కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 24 - పల్టీ కొట్టిన కారు; పట్టి నేర్చుకున్న ఆకు...
గోల్డెన్ కంపెనీలో చేరింతర్వాత మా కృష్ణస్వామిగారికి ఫోన్ చేశాను. ఆయనే నా మొదటి గురువు ఎక్సైజులో ఎమ్మెల్ కంపెనీలో. ఆయన తోనే కదా నేను ఛాలెంజ్ చేశాను - ఇదే కంపెనీలో నేను ఐదంకెల జీతం తెచ్చుకుంటానని!
ఆయనకి ఫోన్ చేసి "కృష్ణస్వామిగారూ...నేనిలా గోల్డెన్‌లో చేరానూ, మూడంకెల్లోంచి నాలుగంకెల్లోకి ప్రవేశించానని" చెప్పాను. చెప్తే ఆయన సంతోషించి "ఒరే...నువ్వు అదే గోల్డెన్‌లో కంటిన్యూ అవ్వూ... మాన్యుఫాక్చరర్స్ కంపెనీ అదీ... నువ్వక్కడే కొనసాగితే ఐదంకెలు కాదు ఆరంకెలక్కూడా వెళ్ళిపోతావు" అంజెప్పి ఆశీర్వదించాడాయన.
సరే - ఆ విధంగా గోల్డెన్ టొబాకోస్‌లో ఉద్యోగం చేస్తున్నాను.
ఈ లోపులో ఏమైందంటే 1982 నవంబర్‌లో నాకు బ్రేకు పడే వ్యవహారం వచ్చింది. గోల్డెన్ కంపెనీలో ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
అదెలాగంటే... 83 నవంబర్ దాకా ఈ గ్రేడింగ్ పాయింట్లూ అవీ చూస్తున్నాను.
మార్టూరులో లక్ష్మయ్య గారికి త్రెషింగ్ ప్లాంటూ, ఫేక్టరీ వున్నాయి. ఈ గోల్డెన్ టొబాకో కంపెనీ దాన్ని పాతికేళ్ళకి లీజుకి తీసుకుంది.
మా బాసు ఖేతాన్ గారు గోల్డెన్ కంపెనీలో జనరల్ మేనేజర్ ఆయన నన్ను అంతకు ముందు 1981 లో ఎమ్మెల్ కంపెనీలో ఫేక్టరీ కో-ఆర్డినేటర్‌గా టెస్ట్ చేసున్నాడు కదా! ఆయనేం చేశాడంటే - నన్ను గుంటూరుకి పిలిపించి "కామేశ్వరరావుగారూ! మార్టూరు ఫేక్టరీ కో-ఆర్డినేటర్‌గా మిమ్మల్ని నియమిస్తున్నాం. మీరు వెళ్ళి మార్టూరులో ఉండాలి. అక్కడ కంపెనీకి మనం పాతిక సంవత్సరాలు లీజుకి తీసుకున్నాం." అంజెప్పేసి అన్నాడు.
ఇది ఎప్పుడూ...1983 నవంబర్-డిసెంబర్ ఆ ప్రాంతాల్లో. "ఓకే వెళ్తాను సర్...దాందేవుంది...ఎక్కడన్నా చేయాల్సిందే కదా!" అని నేనన్నాను.
వెంటనే ఆయన "సరే మరి! అయితే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మన గెస్టు హౌసులేవో ఉన్నాయి. మీరు మీ ఫామిలీతో ఆ గెస్ట్ హౌసులో ఉండి జాగ్రత్తగా ఆ ఫేక్టరీ మేనేజ్‌మెంటు చూసుకోండి" అన్నాడు.
అప్పుడు నేనొకటే చెప్పాను ఆయనకి. "చూడండి సర్! నేను పొగాకు కంపెనీల్లో ఉద్యోగం మొదలుపెట్టినప్పట్నించీ పల్లెటూళ్ళలోనే పని చేయడం వల్ల నా పిల్లల్ని ఎప్పుడూ కూడా గవర్నమెంటు స్కూళ్ళలోనే గానీ ఎక్కడా కాన్వెంట్లలో చదివించలేకపోయాను. ఇప్పుడు పెద్దమ్మాయి పదోతరగతి చదువుతోంది. ఇక వచ్చే ఏడాది కాలేజ్‌కి వెళ్తుంది. మిగతా ఇద్దరు పిల్లలు కూడా హైస్కూలుకి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో నాకేదైనా టౌన్ బేస్ ఇవ్వండి. నేను అక్కడుండి మార్టూరులో పని చేస్తాను." అని.
నేనలా అనగానే ఆయన "ఎక్కడ కావాలి టౌన్‌బేస్ నీకు" అనడిగాడు.
దానికి నేను "గుంటూరు మంచి ఎడ్యుకేషన్ సెంటర్. నాకు గుంటూరు టౌన్‌బేస్ ఇస్తే నేను రోజూ మార్టూరుకి అప్-ఎండ్-డౌన్ చేస్తాను. ఏదన్నా అర్జెంటు పని ఉన్నప్పుడు ఒకట్రెండ్రోజులు అక్కడే గెస్టుహౌస్‌లో ఉండిపోతాను. అంచేత నాకు గుంటూరు టౌన్‌బేస్ ఇస్తే నేను జాబ్ చేస్తాను" అని చెప్పాను.
అది విని ఆయన "నో! దానికవకాశం లేదు. నువ్వు మార్టూరు లోనే ఉండాలి. అక్కడ ఫేక్టరీలో మన సొంత ప్యాకింగు. చాలా పని ఉంటుంది. రౌండ్-ది-క్లాక్ అక్కడే ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. పొదున్న ఆరింటి నుంచి రాత్రి పదింటి దాకా నువ్వు అక్కడే ఉండాలి. అంచేత నీకు మార్టూరు లోనే ఇస్తాము. నువ్వక్కడే ఉండాలి" అని ఖచ్చితంగా చెప్పాడు.
ఆయనలా చెప్తున్నప్పుడు - శంకరనారాయణ గారు, వీరయ్యగారు, నరేంద్ర అని ఓ ఫైనాన్స్ మేనేజరు - వీళ్ళందరూ కూడా ఆ బోర్డ్-మీటింగులో ఉన్నారు.
అలా చెప్పాక ఖేతాన్ గారు "ఆలోచించుకుని రేపు పొద్దున్న చెప్పు" అన్నాడు.
గుంటూర్లో గోల్డెన్ గెస్ట్‌హౌస్ ఉండేది. అక్కడకెళ్ళినప్పుడు ఆ గెస్ట్‌హౌస్ లోనే ఉండేవాణ్ణి నేను.
ఈ లోపులో వీరయ్యగారు నా దగ్గరకొచ్చాడు. వచ్చి "కామేశ్వర్రావు గారూ! వచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఓకే అనెయ్యండి. తర్వాత నెమ్మదిగా చూద్దాం." అన్నాడు.
నేనప్పుడు "లేదండీ! ఇప్పుడే తేల్చుకోకపోతే కష్టమిది. నాకేదైనా టౌన్‌బేస్ కావాలి. అదిస్తే మాత్రం ఉంటా. లేకపోతే ఉండను." అని చెప్పేసి చెప్పా.
"సరే! ఆలోచించుకోండి" అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు.
మర్నాడు పొద్దున్న ఖేతాన్ గారి దగ్గరికెళ్ళా.
వెళ్ళి కూర్చుని "నాకు టౌన్‌బేస్ ఇవ్వనంటున్నారు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నానండి ఉద్యోగానికి. నేను వెళ్ళిపోతాను ఇక్కణ్ణించి" అన్నాను.
"వెళ్ళిపోయి ఏం చేస్తావ్" అనడిగాడు ఖేతాన్ గారు.
"నాకు కోనసీమలో వ్యవసాయం ఉంది. పక్కనే అమలాపురంలో నేను చదివిన ఎస్కేబీఆర్ కాలేజ్ ఉంది. పిల్లనక్కడ జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళిపోతానండి. నే ఉండనిక్కడ. నాకిస్తే టౌన్‌బేస్ ఇవ్వండి. ల్యాపోతే నేను చెయ్యను" అని చెప్పా.
దానికి ఆయన "నీ ఇష్టం! ఇంకో నాల్రోజులు టైమిస్తున్నా. ఆలోచించుకుని చెప్పు" అన్నాడు.
"ఇందులో ఇక నేనాలోచించేది ఏవీ లేదు. నా ఎకౌంటు సెటిల్ చేసేయండి. నేనుండను." అని చెప్పి బైటకొచ్చేశాను.
వచ్చేసి గెస్ట్‌హౌస్ నుంచి మా సుబ్బన్నగారికి ఫోన్ చేశాను. చేస్తే ఆయన కూడా "సరే! ఆలోచించుకో. తొందర పడకు." అన్నారు.
ఈలోపులో ఇక్కడ పోలిశెట్టి సోమసుందరం గారి కంపెనీ ఒకటుంది. అందులో హరిగారని చెప్పేసి సోమసుందరం గారి తమ్ముడు ఉండేవాడు. ఆయన కూడా నాకు బాగా తెలుసు. లక్ష్మయ్య గారి కంపెనీతో సమానమైన కంపెనీ పోలిశెట్టి వాళ్ళది. వాళ్ళకి బయ్యర్స్ అవసరమని చెప్పేసి తెలిసింది. అది నాకు సుబ్బన్నగారే చెప్పారు.
మరుసటి రోజు పొద్దున్నే హరి గారి దగ్గరికెళ్ళాను.
వెళ్ళి "సర్! నేను ఇట్లా ఎమ్మెల్‌లో చేసి, అక్కణ్ణించి వెళ్ళి గోల్డెన్‌లో చేసొచ్చాను. నాకు టౌన్‌బేస్ కావాలని అక్కడ మానేస్తున్నాను. మీరేదైనా అవకాశం ఉంటే ఇస్తే మీ దగ్గర జాయిన్ అవుతాను" అంటే పాపం ఆయన తక్షణమే నాకు ఉద్యోగం ఆఫర్ ఇచ్చేశాడు.
నేనప్పుడు "మీరు బయ్యింగుకి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. మైసూరు పంపించినా, వెస్ట్ గోదావరి పంపించినా, ఎక్కడికైనా వెళ్తా. కానీ నేను ఉండడం గుంటూర్లోనే ఉంటా." అని చెప్పా. దానికి సరేనన్నాడాయన.
ఇహ వెంటనే ఖేతాన్ గారి దగ్గరికి వెళ్ళి నా ఎకౌంట్ సెటిల్ చేయించుకుని టంగుటూరు వెళ్ళిపోయాను.
ఈలోపులో అక్కడ కొన్ని మార్పులు జరిగాయి.
లక్ష్మయ్య గారికి గుంటూర్లో ఫేక్టరీ ఒకటుంది. కే ఎస్ సుబ్బయ పిళ్ళై పేరు మీద ఉండేదది. 1973లో లక్ష్మయ్యగారు కొన్నాడది. ఆ ఫేక్టరీ ఆయన అన్నగారు మద్ది సత్యం గారికి లీజుకిచ్చాడు. ఆ లీజ్ పీరియడ్ ఇప్పుడు అయిపోయింది.
అక్కడ మేనేజర్ డిసౌజా అని ఒకాయన ఉండేవాడు. ఆ డిసౌజా వేరే చోట ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోదామనుకుని ఇక్కడ ఫేక్టరీలొ రిజైన్ చేద్దామనుకున్నాడు. ఈలోగా లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. సత్యం గారు ఫేక్టరీని విదిలేస్తున్నాడు.
లక్ష్మయ్యగారూను, ఖేతాన్ గారూను మంచి స్నేహితులు. ఇద్దరూ రోజూ కలుసుకుంటూ ఉండేవారు. ఓ రోజు లక్ష్మయ్యగారు ఖేతాన్ గారి దగ్గర కూర్చున్నప్పుడు "గుంటూరు ఫేక్టరీ మళ్ళీ నా హ్యాండ్-ఓవర్ లోకి వచ్చేస్తోంది. దానికి మంచి ఫేక్టరీ మేనేజర్ కావాలి. ఎవరైనా మంచి కుఱ్ఱాడైతే బావుంటుంది. అది లాంగ్-టైం వుంటుంది కదా!" అన్నాడట.
అది వింటూనే ఖేతాన్ గారు నన్ను రికమెండ్ చేశాడట. "ఎవరో ఎందుకు? మీ దగ్గర పని చేసినవాడే ఉన్నాడు కదా! వాణ్ణే తీసుకోవచ్చు కదా!" అని.
దాంతో లక్ష్మయ్యగారు "ఎవరూ నా దగ్గర పనిచేసినవాళ్ళు?" అనడిగాడట.
"అదే ... కామేశ్వర్రావని మీ దగ్గరే ఇంతకు ముందు చేశాడు. ఈ మధ్య రెండేళ్ళు నా దగ్గర చేశాడు. అతనికేమో టౌన్‌బేస్ కావాలంటున్నాడు. నేనేమో మార్టూరు ఫేక్టరీ మేనేజర్‌గా పంపిద్దామనుకుంటే - 'నేను వెళ్ళను, నా ఎకౌంట్ సెటిల్ చేసేయ'మన్నాడు. గుంటూరు ఇమ్మంటున్నాడు. అంచేత ఆ కుఱ్ఱాణ్ణే తీసుకోవచ్చు కదా! మంచి వర్కర్ అతను." అని చెప్పేసి ఖేతాన్ గారే నన్ను లక్ష్మయ్య గారికి రికమెండ్ చేశాడట.
అది వింటూనే లక్ష్మయ్య గారేమో "అతనొస్తానంటే నాకభ్యంతరం ఏముంటుంది? నాకు తెలుసు అతను. చాలా బాగా వర్క్ చేస్తాడని" అనేసి - అంతటితో ఆగక అప్పాయింటుమెంటు లెటర్ కూడా నా పేరు మీద ఇచ్చేశాడట.
గుంటూరు ఫేక్టరీలో డిసౌజా గారికి ఆ లెటర్ పంపించి "మా ఫేక్టరీ మేనేజర్ కామేశ్వరరావు అని వస్తాడు. ఇన్వెంటరీ అంతా కూడా అతనికి హ్యాండోవర్ చేసేయండి" అని చెప్పాడట.
నాకు ఈ విషయాలన్నీ అసలు తెలీదు.
నేనేమో టంగుటూరు వెళ్ళిపోయాను కదా!
డిసెంబర్ 31 వ తేదీన మా సుబ్బన్నగారికి, ఖేతాన్ గారికీ న్యూ ఇయర్ విషెస్ చెబ్దామనుకుని నేను బయల్దేరి చిలకలూరిపేట వచ్చాను.
1984 జనవరి ఒకటో తారీఖు.
నేను టంగుటూరు నుంచి బయల్దేరి సుబ్బన్న గారికీనూ, ఖేతాన్ గారికీను గ్రీటింగ్స్ చెబ్దామని చిలకలూరిపేట వచ్చాను. వచ్చి బొకేలు అవీ తీసుకుని సుబ్బన్న గారింటికెళ్ళా.
ఆ టైములో సరిగ్గా ఆయన బ్రేక్‌ఫాస్టు చేయబోతున్నాడు.
నన్ను చూసి "రారా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం" అని నన్ను కూడా పిలిచాడక్కడికి. వాళ్ళమ్మగారు వాళ్ళూ కూడా నాకు బాగా తెలుసు. ఆ చనువుతో నేను కూడా ఆట్టే మొహమాటపడకుండా సుబ్బన్న గారితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా.
ఆయనకి చాలా ఇష్టమైనదేంటంటే కట్టు పొంగలి. ఆ రోజు కట్టుపొంగలి చేశార్టింట్లో. ఇద్దరం కూర్చుని బ్రేక్‌ఫాస్టు చేసింతర్వాత ఆయనకి గ్రీటింగ్స్ చెప్పాను.
ఆ తర్వాత ఆయన "ఎప్పుడు జాయిన్ అవుతున్నావు నువ్వు గుంటూరు ఆఫీసులో?" అనడిగాడు.
అది వింటూనే నేను గుంటూరులో చేరబోతున్న పోలిశెట్టి హరి గారి ఆఫీసు గురించి అడుగుతున్నారేమో అనుకుని "పండగెళ్ళాక జాయిన్ అవుతానని ఆయనతో చెప్పొచ్చానండి" అన్నా.
"ఎవరికి చెప్పావు? ఏంటి" అన్నాడు సుబ్బన్న గారు.
"మీరు నాకు గుంటూరు పోస్టింగ్ కావాలీ అంటే పోలిశెట్టి హరిగారి దగ్గరికి వెళ్ళమన్నారు కదా! వెళ్ళాను. ఆయన సరే నన్నాడు. అంచేత అక్కడ జాయిన్ అవుతున్నాను" అన్నా.
నేనలా అనగానే సుబ్బన్న గారు "లేదు లేదు. లక్ష్మయ్యగారు నీకు గుంటూరు ఫేక్టరీ మేనేజర్‌గా పోస్టింగ్ ఇచ్చాడు. మళ్ళీ మన కంపెనీకే వస్తున్నావు నువ్వు. అంచేత మన కంపెనీ ఫేక్టరీలో ఎప్పుడు చేరుతున్నావని అడిగాను. ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నావ్?" అని మళ్ళీ అడిగాడాయన.
నాకది అసలు ఊహించని పరిణామం.
"నాకసలు తెలీదు సర్ ఇది, నాకెవ్వరూ చెప్పలేదు." అన్నాన్నేను.
"సరే! అయితే. ఓ పని చెయ్. నువ్విప్పుడు ఓ బొకే తీసుకుని లక్ష్మయ్య గారింటికి వెళ్ళు. ఆయనకి గ్రీటింగ్స్ చెప్పు. ఆయనే చెప్తాడు నీకు" అని ఓ సలహా ఇచ్చాడు నాకు సుబ్బన్నగారు.
ఆయన చెప్పినట్టే లక్ష్మయ్య గారి దగ్గరికి వెళ్ళాను. లక్ష్మయ్య గారికి పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాక, ఆయన "ఆ! కామేశ్వర్రావ్! ఎప్పుడు జాయిన్ అవుతున్నావ్?" అనడిగాడు.
నేను వెంటనే "సంక్రాంతి పండగ వెళ్ళాక జాయిన్ అవుతాను " అని అనేశాను.
ఆయనకి ఇంకేమీ చెప్పలేదు. అలా అనేసి వచ్చేశాను.
వచ్చి మళ్ళీ సుబ్బన్నగారి దగ్గరికెళ్ళి "సర్!ఇదేం ట్విస్ట్ ఇది? నేనేమో పోలిశెట్టిలో జేరతానని హరి గారికి చెప్పాను. ఈయనేమో ఎప్పుడు జాయిన్ అవుతావంటే ఈయనకేమో పండగెళ్ళాక అని చెప్పాను. ఇప్పుడేమిటి సర్ చేయడం" అన్నా.
సుబ్బన్న గారు "సరే! ఓ పన్జెయ్. నువ్విపుడింక గుంటూరు వెళ్ళకు. వెనక్కి టంగుటూరు వెళ్ళిపో. మంచిరోజు చూసుకుని బయల్దేరి చిలకలూరిపేట రా. మనిద్దరం కలిసి గుంటూరెళ్దాం. నిన్నేమో డిసౌజాకి పరిచయం చేస్తా. అక్కడ ఫేక్టరీలో ఛార్జ్ తీసుకో. తీసుకున్నాక ఇద్దరం కలిసి హరి గారి దగ్గరికెళ్దాం. ఆయన తోటి నేను కూడా మాట్లాడతాను. ఆయన కూడా ఏమనడులే" అని చెప్పేసి అన్నాడు.
సరే అని - సుబ్బన్నగారు చెప్పినట్టే నేను టంగుటూరు వచ్చేశాను.
వచ్చేసి మళ్ళీ మంచిరోజు చూసుకుని పదో తారీఖు లోపులో - ఐదారు తారీఖుల్లో అనుకుంటా - తేదీ సరిగ్గా గుర్తు లేదు నాకు - ఆ టైములో మళ్ళీ చిలకలూరిపేట వెళ్ళాను. అక్కణ్ణించి సుబ్బన్నగారూ, నేనూ కార్లో గుంటూరు వెళ్ళాం.
గుంటూరెళ్ళింతర్వాత ఫేక్టరీకి వెళ్ళాం. అక్కడ అప్పటికి మేనేజరుగా డిసౌజా గారున్నాడక్కడ. ఆయనకి నన్ను పరిచయం చేశాడు సుబ్బన్న గారు. "వీడే కామేశ్వర్రావ్. మా కొత్త ఫేక్టరీ మేనేజరు" అని చెప్పాడు.
అప్పుడు ఆ డిసౌజా కూడా - ఆయనేదో వేరే చోట ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు - "నేను తొందరగా హేండోవర్ చేసేస్తాను. నేను కూడా రిలీవ్ అయి వెళ్ళిపోవాలి" అంటే నేను ఆయనతో "వుంటానండి ఓ రెండ్రోజులిక్కడ. ఛార్జ్ తీసుకునే నేను వెనక్కి వెళ్తాను" అంజెప్పేసి అన్నాను .
అక్కడికదయ్యాక సుబ్బన్నగారు, నేను కలిసి పోలిశెట్టి హరి గారి దగ్గరికెళ్ళాం.
నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే అంతకు ముందు అసలేమీ అడక్కుండా నాకు ఉద్యోగం ఇచ్చేశాడు. అటువంటిది ఆయన దగ్గర చేరట్లేదని చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డాను.
<వచ్చేమాటు తరువాయి కథ>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి