అప్పుడు -
ఏమీ తెలిసీ తెలియని అప్పుడు
చిన్నప్పుడు
చదువుకున్న బడిలో
ఆడుకున్న ఆటల్లో
కుదిరిపోతుంది చెలిమి
అలవోకగా ...
మాటల్లో ... ఆటల్లో ...
ఇప్పుడు -
ఎంతో తెలుసని అనుకునే ఇప్పుడు
పెద్దప్పుడు
కలుపుకున్న మాటలతో
ఊసుపోని వేళలలో
కుదురుకుంటుంది కూరిమి
అలవాటుగా...
మాటలతో ... పాటలతో...
********
********
స్నేహం అన్న మాట వినగానే ముందు గుర్తొచ్చేవి - గడిచిపోయిన పాత రోజులు, చిన్నప్పటి నేస్తాలే.
ఆ పాతరోజుల స్నేహం అలా ఉంటూనే - ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడడం ఎప్పుడూ బావుంటుంది.
ఆ కొత్త పరిచయపు సాంగత్యంలో - కొత్త విషయాలు తెలియడంతో పాటు - అప్పటివరకు తెలిసిన విషయాలనే కొత్తగా-కొంగొత్తగా చూడడం అంతకు ముందెప్పుడూ లేనంత బావుంటుంది.
కొత్తకొత్త అనుకుంటూనే ఆ పరిచయం చిన్నిచిన్ని పలకరింపుల్లో ఇష్టమైన అలవాటుగా మారడం - పలకరింపులు దాటి స్నేహమై నిలిచిపోవడం - ఇంకెప్పటికీ బావుంటుంది.
అన్నట్టు ... ఆ కొత్త పరిచయం ప్రతీ సారి ఓ కొత్త మనిషితో మాటాడుకున్న మొట్టమొదటి మాటే కానక్కర్లేదు - మొట్టమొదటిసారిగా విన్న ఓ పాత పాట కూడా అయుండొచ్చు.
అప్పుడెప్పుడో పెద్దలెవరో "ఋణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయా" అన్నారు కదా దానికి నా version "ఋణానుబంధ రూపేణా పతి మిత్ర సుత గీతాలయా ".
ఇంతకీ ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే - అప్పుడెప్పుడో ట్రావెల్ చేసే రోజుల్లో - అంటే 2020 కి ముందు - అనగా 2019 BC యుగంలో - ఒకానొక రోజు - నాకు చెబ్దామని మూటకట్టుకొచ్చే బోల్డన్ని కబుర్లతో పాటు - ఝుమ్మని మోగే తుమ్మెద పాటలాంటి - పాట నొకదాన్ని తన పెదవుల మీద మోసుకొచ్చారు బద్రి.
చాలా రోజుల పాటు - తను మోసుకొచ్చిన పాటని - "ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!" అంటూ పదేపదే ఆ రెండు ముక్కలే పాడుకుంటూ ఉండిపోయామే కానీ ఆ పాటేదో పట్టుకోలేకపోయాము.
ఇలాక్కాదని చెప్పి - ఓ రోజు - "ఎంతకాలం ఇద్దరం చెరికో ముక్క అనుకుంటూ ఆ రెండు ముక్కలే పాడుకుంటాం? ఎలాగైనా సరే వెతికి చెఱుకుముక్కలాంటి ఆ పాటేదో పట్టుకుందాం" అన్జెప్పి వెతుక్కుంటే - పనికట్టుకుని పలకరించి చేసుకున్న కొత్త పరిచయం లాగా - భలే దొరికేసింది ఆ పాత పాట.
పాట పూర్తిగా విన్నాం.
ఒక్కో పాట అప్పటివరకు అస్సలెప్పుడూ విని ఉండనిదైనా - అప్పుడే మొదటిసారి వింటున్నదైనా - వినీ వినగానే, వింటుండగానే - చెవులలో మూగేస్తుంది, పెదవులపై మోగేస్తుంది.
ఇది అచ్చు అలాంటి పాట. ఈ పాట గురించి ఇంకా ఇంకా చెప్పే ముందు అసలు ఆ పాటేంటో చెప్పాలి కదా!
పాట పేరు: ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!
పాటున్న సినిమా పేరు: ౙహ్రీలా ఇన్సాన్
పాటలో పరిగెట్టిన వాళ్ళ పేర్లు: రిషి కపూర్, ఇటు నుంచి నీతూసింగ్,
అటు నుంచి మౌసమీ ఛటర్జీ, వీళ్ళు ముగ్గురే కాకుండా బోల్డంత గాలి
పాటలో కనిపించిన ఊరు: చిత్రదుర్గ
పాట రాసినవారి పేరు: మజ్రూ సుల్తాన్‌పురి
పాట కట్టినవారి పేరు: రాహుల్ దేవ్ బర్మన్ (RD బర్మన్)
పాట పాడినవారి పేరు: కిషోర్ కుమార్
పైన రాసింది పాటకి పైపై పరిచయం మాత్రమే. ఈ పాట గురించి చెప్పాలంటే కథ ఇంకా చాలా ఉంది.
ౙహ్రీలా ఇన్సాన్ సినిమా పేరెప్పుడూ వినలేదు ఇంతకు ముందెప్పుడూ. అసలీ సినిమా ఏమిటీ, ఎప్పటిదీ, ఎక్కడిదీ, ఎవరిదీ అని వెతుక్కుంటూ వెళ్ళగా వెళ్ళగా యూట్యూబ్‌లో తేలా.
అక్కడ చూడగా తేలిందేంట్రా అంటే - ఇది కన్నడలో నాగర హావుగా గొప్పగా పుట్టి - తెలుగులో కోడెనాగుగా ఓ వెలుగు వెలిగి - హిందీలో ౙహ్రీలా ఇన్సాన్ (విషపూరితమైన మనిషి) గా కృంగి పోయిన సినిమా అని.
కన్నడ సినిమా నాగరహావులో - నట-నటీ -త్రయం: విష్ణువర్ధన్, శుభ, ఆరతి.
తెలుగు సినిమా కోడెనాగులో - కథానాయక-నాయికా-త్రయం: శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ.
హిందీ సినిమా ౙహ్రీలా ఇన్సాన్ లో - ఆభినేత-నేత్రీ-త్రయం: రిషి కపూర్, రిషి నిజదార నీతూసింగ్, మౌసమీ ఛటర్జీ.
కన్నడ, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించినది - కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కణగాల్. తెలుగులో మాత్రం K.S. ప్రకాశరావు (ఫలపుష్ప-విసిరేంద్ర రాఘవేంద్రరావుగారి తండ్రిగారు).
ఇక నాకు నచ్చిన హిందీ పాట - ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?! విషయానికి వస్తే... పాటలో వినిపించే మొట్టమొదటి మాట దగ్గర మొదలుపెట్టి - పాటలో కనిపించే చిట్టచివరి పరుగు దాకా చెప్పాల్సింది బోల్డంత ఉంది.
నిజానికి ఈ పాటని ఓ హంసినీ... మేరీ హంసినీ! అని అనుస్వారసహిత-హ "హం" తో తేలిగ్గా రాసేయొచ్చు. మరి అలా రాస్తే కిషోర్ కుమార్ మునిపళ్ళతో సుతారంగా అన్న నకారపొల్లు నా రాతలో ఎలా కనిపిస్తుంది? అందుకే నా రాతలో"హంసిని" - "హన్సిని " అయింది.
ఇక్కడ నుంచి ఈ పాట లోకి ఇంకా ముందుకి వెళ్ళేలోగా - కన్నడ, తెలుగు సినిమాల్లో ఇదే సందర్భానికి వచ్చే కవల పాటల గురించి చెరి రెండు ముక్కలూ చెప్పేసి అప్పుడు మళ్ళీ హిందీ పాట దగ్గరికొస్తా.
నాగరహావు సినిమాలో పాట: బారే... బారే... చెందద చెలువిన తారె!
కన్నడలో - ఇదే సందర్భానికి చెందిన పాట - పీబీ శ్రీనివాస్ పాడారు.
ఆ పాట ఏంటంటే... ఈ కింద ఓ రెండు లైన్లు రాసిపెట్టా.
(కుండలీకరణాలలో ఉన్నది కన్నడ పాటకి నా తెలుగు అనువాదం - మహాదుష్టసమాసాలతో అసలుసిసలు డబ్బింగు పాటలా )
"బారే... బారే... చెందద చెలువిన తారె ...
(రావే... రావే... సుందర సుందర తారా!)
బారే బారే ఒలవిన చిలుమెయ ధారె"
(రావే... రావే... ప్రేమల చెలమల ధారా!)
కన్నడలో "చిలుమె" అంటే ఇంగ్లీషులో "ఫౌంటెన్ (fountain)". దానికి అచ్చతెలుగు మాట "చిమ్మనగ్రోవి". Fountain కి తెలుగులో ఇంకో అర్థం "చెలమ" అని కూడా ఉంది. అందుకని డబ్బింగు పాటలో రాసినట్టు "చిలుమెయ ధారె" ని - "చెలమల ధార" చేశా.
కన్నడ పాటలో నాకు నచ్చిన ఇంకో లైను ఏంటంటే "మౌన గౌరియ మోహద కై బిడలారే ". దాన్ని నేను తెలుగులో ఇలా డబ్బుకున్నా "మూగప్రేమ సమ్మోహన చెయి విడలేనే".
పాటలో మాటలు ఎంత బావున్నాయో - పీబీఎస్ మెత్తటి గొంతులో వినడానికి అంత కంటే హాయిగా ఉన్నాయి. ఈ పాటకి విజయభాస్కర్ సంగీతం, పీబీ శ్రీనివాస్ గాత్రం - రెండూ కూడా సప్తస్వరభరిత పంచప్రాణాలు. ఈ పాట విన్న దగ్గర్నుంచి - 5 of 1 = 2 && 7 అనేది నా కొత్త సమీకరణం (equation).
ఈ పాటలో ధవళవస్త్రధారక-విష్ణువర్ధన్ తో పాటు కనిపించే హీరోయిన్ ఆరెంజ్-చీరధారిణి-ఆరతి.
పాటంతా గాలిలో తేలుతున్నటుగా - స్లో మోషన్ లో ఉంటుంది.
ఆ ఆరతి కూడా - గడ్డిభూముల్లో పరిగెడుతూ, చెట్టు కొమ్మలెక్కి ఊగుతూ, చెట్టు కొమ్మల మీంచి అటూఇటూ గెంతుతూ - భలేగా పరిగెడుతూ ఉంటుంది.
ఇక విష్ణువర్ధనేమో జుట్టంతా కుడిపక్కకి పోగు పెట్టేసుకుని - భుజాలు ఎగరేస్తూ, బుగ్గల్లో పూరీలు పెట్టుకున్నట్టు కనిపిస్తూ - బల్-తమాషాగా ఉంటాడు.
కస్తూరి-పరిమళ భరిత కన్నడ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=1r2DfXX4T3c
కోడెనాగు సినిమాలో పాట: నాలో కలిసిపో...
ఇహ తెలుగుపాట ఎలా ఉంటుందీ అంటే - శోభన్ బాబు, చంద్రకళ గాలిలో తేలిపోతూ - అక్కడే ఆగక సెట్టింగుల్లో అట్నుంచి ఇటూ, ఇట్నుంచి అటూ దూకుతూ ఉండగా - బహుమంద్ర స్థాయిలో మొదలయి - ఘంటసాల స్వరంలో, పెండ్యాల స్వరాలతో సాగే ఆత్రేయ పదాలతో సాగుతుంటుంది.
నాలో - కలిసిపో...
నా ఎదలో నిలిచిపో...
కాచుకున్న కౌగిలిలో కప్పురమై - కరిగిపో... కరిగిపో...
ఈ పాటలో - తెల్లదుస్తుల-శోభన్ బాబుకి ఇటు వైపు నుంచి అటు వైపుకి నల్లచీరలో పరిగెడుతూ లక్ష్మి కనిపిస్తే, అటునుంచి ఇటువైపుకి పసుప్పచ్చ చీరలో చంద్రకళ తేలుకుంటూ వస్తుంది.
కన్నడ, హిందీ పాటల్లో అదే కొండలు-అదే గాలి-అవే దుస్తులు. అయితే తెలుగులో మాత్రం కొండల్లో సెట్టింగులు-సెట్టింగుల్లో వానవిల్లులు -వానవిల్లులాంటి దుస్తులు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి కళాపోషణకి బాగా-మహాగా-మహబాగా పోషణ జరిగేది తెలుగు సినిమాల్లోనే.
తెలుగు పాటలో రెండో చరణంలో - ౘందమామ కెదురుగుండా నించుని శోభన్ బాబు ఎత్తుకున్నప్పడు చంద్రకళ కట్టుకున్న తళుకుబెళుకుల-వానవిల్లు చీర ఎంత బావుందో!
తేటతెలుగు పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=WfbHhPN24ws
అలా - కన్నడ-చెట్టు చుట్టూ, తెలుగు-సెట్టు చుట్టూ తిరిగితిరిగి - ఇహ ఇప్పుడు - నాకు కొత్తగా చుట్టమైన పాత హిందీ పాట దగ్గరికి వచ్చేశాం !
ౙహ్రీలా ఇన్సాన్ సినిమాలో పాట: ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
నాకు నచ్చిన ఈ హిందీ పాట దాపులకి వెళ్ళేలోగా ఈ ౙహ్రీలా ఇన్సాన్ సినిమా గురించి నాకనిపించిన కొన్ని కబుర్లు.
కన్నడలో, తెలుగులో గొప్పగా, పొగరుగా ధ్వనించే "నాగరహావు", "కోడెనాగు" అన్న పేర్లు పెట్టి హిందీ లోకి వచ్చేటప్పటికి - "ౙహ్రీలా ఇన్సాన్" - అని - వినగానే "ఎబ్బే! ఏం మనిషిరా వీడు?" అనిపించేలాంటి పేరు పెట్టటం ఈ సినిమాకి జరిగిన మొట్టమొదటి అన్యాయం.
అందులోనూ - బే-మీసాల్గా ఉండి "బేమిసాల్" అనిపించే ఎండ కన్నెరగని కపూ-రాకుమారుడు రిషికపూర్‌ని తో-మీసాల్గా, కయ్యానికి కాలు దున్నేవాడిలా చూపించడం - విషాదాంతం చేయడం - హిందీ సినిమాకి పుట్టణ్ణ చేసిన ఇంకో అన్యాయం.
ఈ పాట వినగానే - మహా మోజు పడి - సినిమా చూద్దామనుకుని ఎంత అనిపించిందో - కానీ చూడలేదు.
హిందీ పాట "ఓ హన్సినీ.. . ! మేరీ హన్సినీ!" గురించి నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఈ పాటకీ, తెలుగులో సిరిసిరిమువ్వ సినిమాలో "ఝుమ్మంది నాదం" పాటకీ ఒక మంచి పోలిక ఉంది. ఈ రెండు పాటలూ కూడా డ్రీం-సాంగ్స్ అంటే ఊహల్లో పాటలు.
కానీ అది కాదు నేను చెప్పాలనుకున్న పోలిక.
ఈ రెండు పాటల్లో కూడా - మొదటి కొన్నిసెకన్ల వరకు - అంటే - నిజం లోంచి ఊహ లోకి తలపు మారే దాకా "టిటి-టిట్ట టిటి-టిట్ట టిటి-టిట్ట" అంటూ ఒక తంత్రీ-వాయిద్యంతో మొదలయి - ఊహలో ప్రారంభమయ్యే అసలు పాట దగ్గరికి వచ్చేసరికి - ఒక్కసారిగా కుదుపు లాంటి ఎత్తుగడతో వినిపిస్తుంది పల్లవి.
ఝుమ్మంది నాదం పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=g_f9X6xbx6U
ఇప్పుడు - అసలు పాట గురించిన కబుర్లు...
"ఓ హన్సినీ..." పాట మొదలవుతూనే ఒక పురాతన దేవాలయం పక్కనే ఉన్న శిలాతోరణం నుంచి పరిగెట్టుకుంటూ ఆకుపచ్చ ట్యూనిక్ వేసుకుని నీతూసింగ్ వస్తుంటుంది. ఆమె వెనకాలే రిషి కపూర్ పరిగెడుతూ వస్తాడు. నీతూసింగ్ పరిగెట్టే వైపు కూడా ఒక పురాతన దేవాలయం, దానిముందు ఒక ధ్వజస్తంభం ఉంటాయి. ఆమె అలా పరిగెడుతూనే ఉంటుంది - ఆమెకి వ్యతిరేక దిశలో గాల్లో తేలుకుంటూ ధవళవస్త్రధారిణి మౌసమీ ఛటర్జీ రిషి కపూర్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది రిషి కపూరుకి.
నాకు ఈ పాట చూసిన మొదటి సారే ఆ పురాతన దేవాలయాలు చాలా సమ్మోహనంగా అనిపించాయి. అవి ఏంటా అని వెతికితే - కర్నాటకలో చిత్రదుర్గ కోట పరిసర ప్రాంతాలని తెలిసింది. నా హంపి-హళేబీడు లిస్టులో చిత్రదుర్గ కూడా చేర్చుకున్నాను - కుదిరినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే!
శాక్సోఫోన్ గంభీర ధ్వని పాట అంతా కమ్ముకుని వినిపించే ఈ పాటలో - పల్లవి అవగానే మొదటి చరణం మొదలయే ముందు వచ్చే వాద్యసంగీతం - అచ్చు - గాలి మునివేళ్ళ మీద పరిగెడుతోందా - అన్నట్టు వినిపిస్తుంది. దానికి తోడు అప్పుడే రిషి కపూర్ కూడా చులాగ్గా గాలితో పాటు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తాడు. అదే మ్యూజిక్ రెండో చరణం మొదలయ్యే ముందు కూడా మళ్ళీ వస్తుంది.
మొదటి చరణంలో మెహక్-గజ్రా, లహక్-కజ్రా అన్న ప్రాసలు అప్రయత్నంగానే కుదిరినట్టు అందంగా అమిరాయి.
మేరీ సాసోం మే - మెహక్ రహా రే - తేరా గజ్రా
(నా ఊపిరిలో నీ మల్లెల వాసనలు అలుముకుంటున్నాయి)
మేరీ రాతోం మే - లహక్ రహా రే - తేరా కజ్రా
(నా రాతిరిలో నీ కాటుకల రంగులద్దుకుంటున్నాయి)
రెండో చరణం మాత్రం కొంచెం వింతగా అనిపించింది -
దేర్ సే - లెహరోం మే - కమల్ సంభాలే హుఏ - మన్ కా
(ఎప్పట్నుంచో నా మనసనే కమలాన్ని అలల మీద నిభాయిస్తున్నాను)
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్సా
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్సా
(జీవన లయలో నీ హంసనైన నేను పరిభ్రమిస్తున్నాను)
ఈ రెండో చరణంలో పై రెండు లైన్లు పాడేటప్పుడు - రిషి కపూర్ - రెండు చేతులు పైకి ఎత్తి తమషాగా కదులుతూ వేసే రెండు చిన్న స్టెప్పులు భలే ఉంటాయి.
మొత్తానికి ఈ పాటలో - హంస - రిషి కపూర్, హంసిని - మౌసమీ ఛటర్జీ.
అది అర్థం కావడానికి బానే టైం పట్టింది నాకు.
ఆ ఊహలో పాట పాడే రిషికపూర్ కోసం గీత రచయిత మజ్రూ సుల్తాన్‌పురి ఊహించుకున్న పేర్లు అవి.
నేను ఈ పాట చిన్నప్పట్నుంచి ఎప్పుడూ విని ఉండకపోయినా - విన్న దగ్గర్నుంచి నన్ను తెగ వెంటాడిన పాట. ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. ఇంకెన్ని సార్లు వింటానో చెప్పలేను!
ఓ హన్సినీ... ! పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=R4Vj_XsfHTM
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!
ఆజా - మేరీ సాసోం మే - మెహక్ రహా రే - తేరా గజ్రా
ఓ... ఆజా - మేరీ రాతోం మే - లహక్ రహా రే - తేరా కజ్రా
ఆజా - మేరీ సాసోం మే - మెహక్ రహా రే - తేరా గజ్రా
ఓ... ఆజా - మేరీ రాతోం మే - లహక్ రహా రే - తేరా కజ్రా
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!
దేర్ సే - లెహరోం మే - కమల్ సంభాలే హుఏ - మన్ కా
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్సా
దేర్ సే - లెహరోం మే - కమల్ సంభాలే హుఏ - మన్ కా
జీవన్ తాల్ మే - భటక్ రహా రే - తేరా హన్సా
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ! కహా ఉడ్ చలీ?!
మేరే అర్మానోం కే - పంఖ్ లగాకే - కహా ఉడ్ చలీ?!
ఓ హన్సినీ.. . !మేరీ హన్సినీ!
********
********
నన్ను వెంటాడిన పాట
నా వెంటే ఉంటానన్న పాట
ఆ పాటని పంచుకుంటూ ..,
పంచిన కబుర్లట - ఇవి ఈ పూట ...
~ పాటల భైరవి
పోస్ట్ చాలా బాగుందండి. నాగరాహవు హిందీలో కూడా తీసారని ఇది చదివాకే తెలిసింది.
రిప్లయితొలగించండిఅవునండి...నాకూ ఆ విషయం హిందీ పాట గురించి వెతుకుతున్నప్పుడు తెలిసింది. నా బ్లాగ్ పోస్ట్‌ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు, నాగేశ్వరరావుగారు!
తొలగించండి