22, డిసెంబర్ 2019, ఆదివారం

ఇచ్చుకాలం... మనసు విచ్చుకాలం...

ఇచ్చుటలో ఉన్న హాయీ - వేరెచ్చటను లేనేలేదని ... ఉత్తరమెరికాలో డిసెంబర్ నెలకి తెల్సినట్లుగా ఇంకే నెలకీ తెలీదేమో...

పిల్లల బళ్ళకి సెలవులిస్తారు.
ఆఫీసులో పనులకి ఆటవిడుపులిస్తారు.

మబ్బుల్లేని ఆకాశం చుక్కల తళుకు తళుకు మెరుపు నిస్తుంది.
బల్బుల వరసలు పెట్టుకున్న భూమి మిణుకు మిణుకు వెలుగు నిస్తుంది.


తెలిసేలా కొందరు, తామెవరో తెలియనీకుండా ఇంకా ఎందరో - తమకున్న దాంట్లోనే కొంత తీసి ఇస్తూ - తమకు అసలు తెలియని వారి కనుల సంతోషపు దీపాలు వెలిగిస్తారు. 

మనిషి మనిషికి మధ్య దయ ధారాళంగా వినిమయమవుతూ ఉంటుంది.
ఇచ్చుకాలం మనసు విచ్చు కాలమవుతుంది.

శీతాకాలపు వాతావరణం కరుణతో కవోష్ణమవుతుంది.



మా ఇంట్లో మేం కూడా ఈ ఇచ్చుకాలానికి ఎంతగానో ఎదురు చూస్తాం.

ముఖ్యంగా ముగ్గురి కోసం కొంత డబ్బు తెచ్చి ఇంట్లో ఉంచుకుంటాము.

ఆ ముగ్గుర్లో ఒకరు మామూలు ట్రాష్ ట్రక్ డ్రైవర్, ఇంకొకరు రీసైకిల్ ట్రాష్ ట్రక్ డ్రైవర్, మూడోవారు మా మెయిల్ మ్యాన్.

క్రిస్మస్ వచ్చే వారాని కన్నా ముందు వారంలో సోమవారం నాడు ఈ ముగ్గురికీ మూడు గ్రీటింగ్ కార్డులు, ఆ కవర్లలో కొంత డబ్బూ పెట్టి ఇవ్వడం ఇప్పటికి ఈ ఇంటిలోకి వచ్చిన పధ్నాలుగేళ్ళ అలవాటు. మేమిచ్చే ఆ కొన్ని పదుల డాలర్లకే మురిసిపోయి కళ్ళు మెరిపించుకునే వాళ్ళని చూస్తే కలిగే ఆనందపు-స్వార్థం బదరీది, నాది.

ఇంతకీ ఈ రోజు ఈ ఇచ్చిపుచ్చుకునే కబుర్లు రాస్తోంది మేమేమిచ్చామూ, ఇస్తామూ అన్నదాని గురించి కానే కాదు. దానికోసమైతే రాయాల్సిన పనే లేదు. 
రాసుకోగలిగినంత విషయమూ, రాసిపెట్టుకోదగిన విశేషమూ లేనే లేవు.

అసలు విషయమేంటంటే...

క్రిందటి ఏడాది ఎప్పట్లాగే క్రిస్మస్ ముందు వారంలో బాగా మంచు కురిసింది. బాగా చలిగా వుంది. ఆ రోజు సోమవారం. మా సబ్-డివిజన్‌లో ట్రాష్ ట్రక్కులొచ్చే రోజు.

నేను ఇంటి కిటికీ దగ్గర నుంచుని మా ఇంటి ముందు ఆగబోయే ట్రాష్ ట్రక్కు కోసం ఎదురు చూస్తున్నాను.  ట్రాష్ ట్రక్కులో డ్రైవర్ ఒకడే ఉంటాడు. అతను ప్రతి ఇంటి దగ్గర ఓ రెండు నిముషాలు ఆగి, తను దిగకుండానే ట్రక్కుకున్న robotic-arm తో ట్రాష్ బిన్‌ని ఎత్తి చెత్తని ట్రక్కులో వేసేసుకుని వెళ్ళిపోతాడు.

నేనలా చూస్తూ ఉండగానే మా ఇంటి ముందు ట్రాష్ ట్రక్ వచ్చి ఆగింది. మళ్ళీ ఎక్కడ వెంటనే వెళ్ళిపోతాడో అని గబగబా తలుపు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చిన నన్ను చూసి - గబగబా ట్రక్ దిగి వచ్చి - విశాలంగా నవ్వుతూ - నా చేతిలో వున్న కవర్ అందుకుని Happy Holidays! అని చెప్పి - ముందుకి సాగి పోయాడు మా ట్రాష్ ట్రక్ డ్రైవర్.

నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి - అదే కిటికీ దగ్గర నించుని - అంతలోనే రాబోయే రీసైకిల్ ట్రాష్ ట్రక్ కోసం ఎదురు చూస్తూ వున్నాను. మా రీసైకిల్ ట్రక్ డ్రైవర్ ఒక అమెరికన్ అమ్మాయి. కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరిస్తుంది. తన కోసమని నేనెప్పుడూ వెతికి ఒక మంచి పూలపూల గ్రీటింగ్ కార్డు రాసి పెట్టుకుంటాను.

నేనలా చూస్తూ ఉండగానే ఓ పది నిముషాల్లో ఒక నీలం ట్రక్ వచ్చింది. అది చూడగానే మళ్ళీ బయటికి పరిగెత్తాను. కానీ ఆ ట్రక్ మా ఇంటి దగ్గర ఆగకుండా ఇంకో రెండిళ్ళ అవతల ఆగింది.

నేను అలానే ముందుకి పరిగెట్టాను - ఎందుకంటే అప్పుడు ఇవ్వకపోతే ఆ ట్రక్ సబ్-డివిజన్ అంతా తిరిగొచ్చేసరికి ఇంకో గంట, గంటన్నర పడుతుంది. నేను అంతసేపు పని మానేసి కిటికీ దగ్గరే కూర్చోలేను. అందుకని ట్రక్ డ్రైవర్‌కి కనిపించేలా ట్రక్ ముందుకి పరిగెట్టాను.

నన్ను చూసి ట్రక్ ఆపి ఆ డ్రైవర్ కిందికి దిగడం కనిపించింది. నేను కొంచెం ముందుకి కదిలి "హాయ్" అనగానే అటునుంచి ఒక ఆఫ్రికన్-అమెరికన్ అబ్బాయి వచ్చాడు.

అప్పుడు చూశాను - అది ఎప్పుడూ సోమవారం పొద్దున్నే వచ్చే రీసైకిల్ ట్రక్ కాదు. అంతకు ముందు శుక్రవారం రావాల్సిన యార్డ్ వేస్ట్ ట్రక్. వాళ్ళు సాధారణంగా నేను పనిలో వుండే వేళల్లో వస్తారు. వాళ్ళు వచ్చినట్టూ, వెళ్ళినట్టూ కూడా నాకు తెలిసేది కాదు. అందులోనూ మా ఇంటి ముందు యార్డ్ వేస్ట్ ఎక్కువగా ఉండకపోవడంతో ఒక్కోసారి అసలు మా ఇంటిముందు ఆగను కూడా ఆగరు. అందుకే ఆ రోజు కూడా ఆగలేదు.

సరే! ఆ అబ్బాయి దిగాడు కదా... అతను కూడా నవ్వుతూ ముందుకి రాబోయాడు.

నా మొహంలో - అమ్మాయి దిగుతుందని అనుకుంటే అబ్బాయి దిగాడేంటా అన్న ఆశ్చర్యపు చూపు - అతనికి నేను చెప్పనిదేదో చెప్పినట్టు అనిపిపించిందేమో - ఒక్క క్షణం ఆగి - "మీరు ఎవరనుకున్నారో ఏమో ...నేను ఈ ఏరియాకి ఎప్పుడూ వచ్చేవాడిని కాదు. మీరివ్వబోయేది నాకోసమని అనుకోలేను" అంటూ వెనక్కి తిరగబోయాడు.

నాకు వెంటనే - "అరె" - అనిపించింది.

అతనిని అలా ఉట్టి చేతులతో పంపిచేస్తే అంతకు మించిన బాధ నాకింక ఆ రోజుకి ఉండదు అనిపించింది.

వెంటనే అతని ముందుకి గబగబా వెళ్ళి - "ఇది మీ కోసమే! Happy Holidays!" అనగానే - అతని కళ్ళలో వెలిగిన వెలుగులకి చుట్టూ పరుచుకుని వున్న మంచు తెలుపులు వెలవెలలాడాయి.

అనుకోకుండా నేను చేసిన ఒక మంచి పనేంటంటే ఏ గ్రీటింగ్ కార్డులోనూ - Dear Friend! - అని తప్ప పేర్లు రాయకపోవడం.

ఆ తర్వాత మా రీసైకిల్ అమ్మాయి జేన్‌కి వేరే కార్డు ఇచ్చాను. అది వేరే సంగతి.

కానీ పేరు కూడా తెలియని  - నేనివ్వబోయినది తన కోసం కాదేమో అనిపించగానే తనకు వద్దని వెనక్కు తిరిగిన - ఆ ఆఫ్రికన్-అమెరికన్ అబ్బాయి నాకెప్పుడూ గుర్తుంటాడు.

మా ఇంటి Holiday Season కబుర్లలో మెదులుతూనే ఉంటాడు.

మామూలు మనుషులకి అది పెద్ద పట్టించుకోదగ్గ విషయమేమీ కాకపోవచ్చు. కానీ కనీసపు వేతనాలతో, పూటపూటా కనీసావసారాలకి కూడా వెతుక్కునే వాళ్ళలో కనిపించే డబ్బంటే ఆశలేనితనం నాకెప్పుడూ గొప్పగా కనిపిస్తుంది. 


వాడు 
వయసులో చిన్నవాడు
లేమి ఎంతో వున్నవాడు
కలిమి తాన లేనివాడు
చిరుజీవి వాడు

వాడు 
తనను చేరిన 
తనది కానిది 
తనకు వలదని 
మరలినవాడు 

వాడు 
మనసులో మిన్న వాడు 
మనిషికే వన్నెవాడు
మా మనసులోనే వున్నవాడు 
చిరంజీవి వాడు

 

4 కామెంట్‌లు:

  1. నిజమే. ఇరవై డాలర్లే ఇచ్చినా వాళ్ళ కళ్ళలో కృతజ్ఞతాభావం, వాళ్ళ శుభాకాంక్షలు విలువకట్టలేనివి.

    రిప్లయితొలగించండి
  2. This is a good reminder for me...Been reading some really touchy stories recently on the news and your story is an extension... very happy for the guy!

    రిప్లయితొలగించండి