29, ఫిబ్రవరి 2020, శనివారం

ఇల why కంటి ఫిలుమురో!

ప్రతీవారం గురువారపు సాయంత్రం వారాంతపు కాలక్షేపానికి సినిమాలు వెతుక్కుంటాం.

ఒకటి కాపోతే ఇంకోటి - ఏదో OTT అనుకుంటూ - అమెజాన్ ప్రైమూ, నెట్‌ఫ్లిక్సూ - మార్చిమార్చి చూస్తూ - ఆ రెండిట్లో వున్న అన్ని భాషల సినిమాలూ ఏంటా అనుకుంటూ - అందులో అప్పటికే చూసినవాటిని గుర్తుపట్టి, దాటుకుంటూ వెళ్తూ - చూడని వాటి preview చూసి నచ్చితే ఎంచుకుంటూ, నచ్చకపోతే విడుచుకుంటూ - మొత్తానికి ఒక అరగంట సమయం సినిమా-అన్వేషణార్పణం.

ఈ వారపు గురువారం అందుకు మినహాయింపేమీ కాదు. సాయంకాలం కాగానే - ఇల సెయింట్ లూయిస్ పురములో - మా లివింగు రూమాంతర స్థిత సోఫా మీదుండి - నా మేలి-సగం బదరి - ఎక్కడో వంటింట కూనిరాగాలు తీసుకుంటూ కూరగాయలు తరుక్కుంటున్న నన్ను "నీకో surprise చూపిస్తా ఓ సారిలా రా!" అనగానే ఏంటా అని ఓ అడుగు అటేశా!

"ఇక్కడే వుండు చూపిస్తా!" అని తను రిమోట్ మీటలు నొక్కుతుండగానే నాకుప్పందిపోయింది.

"ఏంటీ? అల వైకుంఠ పురములో అప్పుడే Netflix లోకొచ్చేసిందా?" అనడిగా.

"ఆ! అదే! వచ్చేసిందప్పుడే!" అంటూ ఆ సినిమా చూపించారు బదరి.

అది చూడగానే కనుగొంటి కనుగొంటి కొత్త సిన్మానిటు కనుగొంటి అని పాడేస్కున్నాం. పాడేస్కుని ఈ సిన్మా రేపు శుక్రవారమే చూసేద్దాం అనేస్కున్నాం. అనేస్కున్నట్టుగానే చూసేశాం కూడా.

కానీ... ఆ OTT లో - అల వైకుంఠపురములో - మేమేం కంటిమో, ఏం కంటిమని అనుకుంటిమో, ఏమనుకొంటిమని అందామనుకొంటిమో - ఏమందామనుకొంటిమో - ఏమనుటకూ మాటలు దొరకక కటకటలాడితిమి.

సినిమా మొదట్లో పెద్దైన పిల్లల్లో - పెద్ద ఇంట్లో కనబడ్డ అల్లువారి వారసుణ్ణి చూసి, మళ్ళీ అదే అల్లువారి అబ్బాయిని పేద ఇంట్లో చూసి - "ఇదేంటి? ఇద్దరూ ఒక్కరుగానే కనిపిస్తున్నారు?" - అని ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం సినిమా చూస్తున్న మేమిద్దరం.

ఇంకొన్ని నిముషాలు గడిచాక, కథ ఇంకొంచెం ముందుకు నడిచాక - అది అల్లువారి వారసుడే అసలు వారసుడని చెప్పీ చెప్పక చెప్తున్న త్రివిక్ర-మాయ అని అర్థమయ్యింది.

అప్పటికే - అస్సలు బుఱ్ఱ వేడెక్కకుండా ఉండాలంటే అది వాడకుండా సినిమాలు చూడాలని బాగా తెల్సిన మేము - ఎవరిది వాళ్ళం వాడకుండానే చూస్తున్నా కూడా, వేడెక్కకుండానే మాడి వాడిపోయిందని అర్థమయ్యింది.

ఇక అక్కణ్ణించి కళ్ళప్పగించి చూస్తూనే వున్నా - అర్థం అయిన విశేషాల కన్నా అర్థం కానీ విషయాలే ఎక్కువ.


తన కాళ్ళ మీదే దృష్టి పెట్టిన హీరో ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి బయటికి పంపక అతని కంటిచూపుకి శిక్షగా ఓ సారి ఒంటిని మండించే ఎడారికి, ఇంకోసారి ఒంటిని ఒణికించే మంచుకొండలకి పంపించడమేమిటో?

పొట్టిపొట్టి గౌన్లేసుకున్న హీరోయిన్ కాళ్ళను పట్టుకు వదలనన్న హీరో కళ్ళు పారిస్ ఎందుకెళ్ళాయో, అక్కణ్ణుంచి తిరిగి ఇండియా ఎప్పుడొచ్చాయో ... ?

వస్తూనే కంపెనీ తనకమ్మమని హీరోయిన్ని విసిగిస్తున్న బ్రహ్మాజీ పక్కన అందరూ సూట్లేసుకున్న ఫ్రెంచ్ వాళ్ళు ఎందుకున్నారో? వాళ్ళని హీరో కొడుతుంటే ఎందుకు కొట్టించుకున్నారో?

అర్జున్ రెడ్డితో పక్కన కనిపించినప్పుడు "ఎవరబ్బా ఈ అబ్బాయి భలే చేశాడు?!" అని వెతుక్కుని మరీ కనుక్కున్న రాహుల్ రామకృష్ణన్‌ని ఇందులో చూసినప్పుడు ఆ భలే-factor లేనట్లనిపించిందేంటో?

మురళీశర్మ కనిపించిన ప్రతీసారీ చిరాగ్గా అనిపించడం - అతను ఆ పాత్రలో జీవించడం కాదూ - అసలా పాత్రలో కనిపించడమే అని అనిపించిందేంటో?

వైకుంఠపురం అని పేరు బడ్డ, పేరు పెట్టబడ్డ ఇంటిలోకి - ఆ ఇంట్లో వున్న తన తండ్రికి తను ఆసరాగా ఉందామని హీరో వచ్చేటప్పుడు నేపథ్యంలో వినిపించిన పోతనగారి "అల వైకుంఠపురములో..." పద్యం అసందర్భంగా వినిపించిందేంటో?

"రాములో రాములా..." పాటలో తలపాగా పెట్టుకుని హఠాత్తుగా కనిపించిన బ్రహ్మానందాన్ని చూసిన ఆనందం ఎవరిదో? ఎందుకో?

బన్నీ చేసిన డాన్సులు, బన్నీ చేసిన ఫైటులు, బన్నీ పాడిన పాటలు, బన్నీ వాడిన మాటలు - సినిమా అంతా బన్నీ-మయం. ఈ సీను చూసినా ఏమున్నది తారాగణం...? సినిమా సమస్తం బన్నీ-గాథ-పారాయణత్వం.

ఈ బన్నీ అనబడే అల్లువారి వారసుడు - నటనా, నాట్యం, ఫైటూ- అన్నీ  బాగానే చేస్తాడు కానీ ఎవరైనా పొగుడుతున్నప్పుడు మాత్రం కృతజ్ఞత చూపబోయేటప్పుడు రాబోయే తుమ్ముని ఆపుకుంటున్నట్టు కనబడతాడు. యూట్యూబ్ వీడియోల్లో చూడొచ్చు.

ఈ సినిమాలో ఎందుకు చేశాడ్రా అనిపించింది మాత్రం - అజయ్! ఒకప్పటి రాజమౌళి-విక్రమార్కుడి-ప్రతినాయకుడు ఇందులో ఒక్క దెబ్బకే చెత్తకుండీలో పడిపోవడం, కనిపించిన ప్రతి సీనులో దెబ్బలు తినడం అస్సలు బాలేదు.

ఎంతో చదువుకుని - ఒక కంపెనీని సమర్థవంతంగా, విజయవంతంగా నడుపుతున్న ఒక అమ్మాయి - అప్పటికే తన కాళ్ళని పట్టుకు వదలని కళ్ళు గల అబ్బాయిని ఇష్టపడుతూ కూడా - తండ్రి చెప్పగానే నోరెత్తకుండా ఇంకో డబ్బున్న అబ్బాయి చేత ఎడం చేతి వేలికి ఉంగరం పెట్టించుకోవడమేమిటో? దానికోసం కట్టుకున్న సగం-సగం చీర కట్టేమిటో?

ఆ ఉంగరం తొడిగిన అబధ్ధపు వారసుణ్ణి ప్రేమించిన మేనకోడలు అసలు-వారసుడు అల్లువారి వారసుడు కనపడగానే అతని వెంట కూడా పడడమేమిటో?

అసలు మాట్లాడుకోవడం మానేసిన తన అసలు తల్లిదండ్రుల మాట్లాడుకోకపోవడానికి కారణం తన తండ్రి దగ్గర ఒకప్పుడు పనిచేసిన స్టెనో రేవతి అని హీరోకి ఎవరు చెప్పారో? వాళ్ళ తాతా? ఎప్పుడూ? ఎక్కడా? ఎందుకూ? ఎలా?

అందరూ లాప్‌టాపులు పట్టుకు తిరుగుతుంటే సునీల్ iMac monitor పట్టుకు తిరగడం హాస్యమా?

వెన్నెల కిషోర్‌ని చూస్తే నవ్వు రాలేదెందుకో?

టబూకి నువ్వే కొడుకువని చెప్తానంటే "వద్దూ...నాకు నన్ను పెంచిన అమ్మే ఇష్టం" అని చెప్పిన హీరో అసలు సినిమా సెకండాఫ్‌ మొదలయిందగ్గర్నుంచీ అమ్మ మాటే లేకుండా, అమ్మ-రోహిణి దగ్గరికి వెళ్లకుండా, సినిమా చివర్లో హీరోయిన్నుతో హెలికాఫ్టరు ఎక్కెళ్ళిపోవడం ఏంటో?

సరే! ఇంత గొప్ప సినిమా ఎలాగూ అర్థం కాలేదు. IQ బొత్తిగా ఇంకిపోయినట్లుంది అని నాకు నేనే బాధ పడిపోతున్న నేను యూట్యూబులో అనుకోకుండా త్రివిక్రముల వారు సరదాగా అన్న "మనసుకి దురద పుడితే గోక్కునే దువ్వెన సంగీతం" అన్న caption వున్న వీడియో కనబడితే - ఆ caption లో వున్న భాషని భరించలేక, భావాన్ని అర్థం చేసుకునే స్థాయి లేక - ఓ దండమెట్టి - చూడక - ఊరుకున్నా!

అన్నట్టూ... పాట రాసేటప్పుడు బన్నీని ఊహించుకుంటూ - హీరోయిన్ను కాళ్ళని పట్టుకుని వదలని బన్నీ కళ్ళ గురించి - రాసిన తాతగారు ఆ పాట రాసేటప్పుడు తన మనవరాలి కాళ్ళను ఊహించుకోవడమేమిటో? అప్పుడు మరి ఆయన సినిమాలో సన్నివేశానికి తగినట్లు రాసినట్లా? రాయనట్లా?

మొత్తానికి... ఈ సినిమా చూసిన నాకనిపించిందేంటంటే...

అల వైకుంఠపురములో... 
ఇల why నే కంటి ఈ ఫిలుమురో!
తెలివైన నిర్మాతరో ... 
నెల కాగానే OTT కమ్మెరో! 

~ సినీ-మా-లక్ష్మి


ఓ సరదా కబురు:

ఇవాళ ఫిబ్రవరి 29. Leap Day!
మా అపర్ణ నుంచి ఒక Whatsapp message కనిపించింది. 
If today is leap day, what day was yesterday? అని.
దానికి సమాధానం కూడా తనే చెప్పింది : Look day - అని :)
భలే punny గా, funny గా అనిపించింది నాకు...


16 కామెంట్‌లు:

  1. ఈ త్రివిక్రమ అవతారాన్ని వర్ణించడానికి పోతనామాత్యుడు రావాలి!

    మీ వల్ల కాదు.

    I hope you understood that!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ మాత్రానికి పోతన రావడమెందుకులెండి. No one in current times deserves any mention in బమ్మెరవారి వర్ణనలు. Thanks for your comment.

      తొలగించండి
  2. పూజా హెగ్డే ని చూస్తే చిరాకు పుడుతుంది. ఆమె కాళ్ళ మీద పాటలు వ్రాయడం ఏమిటి. త్రివిక్రమ్ తీసిన పిచ్చి సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయో అర్థం కాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కదా ?! అదే నాకూ అర్థం కావట్లేదు - ఏముందని అంత hype అని. Thanks for your comment.

      తొలగించండి
  3. Your breakdown is awesome. When I came out of the movie the main thing I felt was, it was very melancholic, and why would an accomplished woman like her would fall for a guy who likes her mainly for her legs😀😀

    రిప్లయితొలగించండి
  4. "ఏమి చిత్ర కథ.. బదరీ బదరీ... ఏదీ మరియొక సారి" అని మీచేత పాడించగలిగే సినిమాలేవీ రావట్లేదన్నమాట!☺️

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతే అంతేనండి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, సూర్య గారు.

      తొలగించండి
  5. కలలోకూడా కొడుకు-కాని-కొడుకు ఠీవిగా ఉంటే తట్టుకొలేని కుటిలబుద్ధి చూపించటానికి ఆ మొదటి సీన్ ..

    పూర్వం "నీ కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని" అని పాడుకునే రోజులకి నేటిపారడీ " నీ కాళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని " -- ఆ పాటకీ జనాలు బ్రహ్మరథం పట్టారు .. ఈ పాటకీ జనాలు ఉర్రూతలూగారు ... ఆ లెక్కన జనం నాడి హీరోయిన్ కాళ్లతో పట్టేసుకున్నాడేమో దర్శకుడు ..

    పారిస్ వెళ్లటం రావటం మిడిల్ క్లాస్ వారి కలలని నిస్సహాయతని కాష్ చేసుకునే కమర్షియల్ ఫార్ములా ..

    బ్రహ్మాజీ పక్కన ఫారిన్ సేవకులు , బ్రహ్మీ ఎంట్రన్స్ -- వీటిని వెనకేసుకొద్దమన్నా ఏ పాయింట్లూ రావట్లేదు ..

    అలాగే హీరోయిన్ అంత చదువుకుని అసలు వ్యక్తిత్వం లేనట్టు చూపించటం ( కాళ్ళ ప్రేమికుడిని అదే కాళ్ళకున్న చెప్పుతో కొట్టాలి , కనీసం మెసేజ్ ఇచ్చినట్టు ఉండేది, అసలే బయట రకరకాలుగా ఉంది నేటి పరిస్థితి ) -- దీన్ని వెనకేసుకొచ్చినా తప్పే !

    అల్లు అర్జున్ని అందరూ మోసేసారు .. అతను కూడా సినెమా అంతా ఒక్కడే మోసాడు ..

    ఇక పోతనగారి పద్యం , త్యాగరాజకృతి -- అసందర్భం , అనవసరం .. పైపెచ్చు వాటికున్న గౌరవాన్ని ఇలాంటి చిన్నచిన్న వాటితో కలిపి తెలుగుని కాపాడుతున్నమనో , వాటిని జనబాహుళ్యానికి మళ్ళీ పరిచయం చేసామనో చెప్పుకుంటే దాన్ని మించిన అహంకారం ఇంకేమీ ఉండదు ...
    ఎక్కడైనా నిజం "సామజవరగమనా ..." అని పాడుతూంటే కాళ్ళను వెతికే పిల్లలు ... అల వైకుంఠపురంలో పద్యం వినగానే బీటేస్తూ పారడీ జేసే కుర్రకారు తయారవ్వడానికి కారణం అయ్యామని గుర్తిస్తే చాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హలో అండీ కళ్యాణ్! మీ విపులమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు...అస్సలు మీరే ఒక బ్లాగ్ పోస్ట్ రాసుంటే ఇంకా బావుండేది :)

      తొలగించండి
  6. చాలా బాగా చెప్పారు...ఈ మధ్యనే చూసాను...అసలు ఏముంది ఈ సినిమా లో..అందరూ అంతలా అనడానికి అని.. మీకొచ్చిన అనుమానాలే వచ్చాయి...🥴

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కదా, మోహనా! సినిమా రంగురంగులుగా బానేవుంది కానీ అంత గొప్పగా ఏమీ లేదు. కాకపోతే అంత కన్నా మంచివేవీ లేక ఉన్నంతలో ఇదే బావుందనిపించిందేమో!

      తొలగించండి