19, డిసెంబర్ 2019, గురువారం

త్వామనురజామి - 42 - వింత-Chaట్లు వినవలె వింతవింతలూ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 41 - నీవీ నావీ కలలే... ఒకటే రంగులే...

డిసెంబర్లో బెంగుళూరు మరీ చలిగా అనిపించింది.

BTS లో వెళ్ళేటప్పుడు నాకు కిటికీ దగ్గర సీట్లో కూర్చుని రోజూ చూసే రోడ్లూ, బిల్డింగులే అయినా సరే ఏ రోజుకారోజు కొత్తగా చూడడం ఇష్టం. దాని కోసం ఒకట్రెండు బస్సులు మిస్ అయినా సరే - నాతో పాటు బస్సెక్కాల్సిన వాళ్ళందరూ ముందు బస్సుల్లో వెళ్ళిపోయాక ఆ తర్వాత ఖాళీగా వుండే బస్సు కోసం వెయిట్ చేసేదాన్ని. అప్పుడు నాకు కిటికీ సీటు దొరికేది - పైగా కిటికీ మూ సెయ్యమని చెప్పడానికి నా పక్కన ఎవరూ వుండేవాళ్ళు కాదు. దాంతో హాయిగా గాలి తగలాలని కిటికీ బయటికి మొహం పెట్టి కూర్చునేదాన్ని. అలా చేసినప్పుడు నాకు నచ్చేది. కానీ ఆ చలిగాలి తగిలి నాకు కొంచెం తలనొప్పి, మెడనొప్పి రావడం మొదలు పెట్టాయి. నా గాలి-ఇష్టం ముందు ఆ నొప్పి-కష్టాన్ని అంతగా పట్టించుకోలేదు.

నవంబర్ ఆఖరివారంలో ఇంటికి ఫోన్ చేసినప్పుడు అమ్మ చెప్పింది డిసెంబర్లో హైదరాబాదుకి వచ్చేలా ప్లాన్ చేసుకొమ్మని. ఎందుకూ అంటే మా ప్రభావతి దొడ్డ కొడుకు నానిబాబు పెళ్ళి అని చెప్పింది.

చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో  ట్రెయిన్ ప్రయాణం. బెంగుళూరు నుంచి నేను, వైజాగ్ నుంచి కుట్టి హైదరాబాదు చేరాం. పప్పి అమ్మ, నాన్న లతో గుంటూరు నుంచి వచ్చింది.

సాంబశివరావు పెదనాన్నకి నేనంటే బోల్డు ఇష్టం. పెళ్ళికి వచ్చిన వాళ్లందరికీ నేను ఎంసీఏ చదువుతున్నానని భలే గొప్పగా పరిచయం చేశారు. నిజం చెప్పాలంటే నేనూ ఆ అటెన్షన్‌ని బోల్డంత ఎంజాయ్ చేశాను.

నానిబాబు పెళ్ళికి అమ్మ మా ముగ్గురి కోసం పట్టుచీరలు కొంది - నాకు నెమలికంఠం రంగుకి ముదురునీలం అంచుది, కుట్టీకి గులాబీ రంగుకి ముదురునీలం అంచు వున్నది.

మా ఇద్దరికీ కొన్న చీరలు అమ్మే సెలెక్ట్ చేసింది-మరి మేమిద్దరం గుంటూరులో లేం కదా! పప్పీ మాత్రం గోరింటాకు రంగుకి మెరూన్ బోర్డర్ చీర కొనుక్కుంది. ఇక నేను, కుట్టీ బోల్డంత unique గా వున్న పప్పీ చీర కాంబినేషన్ చూసి కొంచెం సేపు - కుహూ కుహూ - అన్నాం. పప్పెమ్మేమో మమ్మల్ని చూసి ముసిముసి నవ్వులు. అది చూసి ఇంకొంచెం ఉడికిపోయాం.

ఇంతలో అమ్మ  - "నాకు నచ్చినవేవో కొన్నాను. ఈ ఒక్క చీర తోనే అయిపోదు కదా? ఈసారి మీక్కావాల్సినవి కొనుక్కుందురు గానీ" అనగానే చీరల కబుర్లు అక్కడితో ఆగిపోయాయి. అసలు నిజం చెప్పాలంటే రంగుల పట్టింపులు లేనేలేవు. అమ్మ ఏది కొంటే అదే కట్టుకునేవాళ్ళం. కాకపోతే పప్పి చీర కొంచెం వేరేగా కనిపించేటప్పటికి నేను, కుట్టి దాంతో అరువుదెబ్బలాటాడుదామనుకున్నాం. ఆడాం. అంతే!

నానిబాబు పెళ్లి హడావిడిగా, సరదాగా జరిగిపోయింది. మేం ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, నవ్వుకుంటూ బోల్డంత ఎంజాయ్ చేశాం.

సత్యనారాయణవ్రతం రోజున కొత్త పెళ్ళికూతురు రాణి "ఆప్ కీ నజరోం నే సమ్‌ఝా" పాట పాడింది. చాలా బాగా పాడింది. కుట్టి కూడా  అన్నమాచార్య కీర్తనలు "కొండలలో నెలకొన్న", " జగడపు చనవుల జాజర", "వినరో భాగ్యము విష్ణు కథా", "భావము లోనా బాహ్యము నందునూ" పాడింది.

వాళ్ళిద్దరూ పాడగానే వింటున్న వాళ్ళందరూ "లల్లీ! నువ్వూ పాడతావుగా - ఒక పాట పాడు" అని అడగ్గానే నేను పాడిన పాట "సారీ సారీ రాత్ తేరీ యాద్ సతాయే". అడిగారే కానీ ఒక్కళ్ళూ నా పాట సరిగ్గా వినలేదు. అది వాళ్ళ తప్పేం కాదు. మా కుట్టి పాట వినేవాళ్ళని కట్టిపడేసేలా వుంటే, నా పాట మాత్రం వాళ్ళని కట్టి పడేస్తేనే వింటారు.

డిసెంబర్ నాలుగో తారీఖు నా ప్రయాణం బెంగుళూరుకి. సాయంత్రం ట్రెయిన్.

ఆ రోజు పొద్దున్నే ప్రభావతి దొడ్డ నాకూ, పప్పి, కుట్టీలకి బట్టలు కొనిపెడతాని ఆబిడ్స్‌కి షాపింగ్ తీసుకెళ్ళింది. ఇక ఇంటికొచ్చేటప్పటికి నాకు బాగా తలనొప్పి, మెడనొప్పి వచ్చాయి. భరించలేక ఏడ్చేశాను. అందరూ కంగారు పడిపోయారు. నా తలకి నూనె రాసి, మెడకి అమృతాంజనం రాసి "ఏడు మల్లెపూలెత్తు మన లల్లెమ్మ" అంటూ బోల్డంత సేవలు చేసేశారు. పెళ్లికూతురు రాణి మెడిసిన్ చదువుతోంది. తను కూడా వచ్చి డిస్ప్రిన్ వేసుకోమని ఇచ్చింది.

ఎంత మంది ఏ మందిచ్చినా తగ్గదే నా తలనొప్పి!!!

వెంటనే ప్రభావతి దొడ్డ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. ఆయన చూసి ఏదో మందిచ్చి సైనస్ ఉన్నట్టుంది, ENT స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమని అన్నారు. అప్పటికి నొప్పి తగ్గింది. అప్పుడే అమ్మ చెప్పింది సంక్రాంతికి గుంటూరు వస్తే ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చని. 

మొత్తానికి సాయంత్రం దొడ్డ కొనిచ్చిన కొత్త చీర కట్టుకుని, అమ్మ కాళ్ళకు రాసిన పసుపుపూతతో ట్రెయిన్ ఎక్కి బెంగుళూరు వెళ్ళాను. ఆ మరసటి రోజు డిసెంబర్ 6వ తారీఖు. ఆఫీసుకి వెళ్ళలేకపోయాను. బెంగుళూరులో కర్ఫ్యూ - ఢిల్లీ దగ్గర కర్ సేవ జరిగిందని. నేను హైద్రాబాదులో బయల్దేరడం ఒక్క రోజు ఆలస్యం అయి ఉంటే నేను బెంగుళూరు ఇంటికి చేరగలిగేదాన్ని కాదు. అది తలుచుకుని "అమ్మో!" అనిపించింది అప్పుడు.

ఓ నాలుగు రోజుల కర్ఫ్యూ తర్వాత మళ్ళీ 14వ తారీఖునే NALకి వెళ్ళగలిగాను నేను.

మళ్ళీ నా వర్క్, సునీతతో కేంటీన్లో కబుర్లు - అన్నీ మామూలే. NAL కేంపస్‌లో ఒక సూపర్ మార్కెట్ ఉండేది. సునీతా, నేనూ రోజూ లంచ్ కాగానే అక్కడికి వెళ్ళి ఒక చాకొలెట్ బార్ కొనుక్కుని వచ్చేవాళ్ళం. నాకు అమూల్ - ఫ్రూట్ & నట్ బోల్డంత ఇష్టం. ఎందుకంటే అది అబ్బాయి కల్పించిన ఇష్టం. తిరుపతిలో నన్ను హాస్టల్లో కలవడానికి వచ్చిన ప్రతిసారీ ఓ బార్ తెచ్చి, నా చేతిలో పెడుతూ ఆ రేపర్ మీదున్న A gift for someone you love... అన్న ఫ్రేజ్ కేసి "చూడూ" అన్నట్టు కళ్ళతో నవ్వుతూ చేసిన అలవాటది. ఆ గుర్తుగా NAL  సూపర్ మార్కెట్లో నేను అదే అమూల్ కొనుక్కుని తినేదాన్ని.

సరే! తిరగడాలు-తినడాలు నిరవధికంగా జరుగుతున్న రోజులు. డిసెంబర్ 19 శనివారం. ఆ రోజు శ్రీను, శ్యామల ఎక్కడికో బయటికి వెళ్ళారు. నేను సాధారణంగా వాళ్ళతో వెళ్ళేదాన్ని కాదు. ఇంట్లోనే వుండి పుస్తకమేదో చదువుకునేదాన్ని. ప్రస్తుతానికి Gone with the wind లో స్కార్లెట్ ఓ'హారాతో పాటు నేనూ అట్లాంటా కాటన్ ప్లాంటేషషన్స్‌లో తిరుగుతున్నానేమో - దాన్ని వదలాలనిపించక హాల్లో సోఫాలో కూర్చుని చదువుకుంటున్నాను. ఇంతలో నా కళ్ళ చివరల నుండి బయట గేటు దగ్గర ఎవరో నించున్నట్టు అనిపించింది.

ఎవరా...  అని చూసి ఒక్క గెంతులో గేటు దగ్గరికి పరిగెత్తాను.

గేటుకవతల - గేటు తీయబోతూ తను, గేటుకివతల - గేటు తీయనీకుండా నేను.

అప్పటికి బదరిని చూసి, మాట్లాడి చాలా రోజులైపోయింది. అప్పుడెప్పుడో మే లో తను మెడ్రాస్ వెళ్లే ముందు తిరుపతిలో చూడ్డమే. మళ్ళీ ఈ రోజు - ఇలా... తనని చూడగానే ఏదో తెలియని మొహమాటం ...

చేరువనున్న మోము చూడబోతే
అడ్డు వచ్చింది సిగ్గు తెఱసెల్లా


నన్ను చూస్తూనే "నువ్వు బెంగుళూర్ ఇష్టమన్నావని ఇక్కడే ఉద్యోగం వెతుక్కుందామని వచ్చేశాను...." అని ఇంకేదో చెప్పబోతుంటే నేను మాత్రం కుశల ప్రశ్నలు కూడా అడక్కుండా - "మీరు లోపలికి రావొద్దు. శ్రీను వాళ్ళు ఇంట్లో లేరు." అని గబగబా అనేశాను. 


ముందో నిముషం తనకి నేనేం చెప్తున్నానో అర్థమయినట్లు లేదు. అర్థం కాగానే - నాచేతిలో అమూల్ ఫ్రూట్ & నట్ బార్ పెట్టి - ఎప్పట్లాగే ఓ కనుబొమ్మ ఎత్తి A gift for someone you love...కేసి చూపించి - " రేపు NAL దగ్గర కలుస్తాను" అని చెప్పి వెళ్లిపోయారు. 

చెప్పొద్దూ...నాకెంతో బెంగగా అనిపించింది. కొంచెమంటే కొంచెమే కన్ను తడిసింది.

దూరమౌతున్న మిము కనబోతే
కన్నీరు మూసేసింది నీహారికలా... 
 
... అంత దూరం నుంచి తనొస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అలా పంపించేశానని.

కానీ కావాలనే అలా చేశాను. అప్పటికే శ్రీను చేత చెప్పించుకున్నాను - బదరి టెలిగ్రాం పంపించినప్పుడు వాళ్ళ ఇంటి ఓనర్ ఆవిడ కంగారు పడ్డారని, అది తనకూ నచ్చలేదని. ఇక ఇంకోసారి తనతో చెప్పించుకోవడం నాకిష్టం లేదు. పైగా బదరి విషయం నేను మా అమ్మా-నాన్నతో ఒప్పించుకోవాల్సివుంది. అందుకే అలా వెళ్లిపొమ్మన్నాను.

అన్నట్టుగానే మరుసటి రోజు NAL దగ్గరికి వచ్చారు బదరి. తనని సునీతకి పరిచయం చేశాను. ఆ రోజు ముగ్గురం కలిసి లంచ్ చేశాము. ఆ రోజు సాయంత్రం వరకు నాతోనే ఉండి నాతో పాటే విజయనగర్ బస్టాప్ దాకా వచ్చారు తను. తనతో ఉన్నంత సేపూ మాట్లాడుతూనే వున్నాను. ఒకటా, రెండా - ఆర్నెల్ల కబుర్లు మరి.

W. Besil నుంచి నాన్న పేరు మీద వచ్చిన కొరియర్ గురించి
డైనింగ్ టేబుల్ దగ్గర నూనెగిన్నె కబుర్లు
బెంగుళూరు నుంచి వెళ్ళే ముందు నాన్న నాకు చెప్పిన మాటలు
BTS ప్రయాణాలు
NAL కబుర్లు - అక్కడ సైంటిస్టులు నాకు పెట్టిన కొత్త పేర్లు
తను పంపిన పాట టెలిగ్రాం తెచ్చిపెట్టిన ఇబ్బంది

- ఇలా వింత-Chaట్లు వినవలె వింతవింతలూ... ఇంతగ నేనింత నోరెత్తగానయ్యా... అన్నట్లు తన విన్న-పాట్లు కూడా పట్టించుకోకుండా చెప్తూనే...చెప్తూనే వున్నాను. బదరి వింటూనే...వింటూనే వున్నారు.

అప్పుడే చెప్పాను అమ్మ, నాన్నల పెళ్ళిరోజుకి ఎవరో W. Besil గిఫ్ట్ పంపించారని, నాన్న బ్రాడీపేటలో కొరియర్ వాళ్ళందర్నీ అడిగినా ఎవరు పంపించారో తెలీలేదు అని.

నేను చెప్పింది వింటూనే ఓ చిన్న నవ్వు, ఆ నవ్వుతో ఓ బుల్లి ప్రశ్న "ఎవరూ డబ్ల్యు బెసిలేనా?" అంటూ.

"అరె! అదే పేరు... మీకెలా తెలుసు?" అసలే తను కనిపించిన ఉత్సాహం, పైగా తనకన్నీ తెలిసిపోతున్నాయేంటా అని హాచ్చెర్యం.

"మళ్ళీ ఇంకోసారి అనుకుని చూడు... W...BE... S. I. L." అని స్పెల్లింగ్ విడివిడిగా చెప్తుంటే కూడా నాకు తట్టలేదు.

"ఉహూఁ ... ఏంటో చెప్పొచ్చుగా" ఆలోచించే ఓర్పు లేక విసుగొచ్చేస్తోంది నాకు. నాకు చెప్పడంలో ఉన్న ఉత్సాహం వినడంలో, ఆలోచించడంలో ఉండదు మరి.

"మీ నాన్నగారికి అంత మంచి పక్షుల బొమ్మ అసలెవరు పంపిస్తారని అనుకుంటున్నావు?.... కాబోయే అల్లుణ్ణి నేను తప్ప" తన మార్కు నవ్వు-సహిత-వాక్కు అది.

అప్పుడర్థమయ్యింది నాకు. "రిదం సురపుత్రి తాలిలవి" అంటూ నా పేరుతో ఆట్లాడే తను సృష్టించిన ఇంకో పేరు W. Besil (Would Be Son-in-law) అని.

భలేగా అనిపించి ఆ excitement లో తాను ఉలిక్కిపడేలా గట్టిగా విజిల్ వేసేశా. అప్పటికే ఓ రెండులక్షల ఏభైవేల ఆరువందల తొంభై సార్లు (అది నా లక్కీ నంబర్) అనిపించినట్లు మళ్ళొక్కసారి అనిపించింది ఈ అబ్బాయితో నా లైఫ్ మూడు పజిళ్ళు - ఆరు విజిళ్ళుగా ఉంటుందీ అని.

సరే! అప్పట్నుంచి తనకి కుదిరినప్పుడల్లా - రోజు విడిచి రోజో, రెండ్రోజులకోసారో - నాతో పాటు NAL దాకా బస్సులో రావడం - నన్నక్కడ దింపి తను సెయింట్ మార్క్స్ రోడ్లో వున్న ఆఫీసుల్లో ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించడం - రోజులు BTS చక్రాల మీదే పరిగెడుతున్నట్లున్నాయి.

ఓ రోజు అలాగే కలిసినప్పుడు బదరి నాకేం చెప్పారంటే ఆ పై వారం తన ఫ్రెండ్ రాకు మెడ్రాస్ నుంచి బెంగుళూరు వస్తున్నాడని, అతనితో బెంగుళూరులో ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్లు. చెప్తూ నన్ను కూడా వాళ్ళతో నందిహిల్స్ చూడ్డానికి రమ్మని అడిగారు. రాకు అసలు పేరు రాజకుమార్ అయితే రాకు బదరి తనకిచ్చిన Peట్టు-పేరు.

నాకు వెళ్లాలని అనిపించినా మళ్ళీ శ్రీనుకి చెప్పాలా వద్దా అనాలోచిస్తూ అసలు వెళ్ళకపోతే ఎలా చెప్పాలా అన్న గొడవే లేదు కదా అనుకుని నేను ముందు రానని అన్నాను కానీ బదరి "నేన్నీకు ఒక విషయం చెప్పాలి - అదేంటో వినాలంటే నాతో రావాల్సిందే" అనగానే సరేనన్నాను.

అనుకున్నట్టుగానే రాకు రావడం, మేం ముగ్గురం బస్సులో నందిహిల్స్ వెళ్ళడం జరిగింది. ఒక కిటికీ సీట్లో నేను, నా పక్కనే బదరి కూర్చున్నాము. రాకు మా ముందు సీట్లో కూర్చున్నాడు. అప్పుడు అడిగాను బదరిని - "ఇప్పుడు చెప్పండి. ఏంటో చెప్తానన్నారు ... " అంటూ.

" ఏం లేదు బుజ్జాయ్... నేను ఇక్కడికి వచ్చే ముందు గుంటూరు వెళ్లి వచ్చాను. అమ్మకి నీ విషయం చెబ్దామని అనుకున్నాను. అప్పుడేం చేశానంటే ..." - అంటూ - ముందున్న రాకు భుజం తట్టి "ఔను రాకూ...మద్రాసులో మన వాళ్ళందరూ ఎలా వున్నారు ? వచ్చేముందు ఎవర్నైనా కలిశావా? " అని రాకుతో మాట్లాడడం మొదలు పెట్టారు.

మామూలుగా  సుఖాంతం అని తెలిసిన నవలనైనా వెనక నుంచి ముందుకు చదివే నేను - బదరి నాతో చెప్తున్న విషయం మధ్యలో ఆపేసరికి - ఇక గోళ్లు కొరకడం మొదలు పెట్టాను.

అది చూడగానే - నన్ను ఉడికించాలని కావాలని రాకుతో మాట్లాడుతున్న బదరి - నేనింక నా గోళ్ళు అయిపోయి తనవి కొరికేస్తానేమో అనేస్కుని - మళ్ళీ నాకేసి తిరిగి చెప్పడం మొదలు పెట్టారు.

"అమ్మ, తమ్ముడు, చెల్లాయ్ అందరితో సినిమాకి వెళదామని చెప్పాను. తమ్ముణ్ణి, చెల్లాయిని ముందో రిక్షాలో టికెట్లు తీసుకోమని మంగా థియేటర్‌కి పంపించి, నేను అమ్మతో ఇంకో రిక్షాలో ఎక్కాను. అమ్మకి అప్పటికే నేనేదో చెప్పబోతున్నానని అర్థం అయింది.

రిక్షా శంకర్ విలాస్ దగ్గరికి వెళ్ళగానే - నవ్వుతూ  "ఏంట్రా? ఏంటీ హడావిడి? ఏంటి సంగతి"? అని అడిగింది.

నేను "అమ్మా! మనింటికి వచ్చిందే - అదే లలిత - నేను తనని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను" అని గబగబా చెప్పేశాను.

అంతే! అమ్మ అక్కణ్ణించి రిక్షా బ్రిడ్జ్ దిగి ఏసీ కాలేజ్ దగ్గరకెళ్ళేదాకా మాట్లాడలేదు. నాకు ఆ కొంచెం టైం కూడా చాలాసేపు అనిపించింది.

సరిగ్గా ఏసీ కాలేజ్ దాటగానే అమ్మ నన్నడిగింది కొంచెం సీరియస్ గానే... "ఏరా... నిజంగా ఆ అమ్మాయంటే ఇష్టమా? లేకపోతే ఏదో ఆదర్శాలకి పోతున్నావా?" అంటూ.

"లేదమ్మా...తనంటే నాకు ఇష్టం" నెమ్మదిగా చెప్పాన్నేను.

మళ్ళీ అమ్మ చాలా సేపు మాట్లాడలేదు.

ఆ తర్వాత నెమ్మదిగా, స్థిరంగా చెప్పింది "నీ ఇష్టం. చేసుకో. నాకభ్యంతరం లేదు. కానీ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నువ్వెలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యొద్దు" అని".

బదరి వాళ్ళమ్మగారితో మాట్లాడిన సంగతి వినగానే నాకు సంతోషంగా అనిపించింది. నేను వెంటనే తన చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాను - ఇంకెప్పటికీ వదలనన్నట్టు.

తనింకా ఏం చెప్పారంటే "అన్నట్టు బుజ్జాయ్! నేను మద్రాసులో వున్నప్పుడు ఆంటీ, అంకుల్ మా ఇంటికి వచ్చారట. అంకుల్ బయట వరండాలో కూర్చుంటే ఆంటీ అమ్మతో లోపల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలా సేపు మాట్లాడారట. మాట్లాడినంత సేపూ - "మీ అబ్బాయి మంచివాడిలా వున్నాడండి. మీ మాట వింటాడు కూడా. మీరైనా చెప్పండి అతనికి. మాది పల్లెటూరు. మా ఇంట్లో పట్టింపులెక్కువ. ఇలాంటివన్నీ ఒప్పుకోరు" అని - "పెళ్ళి" అన్న మాట ఒక్కసారి కూడా ఆవిడ నోట్లోంచి రాకుండా జాగ్రత్త పడుతూ - మరీమరీ చెప్పి వెళ్ళారట. అందుకే అమ్మ కూడా మరీమరీ చెప్పింది ఆంటీ-అంకుల్ ఒప్పుకుంటేనే మన పెళ్ళి అని" అని.

అది వినగానే అప్పటిదాకా అనిపించిన హాయేదో తగ్గుతున్నట్టు అనిపించినా అంతలోనే ధైర్యం - బదరితో కలిసి అమ్మా-నాన్నని ఒప్పించగలనని.

మొత్తానికి రాకు, బదరి, నేను నందిహిల్స్ అంతా బోల్డంత నడిచి అక్కడున్నవన్నీ - టిప్పు సుల్తాన్ వేసవి విడిదితో సహా - చూశాం. నేను ఐస్క్రీమ్ తిన్నా - చలిలో వణుకుతూ తినడం నాకిష్టం మరి :) అన్నట్టు నేను అప్పుడెప్పుడో గుంటూరులో అమ్మాయిలు మెచ్చుకున్న నా ఆఫ్-వైట్ బెంగాల్ కాటన్ చీర కట్టుకెళ్ళాను నంది హిల్స్‌కి. రాకు తను తెచ్చిన కెమెరాతో ఫోటో కూడా తీశాడు.

సాయంత్రం నాలుగు కాగానే వెనక్కి వచ్చేశాము. మెజెస్టిక్ బస్టాండులో దిగగానే రాకు, బదరి నన్ను విజయనగర్ వెళ్లే బస్ ఎక్కించడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో రాకు కాఫీ తాగి వస్తానని కేంటీన్ లోకి వెళ్ళగానే బదరి నా చెయ్యి పట్టుకుని "బుజ్జాయ్! అమ్మ అలా ఆంటీ-అంకుల్ని ఒప్పిస్తేనే పెళ్లి అంది కానీ నాకెందుకో కొంచెం బెంగగా వుంది. అందులోనూ సంక్రాంతికి గుంటూరు వెళ్తున్నానని చెప్పావు. నిన్ను అక్కణ్ణించి ఏ అనాతవరమో పంపించేస్తే ఇక నిన్నెప్పటికీ చూడలేనేమో అని భయమేస్తోంది" అన్నారు.

బదరి అలా మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వొచ్చింది. తనకి అలా చేయడం అలవాటే... ఏదో చాలా సీరియస్ విషయం చెప్తున్నట్లు మొదలుపెట్టి నేనది విని కంగారు పడుతుంటే - "చూశావా... నేను చెప్పింది మళ్ళీ నమ్మేశావ్... ఇలా ప్రతిదీ నిజమని నమ్మేస్తే ఎలా?"  - అని నన్ను వేళాకోళం చేయడం, నేను ఉడుక్కోవడం మామూలే.

అందుకే  నేను వెంటనే నవ్వుతూ "ఇంకా నయం! నా ప్రాజెక్ట్ ఇంకా ఫిబ్రవరి వరకు వుంది. నన్నెందుకు అనాతవరం పంపిస్తారు? నా ఇష్టం లేకుండా అలా చెయ్యనే చెయ్యరు" అనేశా.

బదరి వెంటనే.. "నీకు అసలు నే చెప్పేది అర్థం కావట్లేదు - నా క్లోజ్ ఫ్రెండొకడు ఓ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు అలాగే చేశారు - ఆ అమ్మాయిని ఎక్కడికో పంపించేశారు. ఇప్పుడు వాడి బాధ చూడాలి నువ్వు ." అని కొంచెం గట్టిగా చెప్పారు.

నేనప్పటికీ పట్టించుకోకుండా "ఆ అమ్మాయి అమ్మ-నాన్న ఎలాంటివాళ్ళో నాకు తెలీదు కానీ మా అమ్మ-నాన్న నన్ను గట్టిగా ఓ మాట అనడానికే ఆలోచిస్తారు. అస్సలలా చెయ్యనే చెయ్యరు. మీకెందుకు అంత భయమో నాకర్థం కావట్లేదు" అన్నాను.

"నువ్వేమైనా చెప్పు. మనిద్దరం రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళదాం - కాదనకు" బతిమిలాడుతున్నట్టు అన్నారు బదరి.

నాకప్పటికి అర్థం అయ్యింది - ఇది సరదాగా సాగుతున్న సంభాషణ కాదని.

"కుదరనే కుదరదు. నా పెళ్ళి మా అమ్మా-నాన్నే చెయ్యాలి. అదెంత కాలం పట్టినా సరే!" అన్నా మొండిగా నేను.

"నీ... పెళ్ళా? సరే! ఇహ నే చెప్పేదేముంది? నీ పెళ్ళి ... నీ ఇష్టం. నే వెళ్తున్నా. Bye" అని బోల్డంత కోపంగా రాకు వెళ్లిన కేంటీన్ వైపు వెళ్లిపోయారు బదరి నన్ను వదిలేసి.

రాకుతో కలిసి తిరిగి వస్తారేమో చూశాను కానీ - ఉహూఁ - చేసేదేం లేక విజయనగర్ బస్సెక్కి ఇంటికి వెళ్ళిపోయాను.

రెండో రోజు, మూడో రోజు ...బదరి రానేలేదు. తనకి బాగా కోపమొచ్చినట్టుంది.

నేను మామూలుగానే ఆఫీసుకి వెళ్లి వస్తున్నాను.

ఆ రోజు లంచ్ అయిపోగానే ఎప్పట్లాగే నేను, సునీత సూపర్ మార్కెట్లో అమూల్ బార్ కొనుక్కుని వస్తుంటే ఎదురుగా నవ్వుతూ అనూప్-ద్వారక్ కనిపించారు.

నన్ను చూడగానే అనూప్ నవ్వుతూ చెయ్యి చాపాడు - "A gift for you" -  అంటూ అమూల్ ఫ్రూట్ & నట్ బార్ ఇస్తూ.

వెంటనే నేను నా చేతిలో వున్న అమూల్ చూపిస్తూ - "I bought my own gift" - అని నవ్వేశా.

అనూప్ అది ఊహించలేదు. అయినా సరే అక్కడితో ఆగక "విండ్సర్ మేనర్లో న్యూ ఇయర్ డిన్నర్‌కి టేబుల్స్ రిజర్వ్ చేసుకున్నాం NAL నుంచి కొందరు ఫ్రెండ్స్ . మీరూ జాయిన్ అవుతారా?" అనడిగాడు సునీతనీ, నన్ను.

సునీత తను మదనపల్లి వెళ్తున్నట్లు చెప్పింది.

అనూప్ అలా అడగ్గానే కొంచెం చిరాగ్గా అనిపించినా - నేను మొట్టమొదటిసారిగా snappy గా కాకుండా - చాలా మర్యాదగా "నాకు కుదరదు. మా అన్న ఇంట్లో ఏదో పార్టీ ప్లాన్ చేస్తున్నాడు" అని చెప్పి తప్పించేసుకున్నా.

అన్నట్టు నే చెప్పనేలేదు కదూ... సునీత దాదాపు ప్రతివారం మదనపల్లి వాళ్ళింటికి వెళ్ళేది. దాని కోసం KR మార్కెట్లో బస్సెక్కేది. నాకు విజయనగర్ వెళ్లాలంటే మెజెస్టిక్ మీంచి కానీ, KR మార్కెట్ మీంచి కానీ ఒకటే దూరం. ఎలాగూ రెండు బస్సులు మారాలి. ఈ మధ్య కొంచెం BTS ప్రయాణాలు బాగానే అలవాటయ్యాయి. అందుకని ప్రతి శుక్రవారం సునీతతో KR మార్కెట్ దాకా వెళ్ళి తను మదనపల్లి బస్సెక్కాక నేను విజయనగర్ వెళ్ళడం అలవాటయ్యింది.

నేను ఏదో తప్పించుకోవడానికి అన్నట్లు చెప్పినా నిజంగానే శ్రీను డిసెంబర్ 31 రాత్రికి సాగి-ఇందిర లను డిన్నర్‌కి పిలిచాడు. శ్రీను, శ్యామల, సాగి, ఇందిరలతో న్యూ ఇయర్ ఈవ్ భలేగా గడిచింది. నేను NAL వాళ్ళ న్యూ ఇయర్ పార్టీ గురించి చెప్పగానే శ్రీను-సాగి నన్ను "అరె లల్లీ! భలే ఛాన్స్ మిస్ చేసుకున్నావ్.." అని ఆట పట్టించారు.

పైకి అంతా సవ్యంగా, సరదాగా జరుగుతున్నట్టున్నా... లోపల్లోపల ఏదో బెంగ -బదరికి న్యూ ఇయర్ విషెస్ చెప్పే వీలు కూడా లేదని. 


పన్నెండింటి దాకా కబుర్లు చెప్పుకుంటూ, టీవీ చూస్తూ ఉండి - అప్పుడు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని - దాదాపు ఒంటిగంట అవుతూ ఉండగా - వెళ్ళొస్తామని చెప్పి సాగి, ఇందిర వాళ్ళింటికి వెళ్లిపోయారు. 

అంతకుముందు శ్రీను, శ్యామలతో విజయనగర్ లెండింగ్ లైబ్రరీలో బుక్స్, ఆర్చీస్ కామిక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు - విజయనగర్ రోడ్ల మీద అప్పుడప్పుడూ వాకింగుకో, షాపింగుకో సాగితో వస్తుండే ఇందిరని కలిసినా - ఇదే మొదటిసారి తనతో ఎక్కువసేపు మాట్లాడడం. నాకు తన కోనసీమ-టింజ్‌తో మాట్లాడే ఇంగ్లీష్, వెండి మోగుతున్నట్టు వినిపించే nasal voice, తన మాటలు, గలగలలాడే నవ్వులు బోల్డంత నచ్చేశాయి. 

సాగి, ఇందిర వెళ్ళిపోగానే నేను కూడా నా గదిలోకి వెళ్ళి - వెంటనే నిద్ర పట్టక కాసేపు Gone with the wind చదువుదామనుకున్నాను కానీ కళ్ళ ముందు స్కార్లెట్ ఓ'హారా కథ కన్నా - తలలో రఫీ పాడిన పాట పదేపదే వినిపిస్తోంది... అదేదో అచ్చంగా - నా మీద కోపమొచ్చి వెళ్లిన బదరి - అక్కడెక్కణ్ణుంచో - నాతోనే అంటున్నారేమో అనిపించే మాటల్లా...

తేరీ గలియోం మే న రఖేంగే కదమ్ ... ఆజ్ కే బాద్...
తేరే మిల్‌నే కో న ఆయేంగే సనమ్ ... ఆజ్ కే బాద్... 

వెంటనే - ఇలాక్కాదు - అని లేచి కూర్చుని నా NAL ప్రాజెక్ట్ నోట్‌ప్యాడ్‌లో నా కొత్తసంవత్సరపు జ్ఞాపకం ఇలా రాసుకున్నా...

సాయంకాలపు నీరెండలో
కనబడిన నీ నీడను
ఆశగా అందుకోబోతే
వెక్కిరింతగా నవ్వుతావు గుండెలోంచి నువ్వు

నడిరేయి వెన్నెలను
నీ నవ్వనుకుని
కళ్ళలో దాచుకోబోతే
చడీ చప్పుడు లేకుండా ముత్యమై రాలుతావు నువ్వు

రెప్పపాటులో కదిలిపోయే నీ రూపు... 
అందుకోలేని పరుగుతో అలసిపోయిన నేను...
అనిమేషనై ఎంత సేపుండను?
గుండెలోనే దాగున్నా అందుకోలేని నేను!




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

4 కామెంట్‌లు: