3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

గళ్లలెక్కలు - కళ్లచిక్కులు

నేనూ - బుజ్జిజింక సరదాకి చేసే పనుల్లో లెక్కలొకటి .

లెక్కలంటే -
ఆకాశంలో చుక్కలని ఎంచేవో...
ఎంచలేక చుక్కలని చూపించేవో...
చుక్కలు చూసిన కళ్లకి చికాకు పెంచేవో కాదు...

లెక్కలంటే -
కొన్ని టక్కున ఎంచేవి
కొన్ని చప్పున చిక్కనివి
ఎంతో మక్కువ పెంచేవి
ఇంకెంతో చక్కనివి

అలాంటి ఒకానొక తమాషా-లెక్క ఇదిగో -



తెలుగులో ఈ లెక్క ఏంటంటే:

జూలియెట్ అనే అమ్మాయి "చదరాలని పట్టండి" అనే ఒక వేడుక-ఆటలో పోటీ చేస్తోంది. ఆ ఆటలో ఒక 4X4 చదరపు పటాన్ని చూసి - అందులో దాగున్న చదరాలని కనుక్కుంటే డబ్బులు గెలుచుకోవచ్చు.  ఆ అమ్మాయి కనుక్కున్న ప్రతీ చదరానికీ డబ్బులు బహుమతిగా ఇస్తారు. ఆ డబ్బుల లెక్క ఎలాంటిదంటే - ఒక 1X1 చదరానికి ఒక డాలరు, 2X2 చదరానికి నాలుగు డాలర్లు, 3X3 చదరానికి తొమ్మిది డాలర్లు, 4X4 చదరానికి పదహారు డాలర్లు - ఇస్తారన్నమాట. ఒకవేళ జూలియెట్ కనక అన్ని చదరాలని కనిపెట్టి - పట్టగలిగి - పటం కట్టగలిగితే ఆ అమ్మాయి ఎంత డబ్బు గెలుచుకుంటుంది?

(అసలయినా - రోమియోని తలచుకుంటూ ఏ బాల్కనీలోనో నించుని -
What's in a name? That which we call a rose
By any other word would smell as sweet.
- అనుకుంటూ వుండక జూలియెట్ ఈ గళ్ల లెక్కలు చేయడమేంటో కదా ?!)

ఆ జూలియెట్ సంగతేమో కానీ ఆ గళ్ల గళ్ల -లెక్క చూడగానే నాకూ, బుజ్జిజింకకీ - చెరి రెండు కళ్లూ మెరిశాయి.

చేతికొక  పేపరు, పెన్సిలూ పట్టుకుని -  చెరొక గళ్ల-చదరం గీసేసుకున్నాము.

అటు తిప్పాము - ఇటు తిప్పాము.

ముందు ఇందులో ఒక పే....ద్ద చదరం వుంది అనేసుకున్నాము - మేఫ్లవర్ ఎక్కని కొలంబస్సుల్లా - ఎదురుగా మరి అంత పెద్దదే కనిపిస్తోంది కదా!



తర్వాత - ఇందులో ఇంకా పదహారు బుల్లి బుల్లి చదరాలు వున్నాయి అని - నాలుగు నాలుగులు పదహారు - అంటూ ఎక్కాలేసి మరీ లెక్కేసేశాం.



తర్వాత - ఇంకొంచెమే వున్న 3X3 చదరాలు గబగబా రొక్కించి మరీ లెక్క చెప్పేశాం - నాలుగే నాలుగని .



చివరాఖరుగా - కుడి చేతి చూపుడు వేలుని, నడిమి వేలుని - మెలికలు మెలికలుగా - గళ్ల మీదుగా నడిపిస్తూ - 2X2 చదరాలు - ఆరని నేనంటే -

రెండార్ల వయసింకా లేకపోయినా - నీకన్నా ఆరున్నొక్కాకులు ఎక్కువే చదివానని - నాకు చెప్పీ చెప్పకనే చెబుతూ -

"అమ్మా ! నిన్ను కాదనాలని కాదు - కానీ అనాల్సొస్తోంది - క్షమించూ "

- అని మహా నేర్పుగా నన్ను నొచ్చనీయక - అలాగని ఇచ్చకపు మాటలాడక -

2X2 చదరాలు తొమ్మిదున్నాయని - నెమ్మదిగా లెక్కపెట్టి చూపించాడు నా బుజ్జిజింక.



ఇంకేముంది - లెక్క తేలిపోయింది.





జూలియెట్ కి ఇచ్చిన లెక్కలో వున్న 4X4 చదరంలో మొత్తం (16+9+4+1) = 30 చదరాలు వున్నాయి.

ఎలా లెక్క పెట్టాలో తెలిశాక ఇంకాగుతామేంటి?

ఇంకో కాయితం మీద 5X5, 6X6 - ఇలా వరుసగా గళ్లు పెంచుకుంటూ గీసుకుని - వాటిలో చదరాల లెక్క కూడా చూశాము.

ఏతావాతా తేలిందేంటయ్యా అంటే - ఇదిగో - ఈ కింద ఫొటోలో వున్నది....



[బుజ్జిజింకకి లెక్కలు కట్టడం ఇంకొంచెం-ఎక్కువ తెలిశాక - మళ్లీ ఈ లెక్కని Sum of the Squares of the first n natural numbers ఉపయోగించి ఇంకోసారి లెక్కగట్టి మేము తప్పో-రైటో - మా లెక్క మేం తేల్చుకుందాం అనేసుకున్నాం. ఇప్పటికి వాడి బుజ్జి-బుర్రకిది చాలు.]

"మరి జూలియెట్ కి వచ్చే డబ్బులో?" - అని నేనడగ్గానే - బుజ్జిజింక వేసిన లెక్క ఇది ...


16 (1X1)'s  = 16X1= $16
 9  (2X2)'s  =  9X4 = $36
 4  (3X3)'s  =  4X9 = $36
 1  (4X4)'s  =  1X16=$16

ఒక 1X1 చదరానికి ఒక డాలరు, 2X2 చదరానికి నాలుగు డాలర్లు, 3X3 చదరానికి తొమ్మిది డాలర్లు, 4X4 చదరానికి పదహారు డాలర్లు  - చొప్పున - మొత్తం (16+36+36+16) = అక్షరాలా అష్టోత్తర-శతానికి-ఒక నాలుగు-తక్కువగా-డాలర్లు అనగా $104/-.

లెక్కంతా అయిపోగానే -
ఒకళ్ల కళ్లు ఒకళ్లు చూసుకున్న
మా కళ్లకి
గళ్ల  లెక్కల్లో చిక్కుకుని
ముళ్లు పడ్డ మా కళ్లు
గళ్లు-గళ్లుగా
బుల్లి-బుల్లి వడగళ్లుగా
అయిపోయాయంటే
వేళాకోళం కానే కాదు మరి!
అంతే కాదు -

అమ్మనోట అనుకోకుండా వచ్చిన -
గళ్లలెక్కలు - కళ్లచిక్కులు 
చెంగుచెంగుమనే బుజ్జిజింక నోట
ఖంగుఖంగుమనే టంగు-ట్విస్టరయ్యింది 



10 కామెంట్‌లు:

  1. బుజ్జి జింకకి డిప్లమసీ ఎక్కడినుంచొచ్చింది,గోదారి తల్లినుంచేగా :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు: ఆయ్ - తల్లి గోదారే కాదండి - తండ్రి బదరి నేర్పిన పంచదార పలుకులూనండి. మీ మంచి మాటకి ధన్యవాదాలు!

      తొలగించండి
  2. మీరు, మీ బుజ్జి జింక కలసి "గళ్ళ లెక్కలు....." ప్రవల్లిక ను మా కళ్ళకు, మెదళ్ళకు చిక్కులు లేకుండా విప్పారు. ధన్యవాదాలు.

    మీ బుజ్జి జింకలో చిక్కులులేని జీవిత లౌక్యాన్ని (డిప్లమసీ) చెక్కుతున్నందుకు కూడా అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట్ గారు: మా గళ్ల లెక్కల ప్రవల్లిక మీకు నచ్చినందుకు సంతోషం. మీ మంచి మాటకి ధన్యవాదాలు!

      తొలగించండి
  3. లలితా! నువ్వు 'పదాల' తోనే కాదు, 'పాఠాల' తోనూ ఆడుకుంటావు!
    బావుంది, మీ ఇద్దరి 'చక్కని', 'చిక్కని', 'చిక్కిన' 'చిక్కుల' లెక్కల ఆటవిడుపు.
    ఇంకో టంగ్ ట్విస్టర్. ;-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆడుతూ పాడుతూ పెరగనిచ్చినదాన్ని - మా ఇంటి వారందరి చేత. అది ఇంకా కొనసాగుతోంది - అంతే :)

      తొలగించండి
  4. కథ, పద్యం, కవిత్వం, పేరడీ,స్వగతం,సమస్యా పూరణలు ఆఖరికి ఈ గజిబిజి చిక్కులుతో సహా అన్ని ప్రక్రియలతోనూ నీ బ్లాగులో సాహిత్యం వెలిగిపోతోంది...మొత్తానికి మా బుజ్జి జింక కూడా బుల్లి మేధావే! వాడికి దిష్టి తేసేయ్ (నవ్వద్దు...తిట్టుకోవద్దు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుజ్జిజింక గురించి నువ్వన్న మాట దీవెనే, హనుమాన్! - దిష్టేమీ కాదులే :)

      తొలగించండి