ఓనాటి పాట...
మెలమెల్లగ వీచెనదె
మువ్వ మొరసినటుల మెరసెనదె
మెలపైన మోత అదె
మైమఱపు తీర్చి మేలుకౌలిపెనదె
ఆనాటి పాట...
అల్లనల్లన తేలివచ్చెనదె
అలలు తాకినటుల సోకెనదె
అలుపెఱుగని అలికిడి అదె
అలుపారగ నిద్రబుచ్చెనదె
నానాటి పాట...
చలచల్లగ చెవుల మీటెనదె
చవులూరునటుల ఉసురు తాకెనదె
చెలిమి చేయ చేరవచ్చెనదె
ౘదలచూలి పాట అదె
*******
*******
*******
*******
అనుకోకుండా ఈ మధ్యనే కొన్ని వెలలేని ఆకాశవాణి (AIR - All India Radio) పాటలు విన్నాను.
అందులో కొన్ని చిన్నప్పుడు విన్నవి. కొన్ని నా చిన్నప్పటికన్నా ముందువి. కొన్నేమో భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన ఆర్తిపూరిత భక్తిగీతాలు. ఇంకొన్నేమో సలలితరాగాల లలితగీతాలు.
వాటినెవరో పుణ్యాత్ములు సేకరించి అందరికీ అందుబాటులో యూట్యూబులో పెట్టారు.
పాటేమో తెగ అల్లరిది. కాలెక్కడా నిలవనిది.
గాలంటూ పుట్టాక వీచక ఎలా ఉండలేదో - పాట కూడా స్వరం కట్టి పదం పట్టాక - చెవుల సోకాక - పెదవుల మీద కదం తొక్కకుండా ఉండలేదు.
అదిగో అలా .. ఒకప్పటి ఆకాశవాణి పాట ఒదిగుండక నన్ను చేరింది.
ఒదిగుండలేని ఆ పాటని ఒడిసి పట్టుకున్నా!
ఒడిసిపట్టుకున్న పాట చుట్టూ గాలికబుర్లల్లుకున్నా!
అల్లుకున్న గాలికబుర్లకి "ౘదలచూలి పాట" అని పేరెట్టుకున్నా.
*******
*******
మొట్టమొదటగా దొరికిన ఆకాశవాణి భక్తిగీతం ఎలాటిదనుకున్నారూ? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన రామగానామృతం.
ఆ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=h2QbPI0P2Kc
నేను విన్న ప్రతీ పాటలో నాకు నచ్చే మాటలు కొన్ని పట్టుకుని అట్టేపెట్టుకుంటా.
అదెందుకంటే విన్నపాటని మళ్లీమళ్లీ వినడానికి - నన్ను నేను పాట కేసి మళ్లించుకోవడానికి - నాకు నేనే ఇచ్చుకునే మళ్లు-లంచమది.
ఈ దేవులపల్లివారి సాహిత్యంలో నాకు నచ్చినవేంటో చెబుతాను.
1. "రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల" అంటూ చెప్పీ చెప్పనట్టున్న అహల్యవేదన.
2. "సేతువై భవజలధితారణహేతువైతే" అన్న వాక్యం వినగానే చిన్నప్పుడెప్పుడో విన్న ఓ పాట "సంసార జలధి దాటించగలది - రెండక్షరముల నామమే... జై! శ్రీరామా చంద్రుని నామమే" అన్నది గుర్తుకు రావడం.
(సంసార జలధి పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=B-IxhABKpEA)
3. పాట పాడిన వారెవరో కానీ ఆ గొంతుల్లో "ఏది ఏమైనా కానీ రామచరణమే మాకు శరణం" అంటూ వినిపించిన నమ్మకం.
ఒక విశేషం ఏంటంటే దేవులపల్లి వారు రాసిన పాటలో ఉన్న ఒక చరణం - ఆకాశవాణివారు పాడిన పాటలో లేదు. అది ఈ కింద రాసి పెట్టుకున్నాను:
ఎదురు చూచే పేదకై - తానెదురు వచ్చే - రామచరణం
ముదిసి వాడిన - బ్రతుకు కాన్కల - మురిసి మెచ్చే - రామచరణం
ఆదరించే - రామచరణం
సేదదీర్చే - రామచరణం
మాకు చాలును - రామచరణం నుండి రాలిన - మధుకణం
రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
మాకు చాలును మౌనిమస్తకభూషణం - శ్రీరామచరణం
మాకు చాలును మౌనిమస్తకభూషణం - శ్రీరామచరణం
రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం...
రాగయై - ఈ బ్రతుకు చెడి - రాయైన వేళల - రామచరణం
మూగయై - పెంధూళి పడి - మ్రోడైన వేళల - రామచరణం
రాగయై - ఈ బ్రతుకు చెడి - రాయైన వేళల - రామచరణం
మూగయై - పెంధూళి పడి - మ్రోడైన వేళల - రామచరణం
ప్రాణ మీయగ - రామచరణం
పటిమ నీయగ - రామచరణం
మాకు చాలును - జరయు మరణం రాకపోతే - రామచరణం
మాకు చాలును - జరయు మరణం రాకపోతే - రామచరణం
రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం...
కోతియై - ఈ మనసు నిలకడ కోలుపోతే - రామచరణం
సేతువై - భవజలధితారణహేతువైతే - రామచరణం
కోతియై - ఈ మనసు నిలకడ కోలుపోతే - రామచరణం
సేతువై - భవజలధితారణహేతువైతే - రామచరణం
ఏడుగడ - శ్రీరామచరణం
తోడుపడ - శ్రీరామచరణం
మాకు చాలును ముక్తిసౌధ-కారణం - శ్రీరామచరణం
మాకు చాలును ముక్తిసౌధ-కారణం - శ్రీరామచరణం
రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం...
నావలో - తానుండి - మము - నట్టేట నడిపే - రామచరణం
త్రోవలో - కారడవిలో - తొత్తోడ నడిపే - రామచరణం
నావలో - తానుండి - మము - నట్టేట నడిపే - రామచరణం
త్రోవలో - కారడవిలో - తొత్తోడ నడిపే - రామచరణం
నావ యయితే - రామచరణం
త్రోవ యయితే - రామచరణం
మాకు చాలును వికుంఠమందిరతోరణం - శ్రీరామచరణం
మాకు చాలును వికుంఠమందిరతోరణం - శ్రీరామచరణం
రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం...
దారువునకును - రాజ్యధూర్వహ దర్పమిచ్చే - రామచరణం
భీరువునకును - అరిని దీర్చే - వీరమిచ్చే - రామచరణం
దారువునకును - రాజ్యధూర్వహ దర్పమిచ్చే - రామచరణం
భీరువునకును - అరిని దీర్చే - వీరమిచ్చే - రామచరణం
ప్రభుతనిచ్చే - రామచరణం
అభయమిచ్చే - రామ చరణం
మాకు చాలు మహేంద్రవైభవ-కారణం - శ్రీరామచరణం
మాకు చాలు మహేంద్రవైభవ-కారణం - శ్రీరామచరణం
రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం...
*******
*******
ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే...
తానంటూ ఒకసారి పుట్టిన తర్వాత -
ఉన్న చోట ఉండదు పాట.
ఊరికే ఉండదు పాట.
మోగకుండా ఉండదు పాట.
మదిని తాకకుండా ఉండదు పాట.
అది పాట స్వర-స్వభావం.
*******
*******
ఎప్పుడూ విన్న పాట వినకుండా ఉండాలనుకుంటూ -
ఒక్కోసారి విన్నదే వింటూ ఉందామనుకుంటూ
ఎప్పటిదో గుర్తొచ్చిన పాత పాటని వెతుక్కుంటూ
అప్పటివరకు వినని కొత్త పాటనేదో కనుక్కుంటూ
విన్నదే వింటూ - విసుగు లేక
అన్నదే అంటూ - ఉడుగడుగక
పాట-బాటల పోక ఉండక
ఊరికే ఉండలేను నేను.
అది నా స్వ-స్వభావం.
*******
*******
నా పాటల-బాటల నాతో నడవాలనుకునే వారుంటారని అనుకుంటూ...
~పాటల భైరవి
చాలా చాలా చాలా బాగుంది ఈ పాట. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఈ పాట వినలేదు. చాలా హృద్ర్యంగా మనస్సును పవిత్రంగా చేస్తోంది. మీకు చాలా కృతజ్ఞతలు.మీరు పెట్టిన లింక్ తెరిచి చూస్తే చాలా ఆకాశవాణి వారి అధ్బుతమైన భక్తిరంజని పాటలు కనిపించాయి. అవి కూడా వింటాను.
రిప్లయితొలగించండిఈ పాట నీకు నచ్చినందుకు సంతోషం, పద్మజా! నా బ్లాగ్ చదివినందుకు థాంక్స్!
తొలగించండిరాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల" అంటూ చెప్పీ చెప్పనట్టున్న అహల్యవేదన.
రిప్లయితొలగించండి2. "సేతువై భవజలధితారణహేతువైతే" అన్న వాక్యం వినగానే చిన్నప్పుడెప్పుడో విన్న ఓ పాట "సంసార జలధి దాటించగలది - రెండక్షరముల నామమే... జై! శ్రీరామా చంద్రుని నామమే" అన్నది గుర్తుకు రావడం.
*****
రాసిన వారికి ఎంతో గొప్ప మెచ్చుకోలు ఇది.
అలాగే,
పాట పాడిన వారెవరో కానీ ఆ గొంతుల్లో "ఏది ఏమైనా కానీ రామచరణమే మాకు శరణం" అంటూ వినిపించిన నమ్మకం
ఇంతకన్నా గొప్ప ప్రశంస ఏముంటుంది పాడిన వారికి?
ఈ పాట నాకు దొరకడం నా అదృష్టం. పాట రాసినవారికి, పాడినవారికి నా మెచ్చుకోళ్ళు ఏదో విలువని ఆపాదిస్తాయనుకునే దుస్సాహసం చేయబోను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండినా పాటల-బాటల నాతో నడవాలనుకునే వారుంటారని అనుకుంటూ...
అన్నీ వెతికి, ఏరి, మంచి దినుసులన్నీ తెచ్చి, రుచికరమైన విందు సిద్ధం చేసి, "ఇలా తింటే ఇంకా బాగుంటంది" అని చూపిస్తే తినడానికి అదృష్టం ఉండాలి నాకున్నట్టు!!
Big thank you!
>>>పాట పాడిన వారెవరో కానీ ఆ గొంతుల్లో "ఏది ఏమైనా కానీ రామచరణమే మాకు శరణం" అంటూ వినిపించిన నమ్మకం>>>
తొలగించండిశ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు
నా పాటల కబుర్లు మీకు నచ్చుతున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్ యూ!
తొలగించండిహలో అండీ నీహారికా! నా బ్లాగ్ చదివినందుకు థాంక్స్!
తొలగించండిఈ పాట పాడినవారు కె. శేషుబాయి గారు మరియు ఇందిర గారూనట. శేషుబాయి గారి అమ్మాయి తాడూరి అనూరాధ గారని ఒకావిడ Youtube లో వ్యాఖ్య రాశారు.