15, మార్చి 2016, మంగళవారం

మొట్టమొదటిసారిగా...

ఓటేసేశా ....
మొదటిసారిగా ...
జీవితం లో మొట్టమొదటిసారిగా...

నిజమే ....ఒక రకంగా ఇదేమీ గొప్పపని కాదు ...
పుట్టిన ఇన్నేళ్ళకి - నాకు పుట్టిన వాడికి ఓటు హక్కు వచ్చాక...
నేను వెళ్లి ఓటు వేయడం - అబ్బే అని తీసి పడేయాల్సిన విషయమే...

కానీ - ఇన్నేళ్ళకయినా వెళ్ళగలిగానని ఒక ఆనందం.

ఎప్పుడో 15 రోజుల క్రితం ఎలక్షన్ సెంటర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డేట్ కూడా మార్క్ చేసి పెట్టుకున్నాను - మార్చ్ 15 అని.

ఇవాళ సాయంత్రం అయిదున్నరకి కిరణ్ ని టై క్వాన్ డో క్లాసు లో వదిలి పిల్లలరూం కి తెల్ల పెయింట్ కొనుక్కువద్దామని ప్లాన్.

వాడి క్లాస్ దగ్గరకి వెళ్ళగానే గుర్తొచ్చింది - ఇవాళ US ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎలెక్షన్, ఏడింటికి ముగిసిపోతుందని. అంతే - ఇంక పెయింట్ షాపింగ్ ని ఏడింటి తర్వాతకి వాయిదా వేసి సెల్విడ్జ్ మిడిల్ స్కూల్ కి వెళ్లాం - నేను, బదరి.

ఇద్దరం టచ్ స్క్రీన్ ఆప్షన్ తీసుకున్నాము - తనది తొందరగానే అయిపోయింది.  ఓటర్ నమోదు లో నా మిడిల్ నేం తప్పు వుండడంతో ఒక పదిహేను నిముషాలు ఆలశ్యం అయింది.

ముందు ఆ ఎలెక్షన్ సూపర్వైజర్ మిడిల్ నేం సరి చేయందే ఓట్ చేయకూడదంటే ఒక నిముషం ఉసూరుమనిపించింది. ఆయన నా మొహం చూసి - ఒక నేం కరెక్షన్ ఫాం నింపేసి ఇస్తే ఓటు వేయొచ్చు అనగానే మళ్ళీ ప్రపంచం అంతా వెలుగ్గా జిగేలుమనిపించింది.

అన్నీ ముగించుకుని ఓటు వేసి రాగానే - ఎలాగైనా గుర్తుగా బ్లాగ్ చేయాలనిపించింది - అది కూడా ఇవాళే ...

4 కామెంట్‌లు: