8, మే 2016, ఆదివారం

బుజ్జిజింకలు తెచ్చే 365 అమ్మ-రోజులు

ఉత్తర అమెరికా అంతటా సందడీ - హడావిడీ. 
అంగడులన్నీ అమ్మలకిచ్చే బహుమతుల కోసం నింపుకున్న సరంజామా - సామగ్రీ 
అమ్మల రోజు వస్తోంది కదా - ఈ రోజు !!!
ప్రతీ ఏడాది మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారు అమెరికాలో.

మా పక్కనే వుండే టాడ్ ఇల్లు, ఎదురుగా వుండే రేండీ ఇల్లు - ఇరువైపుల - అంటే - భార్యా భర్తల ఇద్దరి తల్లిదండ్రుల రాకతో, తాత - అమ్మమ్మ / నాన్నమ్మలను చూసిన సంతోషంలో గంతులు వేసే పిల్లల సంబరంతో - బోల్డంత సందడి సందడి గా వుంటాయి. 

వీధిలో మిగిలిన ఇళ్ళ ముందు కూడా ఎప్పుడూ ఉండేవి కాక ఇంకో రెండో మూడో కార్లు ఎక్కువ పార్క్ చేసి వుంటాయి. 

స్వధర్మే నిధనం శ్రేయః - పరధర్మో భయావహః  - అన్నది నమ్మికో, ఇష్టం లేని వాటిని తప్పించుకోవడానికి వాడుకునే నెపమో - ఎప్పుడూ అలవాటు లేని, కాలేని మదర్స్ డే జరుపుకోలేదు. 

ఆఫీసు లో మెలిస్సా ప్రశ్న - లలితా! ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు మదర్స్ డే అని. 

ఇద్దరు అబ్బాయిల అమ్మనైన నేను - మేలో ఈ ఒక్కరోజేమేటి - ఏడాదిలో ప్రతి రోజూ సెలబ్రేట్ చేసుకుంటాను మదర్స్ డేని - అనేది నా ఉత్తరం. 

గత పదేళ్లుగా అదే తను అడుగుట - అదే  నేను చెప్పుట. 

సరే! నేను అనుకున్నా- అనుకోకపోయినా, జరుపుకున్నా- జరుపుకోకపోయినా, ప్రతీ ఏడాది తమ తమ అమ్మల కోసమని బుల్లి బుజ్జాయిలు బడిలో తమ చిట్టి చిట్టి చేతులతో చేసిన బొమ్మో, నాటిన మొక్కో, రాసిన కవితో తీసుకొచ్చి ఉరికే కాళ్ళతో వచ్చి అమ్మ చేతిలో పెట్టి అమ్మ మెప్పు కోసం మెరిసే కళ్ళతో, నవ్వే బుగ్గలతో అమ్మ మొహంలోకి ఆతృతగా చూస్తారు కదా - అందులో మా బుజ్జిజింక కూడా వుంటుంది. (నెలల పాపాయిలప్పట్నుంచీ అమ్మ, నాన్న ఎత్తుకుని కబుర్లు చెప్తుంటే జింక పిల్లల్లాగా కళ్ళు తిప్పుతూ ఊ ... కొట్టేవారని మా బుజ్జి బుజ్జాయిలని బుజ్జిజింకలని పిలవడం అలవాటు.)

అలాంటి ఒకానొక మదర్స్ డేకి - 
అమ్మ హోం వర్క్ కాగితాలు వెతుకుతుంటే దొరికింది 
బుజ్జిజింక తెచ్చిన అమ్మ - పొగడిక పత్రం
అందులో చదివిన మాట మాటకీ 
అమ్మకి కలిగిన ఉలికిపాటో - కలవరపాటో
ఇంకేదో - మరేదో - ఇదిగో ఇలా... 

"మున్నమ్మా! ఏంటమ్మా ఇది అమ్మ కోసం రాశావా" - ఆనందంగా, ఏం రాశాడో చూద్దామని  ఆతృతగా అమ్మ. 

"ఊ ...", నేస్తులతో ఆటలకి ఉరికే పరధ్యానంలో బుజ్జిజింక. 

"అప్పుడే రారులే - శ్యాము, అనీషు. గబగబా స్నాక్ తిని మనిద్దరం కలిసి చదువుదామా?" అమ్మ ఆత్రపు ప్రశ్న. 

"ఊ ... ఊ ... ", స్నాక్ నోట్లో వుంది కదా - అందుకే రెండు ఊ-లు - అంటే సరే అని. 

"అయితే - దా. నేను చదువుతాను, నువ్వు విను", సంబరంగా అమ్మ. 

"ఊ ... ఊ ... " - ఇంకో రెండు ఊ-లు. 

అమ్మ తెరిచింది కాగితం. ఒక పక్క  - గడ్డి పరకల్లాంటి జుట్టుతో వున్న అమ్మ,  పక్కనే బుజ్జిజింక వున్న బొమ్మకనిపించింది. 



బుంగమూతి పెట్టింది - పెన్సిల్ కి ఇష్టం లేనప్పుడు గీసినట్లున్న అమ్మతో-వున్న-బుజ్జిజింక బొమ్మ చూసి. 

"ఇదేంటమ్మా - అమ్మ జుట్టు ఇలా వుంది?" 


"ఊ ... ఊ ... ఉ ... ఉ... ఊ ... " - చిలిపి కన్నుల జాలువారిన నవ్వులతో వెలిగిన బుగ్గలతో "నేనే గీశా - బావుందా?", అనడం అది. 

ఆ వెలుగుకే ఎప్పటిలా కర్పూరమై కరిగి మురిసింది అమ్మ. 

"నువ్వు గీసిన నేను చాలా బావుంది." కుడి చేతి బొటనవేలు, చూపుడువేలు సున్నాలా చుట్టి బుగ్గన చిటిక వేసి గలగలా నవ్వింది. 

కింద వున్నది బుజ్జిజింక ఎలా పాడుతుందో అలాగే పాడుతూ చదవడం మొదలు పెట్టింది అమ్మ.

మై మామ్ రాక్స్! షి ఈజ్ ఆసం
"ఆసం అన్నావా మున్నమ్మా! యూ ఆర్ మై ఆసం సన్" - పట్టరాని సంబరం అమ్మ గొంతులో

వెన్ షి స్లాప్స్ మి, ఇట్ మేక్స్ మి సో హాపీ
అమ్మ తల ఎత్తి అడిగింది - "ఇదేంటి నాన్నా - నేను కొడితే సంతోషమా ?"

అమ్మ మాటలో తేడా ఏదో తెలిసిందేమో బుజ్జిజింక కన్నార్పక చూపు కలిపింది.

మొదటి నిట్టూర్పుతో అమ్మ ముందుకు చదివింది - ఇంకొన్ని నిట్టూర్పులు ముందు ముందు ఇంకేం ఉంటాయో అని దాచుకుంటూ. 

ఐ లవ్ డూయింగ్ థింగ్స్ విత్ హర్, ఎస్పెషల్లీ టాకింగ్
మళ్ళీ అమ్మ మాటలో హుషారు ...

షి ఈజ్ గుడ్ ఎట్ కుకింగ్
అమ్మకి అమృతం తాగినా కలగనంత తృప్తి... 
 

 షి రియల్లీ ఈజ్ ద బెస్ట్ 
 అమ్మకి  ఎలిజబెత్ రాణి కన్నా ఎత్తుగా కూర్చున్నట్టు అనిపించింది... 

ముందు పక్క చదవడం అయ్యింది కదా - కాగితం వెనక్కి తిప్పింది అమ్మ. 



"అయ్యో! ఇటు బొమ్మ లేదే! పోన్లే బుజ్జిజింకకి టైం సరిపోలేదా?!!" - సర్దేసుకుంది అమ్మ

మళ్ళీ బుజ్జిజింక పూరించిన ఖాళీల వెంట అమ్మ కళ్ళ పరుగులు...

 మై మామ్ ఆల్వేస్ సేస్ స్టాప్ ఇట్

 అర్రే! మళ్ళీ అమ్మ జోరు తగ్గింది...  - (రెండో నిట్టూర్పు)
 
మై మామ్ లుక్స్ ప్రెట్టీ వెన్ వి గో ఔట్
అయ్యో! ఇంట్లో బావుండనా ?! అంతేలే నాన్నా - ఇలా అనేస్తావా అమ్మను? -  (మూడో నిట్టూర్పు)

 బుజ్జి జింక కళ్ళలో తగ్గిన మెరుపు... అమ్మకేదో నచ్చట్లేదని... 

మై మామ్ లైక్స్ టు కుక్ నథింగ్ 

అరె! అమ్మ కంట్లో ఏంటది మెరిసింది - ముత్యమైతే కాదే - తెల్లగా లేదే - ఓహ్ - నీటి ముత్యమా! - (నాలుగో నిట్టూర్పు)

నవ్వబోతూ సాగబోయిన బుగ్గలు మొగ్గలల్లే ముడుచుకున్నాయి - బుజ్జాయికి.
  
మై మామ్ మేక్స్ మి లాఫ్ వెన్ షి మేక్స్ వియెర్డ్ ఫేసెస్
కంట మెరిసిన నీటి ముత్యం జారకుండా అమ్మ పూరించిన బుగ్గలు ఆపాయి... 
హమ్మయ్య! అమ్మ నవ్వింది - అనుకున్నాడు బుజ్జిజింక.

ఐ లవ్ మై మామ్ బికాజ్ షి ఈజ్ మై మామ్
అమ్మ సంతోషం శిఖరమే దాటింది - ఆనందం అంబరమే అయ్యింది 
నాలుగు నిట్టూర్పులూ మరచి నాలుగు దిక్కులా తనే అయినట్టు రెండు చేతులతో బుజ్జిజింకని పట్టేసుకుని ఎత్తేసుకుంది ... 

కానీ అమ్మకి ఏదో తెలియని ఉక్రోషం ... 
కన్నులు రెండూ నీటి ముత్యాల సరాలు పేర్చాయి ... 
బుజ్జిజింకకిప్పుడు తెలిసింది ఇంక - అమ్మకేదో ఆయ్ అయ్యిందని. 
కొంచెం కన్నా ఇంకొంచెం ఎక్కువే అర్థమయ్యింది - మందేదో తనే ఇవ్వాలని ... 

అమ్మ పక్క మెల్లగా చేరింది .... 

"అమ్మా ! మనిద్దరం ఒకటోసారి:రెండోసారి:నాలుగోసారి-ఆట  ఆడేటప్పుడు నేను మూడోసారి అనడిగితే ... చెప్పేది నేనా నువ్వా అని ... చెంప మీద కొడితే నేను నవ్వుతానే ... అందుకే వెన్ ఐ ప్లే దట్ గేమ్ విత్ యు, అండ్ వెన్ యు స్లాప్ మీ, ఇట్ మేక్స్ మీ హ్యాపీ" - మొదటి నిట్టూర్పు బుజ్జి బుగ్గ మీద ముద్దయ్యింది. 

"మరీ! నేను చాలా సార్లు అల్లరి చేస్తూ ఏడుస్తూ వుంటే - చాలా సేపు ఏమనకుండా ఊరుకుని - అప్పుడు స్టాప్ ఇట్ - అంటావు కదా! నేనేడవకపోతే నువ్వనవు కదా!! మరి నువ్వన్నప్పుడు అన్నావని రాయాలి కదా - అందుకే అలా ...." - రెండవ నిట్టూర్పు బుజ్జి కంటి మీద ముద్దు ముత్యమయింది. 

"నువ్వు ఇంట్లో కూడా బావుంటావు. కానీ మనం ఆంటీ వాళ్ళింటికో, పార్టీకో వెళ్తే మంచి షైనీ-షైనీ చీర కట్టుకుంటావు కదా - అది నాకిష్టం - అప్పుడెక్కువ బావుంటావని అలా రాశా" - మూడవ నిట్టూర్పు బుజ్జి అరచేతిలో ముద్దు ముద్ర వేసింది

"మరి యు కుక్ సో గుడ్ అండ్ యు ఆర్ ద బెస్ట్ కుక్ - కానీ మనం రెస్టొరాంట్ కి వెళ్తే నువ్వు మంచిగా చీర కట్టుకుని హాపీగా వస్తావు. అదే ఇంట్లో వంట చేస్తే యు లుక్ సో టయర్ద్ - నిజమే కదమ్మా !!! - నాల్గో నిట్టూర్పు అమ్మ పట్టరాని ప్రేమై బుజ్జి జింకని చుట్టేసింది. 

అమ్మ నవ్వు గోదావరిలా గలగలా - అమ్మ నవ్వు చూసి బుజ్జి జింక కిలకిలా!!!

అమ్మకి ఇప్పుడు మరింత నమ్మకం కుదిరింది - సంవత్సరానికి 365 అమ్మ-రోజులని ... అవి బుజ్జి జింకలు తెస్తాయని... 









19 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. వీలు చేసుకుని చదివి, కమెంట్ పెట్టినందుకు థాంక్స్!

      తొలగించండి
  2. ఇద్దరుంటే 730 రోజులన్నమాట. ఈ ఏడాది రెండు ఎక్కువ వేసుకో! What you say is absolutely true. Once a mom, everyday is mother's day. It's a mom's life, and blessed are those who enjoy it!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లీప్ సంవత్సరానికి ఒక రోజు అదనం ఒప్పుకుంటాను కానీ బుజ్జిజింకలు ఒక్కరైనా, ఇద్దరైనా, ఇంకెందరైనా అమ్మ రోజులని పంచగలదే కానీ పెంచలేదు - మరి ఇద్దరికీ 730 ఎలాగబ్బా ?!!

      తొలగించండి
  3. బుజ్జి జింక 'ఊఊ' భాష, ఆ భాషకు నీ భాష్యం, మీ గలగలలు, కిలకిలలూ అన్నీ భలే ఉన్నాయి.
    Yes! సంవత్సరానికి 365 రోజులూ అమ్మ రోజులే.. అలాగే నాన్న రోజులు కూడా.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మ & బుజ్జిజింక నుంచి ఇంకో గలగలా-మరింకో కిలకిలా - నీ మెప్పుకి.

      నీ మంచిమాటకి థాంక్స్.

      తొలగించండి
  4. Okko katha okko aanimutyam. Super mom-Lalli!

    - Lalitha (Antvrm)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Lalitha: వీలు చేసుకుని చదివి, కమెంట్ పెట్టినందుకు థాంక్స్!

      తొలగించండి
  5. Lalita garu chala bagunay me aanimutyalu ani👌👌 - Katyayini

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Katyayini: వీలు చేసుకుని చదివి, కమెంట్ పెట్టినందుకు థాంక్స్!

      తొలగించండి
  6. అబ్బ ఎంత బాగుందోనండీ పోస్ట్.. మాటల్లో చెప్పలేను.. ఒకటికి రెండు సార్లు చదువుకున్నాను అమ్మనూ బుజ్జాయినీ ఊహించుకుంటూ :-) చాలా బాగా రాశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మ-బుజ్జిజింకలు కూడా మీ వ్యాఖ్యను ఒకటికి రెండు సార్లు చదివి మురిసిపోయారు. చాలా థాంక్స్ - వీలు చేసుకుని చదివి, కమెంట్ పెట్టినందుకు.

      తొలగించండి
  7. Very nice lalitha .. 365 days is moms day .. Very true .. Wishing you a very happy mothers day all throughout

    Siri

    రిప్లయితొలగించండి
  8. Mothers day post adbhutham ga undhi Lalitha garu. Prathi padham lo meeru, mee chirunavvu gurthochayi. Happy mothers day Lalitha garu.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాంధవి: ఇది నాకు చాలా ఇష్టమైన పోస్టుల్లో ఒకటి. మీకు నచ్చినందుకు ఆ ఇష్టం ఇంకొంచెం పెరిగింది. Thank You!

      తొలగించండి