జీవితమంటేనే...
మనుషుల కలయికలా...
మనసుల కూడికలా..
ఒక్కొక్కరితో ఒక్కోలా...
కాదనాలనుకున్నా-
కట్టి పడేసే ఏదో బంధమో...
కట్టి పడేసే ఏదో బంధమో...
కావాలని చెయ్యకపోయినా -
వీడిపోనియ్యని కమ్మని కయ్యమో...
వీడిపోనియ్యని కమ్మని కయ్యమో...
తలచుకొనే నెపమేదో ఉంటుందలా...
ఒక్కొక్కరితో ఒక్కోలా ...
కమ్మని కాలాన -
కలిసివచ్చిన అనుకోని అనుబంధమో...
కలిసివచ్చిన అనుకోని అనుబంధమో...
కలిమిలా ముసిరి -
కుదురుకున్న విడలేని నెయ్యమో...
కుదురుకున్న విడలేని నెయ్యమో...
నిలుపుకునే బలమేదో వస్తుందలా...
ఒక్కొక్కరితో ఒక్కోలా ...
21వ శతాబ్దంలో రెండో దశాబ్దపు చివరి ఏడాది 2019.
ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే మా వరకు మాకు ఎన్నో మొదళ్ళు వున్న ఏడు ఇది.
మొదటిసారిగా...
అన్నజింక ఉద్యోగంలో చేరడం...
బుజ్జిజింక ఒక్కడూ ఫ్లైట్ ఎక్కి సెలవులకి అన్న దగ్గరికెళ్ళడం...
మొదటిసారిగా...
పిల్లల్ని వదిలి మేమిద్దరం ఇంటికి, ఇండియాకి పెళ్ళికి వెళ్ళడం...
కటార్ వారి ఎకానమీని దాటి ఎక్కానమీ తరగతిలో వెళ్ళడం...
మొదటిసారిగా...
నాకు వంగూరి ఫౌండేషన్ వారి నుంచి అతిథిగా, వక్తగా రమ్మని ఆహ్వానం రావడం...
నేనొక్కదాన్నీ ఆర్లాండో వెళ్ళడం...
అలా వెళ్ళిన నన్ను కలవడానికే గంట ప్రయాణం చేసి నా ఆఫీస్ కొలీగ్, చెలి సిరి రావడం...
మొదటిసారిగా...
వంగూరి వారి సభలో నేను మాట్లాడిన నాలుగు మాటలూ విని నచ్చినవారు, నను మెచ్చినవారు నలుగురై, పదుగురై, పలువురై నన్ను అభిమానించడం...
అదే సభలో నాకు అపురూపస్నేహభాగ్యాలు - ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నో కలగడం...
మొదటిసారిగా...
వంగూరి సాహితీ సదస్సులో కలిసిన మిత్రుల నుంచి క్రూజ్‌కి రమ్మని పిలుపు రావడం...
వచ్చిందే తడవు మేము నలుగురం మొట్టమొదటిసారి క్రూజ్‌కి వెళ్ళడం...
ఎప్పట్నుంచో నేపథ్యసంగీతసహితంగా పాట పాడాలీ అన్న బదరి కోరిక కిశోర్ గారి వల్ల తీరడం...
మొదటిసారిగా...
క్రూజ్ నుంచి - అప్పటికి కలిసింది మొదటిసారైనా - మమ్మల్ని వాళ్ళ స్నేహబంధంతో కట్టేసుకుని, వారి వెంటపెట్టేసుకుని, వారింట మమ్మల్ని అట్టేపెట్టేసుకున్న - సురేఖ-కిశోర్ గార్ల ఇంటికి వెళ్ళడం...
అలా వెళ్ళేటప్పుడు మొదటిసారిగా బదరి డ్రైవ్ చెయ్యకుండా వెనక సీట్లో హాయిగా పాడుకుంటూ, కునికి-పాటుకుంటూ ఉండడం - అది కూడా సురేఖ లాంటి నారీరథసారథ్యంలో...
మొదటిసారిగా...
మా కుటుంబం ఒక మంచి, మరపురాని నూతనసంవత్సర ఆహ్వాన మహోత్సవ వేడుకలో పాల్గొనడం...
అది మా 2019 తీపి జ్ఞాపకాల యాత్రకి మార్గశీర్షమై, హేమంతమున సరదాగా నడిచిన శారద-విభావరి కావడం...
అన్ని మొదటిసార్లూ మొదటిరకపు మేలు అనుభవాలే.
వీటిలో నేను రాసుకోవాల్సినవి, రాసి దాచుకోవాల్సినవి - ఏమనగా... కొంచెం వెనక్కి వెళ్ళి ఇప్పటికే మొదలెట్టి ఇకపై పూర్తి చేయాల్సిన వంగూరి సాహితీ సదస్సు విశేషాలు.
వాటికన్నా ముందుగా చెప్పాల్సినవి - డిసెంబర్ నెలలో సముద్రపుటలల మీద సాగిన నౌకాయాన విశేషాల - వేడివేడి కబుర్లు వున్నాయి.
(శీర్షిక ఆలోచించుకుని అట్టేపెట్టుకున్నా - పదకొండతస్తుల ఓడ అదీ... పకపకలాడిన యాత్ర అదీ అంటూ ... దాసరివారి వరసలో)
వాటికి కొనసాగింపుగా మరీమరీ రాసుకోవాల్సినవి మా నవ్వులగని శారద సరదా-కబుర్లు. అవన్నీ త్వరలోనే చెప్తా...- అప్పటిదాకా - నా బ్లాగున - ఉండి రాగమవ్వుడి! - అనగా... Stay Tuned!
సరే! ఇవన్నీ ఒక ఎత్తు.
ఎంతటి మంచి అవకాశాన్ని కోల్పోబోతున్నామో తెలుసుకోకుండా "ఈ సారికి మీ ఇంటికి రాలేమూ" అంటున్నా, పదే-పదే మమ్మల్ని వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించి - క్రూజ్ అయిన తర్వాత వారింటికి వెళ్ళడానికి ఎంతో మొహమాటపడుతూ "సరే"నని ఒప్పుకున్న- మా బుజ్జిజింకల చేత "కిశోర్ అంకుల్, సురేఖ ఆంటీ మన బంధువులై మనకి దగ్గర్లో ఉంటే ఎంత బావుంటుందో కదా! " అనిపించిన సురేఖ-కిశోర్ గార్ల గురించి మామూలు మాటల్లో చెప్పలేక, అలా అని వాళ్ళ మంచితనాన్ని, గొప్పతనాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను కొలిచి చెప్పగలిగే గొప్పభాష నాకు చేతకాక మొట్టమొదటిసారిగా తెలుగులో Terzanelle రాశా - అచ్చంగా వాళ్ళ కోసమే!
తెలుగులో రాసే Terzanelle కదా - అందుకే ఈ మాటలపేర్పుకి ఇంతకు ముందెప్పుడో చెప్పినట్లు తరంగమాల (అలలదండ) అని పేరు పెట్టా.
ఈ Terzanelle / తరంగమాల / అలలదండ కథా-కమామీషు తెలియాలంటే ఇంతకుముందో కొత్త సంవత్సరానికని నే రాసిన English Terzanelle / తెలుగు తరంగమాల (అలలదండ) - ఇదిగో... ఇక్కడ చదవొచ్చు:
Here is a new page to turn.../ రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...[New Year Terzanelle / తరంగమాల (అలలదండ)]
సురేఖ-కిశోర్ గార్లకు అభిమానంతో ... ఈ తరంగమాల (అలలదండ):
వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు
వారి స్నేహమున చిక్కును కిశోర భానుకిరణాల నులివేడి
వారితో చెలిమి కలకాలపు కలిమి కాక మరేమి?
వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు
వారికి వారే సాటి మనసిచ్చుటలో
వారి సన్నిధిని మనసు విచ్చునహో
వారితో చెలిమి కలకాలపు కలిమి కాక మరేమి?
వారి మాటల ఇంపున మనము మురియునట
వారి చేరువన మనసునకూరట దొరకునదే
వారి సన్నిధిని మనసు విచ్చునహో
వారిని చేరిన విడువలేము ఎన్నటికీ
వారి మనముల మనమై మనుమను మాటే మెదలునెప్పటికీ
వారి చేరువన మనసునకూరట దొరకునదే
వారినొక్కసారి కలిసినంతనే కలుగు కూరిమి
వారి ప్రేమమున దక్కును చంద్ర(సు)రేఖల చలువల చలిమి
వారి మనముల మనమై మనుమను మాటే మెదలునెప్పటికీ
వారి జతలో మసలే భాగ్యము మాదని మేమన ...
వారి స్నేహమున చిక్కును కిశోర భానుకిరణాల నులివేడి
వారి ప్రేమమున దక్కును చంద్ర(సు)రేఖ చలువల చలిమి
వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు
Oda meda gurinchi tondaraga raseyyali ..eduru chusrunanu.
రిప్లయితొలగించండితొందర్లోనే రాస్తా :)
తొలగించండి