7, ఏప్రిల్ 2018, శనివారం

కాఫీ విత్ కలిమి - 2 - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ...




పైనున్న తలెత్తి చూస్తున్న ఆ ఐరిస్-రాణి గతకాలపు-వసంత వైభవం.
కిందున్న కొబ్బరి-బొండాల ముగ్గు పూల ముస్తాబు లేదని అలిగిన మా వాకిలిని మరిపించడానికి వేసిన రంగవల్లి.



ఈ యేడాది...
మార్చ్ నెల 21 వ తారీఖు Spring Equinox  ...
హడావిడిగా స్కూళ్ళకి సెలవులిచ్చారు - Spring Break అంటూ... 
చైత్రమాసం శుద్ధపాడ్యమి విళంబినామ ఉగాది ...
సందడిగా పండగ చేసుకున్నాం - ఉగాది పచ్చడి తిన్నాం... 
చుట్టుపక్కల చెట్లింకా శిశిరపు పసిడిని ఒదులుకోలేదు -
తేనెపట్టుల చుట్టాలింకా పుప్పొడి మిసిమిని మెదువుకోనేలేదు. 

ఆమని ఆగమించింది - పేరుకి అంతే!
ఫెళ్ళున ఎండ కాసి కొమ్మకొమ్మనా చిగుళ్ళు తొడిగి 
మొగ్గలొచ్చి పూలు విచ్చి రెమ్మ రెమ్మనా ఉవ్విళ్లూరే కోయిలలూయలలూగి 
ఆ వనప్రియ పాడిన పాటలకే చివుళ్ళొచ్చాయో 
చివుళ్ళ మేతకే ఆ కుహూకంఠపు కూతలు గీతాలయ్యాయో 
కూత ముందా చిగురు మేత ముందా 
అన్న బువ్వా-సవ్వడుల లెక్కలింకా మొదలెట్టనే లేదు ... 
అంతలోనే...
వాన మొయిలుల ఆగం మించింది - వూరిలో వింతే!
ఫెళ ఫెళ ఉరుములు తళ తళ మెరుపులు 
మబ్బులొచ్చి నేల తడిచి చినుకు చినుకునా చిందులాడే నీటి ముత్యాల వానవిల్లు మెరిసి 
ఆ నింగి చుట్టపు అంచున నేల మురిసిందా 
ఈ పుడమి మురిపానికే హరివిల్లు మెరిసిందా 
అన్న మెరుపూ-మురుపుల సందడికే మా వూరు నెలవయింది... 


కిటికీ కవతల చినుకుల చిందులాట - వానలో - కరిమబ్బు గొడుగులో
కిటికీ కివతల చెణుకుల సందడాట - ఫోనులో - కాఫీమగ్గు పొగలతో...

"హలో"

"హాయ్ - ఎన్నాళ్ళకెన్నాళ్ళకి?"

"ఎలా వున్నావ్?"

"బ్రహ్మాండం  - నువ్వో?"

"అండ-పిండి బ్రహ్మాండం"

"అచ్చుతప్పు అప్పు తెచ్చుకున్నావా?"

"అబ్బే - నేనన్నది సరిగ్గానే - అండ-పిండి బ్రహ్మాండం"

"అదేం లెక్క?"

"ఇంటి పట్టున ఉండి పకోడీ తిందామా, బజ్జీ లేద్దామా అనిపించే వాతావరణంలో వున్నాను మరి"

"సరి పోయింది ... ఇంతకీ ఏంటి విశేషాలు?"

"ఏముంటాయి - ఈ మద్య మాట్లాడ్డానికి టాపిక్కులే ఉండట్లేదు - ఇంకెక్కడి టాక్కులు?"

"అదేమలా?"

"తర్వాజ్జెప్తా కానీ ...ఇంతకీ నా బ్లాగ్ చదివావా?"

"అప్పుడే ఇంకో కొత్తది రాసేశావా? రెండ్రోజుల్నుంచీ ఇంటర్నెట్ ప్రాబ్లెమ్... వూరికే డ్రాప్ అయిపోతోంది - నీ కొత్త బ్లాగ్ పోస్టుని పక్కింటివాళ్ళ కృపతోనైనా చదివేయాలి"

"పక్కింటివాళ్ళ కృపా? అదేంటి"

"వాళ్ళ వై-ఫై వాడేస్తే దాన్నలాగే అంటార్లే - నీ బ్లాగ్ చదవడానికి enthusiasm ఎక్కువ - ethics తక్కువైనా పర్లేదులే - హహ్హహ్హ!"

"హహ్హహ్హ... ఇది వింటే మన చిన్నప్పటి ట్రంక్-కాల్ రోజుల్లో PP గుర్తుకొస్తోంది - PP అంటే పక్కింటివాళ్ళ-ఫోనుకి particular person అని ఒక నైసు పేరు"

"అద్సరే కానీ... ఇంతకీ ఏంటి ఈసారి టాప్పిక్కు?"

"టాప్పిక్కు - భలే ఉందీ మాట - ఆ మధ్య అక్షరం చేసిన అక్కరేంటో నీకు - దాన్నలా నొక్కి వక్కాణించావు?"

"ఏదైనా ఒక talk కి top గా pick చేసుకునే subject = టాప్పిక్కు అన్నారు కదండీ మరి?"

"అబ్బబ్బబ్బబ్బా...  నచ్చేసింది ... నిజంగా చెప్పాలంటే నా గాలికబుర్లకి టాకు-టాపిక్కు-టాప్పిక్కు అనేవేవీ ఉండవని నీకు తెల్సు కదా! టాపిక్కు అంటే ఇంకోటి గుర్తొచ్చింది - మాట్లాడడానికి - మాటలాడడానికి నాకు Linus ఆదర్శం"

"Linus అంటే మన Charlie Brown ఫ్రెండేనా?"

"అవును - వాడే... వాడెప్పుడో There are three things I have learned never to discuss with people: religion, politics, and the Great Pumpkin అన్నట్లుగా నేను రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్లూ లాంటి ఎవరితోనైనా సరే గొడవైపోయే సంగతులే తేను నా మాటల్లోకి. Linus చెప్పిన ఆ మూడిటితో పాటు అదే వరసలో నావింకో రెండు - పిల్లలూ, ఫిల్ములూ"

"అదేం మాట ? పిల్లలూ-ఫిల్ములూ అంటూ పి-గుణింతం నేర్పుతున్నావా నీ తెలుగు-వెలుగు పథకంలో?"

"అలాంటి భాషోద్ధరణ ఏమీ లేదు కానీ - ఎందుకో మరి పిల్లల గురించిన ఏ టాపిక్కూ ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. నేను గమనించిందేంటంటే పిల్లల పెంపకం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. మన చేతి ఐదు వేళ్ళూ ఒకలాగే ఎలా ఉండవో - పిల్లల విషయంలో తల్లుల అభిప్రాయాలూ అంతే varied గా అనిపిస్తాయి నాకు.  అందులో చాలా elements కలుస్తాయనుకుంటాను - చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం, అందులో వాళ్ళు నేర్చుకున్నది, నేర్చుకుంటే బావుండును అనుకున్నది, పెరుగుతూ నేర్చుకున్నామనుకున్నది - ఇలా రకరకాల పాఠాలని తమ పిల్లలకి నేర్పే ప్రయత్నంలో - ఎవరి అనుభవం వారిది, ఎవరి ప్రత్యేకత వారిదే. అందుకని ఏదో పైపైన కబుర్లు తప్ప ఎవరి బొటనవేళ్ళూ తొక్కకుండా జాగ్రత్త పడుతూ వుంటాను. అప్పటికే కొన్ని తప్పులు చేశాననుకో - వూరికే ఉండలేక - అడిగారు కదా అని ఏవో సలహాలు చెప్పి. ఇప్పుడింక ఆ సరదా కూడా లేదు"

"బావుందమ్మాయ్ - నీ పిల్లా-సఫీ. ఒప్పుకుంటున్నాను. మరా ఫిల్ముల మాటేంటి?"

"ఆ ముచ్చట కూడాచెప్పాలి మరి నీకు ...అప్పుడెప్పుడో తాతగారి వారసత్వం పదే పదే గుర్తు చేసే మనవడి సినిమా ఏదో చూసి హాల్లోంచి బైటికి వస్తూ 'సినిమా ఎలా ఉందండి?" అని అడిగిన వారితో 'ఈ అబ్బాయి కొంచెం తాతలు తాగిన నేతుల గురించి - నేత అయిన తాత గురించి ఆట్టే చెప్పకుండా, ఆ అంక-తాడనం చేయకుండా సినిమా చేస్తే చూడాలని వుంది ఎప్పటికైనా' అన్నాను అంతే  - అంతకి ఎక్కువా కాదు, ఇంకో మాట తక్కువా కాదు. నన్నడిగి మరీ నా సమాధానం విన్నవారికి నేనన్నది నచ్చలేదు - ఇప్పటిదాకా మళ్ళీ నాతో మాట్లాడింది లేదు. అప్పుడర్థమయ్యింది Linus లిస్టుకి నే చేర్చిన పిల్లలతో పాటు ఫిల్ములు కూడా జత చెయ్యాలని - అంతే - అలా తయారయ్యింది - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ... ! "

"మొత్తానికి నీ కబుర్లతో బోల్డంత టైం తెలీకుండా గడిచిపోయింది" 

"అవును ---నేనూ పెట్టెయ్యాలి గబగబా ఫోనింక - వాళ్ళొచ్చేస్తారింతలో -పచ్చడి చెయ్యాలి"

"ఆ!!!..."

"హహ్హహ్హ - వాళ్ళని కాదులే - టమాటాల్ని"

"హహ్హహ్హహ్హహ్హ .... నువ్వున్నావే .... హహ్హహ్హ"

"నేనున్నాలే - ఇలాగే అంటూనే నేనుంటుంటాలే ...bye మరి!"

"Bye !!!"


చివర్లో ఓ చిన్న సిప్పు - కరెంటు టాకు-టాపిక్కు-టాప్పిక్కు:

"పేపర్ చూశావా?"

"ఏముంది అందులో?"

"నార్త్ కొరియా కుడ్ బి ఏబుల్ టు న్యూక్ యూఎస్"

"కుడ్ బి ఏబుల్  ఏంటో కుడ్ అంటే చాలదూ? - అయినా ఆ కిమ్మొస్తే ఈ ట్రంపు కిమ్మనకుండా ఉంటాడా ఏంటి?"

"నిజంగా జరిగేది పెట్టేది ఏమీ లేదు - జనాలని వూరికే భయ పెట్టడానికి - ఏదో  సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అంతే!"

"పేపరు - సెన్సేషన్ అంటే గుర్తొచ్చింది - సల్మాన్ ఖాన్‌ని జైల్లో పెట్టారట కదా -ఏడ్చాడట కూడా"

"అవును ఇరవై ఏళ్ళ తర్వాత"

"మరి అతన్ని పోలీసులు కొడతారా జైల్లో - మన సినిమాల్లో చూపిస్తారే అలా?"

"అసలేమనుకుంటున్నావ్ నువ్వు - కొట్టడమా ఏమన్నానా - పక్కన్నుంచుని సెల్ఫీలు తీసుకుంటారు అంతే"

"పోన్లెండి ఇప్పటికైనా జైల్లో పెట్టారు - పాపం ఫుట్-పాత్ మీద పడుకున్నవాళ్ళని చంపేశాడు కూడాను"

"ఇది జస్ట్ జోధ్‌పూర్ కోర్ట్ తీర్పు - ఇంకా బెయిళ్ళుంటాయి - పై కోర్టుకి అప్పీళ్ళుంటాయి - అప్పుడే ఏమైంది - అసలెన్ని రోజులు లోపలుంచగలుగుతారో చూడాలి"

"అయ్యో!  మరి ఈ ఇరవై ఏళ్ళ శ్రమ, అదేదో హైద్రాబాదాయన చేసిన కృష్ణజింక DNA టెస్టులు, దానికోసం  ఆయనకి  ఇచ్చిన ఫీజులు - బోల్డు డబ్బు, టైము ఖర్చు కదా - వేసిన శిక్ష ఐదేళ్ళు కాకుండానే అప్పుడే వదిలేస్తే?"

"జనాల డబ్బు అది - ఎవరికి పడుతుంది?"

"అసలెప్పటికి జనాలకి తెలుస్తుందో కదా? పాపం! తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేనివాళ్ళెంతమందో! అసలు సల్మాన్ ఖాన్‌ని కోర్టులు, జైళ్లు అని తిప్పకుండా తనింట్లో తనని ఉండనిస్తే కనీసం పబ్లిక్ మనీ వృధా అవదు."

"హ్మ్ !"

"నాకింకా అస్సలు నచ్చనిదేంటంటే - సల్మాన్ ఖాన్‌కి శిక్ష వేసింది మనుషుల్ని చంపినందుకు కాదు - కృష్ణజింకలని వేటాడినందుకు. మన దేశంలో స్టేటస్ లేని మనుషులకి అయ్యే డేంజర్ లెక్కలోకి రాదు కానీ జంతువులకి మాత్రం endangered స్టేటస్సు ! అస్సలు బాలేదిది - మనుషులని చంపినందుకు వారి తరఫున కేస్ పెట్టే దిక్కు లేదు. వాళ్ళని వచ్చే జన్మలో కృష్ణజింకలుగా పుట్టించమని కృష్ణుణ్ణి అడగాలి - అంతే అంతే !!"

8 కామెంట్‌లు:

  1. " "నాకింకా అస్సలు నచ్చనిదేంటంటే - సల్మాన్ ఖాన్‌కి శిక్ష వేసింది మనుషుల్ని చంపినందుకు కాదు - కృష్ణజింకలని వేటాడినందుకు. మన దేశంలో స్టేటస్ లేని మనుషులకి అయ్యే డేంజర్ లెక్కలోకి రాదు కానీ జంతువులకి మాత్రం endangered స్టేటస్సు ! అస్సలు బాలేదిది - మనుషులని చంపినందుకు వారి తరఫున కేస్ పెట్టే దిక్కు లేదు. వాళ్ళని వచ్చే జన్మలో కృష్ణజింకలుగా పుట్టించమని కృష్ణుణ్ణి అడగాలి - అంతే అంతే !!"

    Super.. mana desam lo manusshulaki unna value adi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్, గిరిరాజ్ - నా బ్లాగ్ చదివినందుకు, అది మీకు నచ్చినందుకు.

      తొలగించండి


  2. మీరూ పోలిటిక్సు లో దిగిపోయారూ ! :)


    నారాయణ నారాయణ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అబ్బే లేదండి, జిలేబీగారు. నాకు మాటలతో poly-tricks చేయటం ఇష్టం అంతే తప్ప పాలిటిక్స్ అంటే పట్టింపు లేదు.

      తొలగించండి
  3. ప్రకృతి వర్ణనలో నీదైన ఓ అందమైన శైలి ఉంది లలితా నీకు.
    చాలా నచ్చింది.
    Top pick ల టాప్పిక్కులూ, కిమ్మొస్తే కిమ్మనని ట్రంపు, పిల్లా-సఫీ, సిన్మా సన్యాసఫీ ఇలా బోల్డన్ని చెణుకులు.
    By the way, after the current news of Salman’s bail, it’s the layman who got the shock.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పన్-చెణుకులు మెచ్చావని ఆనందమే కానీ నాది కాని మాటేదో నా ఖాతాలో వేసేసినట్టున్నావ్ - "సిన్మా సన్యాసఫీ" నా మాట కాదమ్మాయ్!

      తొలగించండి
  4. లలితగారు,
    అనుకోకుండా మీ బ్లాగ్ తొక్కానండి(నక్కతోకని తొక్కినట్లు). చాలా నచ్చేసింది ఎందుకంటే మాదీ గుంటూరే. మీ జ్ఞాపకాలన్నీ చదివితే మా కాలేజి రోజుల్లోకి మళ్ళీ వెళ్ళొచ్చినట్టయింది:)

    మీ రచనా శైలి చాలా బావుంది,ఆపకుండా చదివించేలాగ. మేము మీలాగా ప్రవాసులమే. మీ విసినికర్రల జాబితాలో నన్నూ చేర్చుకోండి.

    తర్వాతి పోస్ట్ కోసం ఎదురుచూస్తాను..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగుని మెచ్చుకున్న మీరెవరో తెలిస్తే ఎంతో బావుండేది. ఇంకోసారి నా బ్లాగ్ చదివితే మీరెవరో చెప్పండేం - బోల్డన్ని థాంక్స్ ముందుగా!

      తొలగించండి