7, డిసెంబర్ 2019, శనివారం

నవ్వంబర్ మాసపు నవ్వుల నవ్వులాటల నాలుగు రోజులు...

నాకు ఆమని ఎంతిష్టమో నేను అంతే Autumn-పక్షం కూడా! 

కిందున్న ఫొటోలో ఆ రంగుటాకుల మలుపు ఎంత బావుందో కదా!? 
ఇంత అందమైన చిత్రవర్ణాల చిత్రాన్ని అడగ్గానే ఇచ్చిన మెహరపర్ణకి బోల్డన్ని థాంక్స్! 

అందమైన బొమ్మ దొరికింది. 
దొరికిన దాన్ని చూసి ఊరుకుంటానా? 
చూసి ఊరుకుంటే అది నేనవుతానా? 

అందుకే నాక్కనిపించిన అందాన్ని చూసి - నాకనిపించింది రాసి - ఇక్కడ వుంచుకుంటున్నా... పంచుకుంటున్నా... 



ఆమని విరిసి మురిసె ఆ వని... 
అని అనుకుని మురిపెమెందుకో?
ఆమని పూసే రంగులు కొంతవరకే 
పూలు తూగు కొమ్మ వరకే
కొమ్మ చివరనూగు పూవు వరకే 

మరి... ఆకురాలు తెచ్చు వరాల కేమనాలో?
రంగులెల్ల రంగరించి 
ఆకులెల్ల రంగు పెంచి 
రాలు ఆకు బెంగ తుంచి 
నీవు రాలి చిగురునంపుమని... సాగనంపు 
ఆకురాలు దేమి లోటు?
ఆమనికది సరితూగు... దీటు...

 
 ఆ బొమ్మ చూసి రాసిందానితో అక్కడాగక - అక్కడందిన ఆకురాలు కబురు గురించి చెప్పకపోతే ఎలా - అనుకుని - అనుకున్నదే తడవు ఇలా రాసుకున్నా... 


ఉరికి వచ్చిన చలి నిలవనీక వణకించె 
చురుకు లేని ఎండ చలవ పందిరాయె
ఆకురాలుకారు ఇటు వచ్చినట్టు కబురదే... అందెనదె!

కొమ్మ రెమ్మ రంగు నలది సొబగు మించెనదె 
నిమ్మళించె పవలు నిశలు సాగి చిక్కనాయె
ఆకురాలుకారు ఇటు వచ్చినట్టు కబురదే... అందెనదె!
ఆగి ఆగి వీచు గాలి ఓపలేని రాగమాయె 
ఆకు ఆకు రాలి వాకిలంత ఆగమాయె
ఆకురాలుకారు ఇటు వచ్చినట్టు కబురదే... అందెనదె!




నవంబర్ నెల. నాకు మాత్రం అది నవ్వంబర్ నెల.

ఏడాది పొడుగునా సెలవు రోజులెన్ని వున్నా, ఆ అన్నిటిలో ఎన్నదగినవి నవంబర్ ఆఖరివారంలో వచ్చే ఆ నాలుగు రోజుల థాంక్స్ గివింగ్ సెలవులు.

చిక్కని సాయంత్రాలు.
తళుకు చుక్కలు నేలకు దిగాయా అనిపించే మిణుకు మిణుకు లైట్లు.
కాలు బైట పెట్టనీయని చల్లదనాలు.
వెచవెచ్చని వంటింట్లో కబుర్లు.

కలిపిచ్చిన వేడిబువ్వల పళ్ళాలతో సహా టీవీ ముందు చేరి అప్పటికి ఓ పదివేల సార్లు చూసినవైనా సరే అప్పుడే మొదటిసారి చూస్తున్నట్లు - feeling nostalgic about it  అనుకుంటూ టామెండ్జెర్రీయో, డిస్నీ వారి రాబిన్హుడ్డో చూస్తూ నవ్వుకునే బుజ్జిజింకలు.

వాళ్ళతో పాటే గత మూడేళ్ళుగా మా థాంక్స్ గివింగ్ ఆనవాయితీ అతిథి, అన్నజింక నేస్తం కెవిన్.

వాడికీ చేత్తో తినడం నేర్పేశాం. అచ్చతెలుగు భోజనం మరి!

వాడికలవాటైన చెంచాల్తో చారు తాగాలన్నా, ముళ్ళ చెంచాల్తో సనసన్నని ముల్లంగి పచ్చడిముక్కలు తినాలన్నా, తిండి పుల్లల్తో సాంబారు తాగాలన్నా తినాలంటే అయ్యే పనేనా?

అందుకే మా ఇంటి నట్టింట్లో నాలుగు వేళ్ళూ సుబ్బరంగా నోట్లోకి వెళ్తాయి వాడికి.

వాళ్ళ నవ్వులు చూస్తూ, కబుర్లు వింటూ - మేమూ కబుర్లాడుకుంటూ వున్నవి తినీ, తిన్నవి కడుక్కునీ - దొరకునా ఇటువంటి తోమా-ల సేవా .... అని పాడుకుంటూ పొద్దుపుచ్చుకుంటాం మా కన్నబాబుల్ని కన్న మేమిద్దరం.

వెచ్చావెచ్చని బువ్వల బొజ్జలు నిండిన బాబులు నెమ్మదిగా కింద నుంచి కదిలి పైన గదిలో చేరతారు. భుక్తాయాసి నాన్నగారు అల్పనిద్ర కొరుగుతారు.

గదిలో చేరిన పిల్లలు ఊరికే వుండరు. గుడి గోపురాల గూళ్ళల్లో పావురాయిల్లా కువకువలాడుతుంటారు. నవ్వుతూ వుంటారు.

నవ్వులు వినిపిస్తే మరి నేనాగలేను. పరుగున నేనూ ఆ గదిలో చేరతాను.

"అన్నా! నీకు తెలుసా అమ్మేం చేసిందో?" అంటూ మొదలు నా మీద నవ్వుతాలు.

అలా అంటూ మొదలెట్టాక చెప్పకపోతే ఎలా - నన్ను చూసి నేనే నవ్వకపోతే వాడికి దొరికిపోనూ!

గదిలో వున్న ముగ్గురు గడుగ్గాయిలకీ తెలుసు నేనేదో చెప్పబోతానని, చెప్పకుండా ఉండబోనని, ఉండలేనని.

మూడు జతల చెవులూ సద్దు-తిరుగుడు చెవులవును.

ఇహ... నా కథ మొదలు... అనగనగా అనక్కర్లేకుండానే...

------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------

"ఏం లేదురా...నాన్నా! మొన్న నేనేదో నా వంట నేను చేసుకుంటూ నా పాట నే పాడుకుంటున్నా. 

ఇదిగో... వీడు - ఎదురుగ్గా హాల్లో నించుని ఆడుకుంటున్నాడు. 

ఎంతసేపని నాలో నేనే పాడుకుంటా? 

ఈలోగా పక్కింటి గేరీ కుక్క - అదే.. ఆ టోసీ లేదూ... అది అరిచింది. అంతలోనే గేరీ బిస్కెట్టేదో పెట్టాడేమో ముద్దుగా - కుయ్ కుయ్ - అంది. 

నాకు అది అలా అనడం నచ్చింది. నేనూ అలా అనాలనుకున్నా...అన్నా... 

వీడేమో ఆడుకుంటున్నవాడు ఆడుకోవచ్చు కదా... ఉహూఁ ! ఆడుతున్న ఆట ఆపి మరీ మన మెట్ల railing సందుల్లోంచి నాకేసే చూస్తున్నాడు. 

నేనూ వాడికేసి చూశా అప్పుడే. 

చూసి అడిగా "Do you think అమ్మ is weird?" అని. 

వీడేమో తలొంచి అడ్డంగా తిప్పుకుంటూ "అమ్మా! You're raising a dishonest kid" అంటాడు తప్పితే - Yeస్సో , No నో చెప్పడు. 

మరప్పుడు నేనేం చేస్తాను ...చెప్పు?

వెంటనే అన్నా... Well! I know that no other mom would do this - unless she is a dog.

అని నా వంట నే చేసుకున్నా... 

వీడు మాత్రం ఆట కూడా మానేసి నవ్వుతూ దొర్లితే  దానికి నాదా పూచీ?" 

------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------


హమ్మయ్య! భళ్ళున నవ్వులు దొర్లాయి.

దొర్లిన నవ్వుల్నేరుకుంటూ ఈ కథతో నా థాంక్స్ గివింగ్ ఆనవాయితీ నిలుపుకోగలిగాను.

ఆ మాత్రం నవ్వుల్లేనిదే ఈ మాసం ఉట్టి నవంబర్ అయిపోదూ?

అన్నట్టు ఈసారి నవ్వంబర్ విశేషం ఏంటంటే తెలుగులో "అ" మాత్రం గుర్తు పట్టగల దక్షిణ-కొరియను కెవిను నా "బోల్డన్ని కబుర్లు" పుస్తకం తీసుకుని చదవడం.

వాడికి మరి నా కథలన్నీ తెలుసు.

Canon camera అనుకుని printer మోసిన వైనం
బుజ్జిజింక నా గురించి రాసిన Mom's Gazette, 
వాడి నింటెండో స్విచ్చు కోసం అర్థరాత్రి క్యూలో నించున్న వైనం, 
అన్నజింక పుట్టినరోజుకి చేసిన సర్‌ప్రైజేస్కో, అప్పుడు కెవినూ, నేనూ కలిసి తీసుకున్న నీలం ఆటో ఫోటో, 
నే ఆడుకునే పజిల్స్, 
నే కట్టుకున్న గళ్ళ లెక్కల సూత్రాలు - 

అవన్నీ గుర్తు పట్టి, అక్కడక్కడా వున్న English script తో అవే కబుర్లో కనిపెట్టి, నాకు చూపెట్టి  - Canoనోపాఖ్యానం ఇంకోసారి తలుచుకుని చప్పట్లు కొట్టుకుంటూ, నవ్వుకుంటూ ఆ రోజు నా రోజుగా చేసిపెట్టాడు.

వాడు చదివిన పేజీలు గుర్తుగా దాచుకోబోతే ఎలా?


Canon camera అనుకుని printer మోసిన వైనం:  Canoనోపాఖ్యానం - అనబడు - ప్రహసన-వారసత్వపు కొనసాగింపు





బుజ్జిజింక నా గురించి రాసిన Mom's Gazette: బుజ్జిజింకలు తెచ్చే 365 అమ్మ-రోజులు 


 వాడి నింటెండో స్విచ్చు కోసం అర్థరాత్రి క్యూలో నించున్న వైనం: ఏంటండో అచ్చట? - నింటెండో స్విచ్చట!



అన్నజింక పుట్టినరోజుకి చేసిన సర్‌ప్రైజేస్కో, అప్పుడు కెవినూ, నేనూ కలిసి తీసుకున్న నీలం ఆటో ఫోటో: ఎక్కడికో చెప్పుకో - సర్‌ప్రైజెస్కో... 





 నే ఆడుకునే పజిల్స్: గజిబిజి-జిగిబిగి 





 నే కట్టుకున్న గళ్ళ లెక్కల సూత్రాలు: గళ్లలెక్కలు - కళ్లచిక్కులు





మొత్తానికి ఈ ఏడాదికి - 
నవంబర్ మాసపు నాలుగు రోజులు 
నవ్వుల రోజులు 
నవ్వులాటల రోజులు 
వెరసి...  
నవ్వంబర్ మాసపు నవ్వుల నవ్వులాటల నాలుగు రోజులు...



10 కామెంట్‌లు:

  1. Inka chadavalanipistundi.
    Inkedo rayalanipistundi. Gillesaru lalitha. Tq

    రిప్లయితొలగించండి
  2. 👌👌👌👌😀😀😀 పదాల కూర్పు, మంచు తెరల సోయగాలలోంచి ఆమని విరిసినట్లు గా వుంది అక్క...

    రిప్లయితొలగించండి
  3. మీ మాటలు కూడా కవితల్లా ఉంటాయండీ.. ఎంత బాగా రాశారో.. చాలా బావున్నాయి కబుర్లు..

    "సద్దు తిరుగుడు చెవులు".. అసలు ఎలా తడతాయండీ బాబు ఇలాంటి పదాలు.. అర్జంటుగా నాకూ ఎక్కడైనా వాడేయాలనిపిస్తుంది.. పేటెంట్ రైట్స్ సమస్య రాదుగా ��

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాటలతో ఆడుకోవడం, కొత్తవాటిని పుట్టించడం నాకొక సరదా. నా మాటలు మీకు నచ్చి వాడుకుంటానంటే - అంత కన్నానా!? నిరభ్యంతరంగా వాడుకోండి.
      Your comment made my blog-day! Thanks a lot!

      తొలగించండి
  4. Simply Super 👌malli chaduvukuni ... navvukuni... Assalu intha chakaga prateedi gurthu pettukoni... raayadam meeke sadyam... Adee matala attalatho....

    Cheppali ante autumn 🍂 akulu la unnayi shabdalu... padalu 👏👏... waiting for your next one

    రిప్లయితొలగించండి