ఆ మధ్య మలయాళ సినిమాలు తెగ చూసేశాం. C U Soon తర్వాత ఇక మలయాళం జోలికెళ్ళలేదు.
ఆ తర్వాత ఓ రెండు మరాఠీ సినిమాలు కూడా చూశాం.
అందులో ఒకటి - దాదా సాహెబ్ ఫాల్కే మొట్టమొదటి సినిమా హరిశ్చంద్ర ఎలా తీశారో అన్న దాన్ని ఆడుతూ, పాడుతూ చూపించేసిన "హరిశ్చంద్రాచి ఫేక్టరీ" అనే సినిమా.
రెండో మరాఠీ సినిమా - సైకిల్.
కేశవ్ అనే ఒక జ్యోతిష్కుడు, ఆయుర్వేద వైద్యుడు - మంచి మనిషి - అందరికీ సాయం చేస్తూ ఉంటాడు.
కేశవ్ వాళ్ళ తాతగారికి బ్రిటిష్ వాళ్ళెవరో ఒక పసుపుపచ్చ సైకిల్ ఇస్తే - దాన్ని ఆయన చనిపోయేముందు తన మనవడైన కేశవ్‌కి బహుమతిగా ఇస్తాడు.
కేశవ్‌కి ఆ సైకిల్ అంటే ఎంత ఇష్టమంటే దాని మీద ఎవర్నీ చెయ్యి కూడా వెయ్యనివ్వడు - ఆఖరికి వాళ్ళ నాన్నగారిని కూడా తొక్కనివ్వడు.
కేశవ్ వాళ్ళ ఊళ్ళోవాళ్ళకి, ఆ ఊరికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కేశవ్ గురించి, అతని మంచితనం గురించి ఎంత తెలుసో, కేశవ్‌కి ఆ సైకిల్ అంటే ఎంత ఇష్టమో ఇంకా బాగా తెలుసు. ఓ రోజు ఆ సైకిల్‌ని ఇద్దరు దొంగలు ఎత్తుకుపోతారు. కానీ ఆ దొంగలు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆ సైకిల్‌ని గుర్తు పట్టి "కేశవ్ ఎక్కడా?" అని అడుగుతూ ఉంటారు. ఆ దొంగలు తాము కేశవ్‌కి కజిన్స్ అని అబద్ధం చెప్పి , తమకి ఆ సైకిల్ తొక్కుకోమని ఇచ్చాడని చెప్పగానే వాళ్ళందరూ కేశవ్ బంధువులని ఆ దొంగలని చాలా మర్యాద చేసి వాళ్ళకి తమ ఇళ్ళలో భోజనం చెయ్యాల్సిందే అని బలవంతపెడుతూ ఉంటారు.
ఇక కేశవ్ ఏమో సైకిల్ పోయిందన్న బెంగతో ఎలాగైనా వెతికి తెచ్చుకోవాలని అన్ని ఊళ్ళూ తిరుగుతూ ఉంటాడు. చివరికి ఏమవుతుందో ఎవరికి వారు చూస్తేనే బావుంటుంది.
ఇహ ఇక్కడికి కథ ఆపేస్తా... ఈ సినిమా బావుంది.
ఒక సైకిల్ మీద ఇష్టాన్ని గురించిన కథ. మంచివాళ్ళకి మంచే జరుగుతుంది అని అడుగడుగునా మంచితనం నింపుకుని చివరికి మంచిగా ముగిసే కథ. పాటలు-డాన్సులు, తాపులు-తన్నులు, punచులు-దంచుళ్ళు ఏమీ లేని ఒక ౘందమామ కథ లాంటి సినిమా.
మలయాళం దాటి మరాఠీ మీదుగా మళ్ళీ తెలుగు వైపు వస్తుంటే - ఉన్నికృష్ణన్ కూతురు ఉత్తర పాడిన "అళగు" పాట గుర్తుకొచ్చింది.
బదరికి ఆ పాట అంటే చాలా ఇష్టం - అందమైన తమిళ పదాలని ఆ పాప ఇంకా అందంగా పాడిందని. సరే! తనకంత ఇష్టమైన ఆ పాట ఉన్న "శైవం" సినిమా కూడా చూసేశాం. "
"శైవం" లో నచ్చిన విషయాలు ముచ్చటగా మూడు - తమిళ్ అనే పేరున్న పాపగా నటించిన సారా అర్జున్, "అళగు" పాట, ఆ సినిమా షూట్ చేసిన మండువా ఇల్లు.
ఇన్ని భాషల సినిమాలు చదువుకుంటూ చూసి, చూసి - చివరికి తెలుగు సినిమాలు చూస్తున్నా కూడా సబ్-టైటిల్స్ చదవక పొతే సినిమా అర్థం కావడం మానేశాయ్. అందుకే కొన్నాళ్ళు సబ్-టైటిల్స్ చదువుకునే సినిమాలు మానేద్దామని అనుకున్నాం.
అప్పుడేం తెలుగు సినిమా చూద్దామా అని వెతికివెతికి - కీర్తి సురేష్ ఉంది కదా అని "మిస్ ఇండియా" పెట్టారు బద్రి.
అసలా సినిమా కథేంటో - అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిన అబ్బాయితో సూట్కేసులు సర్దుకుని అమ్మా, నాన్నా, చెల్లీ - వెళ్ళేది అమలాపురమేమో అన్నట్టు - విమానమెక్కి అమెరికా వచ్చేయడమేమిటో - అలా వచ్చినవాళ్ళు ఒక పే... ద్ద mansion లాంటి ఇంట్లో దిగడమేమిటో - అన్నతో వచ్చిన చెల్లాయి అమెరికాలో రోడ్డు పక్కన బండి పెట్టి చాయ్ అమ్మడమేంటో - అమెరికా పోలీసులొచ్చి ఆ చాయ్ డబ్బాలూ, కప్పులూ ఎత్తుకుపోవడమేంటో - నేను సగం సినిమా కాగానే ఇక చూడడం ఆపేశాను.
కీర్తి సురేష్ - తన వయసుకి తగ్గట్టు - కొంచెం సరదాగా నవ్వుతూ, గలగల్లాడుతూ ఉండే సినిమాలు ఏమన్నా చేస్తే బావుండును. మరీ అంత గంభీరంగా ఉండే అంత పెద్ద పెద్ద గంగాళాల్లాంటి పాత్రలు ఇప్పుడే ఎందుకో ఆ అమ్మాయికి?! ఇలా ఎన్నిసార్లనుకున్నానో "మిస్ ఇండియా" చూశాక!
ఇంతలో మా దివాణం వారి చిన్నారి, నా పేరే పెట్టుకుని, నా లాగే సినిమాలకి మహారాజపోషకురాలైన లలిత వాట్సాప్ స్టేటస్‌లో "కలర్ ఫోటో" అన్న పేరు - పక్కన రెండు బొటనవేళ్ళు , ఇంకో రెండో నవ్వుమొహాలు కనిపించాయి.
వాటిని చూడగానే "బావుందా?" అంటూ ఆశపడ్డా.
నేనలా అడిగీ అడగ్గానే మా లలిత "అవునత్తా!" అంది.
తను అలా అనీ అనగానే నేను బదరికి "కలర్ ఫోటో బావుందట - లలిత చెప్పింది" అని చెప్పాను.
నేనలా చెప్పీ చెప్పగానే బద్రి అమెజాన్ ప్రైమూ, నెట్టుఫ్లిక్సూ, యూట్యూబూ అన్నీ వెతికేశారు.
ఎన్ని వెతికినా, ఎంతసేపు వెతికినా ఎక్కడా దొరకదే ఆ కలర్ ఫోటో?! తీరా చూస్తే అది "ఆహా" లో మాత్రమే ఉందని తెలిసింది.
ఉన్న ఓటీటీలు, యూట్యూబూ చాలక ఈ "ఆహా" కూడా ఎందుకులే అనుకుని einthusan లో వెతికారు బద్రి. అక్కడ దొరికింది "కలర్ ఫోటో".
అన్నట్టు "కలర్ ఫోటో" గురించి చెప్పే ముందు - నిన్ననే చూసిన ఇంకో మహా-hype సినిమా గురించి చెప్పాలి.
అదే "ఆకాశం నీ హద్దురా..." అంటూ ఊరించిన డబ్బింగ్ సినిమా.
ఈ సినిమా గురించిన ఆహాలూ-ఓహొలూ చాలా చదివి - నిన్న శనివారం రాత్రి భోజనాలయ్యాక - చూద్దామని plan చేసుకున్నాం. ఇప్పుడు కూర్చుని ఇది రాస్తూ అసలేం చూశామా అని ఆలోచిస్తూ ఉంటే - ఆకాశంలో విమానాలు ఎగరడం, నేల మీద సూర్య పరిగెత్తడం తప్ప - ఇంకేమీ గుర్తు రావట్లేదు.
గుర్తున్న ఒకే ఒక సీన్ - ఫ్లైట్ టికెట్ కోసం డబ్బులు తగ్గాయని ఎయిర్ ఫోర్స్‌లో పని చేసే సూర్య ఏడుస్తూ అందరి కాళ్ళూ పట్టుకోవడం - అలా నిజంగా జరిగిందో, సినిమా కోసం over-dramatize చేశారో కానీ అంత బాగా అనిపించలేదు.
సాధారణంగా నేను సినిమా చూసేటప్పుడు - కరకరలు ఎక్కువ తినను - డైలాగులు వినిపించవని, అర్థం కావని. కానీ ఈ సినిమా సగం చూసేటప్పటికి ఏం విన్నా అర్థం కాదని అర్థమైపోయింది. వెంటనే ఓ జామకాయ కోసుకుని కచా-కచా నములుతూ చూసేశా!
ఇంతకీ ఈ రెండున్నర గంటల సినిమాలో ప్రతీ అరగంటకీ రకరకాల డ్రెస్సులేసుకుని మోహన్ బాబు ఎందుకొచ్చాడో, ఏం మాట్లాడాడో నేను తిన్న జామకాయ సాక్షిగా నాకు తెలీనే తెలీదు.
ఇందులో నాకు నచ్చినదల్లా హీరోయిన్ కట్టుకున్న చీరలు, వేసుకున్న పువ్వులపువ్వుల జాకెట్లు.
అన్నట్టు ఈ సినిమా చూసే ముందు - సాయంత్రం కొత్త ఫోన్లు కొనుక్కుందామని Costco కి వెళ్తే అక్కడ మా బుజ్జిజింక కిరణ్ గాడి ఫ్రెండ్ అనీష్ కనిపించి "హలో ఆంటీ" అని పలకరించాడు. మాస్క్ పెట్టుకున్నా నన్ను గుర్తు పట్టాడని ముచ్చటేసేసింది. తనతో మాట్లాడుతుంటే చెప్పా డు అంతకు ముందు రోజే "ఆకాశం నీ హద్దురా" సినిమా చూశానని.
"ఎలా ఉంది సినిమా, అనీష్?" అని నేనడిగితే - కొంచెం మొహమాటంగా నవ్వి "కొంచెం Documentary లా ఉందాంటీ! కానీ inspiring గా ఉంది" అంటూ సర్దేశాడు.
నిజ్జంగా చెప్పాలంటే - సినిమా చూశాక - నాకు ఆ పదిహేనేళ్ళ అబ్బాయి రివ్యూ నేను అంతకు ముందు చదివిన ఆహా-ఓహోల కన్నా సరిగ్గా అనిపించింది.
మొత్తానికి చూసేశాక "ఆ సిన్మా ఓ హైపు రా!" అనిపించింది. అంతే... అంతే... అంతే!
ఇప్పుడు - ఇక "కలర్ ఫోటో" గురించి ...
కిందటి శనివారం అంటే నవంబర్ 7 వ తారీఖున - అమెరికా అంతటా ట్రంపా - బైడెనా అంటూ అన్ని పక్కలా ఓ... హోరెత్తిపోతోంది.
మేమైతే "ఏ రాయైతేనేం " పార్టీ.
అందుకని అన్ని రకాల ఎల-క్షణ-వీక్షణాలకి దూరంగా ప్రశాంతంగా "కలర్ ఫోటో" చూద్దామనుకున్నాం.
చూశాం! నచ్చేసింది సినిమా.
"కలర్ ఫోటో" మహ బాగా క్లిక్కయ్యిందిగా... - అనుకున్నాం.
మలయాళ సినిమాలు చూస్తూ ఎప్పటికైనా మన తెలుగులో కూడా ఒక చిన్న స్టోరీ లైను తీసుకుని - ఆట్టే డ్రామా లేకుండా - మామూలు మనుషులు మాట్లాడే భాషతో - ఒక మంచి సినిమాగా ఎవరైనా తీస్తే బావుండును అనుకుంటూ ఉండేవాళ్ళం మేము.
అదుగో... అల్లాంటి సినిమాయే ఈ "కలర్ ఫోటో".
నాకు ఇందులో పాటలు నచ్చాయి.
"అరెరె ఆకాశం లోనా ..." పాట కొంచెం ఎక్కువ నచ్చింది. అందుకే ఆ పాట యూట్యూబ్ లింక్ ఇక్కడ: https://www.youtube.com/watch?v=XWL75FhjtIk
ఈ సినిమాలో - ముగ్గురమ్మాయిలు - పద్దు (దివ్య శ్రీపాద), దీప్తి (చాందిని చౌదరి), దీప్తికి వదినగా చేసిన అమ్మాయి (విద్య) - చేసిన subtle action బోల్డు నచ్చింది.
దీప్తి, వాళ్ళ వదిన వంటింట్లోంచి చూస్తూ - పెదవులు కదపకుండా - పళ్ళ చాటున మాట్లాడుతూ - అద్దం ముందు ముస్తాబవుతూ మీసం తిప్పుకుంటున్న రామరాజు(సునీల్)ని - కామెంట్ చేయడం భలే చేశారు.
ఎప్పుడూ డాన్స్ డ్రామాలో అమ్మవారి వేషం వేసే దీప్తి ఒకసారి ప్రోగ్రాముకి తన అమ్మవారి costume ని పద్దుకి ఇచ్చినపుడు - పద్దు (దివ్య శ్రీపాద) మొహంలో కనీకనిపించని నవ్వు, ఆనందం, కృతజ్ఞత - అన్నీ ఒకేసారి కనిపించి ఎంత బావున్నాయో!
బాలయేసు (హర్ష చెముడు) quick retorts నచ్చాయి.
దీప్తిని పెళ్ళి చేసుకున్న చందు (ఆదర్శ్) మంచితనం బావుంది - నమ్మదగినదిగా లేకపోయినా.
జయకృష్ణ (సుహాస్) గురించి చెప్పక్కర్లేదు. నటన చాలా బావుండడమే కాదు - ఒక స్టూడెంటుకి ఉండే natural body language ఈ అబ్బాయికి బాగా చేతనయింది.
ఒక సీనులో జయకృష్ణ, బాలయేసు, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజ్ వెనకాల మెట్ల మీద కూర్చుని సిగరెట్లు కాలుద్దామనుకుని కూర్చున్నాక వాళ్ళ దగ్గర అగ్గిపెట్టె లేదని గుర్తొస్తుంది. అప్పుడు బాలయేసు జయకృష్ణని వెళ్ళి కాలేజ్ టెర్రేస్ మీద నుంచి అగ్గిపెట్టె తెమ్మంటే - సరేనని వెళ్తాడు జయకృష్ణ. అలా వెళ్తున్న జయకృష్ణ నడకలో చిన్నపాటి అలక్ష్యం, కొంచెం బద్ధకం - అందరూ కూర్చుని తననే పంపిస్తున్నారని కాసింత కినుక - ఆ కొన్ని సెకనుల నడకలో భలే చూపించాడు.
ఇంకా ఈ సినిమాలో కనిపించిన కాయితంతో చేసిన కెమెరా, అగ్గిపెట్టె ఫోన్లు కూడా నచ్చాయి.
కాకపోతే ఈ సినిమాలో ఒకట్రెండు పలుకురాళ్ళు - దీప్తికి ఉన్న disorder ఒక పలుకురాయైతే, దీప్తి భర్త చందు అతి మంచితనం మరీ కొరుకుడు పడలేదు.
ఏదో పెళ్ళిచూపుల్లో ఒకసారి చూసి పెళ్ళి చేసేసుకుని - దీప్తికి ఉన్న mental disorder, ఆమె ఒంటి మీదున్న "కన్నయ్య" అనే పచ్చబొట్టు సహితంగా - అంతగా ప్రేమించేస్తూ - ఆ అమ్మాయి అన్న మాటకల్లా తలూపడం - వింతగా అనిపించింది. కానీ సినిమా కదా... ఫర్లేదనిపించింది.
చివరాఖరిగా అస్సలు నచ్చనిదేమిటంటే ఇంత మంచి సినిమాని "ఆహా" కి మాత్రం పరిమితం చెయ్యడం. దాంతో పాటు అమెజాన్ ప్రైముకి కూడా ఇచ్చుంటే మహబాగా ఉండి ఇంకా ఆహా-ఓహో అనిపించేది.
మన అచ్చ తెలుగు సినిమా - "కలర్ ఫోటో" - తీసిన దర్శకుడు సందీప్ రాజ్ బృందానికి జయహో!
~ సినీ-మా-లక్ష్మి
మీ విశ్లేషణ బాగుంది.
రిప్లయితొలగించండిమీరు ఇలా మెచ్చుకోవడం బావుంది. ధన్యవాదాలండి :)
తొలగించండిAmaram Akhilam Prema in Einthusan is good movie. Concept is good though hero is not photogenic.
రిప్లయితొలగించండిఅన్నట్టు...అమరం అఖిలం ప్రేమ Einthusan లోనే చూశామండి. చూసినప్పుడు బాగానే అనిపించింది కానీ ఎందుకో register అవలేదు. హీరో కూడా బాగానే act చేశాడు. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన సినిమా చివరి వరకు ఆపకుండా చూడగలిగితే అది మంచి సినిమానే. Thanks for reminding me of it!
తొలగించండిఎవరికి నచ్చిన సినిమాని వాళ్ళు హైప్ చేసుకుంటూ పోతున్నారు అచ్చం మీలాగే!
రిప్లయితొలగించండిఅందరూ నాలాగే - అలాగే చేయడం సరి అయినదండి :)
తొలగించండితా వలచింది రంభ...
తా మునిగింది గంగ...
తా మెచ్చింది సిన్మా...
మీ వ్యాఖ్యకి వాదాల్లేని ధన్యవాదాలు, సూర్యగారు!
I am really not someone to post a comment in the blogs or subscribe to them, even though I read many blogs and yours is definitely one of them.
తొలగించండిI have always noticed that you are very particular about your choice of words and have maintained a certain standard and sanctity to your blog which unfortunately can’t be seen around much.
I was curious to see how you would respond to the above comment.
Hats off to your response, especially the last sentence. Floored!!!
Subscribed to your blog. BTW, yours is the first ever blog that I subscribed to.
ఈ పోస్ట్ టైటిల్ ఫస్ట్ హాఫ్ just hilarious.
రిప్లయితొలగించండి‘ఎల-క్షణ-వీక్షణాలు’ - superbly coined word typical of your style లలితా!
మేము కూడా పరభాషా చిత్ర వీక్షణానికి ప్రస్తుతానికి కామా పెట్టేసి, మంచి తెలుగు సినిమా ఏదన్నా రాకపోతుందా అని చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నాం.
వీలైనప్పుడు ఈ సినిమా చూడాలి.