ఓ నాడు - ఓ పాట
ఇలలో...
చలచల్లటి చినుకులా
చెక్కిలి మీద సనసన్నగ జారి
తడిపెళ్ళింది
మూసిన కనుల చాటున
కలల రంగుల నేసింది
ఆ చలువ - కొలవలేని చలిమి!
అది తా వలచిందే!
ఓ నాటి - ఆ పాట
కలలో ...
వెచవెచ్చని ఊపిరిగా
కనురెప్పల మీద అలనల్లన తాకి
తడిమెళ్ళింది
మోసిన కలల మాటున
కనుల వెలుగు పూసింది
ఆ వేడిమి - విడువలేని పోడిమి!
ఇది కావలసిందే!
*******
*******
విడవబోవని రాగమై చుట్టుకుంటుంది.
ఆ రాగమే - ఇంకెప్పుడో ఇంకో పాటగా వినబడి
వెదకబోవని తీగగా సాగి పట్టుకుంటుంది
ఇహ అప్పట్నుంచి -
ఈ పాట కదిలితే ఆ పాటా - మెదులుతూనే వుంటుంది
ఆ పాట మెదిలితే ఈ పాటా - కదులుతూనే వుంటుంది
ఒకదానితో కలిసి మరొకటి - మెదులుతూనే వుంటుంది
ఒకదాని తర్వాత ఇంకొకటి - కదులుతూనే వుంటుంది
ఒకటి మొదలిడి సాగిన పూట మరొకటి - మెదులుతూనే వుంటుంది
ఒకటి ముగిసి ఆగిన చోట ఇంకొకటి - కదులుతూనే వుంటుంది
ఈ పాట - మెదులుతూనే వుంటుంది
ఆ పాట - కదులుతూనే వుంటుంది
*******
*******
విన్నప్పుడు పాట లోని మాటలు అర్థమయేంత భాష తెలీదు కానీ పాటని మెచ్చడానికి భాష అవసరమనిపించని వయసు కాబట్టి - వినీ వినగానే పాట నచ్చేసింది. ఇహప్పట్నుంచీ రేడియోలో ఆ పాట ఎప్పుడు వినిపించినా - నచ్చిన చుట్టమేదో చెవుల ముంగిటి లోకి వచ్చినట్టనిపించేది.
చాలా ఏళ్ళ తర్వాత - ఐదవ తరగతి పూర్తయ్యి - ఆ వేసవి సెలవుల్లో హైద్రాబాదు ప్రభావతి దొడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు - అక్కడ బ్లాక్&వైట్ డయనోరా టీవీలో అసలుకి రంగురంగుల సినిమా అయుండీ నలుపు-తెలుపుల్లో కనిపించిన హిందీ సినిమా "రజనీగంధా" చూశాను. అప్పటికి హిందీ అక్షరాల స్థాయి లోనే వున్న నాకు ఆ సినిమాలో అర్థమయింది ఒకటే - రజనీగంధా అంటే - నాకు తెలిసిన - మంచి వాసనొచ్చే - తెలతెల్లని లిల్లీ పూలని!
అన్నట్టు లిల్లీ పూల గురించి ఇంకో ఇష్టమైన జ్ఞాపకం. కాకినాడలో మేము అద్దెకున్న సుబ్బారావు మాస్టారి ఇంటి ముందు నాయకర్ గారి మేడ వుండేది. ఆ ఇంట్లో పిల్లలు సపనా, సుమన, శ్రీనివాసులు నాకు స్నేహితులు. వేసవి సెలవుల మధ్యాహ్నాలు వాళ్ళింట్లోనో పాడుకుంటూనో , సాయంత్రాలు మా ఇంటి డాబా మీద ఆడుకుంటూనో మహ జోరుగా సాగిపోయేవి. ఆ నాయకర్ల ఇంట్లో చిన్నచిన్న కూజాల్లో మంచినీళ్ళలో లిల్లీపూలు వేసేవారు. మధ్యాహ్నపుటెండపూట ఆటపాటల్లో అలుపు తీరడానికి ఆగి - ఓ గుక్క ఆ లిల్లీపూల నీళ్ళు తాగుతుంటే - గొంతు లోకి చలచల్లగా జారిన ఒక పరిమళభరితమైన రుచి ఇప్పటికీ నాకు గుర్తే!
లిల్లీ పూల కబుర్లు ఇల్లిక్కడ ఆపి - మళ్ళీ వెనక్కి మళ్ళి ఆ హిందీ సినిమా దగ్గరకెళ్తే ...రజనీగంధా సినిమా చూస్తూ వుండగా, వుండగా - ఓ టాక్సీలో హీరోయిన్ను, ఇంకొకతను ఎక్కి వెళ్తుండగా - ఓ పాట మొదలవుతుంది. వాళ్ళు టాక్సీలో వెళ్తున్నంత సేపూ ఆ పాట వస్తూనే వుంటుంది. ఆ పాట గురించిన రెండు తమాషా జ్ఞాపకాలు ఏంటంటే...
ఒకటి - ఆ పాట అచ్చు నాకు అంతకు ముందు నచ్చిన తెలుగు పాటలా ఉండడం.
రెండో తమాషా విషయమేంటంటే... అదే మొదటి సారేమో నేను హైద్రాబాదు లాంటి పెద్ద సిటీకి వెళ్ళడం - అక్కడ టీవీలో సినిమా - అందులోనూ హిందీ సినిమా చూడడం.
ఆ పాట చూసింతర్వాత నేనేమనుకున్నానంటే - హైద్రాబాదు లాంటి ఊళ్ళలో మనం ఏదన్నా టాక్సీ ఎక్కితే అలా ఎక్కడో బ్యాక్-గ్రౌండులో మ్యూజిక్కూ, దాంతోపాటే హిందీ పాటలొస్తాయని.
అది సినిమాలో పాట అని నాకు తట్టనేలేదు. కాకపోతే అప్పుడు ఆటోలు, రిక్షాలు తప్ప టాక్సీ ఎక్కలేదు కాబట్టి - అలా నా వెనకాలే పాట పరిగెడితే వినే అవకాశం రాలేదని బోల్డు దిగులుగా అనిపించింది కూడా.
ఇప్పటికీ ఆ రజనీగంధా సినిమా పాట చూస్తే ఆ చిన్ననాటి అమాయకపు తలపు గురుతుకొచ్చి మురిపిస్తుంటుంది.
*******
*******
ముందుగా మొదట విన్న పాట - తెలుగు పాట - "చైర్మన్ చలమయ్య " సినిమా లోది. ఆ పాట "నయనాలు కలిసె తొలిసారి...". సినిమాలో ఆ పాటకి ఆంధ్రా-దిలీప్ కుమార్ అని పేరెన్నిక గన్న చలం, రివాల్వర్ రాణిగా గన్నులు పేల్చిన విజయలలిత - వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమా పాటలకి ఆటపట్టైన మైసూర్ బృందావన్ గార్డెన్సులో పరుగులు పెడుతూ ఆడుకున్నారని, పాడుకున్నారని మొన్ననే యూట్యూబ్ చెప్పింది.
ఈ పాట వివరాలు వెతుకుతుంటే దొరికిన వివరాల్లో - నాకు - మెరుపుల్లా బోల్డు తమాషాలు కనిపించాయి.
అందులో మొట్టమొదటిది - ముఖ్యమైనది ఏంటంటే - తెలుగులో ఆరుద్ర రాసిన పాటకి సంగీతం కట్టినవారు సలిల్ చౌధరి.
ఆయన ఇదే వరసలో ఒక హిందీ పాట (ముఖేష్), ముగ్గురు పాడిన రెండు బెంగాలీ పాటలు (పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ విడివిడిగా పాడిన ఒక పాట, విడిగా గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో పాట), వీటన్నితో పాటు ఇద్దరు (బాలు, సుశీల) పాడిన ఒక తెలుగు పాట - వెరసి నాలుగు పాటలకి ఒకే ట్యూన్ వాడారు.
పై లెక్క గజిబిజిగా వుంది కదా?! అదే నా ఈ బ్లాగు శీర్షికకి మూలం, ఆధారం - వెరసి మూలాధారం. దాని లెక్క తేలుస్తా - కొంచెం ఓపిక పట్టండి మరి!
ప్రస్తుతానికి ఇక్కడ తెలుగు పాట గురించి ఓ పుంజీడు కబుర్లు. తెలుగు పాటలో మొదటి చరణంలో బృందావన్ గార్డెన్స్ కనిపిస్తే, రెండో చరణంలో కృష్ణరాజసాగర్ డామ్ దగ్గర పాలవెల్లువలా పొంగుతున్న కావేరీ నదీమతల్లి చిందులేస్తూ కనిపిస్తుంది.
ఇక పాటలో కనిపించే చెట్లూ, పూలూ, దూది మబ్బులూ, నీటి తుంపర్లూ, డామ్ పక్కనున్న మెట్లూ, హీరో-హీరోయిన్నుల క్లోజప్పులో పెట్టిన తళుకుబెళుకుల కెమెరా-ఫిల్టర్లూ - ఇవన్నీ కూడా ఒక పెద్ద visual bonus!
ఈ పాటలో పల్లవిలో మొదటి వాక్యం పాడినప్పుడు - ఎస్పీ బాలు, సుశీల - ఇద్దరూ కూడా ఆ ఎత్తుగడలో - బెంగాలీ సంగీత దర్శకుడు సలిల్ చౌధరి ఎలా పాడి చూపించారో - అచ్చు అల్లాగే తెలుగుని పట్టిపట్టి పాడారేమో అనిపిస్తుంది నాకు. అయినా అది కూడా పాటకి ఒక అందాన్నిచ్చింది. పాట మధ్యలో వినిపించే "లలల్లాల్లా, అహహా, ఎహెహే" లాంటి హమ్మింగులు కూడా కొత్తగా వినిపిస్తాయి.
బాలబాలుడు "తలపే తరంగాలూరి..." అనంటే, గానకోయిల్సుశీలమ్మ "తలపే తరంగాలూరే..."అని పాడుతుంది.
నేను చూసి మురిసిన ఆ వింతలూ, విశేషాలూ మీరూ కని, విని ఆనందించేయండి మరి!
"నయనాలు కలిసె తొలిసారి" పాటకి యూట్యూబ్ లింక్: Chairman Chalamayya Movie || Nayanaalu Kalise Video Song || Chalam, Vijaya Lalitha || Shalimarcinema - YouTube
నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే!
పులకించె మేను ప్రతిసారి!
నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి...
పులకించె మేను ప్రతిసారి!
నా లోనా - నీ పేరే - పాడేనూ ... రాగాలూ
నా లోనా - .నీ రూపే - చేసేనూ... చిత్రాలూ
మదిలో - ఏదో - పదే పదే - ధ్వనించే!
మమతల తోటలలోనా
తొలి వలపుల పూవులు పూచే!
నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరి...
పులకించె మేను ప్రతిసారి!
నీలాలా - మేఘాలా - నీవేమో... ఎగిరేవూ
దూరానా - తీరానా - .నీవేమో... నిలచేవూ
కలలే - ఇదే - ఇలా ఇలా - నిజమాయే!
పరువము బంధం వేసే
మన ప్రణయము బాసలు చేసే!
నయనాలు - కలిసె - తొలిసారి
హృదయాలు కరిగె మలిసారి
తలపే తరంగాలూరే!
పులకించె మేను ప్రతిసారి!
*******
*******
ఇక ఇప్పుడు తెలుగు పాటకి కవల పాటైన హిందీ పాట గురించి - ఓ నాలుగు కబుర్లు.
హిందీ సినిమా "రజనీగంధా" లో "కయీ బార్ యూ హీ దేఖా హై" పాటని రాసినవారు యోగేష్ గౌర్.
సంగీతం సలిల్ చౌధరి.
పడిశపు-గొంతుతో పాడినట్టున్నా - ముఖేష్ పాడిన ఈ పసిడి పాట soothing గా అనిపిస్తుంది.
పాటలో కనిపించేవారు - నీలంచీర కట్టుకున్న విద్యా సిన్హా, గడ్డంజుట్టు-సిగరెట్టు-సహిత-దినేష్ ఠాకుర్, మధ్యలో ఓ రెండు నిముషాలు మెరుపులా మెరిసే అన్‌మోల్-అమోల్ పాలేకర్. వీళ్ళే కాకుండా పాట మొదలైన దగ్గర్నుంచి కనిపించే పచ్చకప్పు-నల్లటాక్సీ.
ఈ పాటలో నాకు నచ్చేవి ఓ మోస్తరు జాబితానే వుంది.
విద్యాసిన్హా కట్టుకున్న ప్రకాశవంతమైన తెల్లపూల నీలం రంగు చీర, అల్లుకున్న జడ, పెట్టుకున్న నల్లద్దాల కళ్ళజోడు బావుంటాయి.
దినేష్ ఠాకుర్ తొడుక్కున్న నీలం ముగ్గుల తెల్లచొక్కా కూడా బావుంటుంది విద్యాసిన్హా చీరకి మాచింగ్‌లా.
టాక్సీ కిటికీల్లోంచి కనిపించే ఆ నాటి బొంబాయి నగరపు డబుల్-డెకర్ బస్సులు, ఒకదానిమీద ఒకటిగా పేర్చినట్టున్న అపార్టుమెంట్లు, నెత్తి మీద మూటలు మోస్తూ హడావిడిగా పరిగెడుతున్న టాక్సీలు, మనుషులు - ఇదింకో visual bonus!
"రాహోం మే ..." అన్న చోట సాగుతున్న దారిని చూడమన్నట్టుగా కారు కిటికీ అద్దం మీద కనిపించే విద్యా సిన్హా చూపుడు వేలు ఆవిడ అనుకోకుండా పెట్టిందో, దర్శకుడు బసు ఛటర్జీ చెప్తే కావాలని పెట్టిందో కానీ - ఆ చేతి భంగిమ నాకు చూడడానికి బావుంటుంది.
"జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే" అన్న వాక్యం దగ్గర గాలికి ఎగిరెగిరి పడుతున్న చీరకొంగు పాటకి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. భలే!
"జానూ న -జానూ న" అన్న దగ్గర తెల్లచీరలో - ఎఱ్ఱ రిబ్బన్లతో రెండు జళ్ళ-సీతలా కనిపించే బొద్దు-విద్య ముద్దుగా వుంటుంది. అక్కడే గడ్డం లేని దినేష్ ఠాకుర్ కూడా మబ్బు కమ్మని చంద్రుళ్ళా మెరుస్తాడు ఓ క్షణం పాటు.
మరి - ఈ పాటని కూడా చూస్తూ వినేయండి!
"కయీ బార్ యూ హీ దేఖా హై" పాటకి యూట్యూబ్ లింక్: Kaii Baar Yun Bhi Dekha Hai - Rajnigandha Song - Vidya Sinha - Amol Palekar - Mukesh - Sad Song - YouTube
కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై
కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై
అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై
రాహోం మే - రాహోం మే
జీవన్ కీ - రాహోం మే
జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే
కౌన్ సా ఫూల్ చురాకే - రఖ్ లూ మన్ మే సజాకే!
కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై
అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై
జానూ న - జానూ న
ఉల్‌ఝన్ యే - జానూ న
సుల్‌ఝావూ కైసే - కుఛ్ - సమఝ్ న పావూ
కిస్‌కో మీత్ బనావూ - కిస్‌కీ ప్రీత్ భులావూ
కయీ బార్ - యూ హీ - దేఖా హై
యే జో - మన్ కీ - సీమరేఖా హై
మన్ తోడ్‌నే లగ్‌తా హై
అంజానీ ప్యాస్ - కే పీఛే
అంజానీ ఆస్ - కే పీఛే
మన్ దౌడ్‌నే - లగ్‌తా హై
*******
*******
ఏ పాట రాసే ముందైనా ఆ పాట గురించి సరైన వివరాలు రాద్దామని గూగుల్ చేస్తుంటాను. ఈసారి ఈ హిందీ-తెలుగు కవల పాటల గురించి రాస్తూ సలిల్ చౌధరి గురించి తెలుసుకుందామని వెతికితే ఈ రెండు పాటలకి తోడు ఇంకో మూడు బెంగాలీ పాటలు వున్నాయని తెలిసింది.
అవి కూడా యూట్యూబులో వెతికి పట్టుకున్నా.
ఒకటి - పింటూ భట్టాచార్య పాడిన బెంగాలీ పాట "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి": Ami Chalte Chalte Pintu Bhattacharya - YouTube
రెండోది - లతా మంగేష్కర్ పాడిన అదే బెంగాలీ పాట "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి": Ami Cholte Cholte Theme Gechhi | Abaak Rater Tara | Lata Mangeshkar | Lyrical - YouTube
మూడోది గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో బెంగాలీ పాట "కొతొబార్ చొండో బొద్‌లాబే...": Kotobar Chhondo Bodlabey - YouTube
*******
*******
ఇప్పుడు ఈ పాటల గురించిన నాదైన పొడుపుకథ నేనే విప్పుతా!
"సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!"
అంత కన్నా ముందు ఇంకొక్క చిన్నమాట.
"సలిల్ చౌధరి" లో సలిల్ అన్న పేరు ఎంత సలలితంగా అనిపిస్తుందో నాకు. సలిల్ అంటే నీరు కదా! ఆ పేరూ అంతే చల్లగా ధ్వనిస్తుంది.
ఈ పాటల్లో నాకు తట్టిన కొన్ని అంకెలు, లెక్కలు, లాజిక్కులు కూడా చెప్పేస్తా!
6 - 5 - 4 - 3 - 2 - 1....
హిందీ, బెంగాలీ భాషల్లో విడివిడిగా ఏకగళగీతంగా, తెలుగులో కలివిడిగా యుగళగీతంగా పాడిన వారు ఆరుగురు (6) - ముఖేష్, పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్, గౌతమ్ దాస్‌గుప్తా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల.
ఇందులో అబ్బాయిలు నలుగురు (6), (2) .
పైన చెప్పుకున్నవి మొత్తం ఐదు పాటలు (5) - ఒక తెలుగు (1), ఒక హిందీ(1), మూడు బెంగాలీ(3).
కానీ సరిగ్గా చూస్తే అవి నాలుగే (4) - ఎందుకంటే బెంగాలీ పాటలు లెక్కకి మూడైనా - అందులో ఒక పాట రెండు సార్లు లెక్కకొచ్చింది. "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి" పాటని పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ ఇద్దరూ విడివిడిగా పాడారు. ఇంకో పాట గౌతమ్ దాస్‌గుప్తాది. అలా బెంగాలీ పాటలు రెండయ్యాయి. (2).
అన్నిటికీ ఒక్కరే సంగీత దర్శకులు - సలిల్ చౌధరి (1).
నేను మొదట అనుకున్నది హిందీ-తెలుగు కవల పాటలే (2). కానీ తీరా చూస్తే ఐదు (5) పాటలున్నాయేమో అనిపించే నాలుగు (4) పాటలు మాత్రమే!
అందుకే అనుకున్నా "సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!" అని.
*******
*******
అవండీ ఇవాళ్టి పాటల కబుర్లూ, పాటల మాటున పొడుపు కథలూ, ఆ పొడుపు కథల విడుపు కబుర్లూ...
~ పాటల భైరవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి