25, మార్చి 2018, ఆదివారం

నా నేస్తు పుస్తకమస్తు - ఆమని, వేసవి, వానకారు-1


పుస్తకం హస్తభూషణం అని అమ్మ నేర్పిన మాట 
పుస్తకం చిత్తాహ్లాదనం అంటూ నేను పాడిన పాట
ఆ మాట -  మోసుకుంటూ...  వుంటూ...
ఆ పాట - మోగుకుంటూ... అంటూ...
శ్రీరామ తో మొదలుపెట్టి చిత్తగించవలెను అన్నదాకా
తిన్నగా బొత్తి పెట్టి తిరగేసిన పేజీలెన్నో
ఉన్న మతి పోకుండా చదవేసిన పొస్కాలెన్నో
కొద్దికొద్దిగా...  చదివిన కొద్దీ...
పొత్తంతో పొత్తు పెరిగిన కొద్దీ...
ఒద్దిక మీరి తెలుసుకున్నదేంటీ అంటే...
As I learn more
I learn more
That there is more to learn
అనగా...
తెలియనిది తెలియగా
తెలిసిందేంటంటే
అప్పటికే తెలిసినది కొంతేననీ 
ఇప్పటికి తెలుసుకున్నది సుంతేననీ 
తెలుసుకోవాల్సింది ఇంకా ఉందనీ
తెలియనిది ఇంకెంతెంతోనని...

అందుకే పుస్తకం కంట్లో పడ్డా, పుస్తకం గురించిన మాట చెవిలో పడ్డా - అనుకోకుండానే కళ్ళు మెరుస్తాయి - చెవుల మధ్యనున్న తలలో బుద్ధి మురుస్తుంది.

కిందటి ఏడాది తానా కబుర్లో రాసుకున్నా కదా డాక్టర్లు రామరాజభూషణుడు, బాబ్జీ గార్ల గురించి!

(తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు)

వాళ్ళిద్దరికీ మధ్యలో కూర్చుని వుండగా - బోల్డన్ని డిగ్రీలున్న డాక్టర్ బాబ్జీగారు రామరాజభూషణుడి గారితో చెప్పిన ఒక పుస్తకం విశేషాలు చాలా ఆసక్తిగా అనిపించాయి.

ఆ మాటలు నాగ్గుర్తున్నంతవరకు "ఆయన ఒక ఇజ్రాయెలీ. రాజమండ్రి గురించి ఆయన పుస్తకంలో ఎంత బాగా రాశాడో - రాజమండ్రిలో పుట్టి పెరిగినవాళ్ళు కూడా అంత బాగా రాయలేరేమో.. నీకా పుస్తకం మెయిల్లో పంపిస్తాను - తప్పకుండా చదువు"

అది వింటూనే - వినీవినగానే ప్రశ్నలడగడం అలవాటున్న నాకు - నోట్లోనుంచి వచ్చిన మొదటి ప్రశ్న "అదేం పుస్తకమండి? ఎవర్రాశారు?" అంటూ.

"డేవిడ్ షుల్‌మన్ రాసిన Spring Heat Rains" జవాబిచ్చారు బాబ్జీగారు.

అంటూనే ఆ పుస్తకం పేర్రాసుకోవడానికి వీలుగా తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు.

అప్పుడే అనేసుకున్నాను - మా గోదారొడ్డున బ్రిడ్జొడ్డాణం పెట్టుకున్న మా రాణకెక్కిన రాణ్మహేంద్రి గురించి రాసిన పుస్తకం కొనుక్కుని - కొనుక్కున్న తర్వాత మాత్రమే చదవాలని.

అలా అనుకున్నదే తడవు - మా ఇంటి దగ్గర వెస్ట్‌కౌంటీమాల్‌లో వున్న Barnes & Noble కి వెళ్ళాం ఇంటిల్లిపాదీ. తీరా వెళ్తే వాళ్ళ దగ్గర నేనడిగిన పుస్తకం ఉందని చెప్పారు - కానీ ఒకే ఒక కాపీ అది కూడా ఎక్కడో వేర్‌హౌస్‌లో ఉందని చెప్పారు. అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తే - అదే సమయానికి ఇంకెవరూ అడగకుండా ఉంటే - ఒక మాటలో చెప్పాలంటే నా నక్షత్రాలు బావుంటే ఆ పుస్తకం నా చేతికి ఒక వారంలో అందుతుందని చెప్పింది పుస్తకాలమ్మిణి.

సరే - ఇంకేం చేస్తాం. పుస్తకం తెప్పించమని చెప్పి ఇంటికి వచ్చేశాం. ఒక వారం రోజుల్లో ఈమెయిల్ వచ్చింది - పుస్తకం  వేర్‌హౌస్‌ నుంచి షాపుకి పంపబడిందని -నేను వెళ్ళి తెచ్చుకోవచ్చని.

ఆ వీకెండ్ వెళ్ళి - ఆ పుస్తకం కొనుక్కుని తెచ్చేసుకున్నాను - SPRING, HEAT, RAINS - A South Indian Diary by David Shulman.




---------------------------------------------------------------------------------------------------------------

పుస్తకం మొదటి పేజీలో రాసుకున్న - పతంజలి శాస్త్రి మరియు స్మైల్ గార్లకి - అభినందన పద్యంతో మొదలు షుల్‌మన్‌గారి డైరీ.

ఒక్క తల్లి కొప్పన్ ఉదయంబు బొందిన
బాంధవంబు కంటె బహుగుణముల
వసుధన్ ఎన్ని చూడ వాగ్జాత బాంధవంబ్
అధికమ్ అండ్రు కావే ఆర్యులెల్ల

ఆమని
(మొదటి 66 పేజీలు)

రాళ్ళు
మేకలు
ఎండిన పొదలు
గేదెలు
ముళ్ళు
కూలిపోయిన చింతచెట్టు
గుడారాలు
ఎఱ్ఱ ఇటుకల గుట్టలు
ఆవపిండి రంగులో ఉన్న పరిసరాల్లో అక్కడక్కడ తళుక్కుమనే తెల్ల రంగు సమాధులు
మట్టి దారిలో ఒక మోటరుసైకిలు
పసుపు-నలుపు రంగుల ఆటో రిక్షా
తాటిచెట్లు
సైకిళ్ళు
నారింజరంగు చీరలు
ఆమె తల్లో ఒక తెల్లపువ్వు
కళ్ళు

ఫిబ్రవరినెల - ఒకానొక ఉదయం - తెలంగాణ ప్రాంతంలో మహబూబాబాద్ మీదుగా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ గుండా షుల్‌మన్‌ చూసిన చలానాచలన-విచిత్ర-దృశ్యాల సమాహారం.

కొద్దిసేపటి తర్వాత దిగవలసి వచ్చిన హైదరాబాదు - నాంపల్లి స్టేషన్‌లో అంతా గందరగోళం. తనెక్కాల్సిన రైలు ఏ ప్లాట్‌ఫాం మీదకొస్తుందో చెప్పేవారు, చెప్పగలిగేవారు, చెప్పబోయేవారు లేనే లేరు.

ఎలాగోలా నడిచి - బరువుగా వున్న  బాగ్గులు, మోయక తప్పని మినరల్ వాటర్ సీసా పట్టుకుని - మెట్లెక్కి వంతెన మీదుగా నడిచి - మళ్ళీ అవతల పక్క మెట్లు దిగుతున్న ప్రయాణీకుల మధ్య తన దారిని చూసుకుంటూ, చేసుకుంటూ వెళ్తే - కనిపిస్తుందని అనుకోనే అనుకోని - కనిపించిన అద్భుతం - ఒక రైలుపెట్టె మీద - David Dean Sul., Age -57, Berth - 38 అన్న తన ప్రవర.

అలా జరిగింది - షుల్‌మన్‌ భారతదేశపు పునఃప్రవేశం.
తెలిసిన భాష అంతంతమాత్రం.
ఎక్కడో మనోలోయల్లో ఇరుక్కుపోయిన మాటలు - అందరానివి.
మరపులో గడ్డకట్టినవి.
జ్ఞప్తి ప్రయత్నాలని ప్రతిఘటిస్తున్నవి.

ఆ క్కికిరిసిన రైల్లో - తన సీట్లో కూర్చుని - చుట్టూ గలగలలాడుతున్న మాటల జలపాతానికి తన వంతు చిరు-పదాల జల్లుని చేర్చలేని అసహాయతతో కిటికీలోంచి బయటికి చూస్తే - నెమ్మదిగా పరిసరాల వర్ణచిత్రం మారుతోంది.

ధాన్యపు కంకులు
పచ్చని మొలకలు
నల్లని రాళ్ళు
అవధిలేని నీలాకాశం
ఒక్కో కాలు ఎత్తి వేస్తూ - బహు జాగ్రత్తగా - కొలనుల్లో నడుస్తున్న బక-విన్యాసాలు
తామర ఆకులు
ముళ్ళు
బండరాళ్ళు
పొలాల్లో అక్కడక్కడ ఉంచబడ్డ కుప్పనూర్చు సాధనాలు - తూర్పార బట్టే చేటలు
గడ్డి మేటులు
ఎండిపోబోతూ కూడా ఉనికిని చాటుతున్న నది
ఒక వంతెన
ఒక గుట్ట
ధాన్యం చెరుగుతున్న ఇద్దరు పడుచులు
పెద్ద పసుపుపచ్చ బోర్డు మీద మెరుస్తున్న నల్ల అక్షరాలు - పాపటపల్లి
చొక్కా మాత్రమే వేసుకున్న ఒక చిన్నపిల్లాడు
గడ్డిని చెదరగొడుతున్న గాలి
మరి ఐదు గేదెలు
గుండ్రంగా ఉన్న తాటాకు గుడిసెలు
దూరం నుంచి ఱంపపుపళ్ళలా కనిపిస్తున్న కొండలు
దూరంగా వున్నకొండలు దగ్గరయ్యే కొద్దీ ఆనే ఎరుపు-నారింజ రంగు
అనీ అనిపించకుండానే ఉబుకుతున్న సంతోషం
దాన్ని అనుభవించడానికన్నట్టు ఆరంభంగా షుల్‌మన్ తన సంచిలోచి బయటికి తీసిందేంటో తెలుసా? - శ్రీహర్షుడు రాసిన సంస్కృత కావ్యం - నలదమయంతుల ప్రణయకావ్యం - నైషధీయం.

ఈ ప్రయాణానికి మొదటి మజిలీ - రాజమండ్రి - ఆనంద్ రీజెన్సీ హోటల్.

గోదావరి వంతెన మీదుగా - రాజమండ్రి పట్టణంలో ప్రవేశిస్తుంటే - కనిపించిన దృశ్యం ఎలాంటిదంటే - మిట్టపల్లాలుగా, గజిబిజిగా వున్న ఇళ్ళు. ఆ ఇళ్ళకున్న వెలిసిపోతున్న లేత రంగులు - పాచి అంచు కట్టిన ముఖద్వారాలు. సందులు. ఇవన్నీ గోదావరి ఒడ్డున చింది వస్తున్నట్టుగా కనిపించాయట - ఇవన్నీ అదనపు అమరికగానే కనిపిస్తూ - గోదావరినదే అసలు-సిసలైన రాజండ్రిలా అనిపిస్తుంది షుల్‌మన్‌గారికి.

ట్రెయిన్ దిగి బయటికి రాగానే - మళ్ళీ అదే గందరగోళం. ఇక్కడికి ఎందుకు వచ్చారు - అందులోనూ రాజమండ్రికి అనే అవే ప్రశ్నలు.

విదేశీయులు, ప్రాంతానికి కొత్తవారు అని తెలిసీ తెలియగానే - వీలైనంత రాబట్టాలనుకునే రిక్షావాళ్ళు అడిగిన ఏభై రూపాయలు ఇచ్చి - రాజమండ్రి వీధుల్లో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆనంద్ రీజెన్సీ హోటల్‌కి చేరుతారు షుల్‌మన్‌.

[లలిత ఉవాచ: రాజమండ్రి, గోదావరి, ఆనంద్ రీజెన్సీ - స్వర్గాదపి గరీయసి]

ఆరేళ్ళ క్రితం చూసిన - రాజమండ్రి పట్టణపు - ఏకైక - నక్షత్రపుహోటల్ - తన పూర్వపు తళుకు ప్రస్తుతానికి బెళుకు కాగా - గతకాలపు వైభవంలా నించుని వుంది.

గదిలో చేరి - కిటికీ తెరిచిన షుల్‌మన్‌కి - ఎఱ్ఱటి దుమ్ము వలయంలో వున్న తెల్లటి దానవాయిపేట ఇళ్ళు - అందులో ఒకానొక ఇంటి డాబా పైన ఆరబోసిన ఎఱ్ఱమిరపకాయలు.

[లలిత ఉవాచ: పుస్తకమంతా ఇలాంటి రంగుల ప్రసక్తులెన్నో. షుల్‌మన్‌గారు మన దేవులపల్లివారి బోలు భావకవేమో వారి భాషలో-పరిభాషలో అనిపించేసింది నాకైతే!]

ఆ రోజు రాత్రికి షుల్‌మన్‌గారు తిన్నది - ఎంతో ఇష్టమైన కాకరకాయ కూర భోజనం; విన్నది - షరీఫ్ అనే ఒక వెయిటర్ కాకరకాయ కూర వడ్డిస్తూ - తాను గౌతమీ గ్రంధాలయంలో చదివిన పుస్తకాల నుంచి - పంచుకున్న తాత్వికత నిండిన ఆలోచనలు.

ఏడు నెలలు ఉండబోతున్న కాలంలో - రాజమండ్రిలో ఏం చేయబోతున్నావ్? అని అడిగిన స్నేహితులు Yair కి షుల్‌మన్‌ చెప్పిన సమాధానం ఆయన మాటల్లోనే - One should never go to India with a plan.

[లలిత ఉవాచ: ఇంతకు మునుపు వచ్చినప్పుడు షుల్‌మన్‌గారికి - తానొకటి తలచిన ప్లానొకటి అగునని - బాగా అనుభవమైనట్టు అర్థమయింది ఈ మాటలు చదివినప్పుడు.]

రాజమండ్రిలో మొట్టమొదటగా షుల్‌మన్‌ చూడాలనుకున్నది - గోదావరి నది, ఆ నది ఒడ్డునున్న రేవులు (revus అని పుస్తకంలో రాసుకున్నారు).

ఒక ఆటోరిక్షాలో పుష్కరరేవుకి వెళ్తారు.

ఆ పుష్కరరేవులో షుల్‌మన్‌ చూసిన దృశ్యం: పరచివున్న రాళ్ళ మెట్లు దిగి నదిలో స్నానమాడబోతున్న యాత్రికులు - వారిని తన అలల చేతులతో ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుముతూ, తడుపుతున్న గోదావరి నదీమతల్లి.

అక్కడినుంచి - తనంతకు ముందుసారి వచ్చినప్పుడు బస చేసిన - మహాలక్ష్మి హోటల్‌కి వెళ్ళి - అక్కడి మేనేజర్ రవిసుందర్‌ని కలుస్తారు షుల్‌మన్.

రవిసుందర్ షుల్‌మన్‌ని మహాలక్ష్మిలో బస చేయమని ఆహ్వానిస్తూ - ఉచితమైన రేటు పొందేలా చేస్తానని హామీ ఇస్తారు. ఇక్కడ ఉచితం అంటే వీలైనంత సరసమైన ధరే కానీ - ఫ్రీ కాదన్నమాట.

[లలిత ఉవాచ: ఎక్కడైనా స్నేహం కానీ వ్యాపార సంబంధాల్లో కాదని నిరూపితం.]

మహాలక్ష్మి హోటల్ కిటికీల్లోంచి కనిపించే - ఉరుకుల పరుగుల గోదావరి తన మనసును దోచినా - ఎక్కువ రోజులు ఉండాలి కదా, అందుకని ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నానని చెప్తారు షుల్‌మన్.

మహాలక్ష్మి నుంచి బయల్దేరి కోటగుమ్మం వెళ్ళిన షుల్‌మన్ - అక్కడ శివ-దక్షిణామూర్తి విగ్రహం పక్కగా వున్న సందుల్లో వున్న ఒక పాత పుస్తకాల అంగడికి వెళ్ళి - అక్కడున్న పాత కాశీమజిలీకథల పుస్తకాలు కాసేపు తిరగేసి చూసి - flat దొరికిన వెంటనే వెనక్కు వచ్చి కొనుక్కోవాలనుకుంటారు.

తెలుగు పుస్తకాలు చదివే - తెలుగు మాట్లాడే ఈ తెల్లమనిషిని చూసి ఆశ్చర్యపోతూ ఆ తెలుగు పాతపుస్తకాలఅంగడి యజమాని - మీ ఊరేది? - అని తెలుగులో అడిగితే - తడుముకోకుండా షుల్‌మన్ ఇచ్చిన సమాధానం - "రాజమండ్రి".

---------------------------------------------------------------------------------------------------------------


ఇవాళ్టికి ఈ రాజమండ్రి కోటగుమ్మం రోడ్డులో ఆపుతానే - మళ్ళీ వచ్చే నెల దాకా.....

అమెరికాలో పుట్టి, జెరుసలేమ్ హిబ్రు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఒకటికి రెండు సార్లు  మా రాజమండ్రికి వచ్చి - గోదావరిని దేవతామూర్తిగా ఎంచి - తెలుగు నేర్చుకుని తను రాసిన ఇంగ్లీష్ పుస్తకంలో బోల్డన్ని తెలుగు మాటలు వాడుతూ డేవిడ్ షుల్‌మన్‌గారు రాసిన SPRING, HEAT, RAINS పుస్తకం గురించి ఏవో నాలుగు ముక్కలు ముక్కున పట్టి రాసేసి - 'చాలా బావుంది' - అనేసి ఊరుకోవడానికి మనసొప్పక - ఆ పుస్తకంలో ప్రతీ పేజీని - చదివినదే మళ్ళీ చదువుతూ - నా పఠన-ప్రయాణాన్ని గురించి రాసుకోవాలనిపించింది.

అనిపిస్తే రాసేయాలి కదా మరి!

అసలు ముందు నేననుకున్నదేంటంటే - ఈ పుస్తకం గురించి  రాసి ఏదైనా వెబ్-పత్రికకి పంపిద్దామా అనుకున్నాను - ముఖ్యంగా "ఈమాట" కి. ఎందుకంటే అక్కడ డేవిడ్ షుల్‌మన్‌గారి ఇంగ్లీష్ రచనలు ఉంటాయి. నేను ఆయన పుస్తకం గురించి రాసినది - ఈమాటలో ప్రచురిస్తే ఎప్పటికైనా ఆయన చదవగలిగే అవకాశం ఎక్కువ.

కానీ మళ్ళీ నాకే అనిపించిందేంటంటే - నా బ్లాగ్ లో అయితే పుస్తకం చదువుతూ నాకు తోచిన నోట్స్ లలిత ఉవాచ అని పెట్టి రాసేసుకోవచ్చు. అదే వెబ్-పత్రికలైతే వారివారి నిబంధనలకి కట్టుబడి రాయాలి. నేను రాసింది రాసినట్లుగా ప్రచురించడానికి వారు ఒప్పుకోకపోవచ్చు. అదీ కాక - ఇది మామూలుగా ఒక పేజీలోనో, పోస్టులోనో కుదించేసి "హమ్మయ్య - అయిపోయింది" అనేసుకోవాలనిపించలేదు. అందుకే దీన్ని ఒక సిరీస్‌లా మొదలు పెట్టాను.

అందులోనూ మాకు మొన్ననే మార్చ్ 21 న ఆమని ఆగమించింది.

ఏమో ఏమగునో గానీ ఆమని ఈ వని అన్న దేవులపల్లి వారిని - ఆమనీ పాడవే హాయిగా అంటూ రాగాలల్లిన వేటూరివారినీ - స్మరించుకుని ఆమని ఆగమించిన ఈ మార్చ్ నెలలో నే మొదలెట్టిన ఈ కొత్త సిరీస్ - నా నేస్తు పుస్తకమస్తు -  శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు అగుగాక!

అసలు కబురు పుస్తకం గురించైనా - రేపటి శ్రీరామనవమి గురించి ఒక చిన్న సిసలు కబురు రాయకుండా ఉండడానికి మనసొప్పట్లేదు.

మా కరణం గారింటి ముందు ఆడుతూ పాడుతూ సీతారాముల కల్యాణాన్ని చూసిన చిన్ననాటి శ్రీరామనవమి చలువ పందిరిని తలుచుకుంటూ... ఒక చిన్న పెళ్ళి కబురు

ఆమని పువ్వుల వేళ
నవమి వెన్నెల నాడు  
ఆకాశమే పందిరి 
నేలేమో పెళ్ళికి విడిది 

మనసు దోచినవాడు 
మనువాడ వచ్చినవాడు 
వానకారు మోసుకొచ్చిన మబ్బు రంగు మేని తండ్రి - 
రామచంద్రుడు...

మనసు విచ్చి మెరిసినది
మనువాడి మురిసినది
మబ్బు అంచున మెరిసిన తటిల్లతేమో! - వెన్నెలంటి తల్లి - 
రామచక్కని సీత...
 

12 కామెంట్‌లు:

  1. లలిత గారూ, ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి వార్తలు చదివి చదవగలిగిన టపాలేమైనా వున్నాయా అని బ్లాగు విహారం చేస్తుంటే మీ పోస్టు కనిపించింది. మీర్రాసిన టపా చదవగానే పుస్తకం లైబ్రరీలో దొరుకుతుందేమో నని నెట్ లో విచారిస్తే దొరకలేదు. ఆలసించిన ఆశాభంగమన్నట్లు అమెజాన్ లో పుస్తకాన్ని ఆర్డర్ చేశాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి స్థానికేతరుల దృష్టికోణంలో చదవడం నాకిష్టం. ఇలాంటి పుస్తకమే మారొకటి Empires Of the Indus - Alice Albania. మీకు నచ్చవచ్చు. దీనిపై అప్పట్లో నేను వ్రాసుకొన్న చిన్న వ్యాసం

    http://chiruspandana.blogspot.com/2012/04/empires-of-indus-alice-albania.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కర రామిరెడ్డి గారు: మీరు నా బ్లాగ్ చదివి పుస్తకం కొంటున్నారని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను - నచ్చాలని కోరుకుంటున్నాను. మీరు రాసిన సమీక్ష వీలు చేసుకుని తప్పకుండా చదువుతాను.
      Thanks for sharing the link.

      తొలగించండి
  2. రామిండ్రీ గురించి ఒక పాశ్చాత్యుడు రాసిన పుస్తక సమీక్షా సిరీస్ కి అస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అస్తు.

    శ్రీరామనవమినాడు చినమేష్టారింట్లో జరిగే వేడుక కోలాహలం ఒక అద్భుతం, అలౌకికమయిన అనుభూతి, ఓ జీవితకాలపు మధురజ్ఞాపకం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్‌గారు: మరి మన రామిండ్రి కదండి మరి - మీ "అస్తు" లకి మారువాదాల్లేని ధన్యవాదాలండి - ఆయ్!

      తొలగించండి
  3. // “ పుస్తకం మొదటి పేజీలో రాసుకున్న - పతంజలి శాస్త్రి మరియు స్మైల్ గార్లకి - అభినందన పద్యంతో మొదలు షుల్‌మన్‌గారి డైరీ.” //

    అంటే ఈ పుస్తకం తెలుగులో కూడా లభ్యమాండి? అయితే ఆనందించవలసిన మాటే. ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుందేమో ప్రయత్నించాలి.

    మీరు వినే ఉంటారు - అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో (మాడిసన్) కొన్ని దశాబ్దాల పాటు (తరువాత అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీ కి మారారు) అధ్యాపకుడిగా పని చేసిన డాక్టర్ వెల్చేరు నారాయణరావు గారితో కలిసి డేవిడ్ షుల్మన్ గారు పలు రచనలు చేసారట. అటువంటి భాషావేత్త మన తెలుగు ప్రాంతాల్లో కొంతకాలం గడిపారంటే మరింత ఆనందించవలసిన సంగతి. వారి ఈ పుస్తక పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహారావుగారు: పుస్తకం ఇంగ్లీష్‌లోనే రాశారండి. ఆ పద్యం కూడ English script లో వుంటుంది.
      మీరన్నట్లు షుల్‌మన్‌గారు వెల్చేరు నారాయణరావుగారి స్నేహితులే. పుస్తకంలో కూడా ఆయన ప్రసక్తి చాలా సార్లు వస్తుంది. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  4. Very interesting.... and nice to know about these books 📚 through you ... aa pustakam lo ela varnincharo telidu kani... Meeru matram aa pustakam chadavavlisinde antlu raasru...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకైతే పుస్తకం చాలా నచ్చింది శారదా! Thanks for your comment!

      తొలగించండి
  5. పానకంలా అద్భుతంగా ఉంది. Thanks for suggesting.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీ కమెంట్ కూడా పానకంలా తియ్యగా వుంది. థాంక్స్!

      తొలగించండి