30, నవంబర్ 2020, సోమవారం

థాంక్స్‌గివింగ్ తలపోతలు

    అలుపు తెలియని కాలం కదులుతూ, రోజుకి రోజు కలుపుకుంటూ వారాలు నెలలవుతూ, నవంబర్ నెలని కూడా దాటేస్తోంది. 

    మొన్నమొన్నటి దాకా రంగులతో హొయలొలికిన చెట్లు నవంబర్ వచ్చేటప్పటికి ఆకులు రాల్చేసుకుని ఉదాసీనపు ముసుగేసేసుకున్నాయి. 

    ఉత్తరమెరికాలో నవంబర్ నాలుగో గురువారం Thanksgiving పండగ - నాలుగు రోజుల సెలవు పండగ. 

    రావడమైతే దాని పాటికి అది పండగ వచ్చేసింది కానీ ఎప్పట్లాగే ఉందా? ఏమో అలా ఉన్నట్లు అనిపించట్లేదు. 

    ప్రతీ ఏడాదీ ఈ పండక్కి - మా వీధిలో -  ప్రతీ ఇంటి ముందూ రెండో, మూడో కార్లు అదనంగా ఉండేవి - ఇరుగు ఊళ్ళ నుంచో, పొరుగు రాష్ట్రాల నుంచో వచ్చిన బంధువులవో, స్నేహితులవో. కానీ ఈ సారి అలాంటి హడావిడే లేదు. 

    Black Friday sales అంటూ ఎలక్ట్రానిక్స్ అంగళ్ళ ముందు గురువారం అర్థరాత్రి నుంచే షాపుల ముందు కుదిరితే టెంట్లు వేసుకుని, కుర్చీల్లో కూర్చుని, కుదరని వాళ్ళు గోడకి ఆనించిన ఒంటి కాలి మీద నించుని - కబుర్లు చెప్పుకుంటూ ఆ స్టోర్ తలుపులు తెరిచేవరకూ చేసే శుక్రవారపు-జాగారం సరదాలే లేవు.  

    "మీకోసమే స్టోరులు తెరిచి ఉన్నాం, మీకోసమే ధరలు తగ్గించాం రండం"టూ - ఒళ్ళంతా దీపాలు చేసుకుని మిలమిల్లాడుతూ malls ఎంత ఊరించినా - అటు పక్కకి వెళ్ళాలనే ఊసే ఎవరికీ ఉన్నట్టనిపించలేదు. 

    అంతటా ఎప్పుడూ లేని - చప్పుడే లేని చప్పదనం. సందడి లేమి - స్తబ్ధత. 

    ఇక మా ఇంట్లో - ఉన్న నలుగురం - అందరం కలిసి ఉన్నాం - అదే దసరా, అదే దీపావళి, అదే థాంక్స్‌గివింగ్ - మా వరకు. రెండేళ్ళుగా నవంబర్ నాలుగోవారం మాతో గడపడానికి బోస్టన్ నుంచి వస్తున్న కెవిన్ ఈ సారి రాలేదు. తనని ఎన్ని సార్లు గుర్తు చేసుకున్నామో! 

    గురువారం పొద్దున్నే లేచి కిటికీ లోంచి బయటికి చూస్తే రోడ్డు మీద బంగారపు మలాములా పరుచుకున్న ఎండా, ఆ ఎండలో రెక్కలారబెట్టుకుంటున్న బుజ్జిపిట్టలూ తప్ప ఏ అలికిడీ లేదు మా వీధిలో. ఇంతలో బదరి వచ్చి నా పక్కనే నించుని తనూ బయటికి చూస్తూ - "మన ఎదురింటి వాళ్ళు పండక్కి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు" అంటుండగానే నేనూ అందుకుని "అవును ... ఎప్పుడూ గెంతులేస్తూ ఆడుకుంటూ కనిపించేది - వాళ్ళ కుక్క కూడా కనిపించట్లేదు" అంటూ ఉన్నాను. 

    మా ఇద్దరికీ బయట ఊళ్ళ నుంచి బంధువులు రాకపోతే పోనీ - కనీసం ఊళ్ళో ఉన్న వాళ్ళైనా ఉన్నచోట క్షేమంగా ఉంటే చాలు అన్న ఆశ - రోజూ కనిపించేవాళ్ళు కనిపించకపోతే చిన్నపాటి బెంగ. అందుకే మా ఎదురింటి కేసి చూస్తూ పక్కపక్కనే నించుని మాలో మేమే అనుకుంటున్నవి మాతో మేమే అంటూ, మేమన్నవి మేమే వింటూ నించున్నాము. 

    ఓ పది నిముషాల తర్వాత - నేను కిటికీ దగ్గర నుంచి ఇవతలికి వచ్చి -  రోజూ వచ్చే న్యూస్ పేపర్లో పజిల్స్ ఏవో చేసుకుంటూ ఉన్నాను. ఈలోగా బదరి నన్నోసారి కిటికీ దగ్గరికి రమ్మని పిలిచారు. ఏంటా అని చూస్తే మా ఎదురింటి వాళ్ళ కుక్క - గోధుమరంగు గిరజాల కుక్క - కుదురు లేని ముందరి కాళ్ళతో చెంగుచెంగున ఎగురుతూ - గాలికి రాలి పడే ఆకులతో ఆడుకుంటూ కనిపించింది. దాన్నలా చూడగానే ఎందుకో తెలీని సంతోషం. అంతా మామూలుగానే ఉందన్న ఆనందం. 

    ఈ మధ్య బదరి స్నేహతులతో మాట్లాడుతున్నప్పుడు airports అన్నీ ఎంత రద్దీగా ఉన్నాయో వాళ్ళు చెప్పారని వింటున్నప్పుడల్లా ఏంటో బాధ. సరే! బాధ పడితే రోజులు బాగవుతాయని భరోసా ఉంటే బాధ పడ్డా ఒకందం - లేకపోతే ఆ బాధకి అంతమూ ఉండదు, అర్థమూ ఉండదు. అందుకే అలాంటి విషయాలు నేను విన్నా విననట్టే ఉంటాను. ఎందుకంటే... 

కడుపు నిండనీయని కలత ఇది... 
కనురెప్పల మాటున కనకూడని కల ఇది... 
కల్ల ఐతే బావుండుననే నిజమిది... 
కనిపించని బూచితో దోబూచులాట ఇది...

    అన్నట్టు నాకు నచ్చిన విషయమొకటి చెప్పాలి. మా ఇంటికి వస్తుండే  జెఫ్ కిందటి వారమెప్పుడో బదరికి ఫోన్ చేసి అవీ ఇవీ మాట్లాడుతూ - వాళ్ళ అమ్మా-నాన్నగార్లు, అత్తా-మామగార్లు - ఈసారి థాంక్స్‌గివింగ్ పండక్కి  జెఫ్ వాళ్ళ ఇంటికి రాబోతున్నట్టు చెప్పాడు. అలా రావడం కోసం వాళ్ళు నలుగురూ పధ్నాలుగు రోజులుగా ఎవరినీ కలవకుండా, ఎక్కడికీ బయటికి వెళ్ళకుండా క్వారంటైన్‌లో ఉన్నారట. జెఫ్ వాళ్ళ అక్క టీచరుగా పని చేస్తుందట. ఆవిడ స్కూల్‌కి వెళ్తూ ఉండడం వల్ల - తన వల్ల జెఫ్ కుటుంబానికీ, పెద్దవాళ్ళకి ఇబ్బంది రాకూడదని - మొట్టమొదటిసారిగా తన తమ్ముడికి, తలిదండ్రులకి దూరంగా తన ఇంట్లో తనే పండగ చేసుకుంటుందని చెప్పాడట. ఎంత మంచిగా ఆలోచించింది ఆవిడ! మనుషులు దూరంగా ఉన్నా మనసుకి దగ్గరగా ఉండడం అంటే అదేనేమో! ఇది కదా జెఫ్ కుటుంబమంతా ఒకరికొకరుగా నిలబడి చేసుకుంటున్న నిజమైన థాంక్స్‌గివింగ్ పండుగ!

    సరే! ఇక మా ఇంట ఈ నాలుగు రోజుల సెలవుల పండగ ఎప్పట్లాగే నిండింది ... వేటితో అంటే... 

చల్లటి వేళల వెచ్చటి బువ్వలు
నవ్వుల జాలుల ఇచ్చకాల మాటలు 
పగటి పూట పుస్తకాలు, పజిళ్లు
సాయంకాలాల సినిమాలు 
రోజంతా ఏదో మూల గుయ్-గుయ్ మనే పాటలు... 


    ఈసారి నాలుగు-రోజుల సెలవుకి కొసమెరుపుగా ఇవాళ (ఆదివారం) కార్తీక పున్నమి వెన్నెల మెరుగులు ఉంటాయని మొన్నెప్పట్నుంచో మురిసిపోతున్నాను నేను. గురువారం నుంచి మబ్బుల్లేని ఆకాశం లోంచి తొంగి చూస్తూ పలకరిస్తున్న ౘందమామని చూస్తున్నప్పుడల్లా - ఈ వెలుగు పొర్ణమి దాకా ఉంటుంది కదా అన్న ఓ చిన్న ఆశ!

కానీ ఈ రోజు ... 
చురుకు ఎండల సూరీడు రాలేదు 
చలువ వెన్నెల చంద్రుడి జాడా లేదు 

వెల్ల అయిన వెలుగు లేదు 
వెల్లువంటి వెన్నెల లేదు 

తలెత్తి దండమెడదామంటే
దరిసెనమీయడే  వెలుగుఱేడు!   
కళ్లొత్తులు చేసుకున్నా 
కనిపించడే వెన్నెలఱేడు!

వాన పాటల జోలలాడి 
సోలిపోయెనేమో దినకరుడు!
మబ్బు పరుపుల ఊయలూగి 
నిదురించెనేమో  ౘందమామ!

పగటి వెలుగు మబ్బుల మాటాయె 
చల్లటి వెన్నెల చీకటి పాలాయె 


గుల్జార్ అన్నట్టు... 

खाली हाथ शाम आयी है - खाली हाथ जायेगी...!
ఆ గుల్జారే మళ్ళీ ఇంకోచోట అన్నట్టు ... 
दिन खाली खाली बर्तन है -और रात है जैसे अंधा कुआँ !

అట్టాగుంది ఈదురుగాలుల తూగుతున్న ఈ ఏటి కార్తీక పున్నమి. 

అయితే మాత్రం బెంగెట్టేసుకుంటామా ఏంటి?

రేపు రాకపోదా?
వెలుగు తేకపోదా?
ఆ రేపు దాపయి 
బూచి భయం మాయమయి 
పువ్వులల్లె విరిసిపోయె 
నవ్వులన్ని పోగుచేసి 
వెల్లువల్లె వెన్నెల కురిసిపోదా?




8 కామెంట్‌లు:

  1. This is the season to adopt an attitude of gratitude; that reminds us that nothing is so bad that there is nothing to feel thankful about. Though it came and went quietly, glad that you could have this family time and enjoy the moments of cherished togetherness.
    As for the Beaver moon of November - we were lucky to catch a glimpse of him in our town...again, something to feel thankful for.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Aparne! I hope beavers in our place are not confused and not planning to defer their winter plans thinking that the Beaver moon of November is yet to happen ;)

      Thank You for your thoughtful and thought provoking words!

      తొలగించండి
  2. ఇలా బోల్డన్ని కబుర్లు చెప్పినందుకు బోల్డన్ని థాంక్‌యూలు!

    ఆ గుల్జార్ గారు ఖాళీగా చెప్పినవి, ఈ లాల్జార్ గారు చివర్లో jolly గా చెప్పినవి నాకు బోల్దు నచ్చాయి.

    Thanks for the giving!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా కబుర్లు చదివి మెచ్చుకున్న మీకే బోల్డన్ని థాంక్యూలు!

      తొలగించండి