవ్వుతూ లేచి, "వచ్చింది లలితా పరమేశ్వరి! ఏదో ఒకటి కడుపులో పడకపోతే వేళ్ళాడి పోతుంది - అసలే ఏడు మల్లె పూలెత్తు" -  అంటూ లోపలికి వెళ్లి ఎఱ్ఱగోధుమనూకతో చేసిన ఉప్మా, మాగాయ పెరుగుపచ్చడి వేసి తెచ్చి ఇచ్చింది.


    "ఓమ్మాయ్ లల్లీ! మా లక్ష్మణు స్కూల్ నుంచి వచ్చిన కాణ్నుంచి ఆ డాబా ఎక్కి  నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. వాడితో ఏదో వర్డ్ గేం ఆడుతున్నావంట గదా రోజూ!? - ఇప్పటిదాకా నన్నాడమని ప్రాణం తీసి ఓ రెండు వేడిగా తిని ఇప్పుడే పప్పీ, కుట్టిలతో పైకి వెళ్ళాడు. హోం వర్క్ కూడా చేయలేదింకా. అదేదో కుంచేపు వాడితో ఆడి కిందికి పంపు. మళ్ళీ మీ అంకులొస్తే అదో గొడవ- నేనేదో వాడిని రాసిరంపాన పెడుతున్నానని" అని నేను ఉప్మా తింటున్నంత సేపూ - మధ్యాంటీ అనబడే ఉషాంటీ - నా నములుడుకి నేపధ్య సంగీతంలా మాట్లాడుతూనే వున్నారు.


    ఉషాంటీ, లాయరంకుల్, వాళ్ళబ్బాయ్ లక్ష్మణ్ - కిందా పైన ఆరు వాటాలు వున్న భీమ్ నాయక్ గారి ఇంట్లో క్రింది మధ్య పోర్షన్ లోకి ఏడాది క్రితమే వచ్చారు.


    ఆంటీకి - చదువుకునే పిల్లలంటే - అంటే నాలాంటి సర్వకాలసర్వావస్థ-పుస్తకహస్తులంటే - చాలా ఇష్టం. 

    నాలుగో తరగతిలో వున్న ఆవిడ ఏకైక పుత్రరత్నం ఒక చిన్న సైజు ప్రశ్నా-కోశం నా పాలిటి. 

    వాడు నన్నడక్కుండా వుండాలంటే - నేను వాడిని అడుగుతూ వుండాలి - అనే కిటుకు కనిపెట్టి, చిన్న పదాలతో ఇంగ్లీష్ అంత్యాక్షరి మొదలుపెట్టి - ఒక పది నిముషాల్లో వాడికి వొకాబ్యులరీకి అందనంత కాంప్లెక్స్ వర్డ్స్ దాకా తీసుకెళ్ళి - వాడి చేతే "ఇంక చాలు లల్లీ అక్కా", అనిపించి మేడ దిగేలా చేస్తూ వుంటాను.

    అసలు మా మేడ గురించి చెప్పలేదు కదూ - అది ఎండా-కొండా, చలీ-గిలీ, వర్షం-వరద అని లేకుండా - ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర, రాత్రి వేళలలో - మా నాన్న ముగ్గురు కూతుళ్ళకీ సంగీత-సాహిత్య- క్రీడా-గాసిప్ వేదిక.


    అదేదో హిరణ్య కశ్యపుడి చావు వరంలా - స్కూళ్ళకి, కాలేజ్‌లకి వెళ్ళినప్పుడూ, అన్నం తినేటపుడూ, అరమోడ్పు కళ్ళతో దూరదర్శన్‌లో పాలు-చేలు కార్యక్రమం చూసేటపుడూ, నిద్ర పోయేటపుడు - తప్ప మిగిలిన అన్ని సమయాల్లో, హోం వర్కులకీ, మా ఆల్-ట్రిక్కులకీ మేము ముగ్గురం ఎక్కే - మా ఇంటి కాంపౌండు లోనే గోడ అడ్డంలేకుండా వున్న పక్కింటి శిరీష వాళ్ళ తాతగారి ఇంటి డాబా అది - ఒకరకంగా మా అల్లరి-ఆటల దర్బారు.

    సరే...అమ్మ పెట్టిన ఉప్మా, ఆంటీ 'చెప్మా' కాంబినేషన్ తో తినేసి - రెండేసి మెట్లెక్కుతూ మేడ మీదకి వెళ్ళిపోయాను.

'
    అప్పటికే కుట్టి ఏవో కూనిరాగాలు తీస్తోంది - "శివ దరుశన నమ్మగాయితు కేళే" - అంటూ.

    రోడ్ వైపుగా వున్న పిట్టగోడ కొంచెం వెడల్పుగా వుంటుంది. 

    నేను వెళ్లి ఆల్రెడీ పప్పీ, దాని కాళ్ళ దగ్గరగా కూర్చున్న కుట్టి కి - ఎదురుగుండా వున్న ఇంకో గోడ మీద  కూర్చున్నాను - అదేదో పట్టు బాలీసుల మధ్య ఆనుకుని కూర్చున్న పోజులో.

    "ఏంటే లల్లీ! ఎలా అయింది ఇవాళ నీ ఒంటరి పోరాటం? అపర్ణ రాలేదట కదా కాలేజ్ కి? మళ్ళీ రాగాలెట్టేశావా ఎవడో ఏదో అన్నాడని?" -  దాని పళ్లన్నీ బయట పెట్టి నవ్వుతూ కుట్టి పరామర్శ.


    పక్కనించి ముసిముసి గా నవ్వుతూ నేనేం చెప్తానా అని తల పక్కకి వంచి - దాని భుజం పక్కనుంచి చూస్తోంది పప్పీ.

    అసలు దాని మాటలే పట్టించుకోనట్టు లక్ష్మణ్ కేసి తిరిగి  -


    "లక్ష్మణ్! లెట్స్ స్టార్ట్. ఐ విల్ గో విత్ 'సాంగ్' " అన్నాను.
    వెంటనే లక్ష్మణ్ "గో" -
    నేను "ఆరంజ్" -
    ను "ఎకో" ...

    ఇలా పట్టుమని పది నిముషాలు ఆడామో లేదో - 

     "ఎహె ఆపండే బాబూ! ఎంతసేపూ అదే ఆట. ఇదిగో లక్ష్మణ్ - ఇంక వెళ్లి బుద్ధిగా నీ హోం వర్కేదో చేసుకో నాయనా...లేకపోతే దాని కంఠశోష - నా ఆత్మ ఘోష అయేలా వుంది", అని ఏదేదో దానికొచ్చిన తెలుగంతా మాట్లాడేసి తరిమేసింది వాడిని నా కనిష్ఠ సోదరి కుట్టి.

    వెంటనే నాకేసి తిరిగి "ఇప్పుడు చెప్పు - ఏంటి కాలేజ్ విశేషాలు"  - అని కళ్లెగరేసింది.

    వెంటనే ఉత్సాహంగా నా ఫ్రెషర్స్ డే పాట - సుహానా సఫర్ - ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో చెప్పడం మొదలు పెట్టానో లేదో -


    నన్నాపేసి - " అది కాదే! నీ పాట విన్న తర్వాత వాడికి పూర్వ జ్ఞానమంతా పోయి అదొక్కటే గుర్తుండేలా వాడికేమన్నా బుర్ర కొట్టేసిందేమో?! " అని అల్లరిగా అంది.

    నేను వెంటనే ఉక్రోషంగా, "అదేం కాదు. మనింటి ముందు నుంచి వెళ్తారు - అదే పన్థొమ్మిదవ అడ్డరోడ్డులో వుంటారూ - అదే లెక్చరర్ హనుమంత రావు గారు - ఆయనే -ఆయనకూడా కాళ్లూపుతూ విన్నారు తెలుసా?!", అన్నానో లేదో -

    భళ్ళున నవ్వి -


    "అంత మనిషీ లేచి పరిగెట్టాలంటే ఆ మాత్రం కాలు ఊపుడు అవసరం లే - నీ పాటా - మజాకానా" అనేసి -

    పప్పీకేసి వెనక్కి తల తిప్పి "పప్పమ్మా! నీకు గుర్తుందా టంగుటూరు లో వుండే సంగీతం గేదె? " అనడిగింది.

    పప్పీ అంత కన్నానూ - అసలే నవ్వే కళ్ళతో మాట్లాడుతుందేమో - అవునూ - కాదూ అన్నట్టు తల తిప్పింది.


    ఇంకంతే కుట్టి తల్లి మొదలెట్టేసింది - నా గానకథాలహరి.

    "అది కాదే పప్పీ ! నేనూ, ఈ ఎర్ర తేలు (నాది వృశ్చిక రాశి - అందుకే ఈ బిరుదు) కలిసి సంగీతం క్లాసుకి వెళ్లి వచ్చే  టైంకి టంగుటూరులో మనం అద్దెకున్న ఇంటి ఓనర్ శేషయ్యగారి గేదె -  ఏదో పాపం  - దాని మానాన అది గడ్డి మేస్తూ కూర్చుని వుండేది. ఈ లల్లేమ్మేమో ఆ సుఖాసీనురాల్ని చూడగానే - నన్ను దానిమీద కూర్చోమని "సా రీ గా మా " అని పంచమం లోకి వెళ్లబోయేలోగా - ఆ గేదె లేవబోయేది. ఇదేమో స్వరం ఆపేసేది. మళ్ళీ పాపం ఆ గేదె సెటిల్ అయేది. ఇదేమో మళ్ళీ పాడ , అది లేవబోవ - ఇలా ఓ ఐదారు సార్లు కాగానే ఆ గేదె ఒక్కసారిగా నాలుగు కాళ్ళ మీద ఎగిరి నించునేది. ఇదేమో నా చేయి పట్టుకుని లాక్కుంటూ ఇంట్లోకి పరిగెట్టేది. దాన్ని హింస పెట్టిన పాపం వూరికే పోతుందా - ఈ లల్లి ఏం పాడినా -చివరికి అది చిరంజీవి స్పీడు పాటైనా సరే - త్యాగరాజ కీర్తనలా వినిపించేలా దీనికి శాపం పెట్టేసింది."

    అది వేసే జోకు డైరెక్టుగా నామీదే అని అలగబోయి , ఈ లోగా సంగీతం గేదెని తలుచుకుని బుగ్గలు నెప్పేట్టేలా నవ్వుకుని - పాడమని నన్నడగ తగునా - అని బెదిరిస్తూ చీకటి పడేదాకా కబుర్లు చెప్పుకుని - అమ్మ పిలుస్తోందని కిందకి వెళ్లి - మా గురువారం చిత్రలహరి, హిందీ సీరియల్ "థ్  చక్ర" చూసేసి - రేపటి నవ్వులకి ఇప్పుడే రిహార్సల్ వేసేసుకుంటూ నిద్రలోకి జారిపోయాం.... 


 <<.<<తర్వాతేం జరిగిందంటే... : త్వామనురజామి - 4 - దెబ్బకి ఠా ...>>>>

8 కామెంట్‌లు:

  1. Malli 19 th daka wait cheyyala???.... But wait cheyyadam lo maja undi like eenadu aadivaram kosam chusinatlu

    రిప్లయితొలగించండి
  2. ఒంటరి పోరాటం, ఎర్ర తేలు, సంగీతం గేదె, అరమోడ్పు కళ్ళతో దూరదర్శన్ లో పాలు-చేలు కార్యక్రమం చూడ్డం.....భలే నవ్వాను.
    మీతో పాటు మీ డాబా కూర్చుని మీ అల్లరి ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపించింది. చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అల్లరి అంటే గుర్తొచ్చింది మా బాలు చిన్నప్పుడు అల్లరిని 'లల్లరి' అనేవాడట - వాడికప్పుడే ఎలా తెలిసిపోయిందో ఈ దొడ్డ 'దొడ్డ-అల్లరి' గురించి ;)

      తొలగించండి
    2. గేదె శాపమా ???? అయినా గేదె కీ పాటలు వినిపించే ఆలోచన ఏలా కలిగింది మొత్తం మీద సంగీతానికి బేదము లేదని నిరూపించారు !!భలే బాగా నవ్వుకున్నా ఏర్రతేలు.. చెప్మా చిరంజీవి పాట త్యాగరాయ కీర్తన ప్రాస భలే బావుంది!మొత్తము గా కధలు కవితలు మాటలు పాటలు చదువులు మర్యాదలు అన్నీ మిక్సి లో రుబ్బి బ్రహ్మ గారు చేస్తే దానికి లలిత అనే లాలిత్యమైన పేరు పెట్టారు బాబీ గారు !!! ఇంతకన్నా చెప్పలేను అక్కా

      తొలగించండి
    3. ఇంత కన్నా చెప్పలేను అక్కా - అంటూనే బోల్డంత చెప్పేశావు , హనుమాన్ !

      "శిశుర్వేత్తి పశుర్వేత్తి - వేత్తి గాన రసం ఫణిహి " వినలేదేంటి నువ్వు? - అందులో మా ప్రయోగమే నా సంగీతంతో - పాపం! - ఆ గేదెని విసిగించడం :))

      తొలగించండి
  3. లలితా .. . ఇప్పుడె ఒక 3 గంటలు ( ఆఫీసు కాల్) మాట్లాడి ఇది చదువుతుంటె చాలా హాయిగా ఉంది . ఇంతకి అసలు త్వామనురజామి అనగా నేమి ? ఈ మాట కు అర్ధం తెలియయక పోయినా బాగుంది.

    కొన్ని పదాలు అరమోడ్పు కళ్ళతో, దూరదర్శన్ లో పాలు-చేలు బాగున్నాయి . అరమోడ్పు కళ్ళతో బదులు ఇంకొ పదం నాకు గుర్తుకు వస్తుంది. అర్ధ నిమీలిత నేత్రాలు . ఎవడైనా క్లాస్ లొ కునికి పాట్లు పడితె ఈ మాట అనేవాళ్ళం.

    ఈ బ్లాగు వల్ల నాకు లేఖిని లొ తెలుగు type చెయ్యటం వచ్చింది. లేఖిని ని పరిచయం చేసినందుకు thanks.

    ఇంకో టపా కొసం eagerly waiting .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రశ్న "ఇంతకి అసలు త్వామనురజామి అనగా నేమి ?" చదవగానే కన్యాశుల్కం లో గిరీశం అడిగిన "క్రియేషన్ అనగానేమి?" గుర్తుకొచ్చింది :)) త్వాం + అనురజామి అంటే బదరితో మొదలయిన నా బ్యూటిఫుల్ లైఫ్ కి నేను చెప్పిన, చెప్తూనే వున్న ఐ లవ్ యూ.
      మీ అర్ధ నిమీలిత నేత్రాలు మీరు కాలేజ్ కబుర్లలో చెప్పినప్పుడు విన్న గుర్తు వుంది నాకు :)
      నా బ్లాగ్ కి కమెంట్ రాయడం కోసం తెలుగు టైప్ చేయడం నేర్చుకున్న మీకు నేనే చెప్పాలి బో.....ల్డన్ని థాంక్స్ !

      తొలగించండి