మొన్నటి ఆదివారం నుంచి ఎంత చలిగా ఉందో ఈ మా ఊళ్ళో!
మా ఊళ్ళో చలిపులి "బ్‌ర్‌ర్‌ర్"మని గాండ్రిస్తోంది.
ఉన్నచోట - ఉన్న పళాన ఉష్ణోగ్రత ఎలా ఉందా అని చూస్తే ఇంట్లో థెర్మోస్టాట్ 16 డిగ్రీలు చూపించింది.
అది చూస్తూనే అప్పుడెప్పుడో - మా బుజ్జిజింక గాడన్నట్టు - pre-historic times లో FORTRAN లో రాసిన నా మొట్టమొదటి Fahrenheit to Celsius conversion program ని నెమరేసుకుంటూ - ఉరామరిగ్గా - ప్లస్సు పదహారు డిగ్రీల ఫేరన్‌హైట్ ఈజీక్వల్టూ మైనస్సు తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడు - అని మనసు లోనే లెక్కలేసుకున్నా.
అలా పాత ప్రోగ్రాముల రోజుల్ని నెమరేసుకునేటప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఆ FORTRAN ప్రోగ్రాం రాసినప్పుడు - Fahrenheit to Celsius conversion formula నన్ను ఎంత సతాయించిందో గుర్తుకొచ్చింది.
వారానికో రోజు అరగంట మాత్రం దొరికేది కంప్యూటర్ ల్యాబ్ టైం. మాకు FORTRAN చెప్పింది రమశ్రీ మేడం అనుకుంటా.
ఒక ఉష్ణోగ్రతని ఫేరన్‌హైట్ నుంచి సెంటీగ్రేడుకి మార్చాలంటే దాన్ని 32 లోంచి తీసేసి 5/9 తో హెచ్చవేయమంది. అదీ ఫార్ములా అని తీర్మానించి తేల్చి చెప్పేసింది. అంత వరకు బానే వుంది. సింటాక్స్ ప్రకారం ప్రోగ్రామ్ రాశానే కానీ నాకేంటో నచ్చలేదు అందులో. ఏం నచ్చలేదా అని తెగ ఆలోచించిన తర్వాత తట్టిందేంటంటే నాకు అందులో 5/9 అన్న క్రమభిన్నం సక్రమంగా అర్థం కాలేదు. మా మేడం "అది అంతే!" అని నొక్కి వక్కాణించింది కానీ "అంతే ఎందుకు?" నా ప్రశ్నని ఆట్టే పట్టించుకోలేదు.
ఇలా అర్థాలు ఆట్టే చెప్పకుండా స్టెప్పులేయించి లెక్కలు చేయిస్తున్నారనే కదా ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ కోచింగులు మానేసి సొంతంగా ఆడుతూ-పాడుతూ చదువుకుని ఇక్కడకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే ఫార్ములాల గొడవేంట్రా బాబూ అనిపించింది. కాకపొతే ఓ రెండో, మూడో కాయితాలు నలుపు చేసేసి, నలిపేసి - సెంటీగ్రేడ్ 100-0=100 కి, ఫేరన్‌హైట్ 212-32=180 కి నిష్పక్షపాతంగా నిష్పత్తులు చూసేసుకుంటే 5/9 కిటుకు తెలిసిపోయింది. కానీ నాకింక క్లాసులో పాఠాలు వినాలనిపించలేదు.
MCA మూడేళ్ళలో నేను పాఠాలు విన్నది ఇద్దరో ముగ్గురో చెప్పిన క్లాసులు - శుభ మేడమ్ చెప్పిన డిస్క్రీట్ మేథమేటికల్ స్ట్రక్చర్స్, రాజశేఖర్ సర్ చెప్పింగ్ అకౌంటెన్సీ, సత్యం సర్ చెప్పిన ఆర్గనైజషనల్ బిహేవియర్. మిగిలినవన్నీ నాకు తోచినట్టు నేనే చదువుకున్నా.
నాకు మొదట్నుంచి ఉన్న మంచిదో, చెడ్డదో ఒక అలవాటు ఏంటంటే - నాకు పాఠం మొదటిసారి వినగానే అర్థం కాకపోతే ఆ తర్వాత వాళ్ళేం చెప్పినా వినేదాన్ని కాదు. నేనే చదివేసుకుని నాకు తోచినట్లు అర్థం చేసేసుకునేదాన్ని.
అప్పటికీ మా అమ్మ చెప్పేది "చెప్పే గురువు మీద భక్తి ఉంటేనే శ్రద్ధ కుదిరి చదువొస్తుంది" అని.
"సరే! భక్తి కలిగేలా చెప్పగలిగే గురువు దొరికితే శ్రద్ధగా ఎలాగూ వింటాం. అలా కాకపోతే మహాశ్రద్ధగా వింటున్నట్టుంటాం!!!" అని ఓ విట్టేసేసేదాన్ని. అది విని మా అమ్మకి చిరాకెత్తి - "నీలాంటివాడే వెనకటికొకడు చిన్నప్పుడు కాకరకాయ్ అని పెద్దయ్యాక కీకరకాయ్ అన్నాట్ట" అనేసేది.
అసలివన్నీ ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చాయీ అంటే రెండ్రోజుల క్రితం ఆదివారం నాడు - హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పిల్లలున్న తల్లులిద్దరం కబుర్లు చెప్పుకున్నాం - నేనూ, మా ఆడపడుచు.
తనతో మాట్లాడడం అయ్యాక - ఆ ఫోన్ పెట్టేశాక -
"అన్ని ఇంజినీరింగుల టెక్నాలజీలూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోనే కలిసిపోయేటట్టయితే
To B.E., or not to B.E.?! that is the question" అంటూ మొదలెట్టి ...
"- of that day, of today, of any day"
అంటూ సాగే నా soliloquy
అనబడే స్వగతానికి గతం ఏంటీ అంటే...
గతం...
అనగనగనగనగా... మా గుంటూరు.
ఆ మా గుంటూర్లో ఎఱ్ఱటి ఎండలు మొదలయీ మొదలవగానే - ఏడు రంగుల వానవిల్లులో ఇంకో వెయ్యి వన్నెలు కలిపినన్ని రంగురంగుల రెక్కలు తొడుక్కున్న సీతాకోకచిలకల గుంపుల్లా అమ్మాయిలూ - ఇన్ని రంగులు కళ్ళ ముందు కదులుతుంటే ఏ రంగు బట్టలేసుకుంటే ఏంటన్నట్టు తెలుపో-నలుపో-జానేదేవ్-ఆ తేడాలిక్కడ లేనేలేవ్ అన్నట్టున్న గండుతుమ్మెదల్లాంటి అబ్బాయిలూ - బిలబిల్లాడుతూ మా బ్రాడీపేట రోడ్లని కళకళలాడించేవాళ్ళు.
మా మేడ మీద పిట్టగోడెక్కి కూర్చుని అటూ-ఇటూ గుంపులుగుంపులుగా గలగల్లాడుతున్న వాళ్ళని చూడడంతో సరదాగానే గడిచింది గుంటూర్లో మా మొదటి వేసవి - జూనియర్ ఇంటెర్మీడియట్ సెలవులది.
"కప్పలు, బొద్దింకలు కోయిస్తారు, మా పిల్ల జడుసుకుంటుందమ్మా! ఎందుకొచ్చిన బైపీసీ? ఎంచక్కా లెక్కలు చేసుకుంటుంది" అని దగ్గరుండి మరీ మా అమ్మా, లక్ష్మి దొడ్డా కలిసి నన్ను బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజీలో చేర్పించారు కదా!
తెల్లవారకుండా లేచేసి - ఒకటో-రెండో జళ్ళేసేసుకుని - జట్లుజట్లుగా - బుద్ధిగా - తలొంచుకుని మా ఇంటి ముందు నుంచి ట్యూషన్లకి వెళ్ళిపోతూ-వచ్చేస్తున్న ఆడపిల్లల్ని చూసి "ఓహో! ట్యూషన్లకి వెళ్తే ఇంత బుద్ధిగా ఉంటారు కామోసు" ననుకుని - అదే ఆశతో పొద్దున్నే నూనె రాసి జళ్ళేసి - నన్ను రాఘవేంద్రరావుగారి ఫిజిక్స్ ట్యూషన్లో కూర్చోపెట్టేసింది మా అమ్మ.
ఓ వారం రోజులు అవగానే నాకు ట్యూషన్ పడక జలుబు చేసేసింది.
పొద్దున్నే లేచి చలిలో వెళ్ళి నలిగిపోతున్నానని - తొమ్మిదింటికి వెచ్చగా పాలు తాగి వెళ్ళొచ్చని మా ఇంటి వెనకనే ఐదవ లైనులో రిటైర్డ్ టీచర్ భావన్నారాయణ గారి దగ్గర ట్యూషన్ చేర్పించింది అమ్మ.
ఆయన కొచ్చిందెంతున్నా - నన్నాట్టే కొశ్చెన్లు అడక్కుండా నాకు నచ్చింది మాత్రమే చెప్పే భావన్నారాయణ గారి చదివింపు నచ్చి ఇంటర్ రెండేళ్ళు ఆయన దగ్గరే లెక్కలు చేసుకొచ్చేదాన్ని. మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు చేతనైనంత వరకు అర్థం చేసుకుంటూ చదువుకునేదాన్ని.
ఇక నా సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోగానే - ఎంపీసీ గ్రూపు కదా - ఎంత కాదనుకున్నా తర్వాతి అంకం ఎంసెట్. దాని కోసం ట్యూషన్లు చేరడం తప్పలేదు. తీరా చేరాక - ఈ లెక్క ఇలాగే ఎందుకు చెయ్యాలీ, ఆ ఫిజిక్స్ ఫార్ములా ఎలా వచ్చిందీ - అని సందేహాలొస్తే - "అదంతా ఎంట్రన్స్ అయిపోయాక తీరిగ్గా చర్చించుకుందాం, ప్రస్తుతానికి చెప్పింది చెయ్" - అనేవాళ్ళే అంతా.
అప్పుడు... అలాంటి ... అనేకానేక సందేహాలు అస్సలు తీరని అసహనపు వేసవి మధ్యాహ్నాల్లో - వట్టివేళ్ళ చాపల నీడలో కూర్చుని - నా చుట్టూ - పొరలేసి కుడితే మూడు బొంతలయ్యేంత దొంతరల ఎంసెట్ మోడల్ టెస్ట్ పేపర్సూ, దాని మానాన అది కూనిరాగాలు తీస్తున్న ట్రాన్సిస్టరూ, కొంటె బొమ్మల బాపు, ముళ్ళపూడి బుడుగు, ఆ పక్కనే Merchant Of Venice చదివిన మాయలో ఉండి - మోజుపడి కొనుక్కున్న షేక్స్పియర్ ట్రాజెడీ డ్రామా Hamlet - ఇన్ని పెట్టుకుని - దీర్ఘంగా ఆలోచించా...
ఆ మాత్రం సమాధానాలు కూడా దొరకని అంతంతమాత్రపు చదువు కోసం గుంటూరు వీధుల్లో, వేసంకాలపు మిట్టమధ్యాహ్నపుటెండల్లో తిరగడం అంత అవసరమా అని.
అలా అనుకుని - ఇంట్లోనే ఉండి ఎంత చక్కగా చదువుకుంటానో చూడు - అని మా అమ్మని ఒప్పించి, అప్పటి దాకా వెళ్తున్న ట్యూషన్లన్నీ మానేశా.
ఇహ అప్పణ్ణించి - పొద్దున్న లేస్తూ చదివా. మధ్యాహ్నం భోంచేస్తూ చదివా. సాయంత్రం టీవీ త్యాగం చేస్తూ చదివా. "పుస్తకం హస్తభూషణం" అన్న నానుడికి బ్రాండ్-అంబాసడర్లా మసలా.
అంతా చేసి ఎంట్రెన్స్ రాస్తే వచ్చిన రాంక్ - అంకెల్లోనే కాదు, అంకెలని అక్షరాల్లోకి మారిస్తే కూడా ఘనంగా వినిపించే అంకె - ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు. ఆ రోజుతో కచ్చితంగా తెలిసిపోయింది - I am not meant to be B.E. అని.
ఇప్పుడు...
ఇలా ... -
"I am not meant to be B.E. దాకా ఎలా వచ్చానో చెప్పాక
-ఆ గతానికి కొనసాగింపుగా
ఈనాటి స్వగతం ఏంటీ అంటే...
స్వగతం:
ఇందాక అప్పుడెప్పుడో మా ఆడపడుచుతో చదువుల గురించి మాట్లాడానని చెప్తూ - నా చదువుల రోజుల్లోకి షికారెళ్ళొచ్చా కదా... తన ఫోన్ పెట్టెయ్యగానే - ఫోన్ పెట్టెయ్యడం అన్నది జరిగింది కానీ మాట్లాడడం మాత్రం ఆగలేదు.
"చిన్నప్పుడు ఏ సినిమా చూసినా హీరో బియ్యే చదివి ఫస్టు క్లాసులో పాసవుతూ ఉండేవాడు. అప్పడు BA ఎలాగో ఇప్పటి BE అలా వుంది. సివిల్ చదివినా, మెకానికల్ చదివినా అన్నిటికీ ఎండ్ పాయింట్ IT యే అయిపోయింది. ఆ మాత్రం దానికి అన్ని బ్రాంచులెందుకో? అసలింక కొన్ని తరాల పిల్లలు ఇంజనీరింగ్ చదవడం మానేసి వాళ్ళకి నచ్చిన కొత్త చదువులేమన్నా చదువుకుంటే బావుండును." అని నాలో నేను స్వగతానికి ఎక్కువగా, ప్రకాశానికి మిక్కిలిగా అనుకుంటూ ఉన్నాను.
అప్పటి దాకా నేను మాట్లాడుకుంటూ ఉన్నదంతా నిశ్శబ్దంగా వింటున్న బదరి అందుకుని "నీకో సంగతి చెప్తా విను...మనం చదువుకునే రోజుల్లో - మనతో చదివిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ ఎందుకు చదివారంటే అదేదో ఆ సబ్జెక్టు అంటే ఏంటో తెలిసి, దాని మీద ఆసక్తి ఉండి కాదు. అమెరికా చదువుల మోడల్లో 12 ఏళ్ళు స్కూలు + 4 ఏళ్ళ డిగ్రీ ఉంటే అమెరికాకి వీసా రావడం ఈజీ అవుతుందని ఆ awareness ఉన్న పేరెంట్స్ ఎవరో కొందరు వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగులో చేర్పించి ఉంటారు. వాళ్ళని చూసి ఇంకొందరు... అలా అలా కొన్నేళ్ళయ్యాక అసలు అలా ఎందుకు చదవడం మొదలు పెట్టారో అసలు కారణం మర్చిపోయి ఇంజనీరింగ్ కన్నా ఇక వేరే డిగ్రీయే లేదన్నట్టు అందరూ అదే చదివించడం మొదలు పెట్టారు. ఆంధ్రాలో సీట్లు రానివాళ్లు మహారాష్ట్ర వెళ్ళి కూడా చేరారు. " అంటూ ఇంకొన్ని విషయాలు గుర్తు చేశారు.
నాకు ఎప్పుడు చదువుల గురించి తలచుకున్నా బాధ - ఎంతో విలువైన పిల్లల సమయాన్ని, శక్తిని పనికిరాని కోచింగులు, అర్థం లేని కాంపెటిషన్లు మింగేస్తున్నాయని.
ఆడుతూ, పాడుతూ, అర్థం చేసుకుంటూ, బుద్ధిని వికసింప చేసేలా హాయిగా చదువుకోవాల్సిన చదువుని పరీక్షల్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం మాత్రం చదువుకోవాల్సి రావడం పువ్వుల్లాంటి, పసిగువ్వల్లాంటి పిల్లలకి జరుగుతున్న మహా అన్యాయం.
అన్నట్టు మా బుజ్జిజింకలతో పాటు చదువుకుంటూ నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం - పరీక్షల ముందు ఏ పిల్లలకీ "All the Best ! Do well!" అని చెప్పొద్దు అని.
ఆ విశేషాలు ఇంకో సారి ...
chaala baaga vraasaaru, please contiue ,awaiting next one
రిప్లయితొలగించండిThank you 😊 will definitely continue.
తొలగించండిపరీక్షల ముందు ఏ పిల్లలకీ "All the best! Do well!" అని చెప్పొద్దు అని..
రిప్లయితొలగించండినాక్కూడా పాఠమే ఇది. Thank you!
"అసలింక కొన్ని తరాల పిల్లలు ఇంజనీరింగ్ చదవడం మానేసి వాళ్ళకి నచ్చిన కొత్త చదువులేమన్నా చదువుకుంటే బావుండును." అని నాలో నేను స్వగతానికి ఎక్కువగా, ప్రకాశానికి మిక్కిలిగా అనుకుంటూ ఉన్నాను. ..
అబ్బ..ఎంత బావుంటుందో! IT చిన్నప్పటినుంచి బడి లో చెప్పే ఇంకో language ఐపోతే (trend చూస్తే అలాగే అయిపోయేలా ఉంది) ఎంచక్కా మీరు కలలు కన్న చక్కటి చదువుల ప్రపంచం వచ్చేస్తుంది.
అలాగే వచెయ్యాలని అంతవరకూ తపస్సు చేస్తూ ఉంటాను !
నేను నేర్చుకున్న పాఠం మీకు నచ్చినందుకు సంతోషం. థాంక్ యూ!
తొలగించండి