మూణ్ణెల్ల కిందట ఓ పాట విన్నా...
వెలుతురు తింటది ఆకు...
ఆకును తింటది మేక...
మేకని తింటది పులీ...
ఇది కదరా ఆకలీ!
అ అ అ... అ... అ అ అ...
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటది కాళి...
ఇది మహా ఆకలి ...
అ అ అ... అ... అ అ అ...
వింటానే "బలేగుండ్లా ఈ పాట? ఎవుర్రాసినారబ్బా?" అని ఎంతనుకొండినానో!
"వెలుతురు తింటది ఆకు" అంటా చిన్నప్పుడు ఎన్నెస్సులో చదివిన పాఠాన్ని బలే వాడుకునేసినారు ఈ పాటలో అనుకొనిన్న.
*******
*******
అప్పుడే తెల్సింది - ఆ పాట "పుష్ప" అనే సిన్మాలోనదని.
"పుష్ప" - ఇదేం పేరబ్బా అనుకొనిన్న.
ఆ ఎంబట్నే ఇంకో పాట గూడా చూసుండా.
ఒక్కాలుకున్న చెప్పు ఇడిచేసి, ఇంకో కాలుని ఈడుచ్చా ఎడమ గూడ రొంత పైకెత్తి "చూపే బంగారమాయెనే స్రీవల్లీ, మాటే మాణిక్యమాయెనే" అని పాడుకుంటా ఓ గెడ్డం పెంచుకున్న అబ్బియ్యని జూడగానే నాకేమనిపిచ్చుండాదంటే "ఏందబ్బా! ఈ సుకుమారు గానీ తన కతే సినిమాగా తీచ్చుండాడా ఏంది?" అనుకునేసినా.
అప్పుడే ఈ సినిమా చూసి తీరాలనుకునుండ్లా?!
డిసెంబరు పదియేడ్న "పుష్ప" సిన్మా హాళ్ళకి వస్తాదని తెలీగానే బద్రికి చెప్పెట్నా - ఎట్టాగైనా పోవాల్సిందే అని.
ఆయన గూడా నా గలబా ఇన్లేక "అట్నేలే" ఒప్పుకునేసె.
ఆ సుక్కురారం, సనారం టికెట్లు దొరికేదుండ్లా. ఇగ హాల్లో "పుష్ప" సిన్మా జూళ్ళేననుకొని గమ్మునున్నా.
బద్రి మరొక్క తూరి మా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇంకేడైనా టిక్కెట్లు చిక్కుతాయా అని జూస్తే మిడ్ రివర్స్ మాల్లో దొరికినాయబ్బా ఓ రెండు సీట్లు.
అది గూడా మంగలారం మావిటాల ఎన్మిదీ ముక్కాలు గంటాటకి.
అయితే ఏంబోయే...నాకెట్టాగూ సెలవుండ్లా?!
బద్రీ, నేనూ బెరీన అన్నాలు దినేసి పిలకాయల్ని తలుపేసుకోమని జెప్పి అట్నే బోయినాం.
*******
*******
ఇగ సిన్మా బిగినైనాక జూడబ్బా!
మొదట్నించీ చివర్దాకా తెర నిండుగా "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా?!.. ఫైరు... తగ్గేదేలా" అంటా ఆ పుష్పరాజు నిండుకునేసినాడు. పుష్పని ఇప్పటిప్పట్లో మర్చిపోయేదేలా!
ఆ గెడ్డమబ్బియ్యతో చేరుకొని ఉండిన కేశవ - ఇంకా మంగలం సీను, కొండారెడ్డి, ఆయన తమ్ముళ్లు జక్కారెడ్డి, జాలిరెడ్డి... ఈల్లందరూ గాక పుష్ప ఎంటబడి సాదించుకునిన్న పాలమ్మాయి స్రీవల్లి - ఈల్లందరూ వచ్చా పోతా వుండారు.
ఈల్లందర్నీ చూసేదానికి బలే కుశాలగా అనిపిచ్చుండ్లా!
అందుట్లోకీ "ఊఁ అంటావా..." అంటూ ఊగిపోయిన సమంత డాన్సు పాట అదిరిపోయుండ్లా?! ఆ యమ్మి ఆడేటప్పుడు బలే నైసుగా అనిపించినాది. కాదని ఎవర్నన్నా అనమనబ్బా!
అంతా బావుండాది గానీ - ఆ "చూపే బంగారమాయెనే స్రీవల్లీ" పాట మాత్రం పుష్పరాజు స్రీవల్లిని చూసిన ఎంబట్నే కాకుండా ఓ రెండు తూర్లయినా ఆ అమ్మి వెంటెంట తిరిగింతర్వాత పాడినట్లు చూపిచ్చుంటే ఇంకా అద్దిరిపోయేదుండ్లా!
ఔనబ్బా! సిన్మా మొగట్లో ఆ యబ్బిని పట్టుకున్న తమిల్నాడు పోలీసులు "నువ్వు తమిళోడివా" అంటే వాల్లతో పుష్ప "నేను పక్కా తెలుగు" అనుండె గదా!
చిత్తూరోళ్ళు "పక్కా"అంటారేందబ్బా?!
"అచ్చంగా తెలుగోణ్ణి" అని పుష్ప అనాల్సుండ్లా!
ఇంటి పేరు లేదని సిన్మాలో పుష్ప తెగ ఇదై పోయుండాడు గానీ ఈ సిన్మాతో ఇంటింటా చేరి పోయుండ్లా?
సిన్మా చివర్లో ఆ పోలీసు షెకావత్తుని చెడ్డీలో జూసి మొరిగిన పోలీసు కుక్క - అదేం పోలీసు కుక్కబ్బా! అనిపించినాది గానీ అట్టాటి చిన్న ఇసయం ఈ ఒక్క తూరికి ఇడిసి పెట్టెయ్యచ్చబ్బా!
ఇగ ఆ చంద్రబోసుకీ, దేవిస్రీప్రసాదుకీ అడవేమైనా పూనుండాదేమోనబ్బా...
ఆ పాటల్లో మాటలేందీ? ఆ దరువులేందీ? ఎక్కడా తగ్గేదేలా!
సిన్మాని ఓ కళగా, మంది కన్న కలగా చూసెటోల్లకి ఈ సిన్మా నచ్చుద్దబ్బా!
పుష్ప అంటే ఫిల్ము అనుకుంటిరా ...? ఫీస్టు !!!
*******
*******
ఈ యమ్మికి అడవీ, ఆకాశం గూడ పునినయబ్బో!!
రిప్లయితొలగించండిఅంతే! అంతే!
తొలగించండిఅబ్బ! ఎంత బావుందో.రాగాలుగాయి రాగాలు తీస్తూ ఒక్కో మాటా పేరుస్తూ చెరువు గట్టు మీద కూర్చుని ముచ్చట్లు చెప్తున్నట్టు..
రిప్లయితొలగించండిబావుందన్న మీకు బోల్డన్ని థాంక్స్! :)
తొలగించండిఈ తెలుగు అమెరికా అమ్మాయికి పుష్ప పూనింది.. తగ్గేదేలే..
రిప్లయితొలగించండిఅంతే మరి! తగ్గేదేలే...!!
తొలగించండి