జ్యేష్ఠ మాసం. గ్రీష్మ ఋతువు.
పేరుకి ఎండాకాలం. ఎండలు మెండుగా కాయాల్సిన కాలం
మా ఊళ్ళో కాలమేదైనా అప్పుడప్పుడు అనుకోని చుట్టంలా - ఉండుండి ఉలుకూ-పలుకూ లేని నిలకడ నీటిచాలుగా వాన పడుతూనే ఉంటుంది.
అసలు మా ఊరి కాలాకాలాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే - "ఇప్పుడున్న వాతావరణం నీకు నచ్చకపోతే రేపటి వరకు ఆగి అప్పుడు చెప్పు" అన్నట్టుంటుంది. (If you don't like the weather in St. Louis now, just wait until tomorrow అన్నట్టు).
మా ఊళ్ళో ఎండాకాలం - మహా అంటే - ఏడాదిలో ఓ మూడున్నర నెలలు సూర్యుడు ఎఱ్ఱగా కనిపించి వెచ్చగా అనిపించే కాలం.
అడపా దడపా ఒకట్రెండు రోజులు మాత్రం నీరెండగా మొదలయి - గీరెండగా మారి ఉస్సురుస్సురేలా చేస్తుంది.
అందుకే ఎండ కాసిన ఆ కాసిని రోజులూ - ఒక రోజు పొద్దుటి పూట, ఇంకో రోజు సాయంకాలపు పొద్దు, ఒక్కో రోజు ఆ పొద్దూ, ఈ పొద్దూ కూడా నడుస్తాము - బద్రి, నేను.
ఆ నడకలో - ఒక్కోసారి పైకో, ఎక్కువసార్లు నోట్లోనో "నేల పైన కాళ్ళు లేవు... నింగి వైపు చూపు లేదు" అని ఆత్రేయది అబద్ధపు పాటొహటి పాడుకుంటుంటాను.
అది అబద్ధపు పాట ఎందుకయిందీ అంటే - నడుస్తున్న నా కాళ్ళు నేల పైనే ఉంటాయి.
దారికి అటూ ఇటూ ఉన్న తలొంచని చెట్లని తలెత్తి చూసుకుంటూ నడిచే నా చూపులు నింగి వైపే ఉంటాయి.
తడబడక వడివడిగా పడు అడుగులలో వెనక్కి జరుగుతూ దారి ఉరుకుతూ ఉంటుంది.
బాటకి అటూ-ఇటూ వేర్లు దించుకు తలొంచక నించొను తరువుల వైపు చూపు చుఱుకుతూ ఉంటుంది.
అసలా చెట్లు ఎంత బావుంటాయనీ!?
కొన్ని నేలకి దాపుగా ఒదిగి కుదురుగా
ఇంకొన్ని నింగికి ఏపుగా ఎదిగి గుబురుగా
అన్నీ పచ్చని ఆకులతో కళకళలాడుతూ
అందులో కొన్ని విచ్చిన పూవులతో ఘుమఘుమలాడుతూ
వచ్చిన పక్షిని కాదనవు.
ఊపిన గాలిని వద్దనవు.
మేము వెళ్ళే దారిలో కనిపించే ఎన్నో చెట్లు అరవిచ్చిన పూవులు పొదిగిన ఆకుపచ్చల పచ్చడాలు కప్పుకున్నట్లు ఉంటాయి.
కానీ కొన్ని మాత్రం నొప్పి దాచుకుని పైకి నవ్వుతున్నట్టుంటాయి.
ఒక్కో చెట్టులో పచ్చని ఆకులు నిండిన రెమ్మల పక్కనే రేపో మాపో విరిగి పడిపోతాయా అనిపించే ఎండిన కొమ్మలూ ఉంటాయి. ఇంకొన్ని చెట్లని శిశిరమింకా వదిలి వెళ్ళక అంటిపెట్టుకున్నట్టే ఉంటుంది.
ఇంతకు ముందెప్పుడూ ఇలా లేదు కానీ - ఈ ఏడాది మాత్రం మా చుట్టుపక్కల వున్న ఎన్నో చెట్లు అంత బాగా ఉన్నట్లు లేవు. చూడడానికి పచ్చగానే ఉన్నట్టుంటాయి - కానీ పైనుంచి ఎండుకొమ్మలు వేసుకొస్తున్నాయి. ఎండిన కొమ్మలు విరిగి ముక్కలుముక్కలుగా నేలకొరిగిపోతున్నాయి.
ఈ మధ్య కురుస్తున్న వానల్లో చిన్నచిన్న గాలులకే పెద్దపెద్ద కొమ్మలు విరిగిపడిపోతున్నాయి.
వాటిని చూస్తుంటే అప్పుడెప్పుడో బద్రి చెప్పిన పీటర్ వాలబెన్ (Peter Wohlleben) అనే ఆయన గుర్తొస్తాడు.
వాలబెన్ చెప్పిన ప్రకారం మనకి WWW (World-Wide Web) ఉన్నట్టే, అడవుల్లో ఉన్న చెట్లకి కూడా ఒక WWW (Wood-Wide Web) ఉంటుందట.
పీటర్ వాలబెన్ అంటే ఎవరంటే జర్మనీలో పుట్టిన ఒక చెట్టు-చుట్టం.
ఆయన చెప్పిన ప్రకారం అడవుల్లో ఉండే చెట్లు తమలో తము మాట్లాడుకుంటాయిట.
ఏ చెట్టుకి నీరు తగ్గినా, ఇంకే చెట్టుకి పురుగు పట్టినా - చుట్టు పక్కల ఉండే ఆరోగ్యవంతమైన చెట్లు వాటిని కనిపెట్టి, తమ వేళ్ళ ద్వారా మిగిలిన చెట్లతో మాట్లాడి ఎండిపోతున్న చెట్టుకి నీరు, ఈసురోమంటున్న తరువుకి పురుగు నెదిరించి బలం కలిగించే పోషకాలు అందిస్తాయట.
నాకు మా నడిచే దారిలో ఎండుకొమ్మలతో, వాడిన మొహాలతో ఉన్న చెట్లని చూస్తే ఆ wood-wide web ఏదో అడవుల్లోనే కాక పట్టణాల కాంక్రీటడవుల్లో కూడా పని చేస్తే బావుణ్ణేమో అనిపిస్తుంది.
అకాలంలో
ఆకురాలు సోకినట్టున్న మానులన్నీ
ఆకుల-గనులవుతాయి;
ఆమనుల వనులవుతాయి.


check this out. you may like this movie.
రిప్లయితొలగించండిhttps://en.wikipedia.org/wiki/Epic_(2013_film)
Will do. Thanks for suggesting.
తొలగించండి