కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 25 - గాబరా పెట్టిన కోబ్రా!
ఆ ఐటీసీ మేనేజర్ తోటి కొంచెం సీరియస్‌గా I am a cobra అంజెప్పేసి "రండి ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుందాం" అని ఆఫీసు లోకి వెళ్ళిపోయాను కదా!?
అలా నేను వెళ్ళాక - కొంసేపట్లో - నా వెనకాలే ఆయన కూడా నా రూంలోకి వచ్చాడు కదా!?
ఈలోపులో ఓ చిన్న విషయం జరిగింది.
నేను వెళ్ళిపోయాక ఈయన స్టన్నయ్యాడు మనిషి.
కొంచెం చెమటలు పట్టినయ్.
విశ్వనాథం గారని చెప్పేసి ఐటీసీ గోడౌన్ ఇన్‌ఛార్జ్ ఉన్నాడు కదా మా దగ్గర - ఆ పెద్దాయన!
ఈ మేనేజరు విశ్వనాథం గారి దగ్గరికెళ్లి "ఏంటి...వీడి సంగతీ? కోబ్రా అంటాడూ, చాలా సీరియస్‌గా వెళ్ళాడూ, ఏంటీడి పరిస్థితి? అసలు వీడెవరు?" అంజెప్పేసి అడిగాట్ట.
అడిగితే ఆ విశ్వనాథంగారేంమో కొంచెం గొంతు తగ్గించి "సార్! ఈ గుంటూరు ముఠా వాళ్ళు తొంభై మందున్నారు ఆయన దగ్గర. అందులో రౌడీ షీటర్సు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడాయన. పైగా... రెండోది ఈయనుండేది బ్రాడీపేట నాలుగూ పజ్జెనిమిది. దానికి దగ్గర్లోనే కోబాల్టు పేట. వాళ్ళతో కూడా సంబంధాలున్నాయేమో ఈయనకి. తర్వాత... ఈయన రోజూ అరండల్ పేట డొంకరోడ్డు లోంచి వస్తాడు. ఆ డొంకరోడ్డులో కూడా ఈ కంపెనీకి బొగ్గు వేసేవాళ్ళు ఉన్నారు కదా? వాళ్ళతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయేమో? కొంచెం ఎందుకైనా మంచిది ఆయనతో జాగ్రత్తగా మాట్టాడండి" అని చెప్పాడట.
అది విని ఈయన కొంచెం భయపడుతూనే వచ్చాడు ఆఫీసు లోకి.
వచ్చాక కూర్చున్నాడు.
నేను కూడా రిలాక్స్ అయి కూర్చున్నాను.
నాకో ఆఫీసు బాయ్ వుండేవాడు వెంకటేశ్వర్లు.
ఆ వెంకటేశ్వర్లుని పిల్చి "ఓ రెండు కాఫీ తీసుకురా మంచి స్ట్రాంగ్‌గా" అని చెప్పాను.
వాడు కాఫీ తేవడానికి వెళ్ళాడు.
ఈలోపులో ఈయనతో "ఒక ఐదు నిముషాలు బయటికి వెళ్ళొస్తాను. ఇక్కడే కూర్చుని ఉండండి" అని చెప్పి బయటికెళ్ళాను.
అప్పటికి మిగిలిన స్టాఫు వచ్చారు ఆఫీసుకి.
ఆఫీసులో ముఠా మేస్త్రులు ఇద్దరుండేవారు - వీరాస్వామి, పెదకోటయ్య అని. వాళ్ళిద్దర్నీ పిలిచాను.
శర్మ అనే క్లర్కుండేవాడు. అతన్నీ పిలిచాను.
వాళ్ళు ముగ్గుర్నీ పిలిచి "ఒకసారి పదో నంబర్ గోడౌన్‌కి వెళ్ళి రండి. ప్రతీ కేసు జార్తగా చూడండి. ఎక్కడైనా కేసులు తడిసినయ్యా అని చూసి నాకో అరగంటలో రిపోర్టు ఇవ్వండి" అంజెప్పి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఆఫీసు లోపలికి వచ్చాను.
వచ్చి కూర్చున్నా.
సరే...కాఫీలొచ్చినయ్.
నేనూ, ఐటీసీ మేనేజర్ - ఇద్దరం కాఫీలు తాగాం.
సిగరెట్టు ఆఫర్ చేశాను. ఆయనో సిగరెట్టు, నేనో సిగరెట్టు తాగాం.
అవన్నీ అయింతర్వాత ఆయనే మొదలుపెట్టాడు.
"ఆ... ఇప్పుడు చెప్పు! ఏంటీ ఇందాకేంటో కోబ్రా అన్నావ్. అంటే ఏమిటసలు నీ పరిస్థితి? కోబ్రా అంటే ఏంటి?" అనడిగాడు నన్ను.
"అంటే ...సరే... ఏదో అన్నాను. అక్కడ స్టాఫున్నారు. లైను కుఱ్ఱాళ్ళు వాళ్ళూ ఉన్నారు. వాళ్ళ ముందెందుకు గొడవపడడం? ఆఫీసులోకి రండి మాట్లాడుకుందాం అని చెప్పాను. మీరు వినకుండా ఏదో రెచ్చిపోతున్నారు. అందుకని కొంచెం సీరియస్‌గా చెప్పాను. ఏం లేదు లెండి. దాని సంగతెందుకు మనకి. ఇప్పుడు కేసులేం తడిసుండవు. నేను మనుషుల్ని పంపించాను చూసి రమ్మని. వాళ్ళు చూసొస్తారు ఒక అరగంటలో మనకి రిపోర్టు వస్తుంది" అని చెప్పా.
"నో నో... అలా కాదు. ఆ కోబ్రా అనే మాటెందుకొచ్చింది నీ నోటెంబట? అది చెప్పాలి నాకు." అని కూచున్నాడు.
నేనోసారి నవ్వి "ఏం లేద్సార్! మాది కోనసీమ. అమలాపూరం దగ్గర్ అనాతవరం అనే గ్రామం మాది. మేం ద్రావిళ్ళం. ఆ ఊళ్ళో బ్రాహ్మణ కుటుంబం లోంచి వచ్చాన్నేను. కోనసీమ బ్రాహ్మణ్ణి కాబట్టి "కో...బ్రా...". ఇంతకన్నా ఇంకేం లేదండీ బాబూ" అన్నా!
ఆయనొక్కసారి బిత్తరపోయి - తేరుకుని - పకపకా నవ్వి "నీ దుంపతెగ! ఎంత భయపెట్టావు నన్ను...ఏదీ ఇంకో సిగరెట్టియ్యి" అని ఇంకో సిగరెట్టడిగి తీసుకుని తాగి నవ్వుతూనే ఉన్నాడు.
మనిషొక్కసారిగా బోల్డు రిలాక్స్ అయినట్టు కనిపించాడు.
ఆ తరవాత ఇద్దరం కూర్చుని ఏవో మాటాడుకుంటూ ఉన్నాం.
ఇంతలో శర్మొచ్చి "ఒక్క కేసు కూడా తడవలేదండి. అన్నీ బావున్నాయి" అని చెప్పాడు.
విశ్వనాథం గారు కూడా వచ్చి "రాత్రంతా ఈయనిక్కడే వున్నాడండి. కుఱ్ఱాళ్ళని పెట్టి గోతులు తవ్వించి నీళ్ళు తోడిస్తూనే వున్నాడు. నేను చెప్తూనే ఉన్నాను మీకు. ఏమీ పాడవలేదని చెప్పేసి. మీరు ఊరికే ఇదైపోయారు" అని.
"అబ్బే! చూశా కదా...గమ్మున ఏమన్నా నీళ్ళెళ్ళినయ్యేమో - పొగాకు పాడవుతుందేమో అని భయమేసి అలా అన్నాలే. సరే...ఇక మీరెళ్ళండి... " అని వాళ్ళని పంపించేశాడు ఆ ఐటీసీ మేనేజర్.
ఈ " కో. బ్రా. " అనే మాటని ఐటీసీ మేనేజరు మా కంపెనీలో అజిత్ గారని చెప్పేసి ఒక మైసూరు నుంచొచ్చిన ఫేక్టరీ మేనేజర్ ఉండేవాడు కదా -.ఆయనా, ఈయనా ఫ్రెండ్స్ - ఆ అజిత్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పాడు.
అంతే కాకుండా గుంటూరు టొబాకో సర్కిల్స్ అన్నిట్లో అంటించాడు - కామేశ్వరావు "కో. బ్రా. " అని చెప్పి.
ఆ అజిత్ గారు కర్ణాటక మొత్తం - బయ్యింగ్‌కి వెళ్తాం కదా మేము - రామనాథపుర, షిమోగా, పెరియపట్న, హున్సూరు - మొత్తం అన్ని చోట్లా కూడా ఆయన - ఈ విషయం అక్కడ చెప్పి "ఒరే! వీడు కోబ్రాగాడురోయ్ వీడు" అని చెప్తుండేవాడు.
ఆయనే లక్ష్మయ్యగారికి కూడా చెప్పాడు.
లక్ష్మయ్య గారు జరిగింది తెలుసుకుని - "ఇంత జరిగిందా" అని నవ్వి - "అందుకే కామేశ్వర్రావుని అక్కడ పెట్టాను. ఇటువంటి తమాషాలు చేస్తాడనే కదా" అని అన్నాట్ట ఆయనా!
ఇప్పటికి నా "కో. బ్రా." పొడుపుకథ విప్పా కదా - ఇక్కడ ఆపుతున్నా! తతిమ్మా విషయాలు మళ్ళీ ఇంకోసారి చెప్తా!
<వచ్చేమాటు తరువాయి కథ>
Thoroughly enjoyed the post Lalitha! So many facets of uncle brought to the fore in just one incident! He is really one of a kind. Huge respect for him. So much to learn! Fan of కోబ్రా గారు.
రిప్లయితొలగించండిThank You! Nanna felt so happy reading your comment, Thanks once again.
తొలగించండి