24, నవంబర్ 2019, ఆదివారం

జయహో! Joyous జయస్!

నాకు...

పాటతో మొదలు రోజు
పాటతో కదలుటే రివాజు

నాకు...
పాట అననిదే మాట పెగలదు
పాట విననిదే పూట గడవదు

నాకు... 
పాట తోనే నిండు కడుపు
పాట తోనే వుంది బ్రతుకు

నాకు... 
పాటతో గ్రుంకు పొద్దు
పాటతో మణుగు సద్దు

అందుకే ...
రోజుకో నాలుగు పుంజీల పాటలన్నా వినాల్సిందే నేను -
భాషేదైనా సరే... పాతవో... కొత్తవో...
హాయివో... గోలవో...
ప్రేమవో... బాధవో... భావమేదైనా సరే!

ప్రతిరోజూ ఆఫీసు పని అయిపోగానే కాఫీ గుటక, కాస్త నడకా అయిపోగానే - Dumb time కి వేళాయెగా ... అని పాడుకుంటూ - అమెజాన్ ఫైరు మీదో, యూట్యూబు టీవీ రిమోటు మీదో మీటలు నొక్కుకుంటూ, ఆ పూటకి నేను వినదగ్గ పాటలు వెతుక్కుంటూ వుంటాను.

సెప్టెంబర్లో ఒకానొక రోజు నా Dumb సమయంబును సంబరముతో గడుపుకొన నిశ్చయించి యూట్యూబను యాప్రాజమును తెరిచా.

అప్పుడు అనుకోకుండా ఓ వీడియో చూశా - 2017 సరెగమప లిటిల్ చాంప్స్ ప్రోగ్రాముది.
అందులో బంతి లాంటి ఓ బుడుగు.
పచ్చ టీ-చొక్కా - నీలి జీను పేంటూ వేసుకుని, బుగ్గలొచ్చిన ౘందమామలా వున్నాడు.
మైకోటి చేత్తో పట్టుకుని, గుండ్రంగా తిరుగుతూ "చన్నా మేరేయా... మేరేయా" అంటూ పాడుతున్నాడు.

ఆ బుడుగు పేరు జయస్ కుమార్ అట.
అప్పటికి (2017) తనకి ఐదేళ్ళట. అదే మొదటి స్టేజ్ ప్రోగ్రామట.

ఈ పాట మొత్తం స్ట్రైటు లైనులా నించుని పాడిన జయస్ కుమార్ ఒక్క ""చన్నా మేరేయా... మేరేయా" అన్న లైను దగ్గర మాత్రం అలా గుండ్రంగా ఎందుకు తిరిగాడూ, అది చూసి అందరూ ఎందుకంత మురిసిపోతూ చప్పట్లు కొట్టారూ అన్న ఒక చిన్న కుతూహలంతో - అసలీ "చన్నా మేరేయా... మేరేయా" పాటేంటీ, దాని కథేంటీ, దాన్ని నేనిప్పటిదాకా వినకపోడమేంటీ అనుకుని - యూట్యూబ్లో వెతికితే అదొక కపూర్ వారి మనవడూ, బచ్చన్ గారి కోడలూ, క్రికెట్టు విరాటుడి ఇల్లాలూ తదితరులు నటించిన "ఏ దిల్ హై ముష్కిల్" అనే సినిమా లోది అని తెలియవచ్చింది.

పస్తుతానికి వున్న భవసాగరాలకి తోడు ఈ చపాతీ-ముఖ-భరిత చిత్రాన్ని కూడా ఈద లేక ఒట్టి పాట చూడడంతో సరిపెట్టుకున్నా.

ఆ అసలు పాట చూశాక తెలిసింది ఆ బుగ్గల ౘందమామ ఎందుకలా గుండ్రంగా తిరిగాడో.

జయస్ పాడడం మొదలు పెట్టగానే ఓ ఐదేళ్ళ బుజ్జిగాడు అంత బాగా పాడతాడని ఊహించని ముగ్గురు జడ్జులు (హిమేష్ రేషమ్మియా, నేహా కక్కర్, జావేద్ అలీ), ముప్పై మంది జ్యూరీ ఆనందంతో గంతులు వేశారు.

ఈ జయస్ కుమార్ కూడా భలే వాడు. జడ్జెస్ అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా తనకి అనిపించిందేదో  టకటకా చెప్పాడు - అచ్చు ఐదేళ్ళ బుడుగు లాగా.

నాకు ఆ జయస్ జవాబులు, వాటికి మురిసిన నేహా కక్కర్ నవ్వులు ఎంత నచ్చాయంటే వాళ్ళిద్దరి కోసమే మిగిలిన వీడియోలన్నీ వెతుక్కుని మరీ చూసేంతగా.

జయస్ పాట విన్న హిమేష్ రేషమ్మియా పరుగున వెళ్ళి "బాలలు భగవత్స్వరూపాలు. చోటే భగవాన్! నన్ను ఆశీర్వదించు" అంటూ జయస్ చేతిని తన తలకి తాకించుకున్నాడు.

అన్నట్టు ఈ బుడుగు జయస్ గుండె - ఈ ప్రపంచంలో left out అన్న ఫీలింగెప్పుడూ వాడికి రాకుండా వుండాలన్నట్టు - లెఫ్ట్ సైడ్ కాకుండా -  right place లో రైట్ సైడ్ ఉందట.

వాళ్ళ తాతగారికి (పితామహులకి) సంగీతం అంటే ఇష్టమట. కానీ ఆయన వున్నప్పుడు నేర్చుకోలేక, నేర్చుకోకుండానే ఉన్నట్టుండి వెళ్లిపోయారట. ఈ బుడుగు వాళ్ళ తాతగారు వెళ్లిపోయిన రోజే పుట్టాడట. అందుకని బుడుగు తండ్రి తన తండ్రే ఈ బుడుగు జయాస్ రూపంలో పుడుతూనే పాట పాడుకుంటూ పుట్టేసినట్లనిపిస్తుందట.

మొత్తానికి ఈ జయస్ - is a boy with extraordinary singing talent and flair of smart answers. 





షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్, మీత్ బ్రదర్స్ - ఇలాంటి బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది ఈ బుడతడితో స్టేజ్ పంచుకుని, ఈ చోటే భగవానుడి ఆశీర్వాదాలు పొందినవారే.

గాయకుడు విపిన్ అనేజా విసిరిన voice modulation జ్యూరీ ఛాలెంజ్‌కి బదులుగా జయస్ పాడిన జవానీ-దివానీ సిన్మా లోని "జానేజా ..." పాట తప్పక చూడాల్సిందే.

ఈ పాటలో అటు హీరో గొంతు (కిషోర్ కుమార్), ఇటు హీరోయిన్ గొంతు (ఆశా భోస్లే) ల్లోని స్వర / శృతి భేదాలు తెలిసేలా, పాటకు తగ్గట్లు బుజ్జిబుజ్జి చేతులూపుతూ ఆ బూరె బుగ్గల బుడతడు పాడడం చూస్తే నాకెంత సంబరంగా అనిపించిందంటే నేనక్కడ ఉండి ఉంటే వాణ్ణి ఎత్తేసుకుని ముద్దు పెట్టేసుకునేంత.






బుజ్జి జయస్ గురించి చెప్పాలంటే ఇంకా బోల్డన్ని పాటలు పాడాడు. అవన్నీ యూట్యూబ్లో ఎలాగూ వున్నాయి. కానీ ఇక్కడ ఇంకొక్క పాట గురించి మాత్రం చెప్తాను. అది రంగీలా సినిమా పాట.

జయస్ ఆ పాట పాడేటప్పుడు ఏ. ఆర్. రెహమాన్ అతిథిగా వచ్చాడు. జయస్ పాడిన పాటకు మురిసి చప్పట్లు కొట్టాడు.

అదొక ఎత్తైతే చివర్లో జయస్ ఉచ్చారణ దోషాలు లేకుండా పాడిన భగవద్గీత శ్లోకాలు ఇంకో ఎత్తు.





ఐదేళ్ళప్పుడు బుజ్జిబుజ్జి అడుగులు వేసుకుంటూ సరెగమప లిటిల్ చాంప్స్ ఆడిషన్ కోసమని వచ్చిన ఈ బుడతడు కుసింత జలుబు గొంతుతో పాడిన పాటలు, మాట్లాడిన మాటలు, వేసిన షమ్మీ కపూర్ స్టెప్పులు నాకు భలే ఇష్టం.

వంట చేసేటప్పుడు - నే చేసే వంట పథ్యం కాకుండా నోటికి హితవుండాలంటే - నా గరిటెల విన్యాసానికి నేపథ్య సంగీతంలా - నా వంటిం-థియేటర్లో పూటపూటా పాటల కచ్చేరి జరిగి తీరాల్సిందే. ఆ కచ్చేరిలో ఓ పాట జయస్‌దై ఉండాల్సిందే.

నాకింత joy నిచ్చిన joyous జయస్‌కి జయహో!

~పాటల భైరవి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి