4, మార్చి 2018, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 10 - చదువయ్యింది - మనువయ్యింది!

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 9 - ఎగ్గొట్టిన ఎన్సీసీ సరదా - ఎదురెళ్ళిన గోదావరి వరద

సెప్టెంబర్లో ఇంగ్లీషు పరీక్ష రాశాను - పాసయ్యాను. నాకు మళ్ళీ వచ్చే జూన్ దాకా టైముంది.

1965 జూన్‌లో కానీ కాలేజ్‌లో జేరడానికి లేదు నాకు.

ఈలోగా రోజూ పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవాణ్ణన్నమాట.

మా అన్నగారు కటక్‌లో - విజయా మెడికల్ సిండికేట్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తూ ఉండేవారు.

మా నాన్నగారు పోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి డిసెంబర్ ప్రాంతంలో అనాతవరం వచ్చేశారు వ్యవసాయం చేయడానికి. ఆయనకి ముగ్గురు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల.

మా బావగారిక్కూడా వ్యవసాయం ఉండేది - ఓ తొమ్మిదెకరాలు. విశాఖపట్నం నుంచి చేలో నాట్లు వేసేటప్పడు, కోతలు కోసి మాసూళ్ళు చేసేటప్పుడు ఆయన, మా అక్కగారు వస్తూ ఉండేవారు. వచ్చి ఓ పది రోజులుండి పనులూ అవీ చూసుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. జూన్-జులై నెలల్లో నాట్లు వేస్తామన్నమాట. ఆ నాట్లేసే రోజుల్లో ఎప్పట్లాగే వాళ్ళొచ్చారు. వ్యవసాయప్పనుల్లో బిజీగా వున్నాం.

ఓ రోజలాగే బోయనాలు చేస్తున్నాం కూర్చుని.

మా బావగారు - "ఏమయ్యా బాబీ! వ్యవసాయంలో ఏమన్నా మెళకువలు తెలుసుకున్నావా?" అనడిగారు నన్ను.

"తెలియకపోవడమేంటయ్యా బాబూ - ఇంతకాలం తిరుగుతున్నాను కదా! ఫుల్లు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది వ్యవసాయంలో. మహామహా వనచర్ల సుబ్బన్న లాంటి వాడికే నేర్పుతున్నానిప్పుడు -ఆయనకే చెప్తున్నాను " అన్నాన్నేను.

వనచర్ల సుబ్బన్న ఎవరంటే చిన్నప్పణ్ణుంచి మా పొలం పనుల మీద ఉండేవాడు. ఆయనకి అప్పటికి డెబ్భై ఐదేళ్ళు . మా నాన్నగారి కాలం నుంచి ఉండేవాడు. వాళ్ళావిడ వనచర్ల మంగమ్మ అని ఉండేది. సుబ్బన్నని ఇంటినుంచి పొలానికి తీసుకువచ్చేది.

నారు తీసే కాలమది.

" ఏంటి సుబ్బన్నక్కూడా చెప్తున్నావా నువ్వు? అంత అనుభవం వచ్చేసిందా నీకు - ఏం చెప్పి చేయించుకున్నావేం సుబ్బన్న చేత?" అంటూ మా బావగారు ఆశ్చర్య పోయారు.

"ఏముంది? కర్ర పట్టుకుని గట్టుమీద నిలబడి వున్నాడు - దగ్గరికెళ్ళి 'ఏం సుబ్బన్నా - ఇలా నిలబడి వున్నావు - నారు లాగుదువుగాని రా ' అన్నాను. నడండి  బాబయ్య అన్నాడు. ఆ చెయ్ పట్టుకు తీసుకెళ్ళి నారుమళ్ళో ఒంగోబెట్టి - ఇదిగో ఈ నారు పీకిస్తే వాళ్ళు కట్టలు కట్టి పట్టికెళ్తారు అని అక్కడ కూర్చోబెట్టాను" అని చెప్పాను.

అది వినగానే మా బావగారు ఫక్కున నవ్వాడు - ఎందుకంటే సుబ్బన్న కళ్ళు కనబడనంత పెద్దవాడయ్యాడు అప్పటికే - అతని చేత నువ్వు చెప్పి చేయించే వ్యవసాయం ఇదా అంటూ.

అలా నవ్వుతుండగా నోట్లో ముద్ద ముందున్న కంచంలో పడింది. మా బావగారికి పొరబోయింది. దగ్గొచ్చింది. గబగబా మంచినీళ్ళు తాగి నెట్టి మీద కొట్టుకున్నాడాయన. ఇదంతా అక్కడే నించుని వడ్డిస్తున్న మా అమ్మ చూసి "భోజనాల దగ్గర అవేం కబుర్లు - నవ్వించకూడదలా - పొరబోతుంది" అని నన్ను చీవాట్లేసింది.

1965 జూన్లో బీకామ్ లో చేరాను. మా క్లాసులో ఎనభై మంది ఉండేవారు.

తరగతి గదులేమో పాకలు - కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల. ఎస్కెబీఆర్ కాలేజ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఒకటే పెద్ద భవనం. మిగతావన్నీ పాకలు - కింద బండలు. చగ్గా ఆ పాకలకింద చల్లగా ఉండేది. అందులో కూర్చుని చదువుతుండేవాళ్ళం.

సాయంత్రం అయ్యేటప్పటికి ఎన్సీసీ. వారానికి నాలుగురోజులు ఎన్సీసీకి వెళ్ళాల్సిందే - యుద్ధకాలం కదా - అందరికీ ట్రైనింగు. రైఫిల్ షూటింగులూ అవీ ఉండేవి మాకు.

హైస్కూల్లో మాతో పాటు చదివినవాడు - సాయిబాబా అని ఒకడుండేవాడు. సిరంగు సత్తిరాజుగారి మనవడు. రైఫిల్ షూటింగులో నేనూ వాడూ బెస్టు అన్నమాట. వస్తే వాడికి, లేకపోతే నాకు రావాలి మొదటి స్థానం. అంతబాగా చేసేవాళ్ళం.

ఆ రకంగా ఆడుతూ పాడుతూ డిగ్రీ మొదటి ఏడాది నడిపించేశాం. జువాలజీ క్లాసుకి మాత్రం ప్రయోగాలు అవీ చేయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ గుఱ్ఱం ప్రకాశరావుగారే మళ్ళీ మాకు పాఠాలు చెప్పేవారు. ఇంతకు ముందులాగే మా ఎన్సీసీ కమాండర్ ఆయన - డిగ్రీలో కూడా.

డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయాయి - అన్నీ పాసయ్యాను.

1966 జూన్-జులై లో రెండవ సంవత్సరం మొదలయింది.

మా మేనమామగారు పప్పు రామకృష్ణారావుగారి మూడో అమ్మాయిని చిన్నప్పణ్ణుంచీ మా అమ్మమ్మగారు వాళ్ళూ అంటుండేవారు - ఇది బాబీ పెళ్ళాం - అని.

1965లోనే  మా అన్నయ్యగారికి చెప్పాను - "అర్జెంటుగా నాకు పెళ్ళి చేసెయ్యాలి , మళ్ళీ ఏదో పుష్కరాలు వస్తున్నాయట పన్నెండు నెలల దాకా పెళ్ళిళ్ళు ఉండవని గురువుగారు చెప్పారు. అందుచేత పెళ్ళి చేసేసుకుంటాను"  - అన్జెప్పి.

అప్పటికింకా ఒడుగు కాలేదు. పెళ్ళి కావాలంటున్నాను. సరే అని హడావిడిగా ముహూర్తాలు పెట్టించేశారు .

1966 మే 30 వ తారీఖు ఒడుగు. జూన్ రెండో తారీఖేమో పెళ్ళి.

మా అమ్మగారేమో మా పెళ్ళి తిరుపతిలో చేయిస్తానని మొక్కుకుందట. కానీ అంత తక్కువ వ్యవధిలో తిరుపతి  వెళ్ళడం అంటే కష్టం ఆ రోజుల్లో.

అంచేత రాజోలు వేంకటేశ్వరస్వామి గుళ్ళో చేసేద్దాం పెళ్ళి అని అందరూ అనేసుకున్నారు.

మే 24. ఆర్రోజుల్లో ఒడుగు, ఆ తర్వాత మూడు రోజుల్లో పెళ్ళి. బట్టలూ అవీ కొనాలి. మా బావగారు అనాతవరం - రెండో పంట మాసూళ్ళకి  వచ్చున్నాడు.

"బాబీని తీసుకుని నేను వైజాగ్ వెళ్తాను. బట్టలవన్నీ అక్కడే కొనేస్తాం." అన్నాడు మా బావగారు.

అది విని మా అన్నగారు - నానిగారు "సరే! మీరలా వెళ్ళి బట్టలవీ కొనుక్కురండి - ఇక్కడ మిగిలిన పనులూ - పందిళ్ళు అవీ వేయించడం మేం చేస్తాం" అని మమ్మల్నిద్దర్నీ పంపించారు.

మేమిద్దరం మే 26 బయల్దేరి విశాఖపట్నం వెళ్ళాం.

కోటిపల్లి రేవు దాటేశాం. SRMT వాళ్ళ బస్సు వైజాగ్ వెళ్ళేది ఎక్కాం.

మా బావగారు మధ్య సీట్లో కూర్చున్నాడు - నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. ఆ రోజు తెల్ల ప్యాంటు - తెల్ల చొక్కా వేసుకున్నాను.

బానే సాగుతోంది ప్రయాణం.

తుని దాటింతర్వాత నక్కపల్లి అడ్డరోడ్డు వస్తుంది. అక్కడొక చిన్న మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గర ఓ లారీ వాడొచ్చి మేమెక్కిన బస్సుని గుద్దేశాడు.

ఈలోగా ఏమైందంటే అనుకోకుండా - నేను కుడి పక్క కిటికీ దగ్గర కూర్చున్నాను కదా! మా బావగారికి అటు పక్కన ఓ ఇంజినీరు కూర్చుని వున్నాడు. ఆయన - "బాబూ! నాక్కొంచెం కడుపులో తిప్పుతోంది.  ఆ కిటికీ సీటు నాకిచ్చి ఈ పక్కన కూర్చుంటావా?" అనడిగాడు.

"సరే! మీరిలా కూర్చోండి" - అని చెప్పేసి మా బావగార్ని చివరికి జరగమని నేను మధ్యలో కూర్చున్నాను.

ఆ ఇంజినీరు చెయ్యి బయట పెట్టుకుని కిటికీ దగ్గర కూర్చున్నాడు.

ఇదంతా తునిలో జరిగింది.

తుని దాటాక నక్కపల్లి అడ్డరోడ్డు దగ్గరికి పావుగంట-ఇరవై నిముషాల ప్రయాణం. అక్కడికి రాగానే లారీ వచ్చి కొట్టేసింది. కుడి పక్కనుంచి బస్సుని రాసుకుంటూ వెళ్ళిపోయింది.

నా పక్కనున్న ఇంజినీరుకి చెయ్యి తెగిపోయింది. నా ఒళ్ళంతా ఆయన రక్తం  మా బస్సులో కండక్టరుతో సహా ముగ్గురు చచ్చిపోయారు. ఈ బస్సుకి కుడిపక్కకి రాసుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చి ఎడం పక్కగా కూడా తగిలేసింది లారీ. పాపం - ఆ కండక్టరుకి పెళ్ళయ్యి మూణ్నెల్లు అయిందట. బస్సు తలుపు దగ్గర నిలబడి వున్నాడు - ఆ విసురుకి కింద పడి  చనిపోయాడు. ఇంకొకాయన పెద్దాయన కూడా పోయాడు. 

ఆ బస్సులో నేను, మా బావగారు, ఇంకో తల్లి ఆవిడ నలుగురు పిల్లలూ తప్ప దెబ్బలు తగలని వాళ్ళు లేరు.

ఇంక నేనూ,  మా బావగారు దిగి - నేనేమో బస్సు పైకెక్కి సామాన్లు దించడం మా బావగారేమో వాటిని అందుకొని కింద పెట్టడం - మొత్తం సామాన్లన్నీ నడిరోడ్డు మీదకి దించేశాం.

ఇంక రోడ్డు మీద నిలబడి అటు అనకాపల్లి వైపు - ఇటు తుని వైపు కార్లు, బస్సులు, వ్యాన్లు - ఏవి వెళ్తుంటే వాటిని ఆపి - ఈ దెబ్బలు తగిలినవాళ్ళని, వాళ్ళ సామాన్లని ఎక్కించడం - ఈ రకంగా అందర్నీ పంపించాం.

అందర్నీ పంపించాక నేను, మా బావగారు, ఆ తల్లి - నలుగురు పిల్లలూ - ఈలోగా వేరే బస్సొస్తే అదెక్కి వైజాగ్ వెళ్ళాం.

మాకు బట్టలు మార్చుకుందుకు కూడా లేదు. గుమ్మంలో దిగేటప్పటికీ మా పెద్ద మామయ్యగారు - ఇంతింత కళ్ళు చేసుకుని "ఏంటి ఒళ్ళంతా ఆ రక్తమేంటి ? ఏమయింది ? ఏంటి? ముందా బట్టలు విప్పు " అంటూ తెగ కంగారు పడిపోయారు.

అప్పుడు నేను - "నాకేం కాలేదు. పక్కనున్నాయనకి దెబ్బ తగిలితే ఆయన రక్తం నా మీద పడింది" - అని చెప్పి లోపలికెళ్ళి స్నానం అదీ చేసొచ్చాను.

ఈ లోపులేంటంటే ఈ వార్త అనాతవరంలో తెలిసిపోయింది.

రేడియోలో సాయంత్రం ఆరుగంటల ప్రాంతీయ వార్తల్లో కోటిపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సుకి ప్రమాదం జరిగింది - ముగ్గురు చనిపోయారు - చాలా మందికి తీవ్రంగా గాయాలు తగిలాయి అని చెప్పారట.

"ఏ బస్సు, ఏ బస్సు?" అని అందరూ అనుకుంటుంటే కోటిపల్లి నుంచి ఒకటే బస్సు - పైగా ఎప్పట్లాగే పళ్ళయ్య మాతోటి  కోటిపల్లి దాకా బస్సెక్కించడానికి వచ్చి వెనక్కెళ్ళిపోయాడు.

ఆ పళ్ళయ్య " అది మన బాబీగారు, లాయరు గారు ఎక్కిన బస్సేనండోయ్" అనగానే ఇంట్లో గొడవ.

పెళ్లి పనులన్నీ మానేసి - ఆ రోజుల్లో ఫోన్లు కూడా అందరిళ్ళలో ఉండేవి కావు. ఒక వేళ ఫోనున్నా లైట్నింగ్ కాల్ పెట్టి మాట్లాడాలి. అప్పుడు మా పెద్దక్కయ్య పాపాయి మావగారు - ఆయన్ని మావతాత అనేవాళ్ళం - కర్రా సూర్యనారాయణగారు - వరహాభట్ల గురుమూర్తిగారని మా అమ్మకి కజినవుతుంది ఆయన భార్య - వాళ్ళింటికెళ్లి - వాళ్ళింట్లో కూర్చుని - అక్కణ్ణించి మావతాత వైజాగ్ మా పెద్దమామయ్య గారింటికి ఫోన్ చేశారు.

ఈ లోపులేమయ్యిందంటే నేనూ, మా బావగారు - స్నానం-గీనం చేసేసి - మరీ మనసుకి ఇబ్బందిగా వుంది అని చెప్పేసి సినిమా కెళ్ళిపోయాం. కృష్ణప్రేమ సినిమా.

ఈ లోగా అమలాపురం నుంచి మావతాత ఫోను చేశారు. మా మామయ్యగారు ఫోన్ తీసి "ప్రమాదం జరిగిన మాట వాస్తవమే! కానీ మనవాళ్ళకేమీ కాలేదు. వాళ్ళొచ్చేస్తారు - మీరేమీ కంగారు పడకండి" అని చెప్పారు.

అయినా కూడా మావతాత ఊరుకోకుండా "లేదు - నేను వాళ్ళతో మాట్లాడాలి - ఏరీ వాళ్ళు? ఎక్కడ? బస్సులో అందరికీ గాయాలయ్యాయట. ముగ్గురు పోయారట. వీళ్ళెక్కడ? బానే ఉంటే ఫోన్ దగ్గరికి రారెందుకు? హాస్పిటల్లో ఉన్నారా? వాళ్ళు బానే ఉంటే వాళ్ళకివ్వండి ఫోను. నేను వాళ్ళతో మాట్లాడితే కానీ ఇక్కడ పనులన్నీ బంద్" అన్నాడాయన.

"లేరయ్యా బాబూ - వాళ్ళేదో సినిమాకెళ్ళారు - వాళ్ళొచ్చాక ఫోన్లో మాట్లాడిస్తాను - ఈలోగా మీరు పనులు చేసుకోండి " అని మా పెద్దమామయ్య అంటున్నా కూడా వినకుండా "లేదు - వాళ్ళతో మాట్లాడాకే ఏ పనైనా" అంటూ మావతాత ఫోన్ దగ్గరే కూర్చున్నారు.

మేం సినిమా నుంచి వచ్చిన తరువాత మా బావగారు మాట్లాడి - "మేము క్షేమం గానే వున్నాము, 29 కల్లా వచ్చేస్తాం. మీరు ఏర్పాట్లవీ చేసుకోండి" - అన్నాక మావతాత కుదుట పడ్డారు.

29 సాయంత్రానికి అనాతవరం చేరాం. వెంటవెంటనే పెళ్ళికొడుకుని చేయడం జరిగిపోయింది.

ఈ లోపు శివకోడులో కూడా ప్రమాదం వార్త తెలుసుకుని మా బావమరిది ప్రసాదు కూడా పందిళ్ళు అవీ వేయించడం ఆపు చేసేశాడు. అసలు బాజాలు, భజంత్రీలు ఏవీ లేవు. 

సరే - మా మటుకు మేము ఒక బస్సు అనాతవరం నుంచి పురమాయించుకుని - ఒడుగు కూడా రాజోల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళోనే అనేసుకుని శివకోడుకి బయల్దేరాం.

పుంతలో ముసలమ్మ గుడి దగ్గరికి చేరేటప్పటికి సన్నాయి వాయిద్యం ఏమీ వినపళ్ళేదు.

అప్పుడు బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను - ఆ రోజుల్లో - వందరూపాయలు అతని చేతుల్లో పెట్టి "ఓ పంజేయవయ్యా  నువ్వూ! బాజాలెలాగూ లేవు - పుంతలో ముసలమ్మ గుడి దగ్గర్నుంచి పెళ్ళి వారింటికి వెళ్ళే వరకు ఆ హారన్ మీద చెయ్యి తియ్యకు. అదే మనకి ఊరేగింపు" అన్నాను.

ఆ పళాన ఆ డ్రైవర్ హారన్ మోగిస్తూ బస్సు నడుపుతుంటే - ఊళ్ళోవాళ్ళందరూ "ఏంటీ బస్సు ఇలా హారన్ మోగించుకుంటూ వెళ్తోంది" అనుకుంటూ చూడడానికి ఇళ్లలోంచి బయటికి వచ్చేశారు.

వస్తోంది ఎవరో తెలీగానే ఇంకేముంది! - "పెళ్ళివారొచ్చేశారు, పెళ్ళివారొచ్చేశారు" - అంటూ ఒకటే హడావిడి, సందడి.

అసలే చీకటి పడింది - ఇంటి ముందు పందిరి, దీపాలు ఏమీ లేవేమో - బస్సు డ్రైవర్ ఇంకా ముందుకెళ్ళాలేమో అనుకుని పెళ్ళివారిల్లు కూడా దాటి ముందుకెళ్ళిపోయాడు.

మళ్ళీ నేనతని దగ్గరికి వెళ్ళి - "బాబూ  ఇల్లు దాటొచ్చేశావ్ వెనక్కి తిప్పు" అని చెప్పి మొత్తానికి ఎలా అయితేనేం మగ పెళ్ళివారం ఆడపెళ్ళివారిల్లు చేరాం రాత్రికి.

అప్పటికప్పుడు వంటలు వండించుకుని బోయనాలు చేసి - రెండో రోజు పొద్దున్న రెండెడ్ల బళ్ళు కట్టించుకుని - ఊళ్ళో అంతా స్నేహితులే కదా - మన బాబీ పెళ్ళి అని అందరూ తలకో బండి ఇచ్చారు - ఆ బళ్ళెక్కి పెళ్ళివారం రాజోలు వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాం.

ఆ గుడికి అప్పటికి కాంపౌండ్ వాలూ అది కూడా లేదు. గుడి, ఒక పుట్టు వెంట్రుకలు తీసే చిన్న మండపం - అంతే!

గుళ్ళో 30న ఒడుగు చేసేశారు. రెండో తారీఖు రాత్రి పెళ్ళి.

పుట్టెంట్రుకలు తీసే కల్యాణకట్ట మండపం మా కళ్యాణమండపం. అక్కడ చుట్టూ వున్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేశారు, అలా అందరి సమక్షంలో మా పెళ్లయిపోయింది.

మూడు రోజుల పెళ్ళి మాది - పెళ్ళయింతర్వాత నాగవల్లి అదీ అయ్యాక అనాతవరం  వచ్చేసి గ్రామసంతర్పణ చెయ్యాలి.

కానీ మా అమ్మ తిరుపతి మొక్కుకుంది కదా - పసుపు బట్టలతోనే తిరుపతి వెళ్ళాలి అని ఆవిడ ప్లాను.

అప్పుడు సోమన్నగారని చెప్పేసి ఉండేవాడు అమలాపురంలో టాక్సీ అయన. ఆ సోమన్నగారి టాక్సీ బుక్ చేసుకుని మా బావగారు కర్రా భాస్కరంగారు, మా అక్కగారు, వాళ్ళ ముగ్గురు పిల్లలు, నేనూ-కొత్త పెళ్ళికూతురూ - తిరుపతి వెళ్ళాం - మా పసుబ్బట్టలతోనే.

అంబాసడర్ కారు - గంటకి అరవై కిలోమీటర్లు వెళ్ళేది. దార్లో గుంటూర్లో వడ్లమాని ఉమామహేశ్వర్రావుగారి ఇంట్లో ఓ రాత్రి వున్నాం. రెండో రోజు పొద్దున్నే బయల్దేరి సాయంత్రం ఐదు గంటలకి తిరుపతి చేరాం. స్నానాలు చేసి దర్శనాలు అవీ చేసుకుని ఓ రోజుండి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ వస్తూ నెల్లూరులో ఆ రాత్రికి ఆగి మరసటి రోజుకి అనాతవరం వచ్చేశాం.

వచ్చిన మర్నాడు ఊళ్ళో సంతర్పణ.

అలా డిగ్రీ మొదటి సంవత్సరం అయ్యాక పెళ్ళయ్యింది. నా పెళ్ళికి మా కాలేజ్ వాళ్ళందరూ కూడా వచ్చారు.

బీకామ్ లో హిందీ క్లాసు ఉండేది. మాకు హిందీ లెక్చరర్ ఒకాయన ఉండేవారు - భూపయ్యఅగ్రహారంలో. సాయంత్రం ఆఖరి పీరియడ్ కనక ఆయనది ఉంటే నన్ను పిలిచి "నాయనా వెళ్ళు - కొత్తగా పెళ్లయినవాడివి కదా - ఫో!" అని నన్ను పంపించేసేవారు.

అలా డిగ్రీ రెండవ సంవత్సరం, మూడో ఏడాది - నాటకాలు, నాటికలు వేసుకుంటూ, ఎన్సీసీతో ఆడుతూ పాడుతూ అయిపోయింది.

కాకపోతే నాకు భయమేంటంటే - అమలాపురం ఊళ్ళో మా బావగారు కర్రా భాస్కరంగారుండేవారు కదా - భాస్కర  మెడికల్ స్టోర్స్ ఆయనదే.  మా ప్రిన్సిపాల్ సుబ్బరాజుగారని ఉండేవారు. సుబ్బరాజుగారు తర్వాత తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా చేశారు. మా అమ్మాయి లల్లి (అంటే ఈ బ్లాగ్ రాసే నేనే) తిరుపతిలో MCA ఎంట్రెన్స్ రాసినప్పుడు అక్కడ వైస్-ఛాన్సలర్‌ ఆయనే.

వైస్-ప్రిన్సిపాల్ జి. పి. రమేశం గారని ఉండేవారు. మాథ్స్ చెప్పడానికి చిదంబరం గారని జల్లిపల్లినుంచి వచ్చేవారు. ఆయన జి. పి. రమేశంగారికి మంచి స్నేహితులు. జల్లిపల్లి చిదంబరంగారు, జి. పి. రమేశం గారు మా బావగారికి మంచి ఫ్రెండ్సు. వీళ్ళు అప్పుడప్పుడు మా బావగారి మెడికల్ షాపుకి వచ్చి కబుర్లు చెప్తూ, ఏవో అవసరమైన మందులు కొనుక్కెళ్తూ ఉండేవారు. అంచేత జాగ్రత్తగా ఉండేవాణ్ణి - కాలేజ్ విషయాలేమైనా మా బావగారికి వాళ్ళు చెప్తారేమోనని.

మా బావగారంటే నాక్కొంచెం అభిమానంతో కూడిన గౌరవంతో కూడిన భయం ఉండేదన్నమాట. రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వస్తూ ఆయన సైకిలు బెల్లు వినగానే పుస్తకాలు తీసి చదువుతూ ఉండేవాణ్ణి. అంతవరకూ మా అక్కగారి దగ్గర పాటలు పాడుతూ కూర్చునేవాణ్ణి.

డిగ్రీలో పరీక్షలకి ఎలా చదివే వాణ్ణంటే - సాధారణంగా B.com వాళ్లంటే they can never be calm - ఎప్పుడూ ఎదో సరదా, అల్లరి. కాకపోతే అకౌంట్స్ నేను బాగా చేసేవాణ్ణి. పరీక్షలప్పుడు సాయంత్రం మొదలుపెట్టి రాత్రి తొమ్మిదిన్నర దాకా చదివేవాణ్ణి. అప్పుడు బయటికెళ్ళి టీ తాగి సెకండ్ షో సినిమాకెళ్లిపోయేవాణ్ణి. మళ్ళీ ఒంటిగంటకి ఇంటికొచ్చి అప్పట్నుంచి తెల్లారేదాకా చదివేసేవాణ్ణి. పొద్దున్నే వెళ్ళి పరీక్ష రాయడం - మధ్యాహ్నం నిద్రపోవడం. సంవత్సరమంతా చదవడం ఎప్పుడూ అలవాటు లేదు. మా వాళ్ళందరూ - ఒరే! ఏకసంథాగ్రాహివిరా నువ్వు అనేవారు. ఏకసంథాగ్రాహినో ఏమో కానీ - ఏదో అలా చదివేసి మొత్తానికి బీకామ్ పాసయిపోయాను.

కాకపోతే - జయంతి సత్యనారాయణ గారని మాకు మర్కంటైల్ లా చెప్పేవారు. ఆయన క్లాసులో మాత్రం వెనక బెంచీలో కూర్చుని నేను మంగినపూడి సీతారాం చుక్కలాట ఆడుకునేవాళ్ళం. ఆయనకి మెల్లకన్ను. ఎటు చూస్తున్నారో తెలిసేది కాదు. అటు పక్క చూస్తూ ఇటు పట్టుకునేవారు. కాలేజీలో అందరూ గౌరవంగానే పిలిచేవారు. ఆయన మాత్రం "ఒరేయ్! వడ్లమాని గాడిదా! నువ్వు మాత్రం లా పాసవ్వవురా " అనేవారు. ఆయనలా అనగానే "నాకెందుకు సార్ లా ? పాసవ్వకపోతే నేను వ్యవసాయం చేసుకుంటాను" అనేవాణ్ణి. పైగా ఆయన లాగే మెల్లకన్ను పెట్టి చూసేవాణ్ణి. నిజంగానే ఆయన చెప్పినట్లే మర్కంటైల్ లా ఫైనల్ ఇయర్లో తన్నేసింది. 1968 సెప్టెంబర్లో వైజాగ్ వెళ్ళి రాశాను మర్కంటైల్ లా.

1968లో చదువై పోగానే నేనూ, మా ఆవిడా అరకు, వైజాగ్ అంతా తిరిగి వచ్చాము. అదీ సంగతి! 

సరదాగా ఆడుతూ పాడుతూ చదువయ్యింది
చదువు ముందు బ్రతుకుకి మదుపయ్యింది
మరదలిపై ప్రేమతో ప్రీతితో మనువయ్యింది
మనువు జరిగి చెలువ చనువయ్యింది

<వచ్చేనెల తరువాయి కథ>


12 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మరే! అవునండి! మా నాన్నమ్మ కూడా మీ ఇంటివారి ఆడపడుచే!

      తొలగించండి
  2. బీకామ్ లో జేరానన్నారని వ్రాశారు. దాని క్రింద పేరాల్లో ఒక చోట “జువాలజీ క్లాసుకి మాత్రం ప్రయోగాలు అవీ చేయడానికి వెళ్ళేవాళ్ళం” అని అన్నారని వ్రాశారు. బీకామ్ లో జువాలజీ వగైరా సైన్స్ సబ్జెక్ట్లు ఉండవు కదా. ఏదో ఒకదాన్ని సరిదిద్దాలనుకుంటాను (బీకామే సరియైనదేమో. ఎందుకంటే మర్కంటైల్ లా క్లాసులు జరిగేవన్నారు. ఆ రోజుల్లో డిగ్రీలో దాన్ని బోధించేది బీకామ్ వారికే) (మర్కంటైల్ లా జయంతి సత్యనారాయణ గారంటే లాయర్ జయంతి సత్యనారాయణ గారే గనక అయితే వారీ మధ్యనే 90+ వయస్సులో స్వర్గస్తులయారు - మీరు వినే ఉంటారు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంతకు ముందు నెల రాసిన కబుర్లలో రాశానండి -

      పీయూసీలో నా గ్రూపేమో అకౌంట్స్ ఎండ్ ఎకనామిక్స్. ఒక సైన్స్ సబ్జెక్టు కూడా తీసుకోవాలి. నాకేంటంటే చిన్నప్పట్నించీ జంతువులంటే ప్రేమెక్కువ - ఈ ఆవులూ, గేదెలూ, గుఱ్ఱాలూ - వీటితో తిరిగేవాణ్ణి కదా - అందుచేత జువాలజీ తీసుకున్నాను.

      అది బికాం, జువాలజీ కాంబినేషనేనండి. మా నాన్న చదివేటప్పుడు పీయూసీలో, డిగ్రీ మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా ఒక సైన్స్ సబ్జెక్ట్ చదవాలట.

      జయంతి సత్యనారాయణగారి గురించి మా నాన్నగారికి తెలిసే వుంటుంది.
      నా బ్లాగ్ చదువుతున్న మీకు ధన్యవాదాలండి, విన్నకోట నరసింహారావుగారు!

      తొలగించండి


    2. లాపాయింటున్ బట్టిరి
      ఓపడతి!జువాలజీకి పొత్తెట్లగు లా?
      ఈ పాఠకుడు డిటెక్టివు
      రాపాడిచు తప్పులున్న రమణి జిలేబీ :)

      తొలగించండి
    3. లాపాయింటున్ విప్పితి
      నే చెపితి!జువాలజీకి పొత్తెట్లగొ లా!
      ఏ పాఠకులు డిటెక్టివు
      లైనాను దొరకనంట తెలిపి జవాబే :)

      తొలగించండి


    4. లా పాయింటున్ విప్పితి
      ఓపికగ చెబితి జిలేబి పొత్తెట్లగు లా!
      ఏ పాఠకులు డిటెక్టివు
      లై పోరగనూ దొరకను లలితను నేనే :)

      జిలేబి

      తొలగించండి
  3. మీ గురించి మీరు చెప్పిన కబుర్లు ఇదివరలో చదివాను. ఇప్పుడు మీరు చూడని, మీకు తెలియని సంఘటనలని (జీవితాన్ని) ఒకరు చెబుతున్నవే అయినా సరే ఇంత వివరంగా కళ్ళకి కట్టినట్టుగా రాయగలగడంలో మీ ప్రతిభ కనిపిస్తూంది. నేనూ ఓసారి ఆ కాలంలో, ఆ ఊళ్ళలో తిరిగొచ్చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ చదువుతున్నందుకు థాంక్స్ అండి, శిశిరా! మీ కమెంట్ చదివి చాలా సంతోషించాను.

      తొలగించండి
  4. లల్లి! మీరు రాస్తున్న కథల్లాంటి స్వగతాలు చాలా బావున్నాయి. మళ్ళీ పాత రోజులలోకి తీసుకు వెళ్తున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్, రమా! పాతరోజులని తలుచుకోవడం, ఆ కబుర్లు చెప్పడం నాకూ బావుంటుంది - ఆ కబుర్లు మీకు నచ్చడం ఇంకా బావుంటుంది.

      తొలగించండి
    2. శ్రీనివాస్ అయినపురపు.28 ఏప్రిల్, 2018 5:58 PMకి

      పూస గ్రుచ్చినట్లు చెప్పడమనే నానుడి విన్నాను. నేడు అది కన్నాను. అద్భుతమైన వర్ణన. కథానాయికగా మలిస్తే ఎంతో బాగుంటుందని నమ్మకం.

      తొలగించండి