26, జనవరి 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 19 - కాకినాడ రేవులో ఓడెక్కి ... తుఫాను అలలలో ఊగామే!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 18 - జంగారెడ్డిగూడెంలో జాలీగా...

1979 ఏప్రిల్, మే ప్రాంతాల్లో మా కంపెనీకి చైనా ఎక్స్‌పోర్ట్స్ వచ్చాయి. ఆ ఆర్డర్ దాదాపు మూడువేల టన్నులో ఎంతో. అవన్నీ కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్‌పోర్ట్. అప్పుడేం చేశారంటే కాకినాడ పోర్టులో నాలుగు గోడౌన్లు - ఒక్కోటి 4000 చదరపు అడుగులు - అంటే మొత్తం పదహారువేల అడుగులు - వాటిని అద్దెకు తీసుకుని నన్ను కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు. కాకినాడ వెళ్ళి ఆ ఎక్స్‌పోర్ట్స్ చూడమని.

అప్పుడే మా పెద్దమ్మాయి లల్లీని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరో తరగతిలో చేర్చాము. మళ్ళీ అంతట్లోనే ఈ కాకినాడ ట్రాన్స్ఫర్. మరి ఏ స్కూల్లో సీట్ దొరుకుతుందో చూడాలి. ఆ స్కూలుకి దగ్గరగా ఇల్లు దొరకాలి. ఇవన్నీ కుదిరితేనే కానీ మేమందరం కలిసి కాకినాడ వెళ్ళలేము. అందుకే నేనెళ్ళి మా సర్కిల్ మేనేజర్ రాజగోపాలుకి "ముందు నేనెళ్ళి ఇల్లూ, స్కూళ్ళూ చూసుకుని వస్తాను. ఆ తర్వాత ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాను" అని చెప్పాను. ఆయన సరేనన్నాక నేనొక్కణ్ణీ బయల్దేరి కాకినాడ వెళ్ళాను.

కాకినాడలో తిరుమల ఎక్స్‌పోర్ట్స్ అని చెప్పేసి  ఉండేది - వాళ్ళు C & F ఏజెంట్స్. వాళ్ళ ద్వారానే మా చైనా ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారాలన్నీ జరిగేవి. అందులో కేలప్పన్ అని ఒకాయన, ఆయన కొడుకు రాజీవ్ - కేరళ వాళ్ళు వుండేవాళ్ళు. కేలప్పన్ మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళు  బియ్యం, ఊక (Rice Bran), మొక్కజొన్న లాంటివన్నీ ఎగుమతి చేస్తూ వుండేవాళ్ళు.

పొగాకుకి ప్రత్యేకించి ఒక విభాగం పెట్టి D S శాస్త్రి అని ఏలేశ్వరంలో చేసిన D S శాస్త్రికి అన్నగారీయన - దారా శాస్త్రి. ఆయన టొబాకోలో పని చేశాడు చిలకలూరిపేటలో MSN కంపెనీలో.

మద్ది లక్ష్మయ్యగారి అన్నగారుండేవాడు మద్ది సత్యనారాయణగారని. ఆయన కంపెనీలో ఈ దారా శాస్త్రి జనరల్ మేనేజరుగా పని చేశాడు. కాకినాడలో భానుగుడి సెంటర్ - పద్మాలయా థియేటర్ దగ్గర ఆయన ఇల్లుండేది. ఆయన సత్యనారాయణగారి కంపెనీలో పని మానేసి, కాకినాడకొచ్చి ఈ కేలప్పన్ కంపెనీలో టొబాకో డివిజన్‌లో చేరాడు. కేలప్పన్ కూడా టొబాకో ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ వస్తాయని ఈ దారా శాస్త్రిగారిని మేనేజరుగా పెట్టుకున్నాడు.

సరిగ్గా అప్పుడే మద్ది లక్ష్మయ్యగారి చైనా ఎగుమతులు, పోలిశెట్టి సోమసుందరం గారివి, బొమ్మిడాల వాళ్ళవి రష్యా ఎగుమతులు అన్నీ కూడా తిరుమల ఎక్స్‌పోర్ట్స్‌కే వచ్చాయి. అవన్నీ దారా శాస్త్రిగారి ద్వారానే జరిగేవి.

దారా శాస్త్రిగారి దగ్గర శ్రీనివాసరావు గారని ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉండేవాడు. మూర్తి అని ఒక క్లార్కు ఉండేవాడు. ఆ టైములో నన్నూ అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు.

అక్కడ మద్ది లక్ష్మయ్యగారి టొబాకో ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారాలు నన్ను చూడమన్నారు. సరే! అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. చైనా ఎక్స్‌పోర్ట్స్ నడుస్తున్నాయి. బానే చేయిస్తున్నాము. ఉద్యోగంలో కుదురుకున్నాను. మరి ఇప్పుడు ఇల్లు అద్దెకు తీసుకోవాలి కదా!

జగన్నాథపురంలో శ్రీనివాసరావుగారి ఇంటి దగ్గరే గారపాటి సుబ్బారావు గారని MSN చారిటీస్ స్కూల్లో పని చేసే ఓ తెలుగు లెక్చరర్ ఉండేవారు. ఆయన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా వుంది అంటే వెళ్లి చూశాను. ముందు కటకటాలు, మధ్యలో గది, వంటిల్లు, వెనకాల చిన్న పెరడు - ఇల్లు బావుంది. ఆ ఇల్లు అద్దెకి తీసేసుకున్నాను. శ్రీనివాసరావుగారి భార్య కూడా MSN చారిటీస్ లోనే లెక్చరరుగా పని చేసేవారు. ఆవిడని మేము మేడం గారని పిలిచేవాళ్ళం.


ఆ ఇల్లు తీసుకున్నాక జంగారెడ్డి గూడెం వచ్చి, మళ్ళీ అప్పటికప్పుడు సామానంతా సర్దుకుని జంగారెడ్డిగూడెం నుంచి కాకినాడ వెళ్ళాము. లల్లీని, కుట్టీని కూడా MSN చారిటీస్ స్కూల్లో చేర్చాము.

గారపాటి సుబ్బారావు గారికి ఇద్దరు పిల్లలు - బాల, బాబి.

బాల మా లల్లీ కన్నా ఏడాది పెద్దది. బాబి మా కుట్టీ తోటివాడే. వాళ్ళతో పాటు సుబ్బారావుగారి తల్లి కూడా వుండేవాళ్ళు. ఆవిణ్ణి అందరమూ మామ్మగారనే పిలిచేవాళ్ళం.

సుబ్బారావుగారు బాబి చదువుకునే పాఠాలన్నీ ఆయన గొంతుతో ఓ కేసెట్లో రికార్డ్ చేసి రోజూ పొద్దున్నే బడికి వెళ్ళే ముందు బాబిని కూర్చోపెట్టి టేప్ రికార్డర్లో కేసెట్ పెట్టి వాడితో పాటు - పక్క వాటాలో వున్న మా అందరికీ కూడా వినిపించేవారు.

మొదట్లో ఆఫీసుకి బులెట్ మీద వెళ్ళేవాణ్ణి. పోనుపోనూ దానిమీద ఖర్చు పెరిగి అదో ఐరావతంలా తయారయింది. అందుకని దాన్ని జంగారెడ్డిగూడెం పంపించేసి రోజూ ఆఫీసుకి రిక్షాలో వెళ్ళి వచ్చేవాణ్ణి.

ఒకసారి ఏమైందంటే చైనాకి పొగాకు పంపించడానికి Fir wood cases లో ప్యాక్ చేశాము. ఆ పెట్టెలన్నీ స్టీమరుకి వెళ్ళిపోయాయి. ఇంతలో ఏమైందంటే కెప్టెన్ నుంచి కబురొచ్చింది.

ఏమనీ...?

"Hatches లో కేసులు అన్నీ చెదలు పట్టాయి. మీరొచ్చి రిపేరు చేసుకుంటారా, లేకపోతే అన్నీ సముద్రంలో పారేయమంటారా?" అని.

అది చూడగానే వెంటనే నేను, శ్రీనివాసరావుగారు, ఆ మూర్తి  అనేవాడు , విష్ణు అనే ముఠామేస్త్రి ఉండేవాడు - అతను, ఓ పదిమంది ముఠావాళ్ళు, ఓ పదిమంది కార్పెంటర్సు - ఇలా మేమందరం కలిసి ఓ ఇంజిన్ పడవలో ఓడ దగ్గరికి వెళ్ళడానికి బయల్దేరాం. అలా ఎందుకంటే కాకినాడ పోర్టులో షిప్ లోడింగుకి వెళ్ళాలంటే ఆరు మైళ్ళు సముద్రంలోకి వెళ్ళాలి. డైరెక్టు హార్బరుకి రాదది.

సరే! పడవలో మేమందరం పొద్దున్నే బయల్దేరాం రెండు పడవల్లో. ఆ పడవలో వెళ్ళడం ఎలాగంటే వెళ్ళేటప్పుడు ఇంజిన్ మీద తీసుకెళ్తాడు. వచ్చేటప్పుడు ఇంజిన్ ఆపేసి తెరచాప గాలివాలుకి తీసుకొస్తాడు ఆయిల్ ఆదా చేయడం కోసం. మొత్తానికి ఓడని చేరాం. పైకి వెళ్ళి ఆ hatches లో లోపలికెళ్ళిపోయాం. కార్పెంటర్లు పని మొదలుపెట్టేశారు.

అక్కడ మాకు భోజనము అదీ కెప్టెనే ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం అయింది.

మాకు తెలీలేదు కానీ అప్పటికి తుఫాను వస్తోందని అనౌన్స్ చేశారు. మాకా విషయం తెలీదు. Hatches లో ఉండిపోయాం. మధ్యాహ్నానికి First Flag ఎగరేశారట. సముద్రంలో అలల ఉధృతాన్ని బట్టి ఎగరేస్తారు కాబట్టి దాన్ని surf flag అంటారు. తుఫాను వచ్చినప్పుడు మూడు ఫ్లాగులు ఎగరేస్తారు. మొదటిది వచ్చినప్పుడు మాకు తెలీలేదు. ఇంతలో రెండోది కూడా ఎగరేశారు. అప్పుడు కెప్టెను మా దగ్గరికొచ్చి "మీరు వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కణ్ణించి. Second surf flag కూడా ఎగరేశారు. ఇంకా ఎక్కువ కాకుండానే మీరు ఒడ్డుకి వెళ్లిపోవడం మంచిది." అనగానే మేము కూడా బయల్దేరేశాం. ఈలోపులో మా పనులు కూడా అయిపోయాయి లోపల.

బయల్దేరామే కానీ షిప్పులోంచి పడవలోకి దిగలేకపోయాం. విపరీతమైన గాలి సముద్రంలో. మేము దిగుదామని చూస్తే ఆ నిచ్చెన అటూ ఇటూ ఓ....  ఊగిపోతోంది.

అప్పుడు కెప్టెను ఏం చేశాడంటే - పడవల్లోంచి కేసులు షిప్పులోకి చేర్చే క్రేన్స్ ఉంటాయి. మమ్మల్ని ఆ క్రేన్సులో కూర్చోబెట్టి పడవల్లోకి దించాడు. అందరం పడవుల్లోకి ఎక్కాం. మరి పడవవాళ్ళు ఇంజిన్లు ఆపేశారు కదా. తెరచాపలు ఎత్తారు.

మేమందరం రెండు పడవల్లో ఎక్కి వెళ్తుంటే.... అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుంటూ పడవలు వెళ్తుంటే అసలెలా ఉందంటే ... చుట్టూ ఎటు చూసినా నీళ్ళు. పైన ఆకాశం నల్లగా... ఆ నీడ పడి కింద నీళ్ళు ఇంకా నల్లగా ...పెద్ద పెద్ద అలలు... గాలి... భయంకరంగా వుంది. ఆ పెద్ద అలల్లోంచి సముద్రపు నీళ్లు మమ్మల్ని ఛెళ్ళుఛెళ్ళున కొట్టేస్తున్నాయి.

ఇంతలో శ్రీనివాసరావుగారికి ఆ పడవ కుదుపు, అలల తాకిడికి తట్టుకోలేక వాంతులు మొదలయ్యాయి.

మూర్తి ఏమో తెరచాప కొయ్య గట్టిగా పట్టుకుని కావలించుకుని కూర్చుని ఒకటే ఏడుపు ... "మా అమ్మకి నేనొక్కణ్ణే కొడుకుని బాబోయ్! ఇప్పుడు ఒడ్డుకెలా చేరుతాంరో దేవుడోయ్...!" అంటూ.

ముఠావాళ్ళు కొంచెం గట్టిగానే వున్నారు. లోపల్లోపల భయంగా వున్నా - అది బయటపడితే అందరూ ఇంకా బెంబేలెత్తిపోతారని - నేను ముఠావాళ్ళతో కలిసి ఈ భయపడ్తున్న వాళ్ళందరిని సముదాయిస్తూ "ఏం ఫర్వాలేదు. ఒడ్డుకి చేరిపోతాం. ఒకవేళ మన పడవ మునిగిపోయినా ఏ హెలికాఫ్టరో వచ్చి మనల్ని తీసుకెళ్తుంది. ఇబ్బంది లేదు. ఆల్రెడీ పోర్టుకి కబురెళ్ళింది మనం ఇలా పడవల్లో వస్తున్నామని" అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడి ధైర్యం చెప్తూ ...మొత్తానికి ఒడ్డుకి చేరాం.

ఇంక అదే ఆఖరు... ఆ తర్వాత ఇంకెప్పుడూ సముద్రం లోపలికెళ్ళలేదు - వెళ్ళే ఆలోచన కూడా చెయ్యలేదు.

<వచ్చేమాటు తరువాయి కథ>

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి