సెప్టెంబర్ "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.
నా చిన్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు అమ్మ వద్దని వారిస్తే "ఏం! ఎందుకు చేయకూడదు? మొన్నెప్పుడో నువ్విలాగే చేశావు కదా!" అంటే మా అమ్మ చాలా ఓపిగ్గా "పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలి కానీ చేసినట్టు కాదు" అని చెప్పేది. "అదే ఎందుకు?" అని రెట్టిస్తే "నీకు అమ్మ పెట్టేవి రెండూ పెడితే కానీ మాట వినేలా లేవు" అని ముద్దుగా విసుక్కునేది. మారాం చేసి ఇంట్లో మాత్రమే ఇలా చేస్తాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ మాటే వుంటాను అంటే "నక్క ఒకచోట ఊళలు పెట్టి ఇంకో చోట సంగీతం పాడదు" అని కట్టడి చేసేది.
ఇదిగో ఈసారి మా అమ్మ నేర్పిన ఆ అద్భుత పాఠము, మళ్ళీ ఆవిడే మప్పిన "అమ్మ పెట్టే ఆ రెండిటి గురించి" చెప్పి, సంగీతం కాలేని ఊళల గురించి చెప్పేస్తానే మరి!!
చిన్నప్పుడు అర్థం కాలేదు కానీ చదువుల బడి లో, జీవితపు వేగంలో ఎన్నోసార్లు అమ్మ చెప్పిన మాటలు నిజమే కదా నిపించే ఎన్నో సంఘటనలు, అనుభవాలు.
నేను బి. ఎస్సీ చదివేటప్పుడు పరీక్షలప్పుడు చాలా భయపడేదాన్ని - పరీక్షలో వచ్చే అన్ని ప్రశ్నలకీ జవాబులు వ్రాయగలనో , లేదో అని. అప్పుడు మా అన్న చెప్పేవాడు పాపం: కాలేజ్ మొదటి రోజునుంచీ చదువుకుంటే చివరికి సంవత్సరాంత పరీక్షలకి అంత గోళ్ళు కొరుక్కుంటూ చదవక్కరలేదని. అప్పటికి తన ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగంలో చేరిన క్రొత్త. నేను వెంటనే పెంకిగా "నువ్వు చదివావేంటి?" అని అడిగేదాన్ని. తను నవ్వేసి "నేను చేయలేదు కాబట్టే, ఏం కోల్పోయానో తెలుసు కాబట్టే నీకు చెప్తున్నాను" అని. నిజం కదా! ఆ మాట నాకిప్పటికీ "చద్దిమూట".
అలాగే పెద్దలు నేటి యువతకి సలహాలిస్తూ వుంటారు - చెడు అలవాట్లకి దూరం గా ఉండమని. ఒకసారి అలవాటు అయినవి మానుకోవడం ఎంత కష్టమో అనుభవము వున్నవాళ్ళు కాబట్టి మీరైనా జాగ్రత్తపడి దురలవాట్లకి దూరంగా వుండండి అని తమ తర్వాత తరాలకి చెప్తూ వుంటారు. అలా ఎందుకు చెప్పారో అని వింటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. "నీతులు చెప్పే ముసలాళ్ళు-నిన్న మొన్నటి కుర్రాళ్ళు" అని ఆత్రేయ గారి పాట పాడేసుకుని తల ఎగరేస్తే మన గురించి అదే పాట పాడుకుని నవ్వుకోవడానికి మన తర్వాతి తరం సిద్ధంగా ఉండనే వుంటుంది. అందుకే మరి పెద్దవాళ్ళు చేసినట్టు చేయక చెప్పినట్టు విందామా మరి?!
సరే! వినకపోతే అమ్మ ఏం పెడుతుందో చూద్దామా?
అనగనగా నాలాంటి ఓ అమ్మాయి. చక్కగా పెళ్లయింది. అత్తగారు కొత్తకోడల్ని మురిపెంగా చుట్టపక్కాలకి, చుట్టూ పక్కలవాళ్లకి చూపించుకుంటూ సాధ్యమయినంతవరకూ అమ్మాయి అమ్మ ఊసు ఎత్తి బెంగ పడకుండా వుంచడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఎంత చేసినా బొమ్మలాంటి అమ్మాయి మోములో నవ్వు పువ్వు పూయట్లేదని చూసి ఆ అత్తమ్మ ఎలాగైనా సరే అమ్మని మరిపించి కోడలు పిల్ల కళ్ళు మెరిపించాలని అనుకుని ఒకరోజు ప్రొద్దున్నే లేచి నవకాయ పిండివంటలతో వంట చేసి పెళ్లినాటి వెండి కంచంలో అరిటాకు వేసి అన్నీ వడ్డించి కొసరి కొసరి వడ్డించింది. ఎన్ని వేసినా, ఎంత పెట్టినా ఆ కోడలు పిల్ల "మా అమ్మ పెట్టే రెండూ కావాలి" అనసాగింది. అత్తగారు చాలా ఓపికగా "గారెలు రెండు వేయనా తల్లీ! పాయసం ఇంకో రెండు గరిటెలు వడ్డించనా? లడ్డు ఇంకో రెండు తింటావా?" అని ఎలా అడిగినా ఏం చేసినా అమ్మాయి దృష్టి అంతా "అమ్మ పెట్టే రెండిటి" మీదే. ఇంక విసిగిపోయిన అత్తగారు కోడలిపిల్ల నెత్తి మీద రెండు మొట్టిందండి (నయం! ఈరోజుల్లో అత్తాకోడళ్ళు కాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కావలసినంత కాలక్షేపం టివిల వాళ్లకి, పత్రికల వాళ్లకి - బ్రేకింగ్ న్యూస్: అత్త పెట్టిన హింస-లేచిన కోడలి హంస" అని అర్థం పర్థం లేని శీర్షికతో). అత్తగారు అలా మొట్టీ మొట్టగానే ఆ కోడలుపిల్ల "ఆ! ఇవీ మా అమ్మ పెట్టే రెండూ" అని హాయిగా భోంచేసి లేచ్చక్కా పోయింది- కిల కిలా నవ్వుకుంటూ. అవండీ మా అమ్మని విసిగిస్తే ఆవిడ నాకు పెడతాననేవి. అనేదే కానీ పాపం ఎప్పుడూ చల్లటి దీవెనలే పెట్టింది, కానీ ఆ రెండూ కానే కాదు.
ఇంక ఊళలు-సంగీతం గురించిన ఓ పిట్ట కథ. అనగనగా ఒక అబ్బాయి. వాడు ఒక మాదిరి టౌన్ లో చదువుకునే వాడు. శలవులకి అమ్మమ్మ-తాతగారు వున్న పల్లెటూరికి వెళ్ళేవాడు. వెళ్లేముందు వాళ్ళ అమ్మా-నాన్న చిలక్కి చెప్పినట్టు చెప్పేవారు - తాతగారి దగ్గర పొల్లు మాటలాడకూడదని, ఆయన నొచ్చుకుంటారని - మరి వాడు నోరు తెరిస్తే అన్నీ చెడ్డ మాటలే. వాడు "అన్నిసార్లు చెప్తారేం నాన్నగారూ! నాకు తెలియదా ఎక్కడ ఎలా ఉండాలో" అని అభయమిచ్చి వెళ్ళేవాడు. వెళ్ళిన మొదటి పూట అతి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడాడు. ఆ రాత్రి ఆ కబురూ, ఈ కబురూ చెప్పుకుంటూ ఆరుబయట తాతగారి మంచం ప్రక్కన మంచం వేసుకుని పడుకున్నాడు. ఇంతలో ఆదమరుపుగా నిద్ర పట్టబోతున్న సమయంలో చురుక్కుమని దోమ కుట్టడంతో చటుక్కున లేచి పెద్ద గొంతుతో: "ఈ దోమను తగలెయ్య! కుట్టి చంపేసింది. దీని పీక మీద కాలేసి తొక్కి చంపీయాలి" అనేసి మళ్ళీ పడుకుండి పోయాడు. చూశారా? ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్డామన్నా అసలు బుద్ధి సహకరించక ఎలా బయట పెట్టేసిందో? అందుకే అమ్మ చెప్పింది- మొదట్లోనే మంచి అలవాట్లు చేసుకోవాలి. ఇంట్లో ఇలానే వుంటాను, ఎక్కడికో వెళ్తే మార్చుకుంటాను అంటే అది అంత సులభం కాదు. నక్క ఒక చోట ఊళలు పెట్టి ఇంకో చోట సంగీతం పాడదూ" అని.
మా అమ్మ చెప్పిన కొన్ని వందల జీవిత పాఠాల్లో ఇవి కొన్నే - కానీ ఎప్పటికప్పుడు మనసుకి దన్నుగా నిలిచినవి.
Mee kaburlu pillala ki kadhalu ga cheppa daniki chala bagunnayi
రిప్లయితొలగించండిThanks, Sarada!
తొలగించండి