నమస్తే!
మార్చ్ నెల వనితా మాలిక (అంతర్జాల పత్రిక) లో నా మాయాక్షరాలు వ్యాసం ప్రచురింపబడింది :)
~లలిత
మాయాక్షరాలు
మాయాక్షరాలు అంటే మాయ చేసే అక్షరాలో, మంత్రాలలో ఉండేవో కాదు. మన తెలుగు భాషలోంచి నిశ్శబ్దంగా మాయమైపోతున్న అక్షరాలు.
తెలుగులో మూడు వుండే "చ" కారాలు, "జ" కారాలు రెండు అయ్యాయి. ఫలితంగా చందమామ తెలుగువారికి హిందీత్వం (చందా) కలుపుకుని వినిపిస్తున్నాడు. జల్లెడ తన అసలు పేరు మరిచిపోయింది. ణ, ళ తమ ఉనికిని వెతుక్కుంటున్నాయి . ఏ అక్షరం మారినా అంతగా బాధ పడని తెలుగు భాష "ళ"కారం దూరమైతే తన కళని, తళతళల్ని, పరిమళాన్ని కోల్పోయి ఉసూరుమంటుంది.
ఇవాళ నేను నా ళ-పురాణం లోని కొన్ని సరదా "కథకళుల్ని" మీతో పంచుకోవాలనుకుంటున్నాను :)
1. మల్లి అనబడే మల్లికార్జున రావుకి ఒక ళ-పలకని-స్నేహితుడి మాటలు ఇవి:
మల్లీ! నీ పెల్లికి మల్లీ మీ ఊరు రావాలంటే మా బాస్ ని శలవు అడగాలి. ఆయనేమో మల్లీ నేను శలవడిగితే కల్లు ఎర్రజేసి కల్లు తాగిన కోతిలా అరుస్తాడు.
మనబడికి వెళ్ళే ఉత్తర అమెరికా తెలుగు విద్యార్థులు ఇది చదివారంటే "మల్లీ, కల్లు" అర్థాల మధ్య తికమక పడి బాబోయి తెలుగు వద్దు అనే ప్రమాదం కూడా వుంది.
2. మన తెలుగు దర్శకులు రాఘవేంద్ర రావు గారి "త్రిశూలం" అనే సినిమాలో ఒక అందమైన పెళ్లి పాట ఇలా వింటున్నామని ఊహించండి:
పెల్లంటే పందిల్లు సందల్లు తప్పెట్లు
తాలాలు తలంబ్రాలు....
మూడే ముల్లు ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేల్లు...
........................
చెలిమికి సంకెల్లు వెయ్యేల్లు....
ఏంటో ఏదో అర్థం అయీ అవనట్లుగా వుంది కదూ.....
ఆ పాటనే ఇలా వింటున్నామని అనుకోండి:
పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లుతాళాలు తలంబ్రాలు....మూడే ముళ్ళు ఏడే అడుగులుమొత్తం కలిసి నూరేళ్ళు...........................చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు....
ఆ పాడే పెదవులతో అందమైన పాటని అల్లుతున్నట్లు అనిపిస్తోంది కదా :)
ఇంకా ముచ్చటగా మూడో ఉదాహరణ:
౩. ఈ మధ్య మన ఎఫ్ ఎం రేడియోలో పదహారణాల తెలుగు ఆడపడుచులు ఎలా మాట్లాడుతున్నారో చూద్దామా ;) (ఈ ఎఫ్ ఎం ఆడపడుచుల గురించి త్వరలోనే ఇంకో బ్లాగ్ విడుదల చేస్తాను. ఇక్కడ మాత్రం మన "ళ" ఎలా "ల" అవుతోందో చూపించడమే నా ఉద్దేశ్యం.)
Welcome to SO&SO Telugu Radio!!!
ఇప్పుడు మీ bubbly బొమ్మాలితో "పాత పరిమలాలు " old songs live program.
మన first caller ఎవరో చూద్దామా?
హలో! ఎవరండీ call చేస్తున్నారు? సరల గారా?
How are you, సరల గారు?
ఎక్కడనుంచి call చేస్తున్నారు? శ్రీకాకులమా?
మీకు ఏ song కావాలి ? పెల్లి పుస్తకం లో title songa?
I too like that song అండీ!
మీకు ఇష్టమైన పెల్లి పుస్తకం లోని title సాంగ్ మీ కోసం.
విని enjoy చేయండి.
Bye సరల గారు! మీరిలాగే మల్లీ మల్లీ call చేస్తూ వుండండి.
ఫై సంభాషణలో తెలుగు ఎంత వుందీ అనేది పక్కన పెడితే వున్న తెలుగు అసలు ఎంత బావుంది అంటే మొహమాటం లేకుండా 10 కి 2 మార్కులు కూడా వేయాలని అనిపించదు కదూ !
ఈ రోజుల్లో కనుక దేవరకొండ బాల గంగాధర తిలక్ వుండి వుంటే
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
-----అని కవిత వ్రాయడానికి కొంచెం ఆలోచించేవారేమో.
తెలుగు భాషకే తళతళలద్ది, కళకళలాడేట్లు చేసిన "ళ" లేకపోతే మన తెలుగు పరిమళాలు సౌరభాన్నే కోల్పోతాయి.
శ్రీ ఆది శంకరాచార్య వ్రాసిన మహిషాసుర మర్దినీ స్తోత్రం లాంటివి పేలవంగా వినిపిస్తాయి (అలాంటి ఒక శ్లోకం ఇక్కడ చదవండి ):
కల మురళీ రవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే...
మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైల నికుంజ గతే...
మృగ గణ భూత మహా శబరీ గణ రింగణ సంభ్రుత కేళి భ్రుతే....
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే...
తెలుగు ద్రవిడ భాషల్లో ప్రాచీనమైనది - ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అనిపించుకున్నది. రామాయణ, భాగవత, భారతాలు, ఎన్నెన్నో ప్రబంధాలు, కావ్యాలు, కవితా సంకలనాలు, కథా సంకలనాలు వున్న చిక్కని చక్కని భాష మన తెలుగు. చేతనైనంతలో మన పిల్లలకి మంచి భాష, ఉచ్ఛారణ నేర్పగలిగితే మన వంతు తెలుగు ఉద్యమం చేసినట్లే.
మీరు ఏమంటారు?
~లలిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి