ఓయ్ 2020...
చేసిందంతా చేసేసి ఏంటంత మెల్లిగా జారుకుంటున్నావ్?
అసలు మొదట నువ్వు వచ్చీ రాకుండానే - కొత్త దశాబ్దం మొదలైందని, ఖచ్చితమైన చూపు అంకెలు 20 / 20 కలుపుకొచ్చావని, చమత్కార భరిత - Vision 2020 వనీ, కలిసొచ్చే కాలానివని, కలకల నవ్వులతో కళకళలాడిస్తావని ఎంత మురిసిపోయానూ?
కలవరం తెచ్చావ్.
కలిసుండనియ్యకుండా చేశావ్.
అయినవాళ్ళకి కాకుండా చేశావ్.
ఇంటిని నాలుగ్గోడల బోనుని చేశావ్
ఊపిరిని ఉన్నచోట బంధించే ముసుగు మాటున ఉంచేశావ్.
సరిగ్గా ఏడాది క్రితం ఏమనుకున్నానూ? ఎంత మురిసిపోయానూ? ఓ సారి గుర్తు చెయ్యనా?
నేననుకున్నట్టు నువ్వు సమదృష్టి భరిత వత్సరానివే - కానీ అందులో ఉన్న ఓ చిన్న మెలిక నేను గమనించలేదు సుమా! అదేంటంటే నువ్వు సమదర్శి-దృష్టి భరిత సంవత్సరానివని.
ఒక్కటి మాత్రం నిజం. నిన్నెప్పటికీ మరువలేం. నువ్వు చేసిన గాయం ఇప్పటిప్పట్లో మానేది కాదు.
నువ్వు మాత్రం ఏం చేస్తావులే! ఎప్పట్లాగే సెకన్లు నిముషాలుగా, నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా - తలొంచుకుని నీ దారిన నువ్వు పెరగడమూ, ముందుకు జరగడమూ తప్ప నీకుగా నువ్వు ఏమీ చెయ్యలేదని నాకు తెలుసు.
కాకపొతే - అన్నీ సవ్యంగా సాగుతుంటే, అంతా బావుంటే కాలం కలిసొచ్చిందనీ - ఏ మాత్రం తడబడినా, ఓ చిన్న కుదుపిచ్చినా కాలం పామై కరిచిందనీ - జరిగే వాటన్నిటికీ కాలమే కారణమని అనుకోవడం మనుషులుగా మాకలవాటు. అందుకే మా కష్టాలకి, నష్టాలకి, కాలు కదపలేని బాధలకి నీదే బాధ్యత అంటున్నాం.
ఇంకొద్ది సేపట్లో పాతబడి, వాడిన మొహంతో నువ్వలా పోబోతున్నావా?! ఆ మలుపులో మొహమంతా వచ్చీరాని నవ్వు పులుముకుని, బిక్కుబిక్కుమంటూ, రానా-వద్దా అనుకుంటూ, ముందుకీ-వెనక్కీ ఊగిసలాడుతూ, అలా అని తోసుకొస్తున్న కాలాన్ని ఆపలేక, ఇప్పుడో-ఇంకో ఘడియకో వచ్చేస్తానన్నట్టున్న ఆ 2021 నీకూ కనిపించే ఉంటుంది.
ఆ వచ్చే కొత్త సంవత్సరం - నీ అంత కాకపోయినా ఎంతో కొంత తమాషా - అనగా some-వింత అయిన సంవత్సరమే! ఎలా అంటావా? 2021 అంటే 21 వ శతాబ్దపు 21 వ సంవత్సరం. భలే!
చూశావా! ఇప్పటి దాకా 20-20 వని నువ్వేం చేశావ్ అంటూ నిన్ను నిలదీస్తున్న నేను అంతలోనే 20-21 గురించి కొత్త లెక్కలేసుకుని ఇంతలోనే మురిసిపోతున్నాను. మనిషి పుట్టినప్పటినుంచి చెప్పిందే, మళ్ళీమళ్ళీ చెప్తున్నదే, నీకు మళ్ళీ చెప్తున్నా విను - మరపు మాకు సహజం. మరపు మాకు వరం.
ఎంతో చెడు జరిగిందని అందరం అనుకుంటున్న నీ కాలంలో - కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేలా అంతో ఇంతో మంచి కూడా జరిగిందని - చేతులు కడిగించి, మూతులు మూయించి ఎంతో కొంత మార్పు తెచ్చానని - ఆట్టే మురిసిపోకు.
ఇంకో నాలుగు నాళ్ళు గడిచి మళ్ళీ నలుగురూ కూడే వేళ, నలుదిక్కులకీ వెళ్ళగలిగే వేళ - "నువ్వు నేర్పావూ-మేము నేర్చామూ" అనుకునే మంచి మచ్చుక్కూడా మిగిలుండదు.
ఇంకొక్క రోజులో నిరుడయ్యే నీకు నేను చెప్పేదొకటే!
ఇంత జరిగాక - "ఇప్పుడున్న కాలం బాలేదు, ఇంతకుముందు బావుంది, ఇక ముందు బావుంటుంది" - అన్న లెక్కలేమీ ఉండవు చూసుకో.
అలా అనుకోవడానికి అసలంటూ మనిషి మిగిలుండాలి కదా.

గతం గతః
రిప్లయితొలగించండిభవిష్యం అదృశ్యహ
వర్తమాన కాలాయ తస్మై నమః
అనాలనిపించింది ఈ పోస్ట్ చదివాక.
Wishing everyone a good year ahead.
భలే మాట చెప్పావ్! బదులు ఇవ్వడం ఆలస్యమయింది. ఏమనుకోకు.
తొలగించండి"అలా అనుకోవడానికి అసలంటూ మనిషి మిగిలుండాలి కదా"
రిప్లయితొలగించండిసింపుల్ వాహ్ వాహ్...లాజిక్!! ఇది చదువుతున్నాం అంటే బావున్నట్టే కదా! So, ఉండిన, ఉన్న కాలం మంచిదే నాకు. Very Happy New Year!
అంతే! అంతే! ఉంటున్నకాలం మేలు మేలు!
తొలగించండి