మా సేంటా ఫే (Santa Fe)...
వైటు (white) గా, వెయిటు (weight) గా వుంటుంది.
ఇంచుమించు ఎలిఫెంటులాగే లాగే వుంటుంది. ఇప్పుడిప్పుడే వైటెలిఫెంటులా తయారవుతోంది.
దాదాపు పదిహేనేళ్ళుగా - మేమెక్కడెక్కడికి పదపదమంటే - అక్కడక్కడికి సరిసరియని - రయముగ రయ్-రయ్‌మంటూ ఆగక, అలుపెరుగక - పరుగులు తీస్తుంటూ వుంది.
అలాంటిది - ఈ మధ్య ఎక్కడైనా ఆపితే - అక్కడే ఆగిపోతానంటోంది.
ఒక్కోసారి కదలనని మొరాయిస్తోంది.
తెల్లకారది - వెల్లకరి యాయె!
శ్వేతవాహనమది - శ్వేతవారణమాయె
మా వైటు సేంటా ఫే - వైటెలిఫెంటాయె!!
అందుకే మా సేంటా ఫేని నేను ముద్దుగా "ఫెంటీ" అని పిలిచుకుంటున్నా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
మా ఈ వైటెలిఫెంటు గురించి బద్రి చెప్పే ఉట్టుట్టి గొప్పలు మాగొప్పగా ఉంటాయి.
"చూశావురా బుజ్జిగాడూ! మన వెనకాల వచ్చే కార్లు మన పక్క నుంచి వెళ్ళిపోకుండా మన కారు వెనకాలే ఎలా వస్తున్నాయో? అందరికీ మన కారుని ఎంత చూసినా తనివి తీరదు అందుకే!" అని ఒకసారీ....
"అదుగదుగో... ఆ వెనకాల వస్తోందే ...ఆ నల్ల కారు చూశావూ?! అది సీక్రెట్ సర్వీసు వాళ్ళ కారు. మన సేంటా ఫేని వాళ్ళు ఎప్పుడూ follow చేస్తూ వుంటారు ... ఎందుకో తెలుసా? ఒకటి... ఎవరూ మన కారుని ఎత్తుకుపోకుండా చూడడానికి, రెండు... వీలైతే వీళ్ళే తీసుకెళ్ళిపోయి దీన్ని collectible లా దాచుకోవడానికి..." అంటూ ఇంకొకసారీ...
అవి వింటూ ముందూ వెనక సీట్లలో కూర్చున్న నేనూ, పిల్లలూ respectively నవ్వుకుంటూ వుంటాం.
ఒక్కోసారి మా sub-division లోకి పోలీస్ కార్లు ఏమైనా వస్తే "అదిగో... చూశారా! మనింటి ముందు మన కారు భద్రంగా వుందో లేదో అని కాపలా కాస్తున్నారు పోలీసులు " అని గొప్పగా అంటూ కన్ను గీటుతారు మహ-గీరగా.
తనలా అన్న ప్రతీసారీ కిరణ్ గాడు మా సేంటా ఫే ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం తొమ్మిదివందల డాలర్లు మాత్రం అని గుర్తు చేస్తూ వుంటాడు.
మా ఇంట్లో ఆగి-ఆగి-కదులుతున్న కారు-సరదాలు ఇలానే నడుస్తూ వుంటాయి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
కాకపోతే వున్న ఈ ఒక్క కారు పూర్తిగా కదలకుండా ఆగిపోయేలోగా ఇంకో కారు కొనుక్కోవాలి కదా!
అసలే దీనికి తోడుగా వుండే రెండో కారు - అతి ముచ్చటైన ఎఱ్ఱటి convertible - ఒక్క పూట వర్షంలో తడిసిన పాపానికి పైన కప్పు, కిటికీలు అన్నీ బిగుసుకుపోయి టోటలైపోయి - షెడ్డుకెళ్లి - అట్నుంచి అటే ఎటో వెళ్ళిపోయింది.
ఇహ కొన్నాళ్ళుగా ఇంట్లో - ఏ కారు కొనుక్కోవాలా, ఎలా కొనుక్కోవాలా, ఎంతకి కొనుక్కోవాలా, ఎక్కడ కొనుక్కోవాలా - అన్న ఆలోచనలూ, అందరితో -సమాలోచనలూ, అన్నదమ్ముల-సంభాషణలూ, నాన్నగారి-భాషణలూ - ప్రతి పూటా, ప్రతి రోజూ అవే కారుకతలూ, కారుకబుర్లూనూ.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఈ ఏడాది ఆగస్టులో ఒకానొక శుక్రవారం పూట బద్రి, కిరణ్, నేను కలిసి మా ఇంటికి దగ్గర్లో వున్న Costco కి వెళ్ళి పాలు-వెన్నలూ, నిమ్మకాయలూ-రామ్ములక్కాయలూ లాంటివన్నీ కొనుక్కుని మా ఫెంటీలో ఇంటికెళ్తున్నాం.
ఇంతలో సుహాస్ నుంచి ఫోన్.
బద్రి డ్రైవ్ చేస్తున్నారు కదా అని తనకి మాట్లాడదానికి వీలుగా తన ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేశాను.
ఫోన్లో అవతల్నుంచి సుహాస్ గొంతు వినిపించింది.
[కాలిఫోర్నియాలో చదువుకుంటున్న సుహాస్ ఈ ఏడాది మొదట్లో తను కూడా కారు కొనుక్కుందామా అని కొన్నాళ్ళు అనుకున్నాడు. కాకపోతే ఆ తర్వాత వద్దనుకున్నాడు - అది వేరే సంగతి.]
"నాన్నగారూ! SUV కొనుక్కుంటే బావుంటుంది అనుకుంటున్నాను. కెవిన్, సాక్, జాష్, నేను ఎప్పుడైనా రోడ్ ట్రిప్ వెళ్ళాలన్నా SUV అయితే వీలుగా వుంటుంది" అంటున్నాడు వాడు.
ఎప్పుడైతే SUV అన్న మాట విన్నారో వెంటనే బద్రీకి హుషారొచ్చేసింది.
గొంతంతా నవ్వు నింపుకుని "నాన్నగాడూ...SUV కొనుక్కుందామనుకుంటున్నట్టైతే సేంటా ఫే కూడా ఒక సారి చూడు - బావుంటుంది" అని అన్నారు. .
"ఎందుకు నాన్నగారూ! ఈ మధ్య US లో ఎక్కువగా దొంగిలించబడుతున్న కారు సేంటా-ఫేనే... మీకు తెలీదా?" అని అవతల్నుంచి అన్నజింక సవాలు.
దానికి బద్రి ఏదో బదులిచ్చే లోగా అన్నజింక "నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది నాన్నగారూ! మళ్ళీ రాత్రికి కాల్ చేస్తాను మీకు" అని ఫోన్ పెట్టేశాడు.
వాడలా ఫోన్ పెట్టేశాడో లేదో - బద్రీ తల కొంచెం వెనక్కి తిప్పి - వెనక సీట్లో కూర్చున్న బుజ్జిజింక కిరణ్‌ని చూస్తూ "విన్నావా, బుజ్జిగాడూ, అన్న ఏం చెప్పాడో? కార్లన్నిట్లోకి సేంటాఫేనే అందరూ ఎత్తుకుపోతున్నారట. అంటే అర్థం ఏంటీ? అది అంత గొప్ప కారనే కదా?" అని వాక్రువ్వుతూ కళ్ళెగరేశారు.
అది వింటూనే బుజ్జిజింక బుగ్గల్లో నవ్వు దాచుకోలేక "నాన్నగారూ! దానర్థం సేంటా ఫే లో security features సరిగ్గా లేవని..." అని కిలకిలలాడాడు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇంతలో నేను హడావిడిగా పక్కనున్న స్టోరేజ్ కంపార్టుమెంటులో వెతకడం మొదలుపెట్టా.
అది చూసి బద్రి నన్ను "ఏంటి! అంత కంగారుగా వెతుకుతున్నావ్? ఏవన్నా పెట్టి మర్చిపోయావా?" అనడిగారు.
"అహ ... . నేనేమీ ఎక్కడా ఏమీ పెట్టి మర్చిపోలేదు. కాకపోతే మొన్న - ఓ ఏభై డాలర్లూ, ఇంకో ఇరవై డాలర్లూ - రెండు గిఫ్ట్ కార్డ్స్ ఈ లోపల పెట్టా. అవి అడుక్కి వెళ్ళిపోయినట్టున్నాయి. ఎందుకైనా మంచిది కార్లోంచి తీసేసి నా పర్సులో పెట్టుకుంటా. ఇంట్లో ఐతే safe గా వుంటాయి" అంటూ ఇంకా వెతుక్కుంటూనే వున్నా.
అంతే ....
వెనక సీట్లో నుంచి బుజ్జిజింక పకపకా...
నా పక్క సీట్లో నుంచి "You too, Brutus" అన్నట్టు నన్ను చూస్తూ అవాక్కైన బద్రి...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అవీ...
కారులో...
షికారులో...
వాక్కులూ -
పకపకలూ -
అవాక్కులూ!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి