31, మార్చి 2017, శుక్రవారం

వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - ముక్తాయింపు


అమ్మతో, పప్పితో రోజూ ఫోన్లో మాట్లాడుతూ - ఎప్పటికప్పుడు నాన్న ఆరోగ్యం గురించి, డాక్టర్లు చెప్తున్న ఆపరేషన్ వివరాల గురించి వింటూ - వాటిని బట్టి రాసినవి ఇంతకు ముందు కబుర్లు:  వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - నాంది

నాన్నకి డాక్టర్ గూడపాటి రమేషు అంతకుముందు ఆంజియోగ్రామ్ చేశారు. స్టార్  హాస్పిటల్లో ఒకరోజు ICU లో వున్నారు.


నాన్న ICU లో వున్నప్పుడు మలయాళీ నర్సులు పక్కనే వుండి మలయాళం లో మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు.

నాన్న వాళ్ళని పిలిచి చెప్పారు  - "మీరు తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడకపోతే నామీద మీరేదో చెప్పేసుకుంటున్నారని  గోపీచందుకి చెప్తాను" - అని.

వాళ్ళు వెంటనే నవ్వి - "తాతగారు - మీ మీద ఏమీ చెప్పుకోవట్లేదండి" - అని నవ్వేసేవాళ్లు.

డిసెంబర్ లో హైదరాబాదు వెళ్లిన అమ్మ, నాన్న చివరివారంలో ప్రతీ ఏడాది లాగే నాన్న SKBR క్లాసుమేట్స్ సరదాగా కలిసే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ కి వెళ్లి వచ్చారు.


ఆ  ఓల్డ్ స్టూడెంట్స్ మీటు కెళ్లే ముందు రోజే నాన్న డాక్టర్ గోపీచంద్ తో ఆపరేషన్ వద్దు అని చెప్పి - ఆయన అమ్మతో మాట్లాడతానంటే వద్దొద్దని చెప్పి - ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నది.

అప్పుడే డాక్టర్ని " ఈలోపు నాకొక ఓల్డ్ స్టూడెంట్ మీటొకటుంది తెలంగాణ లో - దానికి వెళ్లొచ్చా? " అడిగారు నాన్న.

"ఆ.. వెళ్ళచ్చు - దాందేవుంది వెళ్ళిరండి ఇబ్బందేం లేదు . ఎన్ని రోజులుంటుంది?" - డాక్టరుగారి ప్రశ్న.

"జస్ట్ టూ  డేస్ "- అన్న నాన్నతో  - " ఏం  చేస్తారు  మీ ఓల్డ్ స్టూడేంట్సూ" - అంటూ డాక్టర్.

"ఏం చేస్తారు?  - వెళ్తామక్కడికి - ఏదో అంతా సీనియర్  సిటిజెన్స్ కదా - ఏదో గుళ్ళూ గోపురాలు చూస్తారు పొద్దున్న. - మధ్యాహ్నం  మీటింగ్ పెట్టుకుని చిన్నప్పటి కాలేజ్ కబుర్లు అవీ చెప్పుకుంటారు - సాయంత్రం మా కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తాం " అన్నారు నాన్న.

డాక్టర్ కళ్లింతవి చేసి - "ఏంటి మీరు కుర్రాళ్ళా?"  అని నవ్వు.

"ఏవయ్యా - అరవై ఏళ్ళు దాటింతర్వాత సెకండ్ లైఫే కదా - ఆ లెక్కన ఇప్పుడు నాకు పదేళ్లే కదా - సాయంత్రం ఆరు తర్వాత నేను కుర్రాణ్ణై పోతా " అంతకన్నా నవ్వుతూ నాన్న.

"సరే వెళ్లి  రండి" అని నవ్వుతూ సాగనంపారు డాక్టర్.

2015 సంవత్సరం: 


జనవరి మొదటి వారంలో మాట్లాడినప్పుడు పప్పి చెప్పింది - నాన్నని 26వ తారీఖునొచ్చి హాస్పిటల్లో చేరమని డాక్టర్లు  చెప్పారని. పైగా పెద్ద వయసు మూలంగా రిస్క్ ఎక్కువ అని, ఆపరేషన్ సక్సెస్ కి 50:50 ఛాన్స్ అని చెప్పారనీ చెప్పింది.

అది తెలిసినప్పటినుంచీ ఎంతొద్దనుకున్నా కొంచెం బెంగగానే అనిపించింది.

ఈలోగా బదరి ఒకరోజు బాలాజీతో ఎప్పట్లాగే ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు - మాటల సందర్భంలో "బాలాజీ! అంకుల్ కి హార్ట్ సర్జరీ - హైదరాబాదులోనే వున్నారు ఇప్పుడు " అని చెప్పారు.

అంతే - ఆ తర్వాత బాలాజీ నాన్నకి ఫోన్ చేసి విషయాలు కనుక్కుని - మా కన్నా ఎక్కువగా ఆదుర్దా పడుతూ - నాన్న ఆపరేషన్ విషయాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ బదరికి చెప్తూ వుండేవారు.

నేను దాదాపు రోజూ ఫోన్ చేసి పప్పితో మాట్లాడుతూ వుండేదాన్ని.

ఓరోజు చెప్పింది - ఆపరేషన్ కి ఎనిమిది మంది  బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పారని. దానికి నాన్న - "నాకు యంగ్ బ్లడ్ కావాలి, ఆపరేషన్ తర్వాత నాది కొత్త లైఫ్ , యువక రక్తం ఉండాలీ" అని - అన్నారన్నది తలుచుకుని నవ్వుకున్నాము - ఈయనకి ఇక్కడ కూడా సెలక్షనే అని.

జనవరి 17 - శనివారం ఫోన్ చేసినపుడు నాన్న ఏం చేస్తున్నారు అనడిగితే - "అనాతవరంలో ప్రసాదు వాళ్లు భజన చేస్తున్నారు - బయట కుర్చీలో కూర్చుని స్పీకర్ ఫోన్లో  ఆ భజన వింటున్నారు" - అని చెప్పింది పప్పి. దాని గొంతు అంత హుషారుగా లేదు. నేనంటే దూరంగా వున్నాను నాకంతగా తెలియట్లేదు - కానీ పప్పి పక్కనే వుండి నాన్నతో పాటు హాస్పిటల్సుకి, టెస్టులకి వెళ్తూ చాలా స్ట్రెస్ తీసుకుంది.

 సరే - ఇంకో వారంలో సర్జరీ అనుకున్నాము.

జనవరి 24 శనివారం మామూలుగా ప్రతీ రోజులాగే పొద్దున్నే ఎనిమిదింటికి ఫోన్ చేశాను. పప్పి ఫోన్ తీసింది - 26 పొద్దున్న హాస్పిటల్ కి వెళ్తున్నాము అంది. ఇంకా తర్వాత ఏమీ మాట్లాడలేకపోతోంది - ఏడుస్తున్నట్టుగా అనిపించింది. నాకూ కంగారుగా అనిపించి గబగబా మాట్లాడి ఫోన్ పెట్టేశాను.

పక్కనే వుండి నన్ను చూస్తున్న బదరి "బెంగగా ఉందా బంగారం? పోనీ నేను వెళ్లిరానా?" అన్నారు.

అంతలోనే నా మొహం చూసి - అసలే - మనసు-చదివే-విద్య తెలుసు కదా "వద్దులే అందరం వెళ్దాం - ఫ్లైట్ టిక్కెట్లు చూడనీ" అని వెంటనే లాప్టాప్ ఆన్ చేశారు.

ఒక అరగంటలో - జనవరి 25కి షికాగో నుంచి హైదరాబాదుకి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేశారు - మా నలుగురికీ - అంటే -  బదరి, నేను, బుజ్జిజింక-కిరణ్, అప్పటికి ఇక్కడేవున్న మా అత్తగారు.

ఇంక వీకెండ్ కావడంతో ఇద్దరం ఆఫీసులకి, బుజ్జిజింక స్కూలుకి అర్జెంటుగా ఇండియా వెళ్తున్నామని - రెండు వారాల్లో తిరిగి వస్తామని ఈ-మెయిళ్లు ఇచ్చి గబగబా ప్రయాణానికి కావలసినవి సర్దుకున్నాము.

పప్పికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను - బయల్దేరి వస్తున్నామని. అమ్మతో కూడా మాట్లాడాను - కానీ నాన్నకి చెప్పొద్దని చెప్పాను - ఆయన్ని సర్ప్రైజ్ చేద్దామని.

ఎయిర్-ఇండియా ఫ్లైట్లో పదిహేను గంటల పాటు రకరకాల భాషల్లో సినిమాలు చూసుకుంటూ - చూడనప్పుడు నిద్రలో తూగుకుంటూ మొత్తానికి జనవరి 26 సాయంత్రానికి హైదరాబాదులో దిగాము.

ఎయిర్ పోర్ట్ కి బాలాజీ వచ్చారు. వస్తూనే - "బదరి! నిన్ను, కిరణ్ ని ఇంటికి తీసుకెళ్తాను - మనం ఇంటికి వెళ్లేదారిలోనే స్టార్ హాస్పిటల్ - లలితనక్కడ అంకుల్ దగ్గర దింపేసి వెళ్దాం" అని చెప్పారు - మనసు చదవడం బాలాజీకి తెలుసు మరి.

హాస్పిటల్ దగ్గర దిగగానే - అమ్మకి ఆల్రెడీ ఫోన్ చేశారెమో - అమ్మ బయటకొచ్చి నించుని వుంది. అమ్మని పలకరించి ఆవిడ దగ్గర సెక్యూరిటీ పాస్ తీసుకుని సెకండ్ ఫ్లోర్ లో వున్న నాన్న రూమ్ కి వెళ్లాను. నీలం రంగు హాస్పిటల్ గౌన్లో మంచం మీద పడుకుని టీవీ చూస్తున్న నాన్న నన్ను చూసి సంబరాశ్చర్యపోయారు. అందరం వచ్చామని తెలిసి బోల్డంత సంతోషపడ్డారు. నాన్నతో కాసేపు, కింద అమ్మ, లక్ష్మి దొడ్డతో కాసేపు మాట్లాడేసి ఈలోగా బాలాజీ వస్తే తనతో ఇంటికి వెళ్లాను. ప్రియని, పిల్లలని పలకరించి - ప్రియ పెట్టిన వేడివేడి భోజనం తిని కాసేపు కబుర్లు చెప్పి పడుకున్నాము.

మామూలుగా నాన్న దగ్గర ఒకళ్లనే వుండనిచ్చేవారు.

జనవరి 27 సాయంత్రం మాత్రం ఫామిలీ మొత్తాన్ని రావొచ్చు అని చెప్పారు. డాక్టర్లు వచ్చి - మరుసటి రోజు ఆపరేషన్ ముందు ప్రొసీజర్లు అవీ మాట్లాడతారని చెప్పారు.

27 పొద్దున్నించీ - పప్పి, నేను - స్టార్ హాస్పిటల్ బయటే వుండి నాన్నని చూడడానికి వచ్చేవాళ్లని పలకరిస్తూ వున్నాము.

అప్పుడే నాన్న చిన్ననాటి  స్నేహితులు భూషి బాబుగారు, వాళ్లబ్బాయి శంభన్నశాస్త్రి, అమ్మాయి పద్మ హాస్పిటల్ దగ్గర కలిశారు. భూషిబాబుగారు నాన్నని పలకరించి వచ్చి నాతో  "మీ నాన్నది గట్టి గుండె. మొండివాడు - నవ్వుకుంటూ తిరిగొస్తాడు - బెంగ లేదు" అని చెప్పి వెళ్లారు. ఆ మాటలు వినగానే బోల్డంత ధైర్యంగా అనిపించింది - మా నాన్న మొండితనం గురించి ఆయనకన్నా ఇంకెవరు అంత గట్టిగా ఎండార్స్ చేయగలరు గనక!

ఆ రోజే హాస్పిటల్ దగ్గర అనుకోకుండా బదరి తిరుపతిలో MBA ఫ్రెండ్ సాయి ప్రసాద్ కలిశారు. ఏమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చెప్పమని పదేపదే చెప్పారు.

ఆ రోజు సాయంత్రం - ఎప్పుడూ హాస్పిటల్ దగ్గరే ఉంటున్న నన్ను - అక్కడ తప్ప ఇంకెక్కడా కలవలేమని - నన్ను చూడడానికి - ప్రసాద్ రెడ్డి, అనిత వచ్చి - ఎంతో ఇష్టంగా బెంగళూరులోని పాతరోజులు గుర్తు చేసి మాట్లాడి వెళ్లారు.

వీళ్లు కాక బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన మా నాన్న యువ-బంధువులు వచ్చి పలకరించేవారు.

ఎంత బయటికి ధైర్యంగా కనిపిస్తూ వచ్చే వాళ్లందరితో సరదాగా మాట్లాడుతున్నా - నాన్న ఆపరేషన్ టెన్షన్లో వున్న నాకు - మధ్యమధ్యలో వచ్చి పలకరించి - "మేమంతా మీ వెనక వున్నాం"  - అని చెప్పీ చెప్పకుండానే చెప్తున్న వీళ్లందరూ ఆపద్బంధువుల్లా, మనస్స్నేహితుల్లా (ఈ మాటలు - intended-టైపోలు) - మా ఆత్మీయ-సంపదలా  అనిపించారు. 

సాయంత్రమయింది. నేను, బదరి, బాలాజీ, అమ్మ, పప్పి, కిరణ్, లక్ష్మి దొడ్డ, రవి, బాబు - అందరం నాన్న రూంలో వున్నాం. డాక్టర్ గోపీచంద్, డాక్టర్ గూడపాటి రమేష్, ఇంకొకరెవరో అనెస్తెటిస్టు, నర్సులు వచ్చారు.

నాన్న మా అందరినీ వాళ్లందరికీ పరిచయం చేశారు.

ఇంతలో డాక్టర్ గోపీచంద్ నాన్నని అడిగారు - "సిగరెట్లు మానేయమన్నాను - మానేశారా ?" అని.

నాన్న " అప్పుడే మానేశాగా! " అన్నారు.

"అదే ఎప్పుడు?" అనడిగారు డాక్టర్.

"ఎప్పుడంటే - మొన్న గురువారం నుంచి" - నాన్న తడుముకోకుండా ఇచ్చిన జవాబు (అంటే జనవరి 22 నుంచి).

డాక్టర్ మాట్లాడుతూ ఉండగానే - బదరి, బాలాజీ - హాస్పిటల్ ఆడ్మిన్ తో ఏదో మాట్లాడాలని బయటికి వెళ్లారు.

నాన్న సమాధానం విన్న అనెస్తెటిస్టు - నన్ను, బాబుని, రవిని - బయటికి పిలిచి "ఈయనేంటండీ బాబూ - సిగరెట్లు మానేయమని నెలనుంచి చెప్తుంటే మొన్న గురువారం మానేశానని చెప్తున్నారు. ఆయనది ఎంత క్రిటికల్ ఆపరేషనో తెలుసాండీ? ఇప్పుడింక అసలు 50:50 కాదు ఇంకా ఎక్కువ రిస్క్ ఉండేలా వుంది" అని తెగ బాధపడి - ఆయన కంగారు పడి - మమ్మల్ని కంగారుపెట్టి వెళ్లిపోయాడు.

అతను మాట్లాడుతున్నంత సేపు కొంచెం బెంగగా విన్న మేము - అతనటు వెళ్లగానే - కాసేపు ఏమీ మాట్లాడకుండా కుర్చీల్లో పక్కపక్కన కూర్చుండిపోయాం.

ఒక రెండు నిముషాల్లో ఒకళ్ల మొహం ఒకళ్ళు చూసుకుని తెగ నవ్వుకున్నాము - పొద్దున్నించీ నాన్న హాస్పిటల్ వాళ్లతో వేస్తున్న జోకులు తలచుకుని.  ఒక్కోసారి ఏమీ చేయలేనప్పుడు అయినవాళ్లతో కలిసి నచ్చిన మాటలు మాట్లాడుకుని నవ్వుకుంటే మనసులో గుచ్చుతున్న బాధ అంతగా నొప్పనిపించదు మరి.




28 పొద్దున్న పదింటికి అనస్తేషియా ఇస్తామని చెప్పారు. కానీ పన్నెండున్నర  అయింది. 

మొదటి ఆపరేషన్ డాక్టర్ గోపీచందు చేసారు.

29న  కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ PCగుప్తా వచ్చి స్టెంట్స్ వేసారు.

ఆపరేషన్ అయ్యాక తెలివి రావడానికి నాన్నబాగా ఇబ్బంది పడ్డారు. ఆపరేషన్ జనవరి 28 అయితే, ఫిబ్రవరి 2 కి పూర్తిగా తెలివొచ్చింది.

ICU లో వుండే నర్సులు, అక్కడ టెక్నిషియన్స్  - "మీకు తెలివొస్తోంది - కళ్లు  తెరుస్తారు - మీకు అంతా  తెలుస్తోంది" అని హిప్నొటైజ్ చేస్తున్నట్టు అంటూ తట్టి తట్టి లేపారట.

ఒక టెక్నిషియన్ వచ్చి గొంతులోంచి ట్యూబ్ లాగబోతే రాలేదు - నాన్నకి నొప్పి తెలుస్తోంది. కళ్ళెర్ర జేసారట. ఎలాగోలా ట్యూబ్ తీశాడు అతను.



ఈ లోపులో ఏమైందంటే నాన్న బెడ్డు తలకింద స్క్రూ  లూజయి కిందకెళ్ళిపోతోందట.
  ... ... ... ...
.... ... ....

నాన్న మాటల్లో

" అసలు పెయిన్ ఒచ్చేస్తోంది - తట్టుకోలేకపోతున్నాను - సిస్టర్ని పిలిచాను - నేను మాట్లాడుతున్నాను  అనుకుంటున్నాను - మాట బయటికి రావట్లా . నేను తిట్టేస్తున్నానని నాకనిపిస్తోంది - తిట్టేస్తున్నాను కూడా - ఇంతలో ఇంకోసిస్టర్ వచ్చి బెడ్డు రిపేర్ చేసేవాణ్ణి పిలుచుకొచ్చింది . వేరే రెండు మూడు దిళ్లు పట్టుకొచ్చి నా తలకింద పెట్టి తన చెయ్యి పెట్టి  నా తల  పైకెత్తిందన్నమాట. ఈలోగా బెడ్డు రిపేర్ అయ్యింది. మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉంచారు అందులో - సాయంత్రం రూంకి షిఫ్ట్ చేశారు".
 ... ... ...
... ... ...


ఆపరేషన్ అయ్యాక నాన్నకి మాట రాలేదు. మాకందరికీ కంగారుగా అనిపించింది.

రెండో రోజు - పక్కనే కొంచెం దూరంలో ఇంకో హాస్పిటల్ బిల్డింగ్ లో వున్న స్పీచ్ థెరపిస్టు దగ్గరికి అంబులెన్సు లో నాన్నని తీసుకెళ్లాను.

స్పీచ్ థెరపిస్ట్ నాన్నని పరీక్ష చేసి "ఈ ఆపరేషన్ కి ఇదొక సైడ్ ఎఫెక్ట్ - వోకల్ కార్డు పారలైజ్ అయింది. కొంచెం ప్రయతంమీద మళ్లీ మాటొస్తుంది - కనీసం ఒక మూడు నెలలు పడుతుంది" అని చెప్పి నాన్నకి స్పీచ్ ఎక్సర్సైజులు చేయమని చెప్పారు.

నాన్న మాటల్లో ఇంకొన్ని కబుర్లు: 

ఆపరేషన్ అయ్యాక - తెలివొచ్చాక డాక్టర్ గోపిచంద్ వచ్చాడు.

వచ్చి "ఎలా వుంది" అన్నాడు.

నేను "పాతిక లక్షలు - బానే అయింది" అన్నాను.

"ఎన్నిసిగరెట్లు తాగుంటారు?"  అన్నాడు

"చిన్నప్పట్నుంచీ కదా - అవీ పాతిక లక్షలయుంటాయి"  అన్నాన్నేను.

"అయితే బాలన్స్ అయిపోయాయిలే" -  అన్నాడు.

అసలాపేరేషనుకి ముందు టెస్టులూ  అవీ చేసే టైములో - నాకు అనూరాధ , చందనారెడ్డి అని పల్మనాలజిస్టులు టెస్టులవీ చేసేవారు.

ఒకరోజు టెస్టుకు సిగరెట్టు తాగేసి వెళ్లాను

డాక్టర్ అనూరాధ "ఏవండీ హాస్పటల్ కి వస్తున్నారు కదా ఇప్పుడైనా సిగరెట్టు మానొచ్చు కదా?!"  అంది

"నేను సిగరెట్టు మానేశాను - పొద్దున్నే కాఫీ ఇచ్చారు - సిగరెట్ తాగాలనిపించింది - ఒకటి కాల్చాను - ఈలోగా మా అమ్మాయి - పదండి - డాక్టర్ దగ్గరికెళదామని మీ దగ్గరికి తీసుకొచ్చింది"  అని చెప్పాను.

అది విని ఆవిడ "మళ్ళీ మీరు నేను ఎందుకు సిగరెట్టు కాల్చానా అని బాధ పడే రోజొస్తుంది" అంది.

అందుకే  ఆపరేషన్ అయాక వెళ్లి అనూరాధకి థాంక్స్ చెప్పి వచ్చాను - నువ్వు చాలా కరెక్టుగా చెప్పావమ్మా అని.

విచిత్రం ఏంటంటే - హాస్పిటల్లో నర్సులు, ఫ్లోర్ లీడర్ యుగంధర్, పరశురామ్ - నాకు ఫ్రెండ్స్ అయిపోయారు.

వచ్చేసేముందు డాక్టర్ గోపీచంద్ "మీకు మందులేమీ అక్కర్లేదు - ప్రతి మూడు నెలలకి ఒకసారి PC గుప్తా రాజమండ్రి వస్తాడు - ఆయన దగ్గర చెకప్ కి వెళ్తే చాలు " అని చెప్పాడు.


PC గుప్తాగారు ఏప్రిల్ లో రాజమండ్రి వచ్చినప్పుడు మొదటి అపాయింట్మెంట్ కి వెళ్ళాను. అప్పటికి మాట కొంచెం బాగానే వచ్చేసింది.

"కామేశ్వరావుగారు ఏంటిసంగతి - ఎలా వున్నారు" అనడిగాడు

"నేను కార్  డ్రైవ్ చెయ్యాలి"  అన్నాను

A. V. సుబ్బారావుగారని డాక్టరే - ఆయన కారుంది అక్కడ - ఆ కారెక్కమని నాకు చెప్పి "పదండి"  అని PC  గుప్తా నాపక్కనే కార్లో కూర్చున్నాడు.

తీసుకెళ్లి చుట్టుపక్కల రోడ్లన్నీ తిప్పుకొచ్చాను.

PC  గుప్తా నా డ్రైవింగ్ చూసి - "సరే డ్రైవ్ చేయండి -ఎక్కువ  దూరం వెళ్లొద్దు" అని చెప్పారు.

ఆ తర్వాత - హైదరాబాదు - గోపీచందు దగ్గరికి వెళ్లి బెల్లం పూతరేకులు, పాలకోవా పట్టుకెళ్ళాను.


గోపీచందు నన్ను చూసి "ఏంటి మీరొచ్చారు?" అనడిగాడు.

"మిమ్మల్ని చూద్దామని వచ్చాను" అని "పాలకోవా, పూతరేకులు మీకోసమే తెచ్చాను" అని అవన్నీ ఇచ్చాను. .

"ఏంటి డాక్టర్ చేతే  షుగర్ తినిపిస్తారా ?" అనడిగాడు

"ఇవి బెల్లం పూతరేకులు - బెల్లం ఐరను - పాలకోవా లో పాలు కాల్షియమ్ - తినొచ్చు" అనగానే నవ్వి తీసుకున్నాడు.


... ... ... ...
... ... ... ...

అలా - బంజారా హిల్సులో (వనచర కొండల్లో) - ఖర్చు విషయంలో చుక్కలు చూపించే సార్ధక-నామధేయ అయిన స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగి అప్పుడే రెండేళ్లు - పోయిన గొంతూ వచ్చేసింది - హాయిగా పాడుకుంటున్నారు నాన్న.










20 కామెంట్‌లు:



  1. శుభమస్తు సర్వే జనాః సుఖినో భవంతు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. The winning story of a successful 60 year's youngster :)

    రిప్లయితొలగించండి
  3. You have great talent and creativity. But it's used for mostly Lowkika vishayalu. Will these liberate you from this Maya? Please think over it.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks for your nice words about my creativity. My blog as it is named - is only for sharing light-hearted conversations - it doesn't serve any other purpose beyond that. I appreciate you for taking time to read and comment.

      తొలగించండి
  4. < " ఈయనేంటండీ బాబూ - సిగరెట్లు మానేయమని నెలనుంచి చెప్తుంటే మొన్న గురువారం మానేశానని చెప్తున్నారు. "
    ---------------------------------
    "పొగ" రాయుళ్ళు (ముళ్ళపూడి వారు వేరే పేరు కూడా పెట్టారు, కానీ వద్దులెండి 🙂) అలాగే ఉంటారండీ 🙂. మా స్నేహితుడొకతన్ని ఓ జనవరి ఒకటి పొద్దున్న కలిసినప్పుడు, చాలా సేపటి వరకు అతని చేతిలో సిగరెట్ కనబడకపోయేసరికి "ఏం" అనడిగాను. మానేసా గురూ అన్నాడు. ఎప్పటినుండి అనడిగాను. ఇవాళ తెల్లారినప్పటినుండీ అన్నాడు 😀.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2015 లో ఆ గురువారం మానడమే - అంతే - ఆ తర్వాత ఇంక దాని జోలికి వెళ్లలేదు 😊

      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
    2. మంచి పని చేసారు మీ నాన్నగారు. వారి ధృఢచిత్తానికి అభినందనలు.

      తొలగించండి
    3. సిగరెట్లను మానేయటం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఈ మాటా చెప్పుకుందాం. మా మావయ్య మంచి హాస్యప్రియుడు. నిత్యాగ్నిహోత్రి (ఆ అగ్ని సిగరెట్ అన్నమాట). ఒకసారి మా అమ్మగారు మా మావయ్యతో 'ఒరే ఆ వెధవ సిగరెట్లు మానెయ్యవచ్చు కదరా' అని అన్నారు. దానికి మా మావయ్య 'అలాగే మానెయ్యచ్చే. చాలా తేలిక. ఇప్పటికో వెయ్యిసార్లు మానేసా' అన్నాడు.

      తొలగించండి
    4. సిగరట్టు కాల్చడం లో మజా తగలేసేవారికిగాని తెలీదు, అదో బలహీనత :) ఆ బలహీనతని ఇలా హాస్యంగా మార్చేస్తాం :) నేనూ అలాగే చాలా సార్లు మానేసినవణ్ణే! చివరగా పదేళ్ళకితం మానేశా,మళ్ళీ ముట్టుకోలేదనుకోండి :)

      తొలగించండి


    5. సిగరెట్టు కాల్చడములో
      తగలేసిన వారికిగద దాని మజా బా
      గుగ తెలియున్ లలితమ్మా !
      బుగబుగ తాగెనట యొజ్జ పొగబండి వలెన్ :)

      జిలేబి

      తొలగించండి
    6. సిగరెట్టు కాల్చడమేమో
      పొగపీల్చిన వారికిగద దాని మజా బా
      గుగ తెలియున్ అనిపించె !
      గబగబ పేరిచిన ఈ పొగ వ్యాఖ్యల వలనన్ :)

      తొలగించండి
  5. Happy endings!!!! Great writings and best regards to your dad!!!!

    రిప్లయితొలగించండి
  6. All is well. big like for your father's attitude

    రిప్లయితొలగించండి
  7. మీ నాన్నగారు భలే నచ్చేశారండీ... ఇప్పుడు పాడుకోగలుగుతున్నారని వినడం చాలా సంతోషంగా ఉంది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా నాన్న మీకు నచ్చారన్న ఈ కమెంట్ నాకు భలే నచ్చిందండి! Thanks a lot!

      తొలగించండి