కొత్త సంవత్సరం - కొత్తగా యప్-టీవీకి చందా కట్టాము - ఒక సంవత్సరం కట్టుబడి ఉందామని.
వారానికో మూణ్ణాలుగు గంటలు మనసుకి నచ్చిన పాతవో - మనసు నొచ్చినా కొత్తవో సినిమాలు చూడగలిగినంత సేపు మాత్రమే చూసి ఆపేయొచ్చు అన్న వీలుంటుంది కదా అని.
రీళ్ళు రీళ్ళు సాగే తెలుగు సీరియళ్ళు - ఎప్పుడూ చూడలేదు కానీ - మనవళ్ళ ఆటపాటలు చూద్దామని వచ్చిన నాన్నమ్మ ఇక్కడ ఉన్నప్పుడో , అమ్మమ్మ-తాతగార్లు వచ్చినప్పుడో తెలుగు టీవీ కోసమని చందా కట్టేవాళ్ళం - వాళ్ళ కాలక్షేపం కోసం.
వాళ్ళు టీవీ చూసే టైంలో అటూ-ఇటూ తిరుగుతూ ఓ కన్నుతో చూసీ చూడక - ఓ చెవితో వినీ వినక - వచ్చీరాని తెలుగు భాషా జ్ఞానంతో సీరియళ్ళలో కొన్ని సీన్లు చూసి - అన్నజింక అన్న మాటలు ఇప్పటికీ గుర్తే -"అమ్మా ! ఇండియాలో ఎవరి మీదన్నా కోపమొస్తే గ్లాసులో మజ్జిగిచ్చి చంపేస్తారా?" - అంటూ.
అప్పటినుంచి టీవీ వినొద్దు-టీవీ కనొద్దు - టీవీ మనకొద్దు అన్నది మా ఇంటి టీవీ-"న"నాదం అయ్యింది.
సరే - మరిప్పుడు ఇంట్లో కొత్తగా టీవీ మోగడం మొదలయింది. స్వరాభిషేకం అనే కార్యక్రమమేదో బావుందని అమ్మ చెప్తే ఒకే ఒక్క ఎపిసోడ్ చూశాను - జనవరి చివర్లోనో ఎప్పుడో.
ఆ కార్యక్రమంలో రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో తను పాడిన పాటల గురించి మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - తన అంటే ఎస్పీబీ సంగీత దర్శకత్వంలో రమేష్ నాయుడు గారు పాడిన ఒక అపురూపమైన పాటొకటి హమ్ చేశారు. అసలే నాకు అసలు పాటల కన్నా ఇలాంటి కొసరు కబుర్లంటే మహా సరదా. ఆ అరుదైన పాట "రాదా...మళ్ళీ వసంత కాలం?" అంటూ మొదలవుతుంది.
ఎస్పీబీ ఇంకా ఏం చెప్పారంటే "నేను స్రవంతి సినిమాకి సంగీతం సమకూర్చేటప్పుడు ఈ పాట రమేష్ నాయుడు గారి చేత పాడిద్దామని ఆయన పాటల బాణీలోనే ఉండేట్లు చేశాను. ముందు ససేమిరా పాడను అన్నారాయన. నేను సిగరెట్లు ఎక్కువ కాలుస్తాను - గొంతెత్తి పాడలేను అన్నారు. లేదు - మీరు పాడగలరు అని ఒప్పించి పాడించాను. అటు తర్వాత ఈ పాట ట్యూన్ విన్న వేటూరిగారికి ఎంత నచ్చిందంటే ఆయన సంగీతం కూరుస్తున్న ఒక ప్రైవేట్ క్రైస్తవ భక్తి గీతాల ఆల్బంలో ఒక పాట ఇదే వరసలో రాసి నా చేత పాడించేంతగా" - అని.
దాంతో మొదలు - నా స్వరరాగ-పరిశోధన.
అసలు పాట: రాదా ....మళ్ళీ వసంతకాలం?!
స్వరాలు కూర్చిన వారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
పదాలు పేర్చిన వారు: వేటూరి సుందరరామమూర్తి
గళాన్ని చేర్చినవారు: రమేష్ నాయుడు
యూట్యూబ్ నంతా వెదికా స్రవంతి సినిమా పాటల్లో ఉందేమో అని - పాట ఆచూకీయే లేదు.
గూగుల్ చేసి చూశా - అబ్బే! నాక్కావల్సింది తప్ప ఎక్కడెక్కడి పేజీలో పట్టుకొచ్చింది.
అప్పుడు గుర్తుకొచ్చింది - పాటల పెన్నిధి - http://www.allbestsongs.com/
గబగబా అక్కడికి వెళ్ళి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటల్లో స్రవంతి సినిమా దగ్గర వెతికితే అసలా పాటే కనపడలేదు. ఉసూరుమనిపించింది. ఎన్నో పాటలున్న ఈ సైట్లోనే నాకు కావల్సిన పాట దొరకలేదంటే ఇంకెన్ని పాట్లు పడ్డా పాట దొరకదనిపించింది.
అయినా ఇంకొక్కసారి చూద్దామని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీబీ లిస్ట్‌లో R తో మొదలయ్యే అన్ని పాటలూ చదువుతూ వెతుకుతూ ఉండగా... డగా ...గా .... దొరికేసిందీ !
వెంటనే ఆ allbestsongs సైట్ ఓనరైన శ్రీనివాసరావుగారికి ఈ-మెయిల్ ఇచ్చాను - "రాదా... వసంతకాలం" అనే పాటని నా బ్లాగ్‌లో వాడుకోవడానికి అనుమతినివ్వమని. వెంటనే బదులిచ్చారు - "Sure లలిత గారు" - అంటూ.
ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే ఈ పాట ఎస్పీబీ చెప్పినట్లు స్రవంతి సినిమాలోది కాదు. శోభన్ బాబు, సుహాసిని నటించిన కొంగుముడి సినిమాలోది - అని శ్రీనివాస్ గారి లిస్ట్ చెప్పింది.
ఆ లిస్ట్ చెప్పిన లింక్ పట్టుకుని ఒక సోమవారం రాత్రి మొదలుపెట్టి రోజుకో నలభై నిముషాల చొప్పున మూడు రోజులు అంటే బుధవారం వరకు యూట్యూబ్‌లో కొంగుముడి సినిమా చూశాను -"రాదా ... వసంతకాలం?!" అని ఆ అపురూపమైన పాటను హమ్ చేసుకుంటూ.
"రాదా?!"... "రాదా?!" అని పదే పదే నేను పాడుకోవడమే కానీ ఎప్పటికీ కొంగుముడిలో ఆ పాట రాదే! చివరి వరకూ చూసినా రానే లేదు.
యూట్యూబ్‌లో కొంగుముడి సినిమా వీడియోలో సరిగ్గా 1:24:31 దగ్గర ఆ పాట మొదలవుతున్న సూచనగా మ్యూజిక్ వినిపించింది కానీ - అసలు సినిమాలోనే తీసేశారో - లేకపోతే యూట్యూబ్‌లో మాత్రమే లేదో - మొత్తానికి ఆ వసంతపు పాట రాక ఆచూకీనే లేదు.
అందుకని allbestsongs సైట్లో వున్న పాటనే ఇక్కడ పోస్ట్ చేశాను.
ఈ పాట వింటూ వుంటే - చాలా రోజుల తర్వాత ఏంటో దిగులు - ఏదో కావాల్సింది చేజారిందన్న బెంగ - వెనక్కి తీసుకు రాలేని రోజుల్ని తల్చుకుని ఇదీ అని చెప్పలేని అశక్తత.
రమేష్ నాయుడుగారి గొంతులో ఈ పాట వింటే - ఆ పాటలో వున్న మాటల్లోని వెత నిలువెల్లా కమ్మినట్లనిపించింది.
అలా అని పాట నచ్చలేదని కాదు - వినగానే నచ్చేసింది.
వేటూరి సుందర రామమూర్తి గారి పదేంద్రజాలంతో నిండి వున్న ఈ పాట - పదం, స్వరం, గళం - రామసుందరం...
నాకు నచ్చిన కొన్ని మాటలు - వాటిని నాక్కావలసినట్టు చేసుకున్న అర్థాలు
- నిరాశలే విరాళిగా - తన జీవితంలో వసంతం ఇంక వస్తుందన్న ఆశ లేని వేళ మిగిలిన నిరాశతో తప్పని వలపేమో ఈ విరాళి
- జాలి కన్నీళ్ళు - తన మీద తనే పడ్డ జాలితో కారుతున్న కన్నీళ్ళేమో ఇవి
- గాలి కౌగిళ్ళు - రాదనుకున్న వసంతంలో దొరికేవి ఊహకి మాత్రమే అందే, ఊహించుకోగలిగినవి మాత్రమే అయిన గాలి కౌగిళ్ళు
ఈ పాటలో ఇంకో విశేషం - మొదటి చరణానికి, రెండో చరణానికి మధ్యలో పల్లవి రాదు.
ఈ పాటలో అర్థం కాని మాటలో రెండు - అడగడానికి వేటూరి గారిప్పుడు లేరు - ఎవరికైనా తెలుసేమో అడగాలి:
- వలపు నీరాలు
- వయసు హారాలు
ప్రస్తుతానికి ఆపాట ఈ కింది లింక్ మీద క్లిక్ చేసి వినొచ్చు - ఆ కింద రాసిన పాట చూసి పాడుకుంటూ....
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2122
రాదా... మళ్ళీ వసంతకాలం?!
మాలో నిరాశలే విరాళిగా సాగే...
జాలీ కన్నీళ్ళలో... గాలీ కౌగిళ్ళలో...
రాదా... మళ్ళీ వసంతకాలం?!
మాలో నిరాశలే విరాళిగా సాగే...
జాలీ కన్నీళ్ళలో... గాలీ కౌగిళ్ళలో...
నిదుర పోదాయె నా కంటిపాప - చెదిరే స్వప్నాలతో...
ఎదలో నిట్టూర్పుతో - హో ...
భుజము దిగదాయె ఈ చంటిపాప - దిగులు వెక్కిళ్ళతో...
తడిచే చెక్కిళ్ళతో...
మరలా రానే రాదా ఆ చైత్రమాసం - ఊగాడు ప్రాణాలలో
రాలే వెన్నెల్లతో - కరిగే రాత్రిళ్ళతో
పగటి కలలాయె మా జీవితాలు - వెగటు పంతాలతో...
తగని పట్టింపుతో... హో...
కలసి రాదాయె ఆ మంచిరోజు - వలపు నీరాలతో...
వయసు హారాలతో...
బిగువు బింకాలింకా ఎన్నాళ్ళదాకా - అల్లాడు బంధాలలో
వగచే కోయిల్లతో... ఎగసే గీతాలలో
రాదా... మళ్ళీ వసంతకాలం?!
మాలో నిరాశలే విరాళిగా సాగే...
జాలీ కన్నీళ్ళలో... గాలీ కౌగిళ్ళలో...
సిసలు పాట: ఏసో! ఎంత వరాల మనసో నీది ...
ఎస్పీబీ ప్రస్తావించిన అసలు పాటకి కవలైన సిసలు పాట ఏసో ఎంత వరాల మనసో నీది! అన్న క్రైస్తవ భక్తిగీతం వెతకడం అంత కష్టం కాలేదు.
ఇలా వెతగ్గానే అలా దొరికేసింది - యూట్యూబ్‌లో - ఎవరో పుణ్యాత్ములు పోస్ట్ చేశారు.
అసలు పాట బరువుగా అనిపించినట్లనిపిస్తే - బాలు నవ్వు గొంతుతో పాడిన ఈ పాట తేలికగా అలల మీద పడవలా కదుల్తున్నట్లనిపించింది.
ఈ పాటకి...
స్వరాలు కూర్చిన వారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
పదాలు పేర్చిన వారు: వేటూరి సుందరరామమూర్తి
గళాన్ని చేర్చినవారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
అసలు పాటతో సమానంగా నచ్చేసిన ఈ సిసలు పాటలో నాకు బాగా నచ్చిన రెండు వాక్యాలు:
- నీవే రేవంట ఏ నావకైనా
- నీవే కడలంట ఏ వాగుకైనా
యూట్యూబ్‌లో పాట వింటూ - ఆ కింద రాసిన పాట పాడేసుకోవచ్చు ...
ఏసో! ఎంత వరాల మనసో- నీది!
సిత్ర సిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో! నీ మహిమే హైలెస్సో!
గాలి వానొచ్చి నడి ఏటిలోనా - నావ అల్లాడగా
నీవే కాపాడినావే... హా
కంట జూడంగ గాలాగిపోయే - అలలే సల్లారెనే
మహిమ సూపించినావే...
నిన్ను పొగడంగ నేనెంత వాడా - నీటి మడుగుల్లో సేపంటి వాడా
నా దారి గోదారిలో
బ్రతుకే హైలెస్సో ఏసో - పలికే నీ దాసో
ఏసో! ఎంత వరాల మనసో- నీది!
సిత్ర సిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో! నీ మహిమే హైలెస్సో!
దిక్కు లేనట్టి దీనార్తులంటే - నీవు కురిసే దయా
నాడే తెలిసిందయా - హో...
జంతు బలులిచ్చే మూఢాత్ములంటే
నీలో కరిగే సొదా...
కరుణే ఎదజల్లగా
నీవే రేవంట ఏ నావకైనా - నీవే కడలంట ఏ వాగుకైనా
ఉప్పొంగు నీ ప్రేమలో
నడిసే హైలెస్సో - మడిసే నీ దాసో
ఏసో! ఎంత వరాల మనసో- నీది!
సిత్ర సిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో! నీ మహిమే హైలెస్సో!
ఎప్పటినుంచో వేటూరి గారి కలం నుంచి వచ్చిన ఈ కవల-పాటలని పోస్ట్ చేయాలని అనుకుంటున్నా - ఈ రోజుకి కుదిరింది. అందులోనూ ఈ రోజు ఈస్టర్ సండే అవడం భలేగా కలిసొచ్చింది.
అసలు పాట నా బ్లాగ్‌పోస్ట్‌లో వాడుకోవడానికి అనుమతినిచ్చిన చిమటా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలతో ...
సిసలు పాట నచ్చి పాడుకునే అందరికీ ఈస్టర్ శుభకామనలతో ...
~ పాటల భైరవి

LOL...పాటల భైరవి...నిజంగానే మీరు పాటల భైరవి + మాటల మరాఠి. ఎందుకు అంటే చదవడం మొదలు పెడితే తల తిప్పకుండా చదివిస్తారు. చాలా బాగుంది పోస్ట్.
రిప్లయితొలగించండిమాటల మరాఠి - భలే పేరు పెట్టావ్ నాకు శారదా! నచ్చింది :)
తొలగించండిఒక పాట కోసం మీ తపన ...awesome! కొత్త వెబ్ సైట్ మాకు అందించినందుకు థాంక్స్. నిజంగా ఆ వెబ్ సైట్ ఒకటి వుందని అస్సలు తెలియదు. ఎప్పుడూ గూగుల్ లేదా యూట్యూబ్. పాటల భైరవికి చప్పట్లు!
రిప్లయితొలగించండినీ చప్పట్లకి బోల్డన్ని థాంక్సమ్మాయ్!
తొలగించండిపాత పాటలు ఎప్పుడూ ఆపాత మధురాలు. ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాల్సిందే. మీరు ఎప్పుడెప్పుడు పోస్ట్ పెడతారా అని చూస్తుంటాను.
రిప్లయితొలగించండినా బ్లాగ్‌ని ఇంత ఇష్టంగా చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్, కాత్యాయిని!
తొలగించండిమామూలుగా హారాలు అంటే నగల్లో ఒక రకం మెడలో వేసుకునే హారాల్ని అన్వయిస్తూ వయసు హారాలు అని రాసి ఉంటారనుకుంటున్నానండీ.
రిప్లయితొలగించండిఇంక వలపు నీరాలు అంటూ వెతికితే ఒకటి రెండు ఇవి దొరికాయి, మీకేమన్నా పనికొస్తాయేమో చూడండి
//సంద్రంలో ఎన్ని నీరాలు ఉన్నాయో
నయనంలో అన్ని నీలాలు దాచానూ//(గజల్ కాన్వాస్)
//గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు
ఊహల విరిజల్లు మది ఊగే పరవళ్లు
తోటలో నీ పైట నీడన ఉంటే చాలు
స్వాగత "నీరాలు" రసరంజిత తీరాలు
ఎలా నిన్ను మరవను
ఎలా క్షణం గడపను
నీ పాద చుంబనం
నా పూజా సాధనం// (భామా కలాపం-సినారె)
హారాలు - నీరాలు గురించి వెతికి ఈ వివరాలు అందించినందుకు చాలా థాంక్స్ అండి, శ్రీనివాస్‌గారు!
తొలగించండిలలితా! పాట కోసం ఇన్స్టాల్మెంట్లలో సినిమా చూసిన నీ తపన నచ్చింది.
రిప్లయితొలగించండిఆపాటను పంచుకోవడానికి అనుమతి అడగడం ఇంకా చాలా నచ్చింది.
రాగమైనా, అనురాగమైనా, సరాగమైనా, విరాగమైనా ఏరి వేటూరికి సాటి?
పాట కోసం చిన్నచిన్న పాట్లు పడడం నాకిష్టమేలే :) - అందులోనూ వేటూరి పాటైతే ఏ పాట్లైనా ఏపాటివి అనేసుకుంటాను.
తొలగించండి