జన్మతః కలిగినదో,
వారసత్వంగా వచ్చినదో,
చదువులలో గమనించినదో,
నా మేలి-సగం సాహచర్యంలో గ్రహించినదో ,
నా పిల్లలని పెంచుతూ నేర్చుకున్నదో -
ఎంతోకొంత - నాదంటూ సొంతబుద్ధి - అంతోఇంతో ఉన్న నేను -
నాకుగా నేను పేర్చుకున్న జీవనసూత్రాలు కొన్ని ఉన్నాయి.
కలిగిన దాంట్లో కలకలలాడుతూ ఉండాలి.
ఉన్నదాంట్లో ఉన్నతంగా ఉండాలి.
పొసగని చోట మసలకుండాలి.
విలువ లేని చోట నిలవకుండాలి.
స్నేహంలో అంతరాలు ఎంచకుండాలి.
భేదం కలిగిన మరి మది తలచకుండాలి.
వీలైనంత వరకూ మంచిని ఎంచుకోవాలి.
కానీ ఇప్పుడు అనుకోకుండా ఇంకో కొత్త పాఠమేదో నేర్చుకోవాలేమో అనిపిస్తోంది.
అదెలాంటిదంటే ...
ఎంచుకోక తప్పకపోతే...
ఎంచుకోవడానికి మంచే లేకపోతే -
ఎంచుకోక ఉండాలంటే మనసొప్పకపోతే -
ఉన్న ఇద్దరు మంచి-కానివాళ్ళలోంచి
ఇంచుక తక్కువ-మంచి-కాని వాళ్ళని
ఎంచుకోవాల్సిందే!
ఒకరిని ఒప్పని, ఒకరిని కాదని
గెలుపోటముల వోటరిని నేనే!
ఎవరు గెలిచినా, ఎవరు తొలగినా
ఓటమిపోటుల ఓటరిని నేనే!
అటు గొయ్యి - ఇటు నుయ్యి
దేంట్లో పడతావో చెప్పమంటే?
అటు చాకు - ఇటు బాకు
ఏదో ఒకటి పొడుచుకొమ్మంటే?
ఇది గరళం - అది హాలాహలం
ఏదో ఒకటి ఎంచుకొమ్మంటే?
అది చచ్చు - ఇది పుచ్చు
ఉన్నవివే పుచ్చుకోమంటే?
ఇటు ట్రంపరి - అటు ట్రంపారి
ఎవరో ఒకర్ని ఎన్నుకోమంటే?
దిగ్గురని, దిమ్మెర పోయి
దిక్కులెన్ని ఉన్నా
ఏ దిక్కూ తోచక
తూరుపు దిక్కుకి తిరిగి
చేతులెత్తి దణ్ణమెట్టుకుంటున్న
చేతకాని, చేవలేని వోటరిని!
ఒడ్డలేని పందెం గెలవలేక
వట్టిపోయిన ఎంపికల ఓటరిని!
వోటరిని నేనే!
ఓటరిని నేనే !

ఇటు ట్రంపరి - అటు ట్రంపారి
రిప్లయితొలగించండిఎవరో ఒకర్ని ఎన్నుకోమంటే?
దిగ్గురని, దిమ్మెర పోయి ..
బమ్మెర కీ, శ్రీనాధు డి కీ మొరపెట్టి?!?
Wonderful post.
దశమ స్కంధంతో మొదలుపెట్టి భాగవతం,దివిజకవివరుల గుండెలను దిగ్గురనిపించిన చాటువులూ చదువుకుంటూ నేర్చుకున్న తెలుగు... లేశ మాత్రపు ౘాలు ఉండకపోదు కదా! వండర్ఫుల్ అన్న మీ వ్యాఖ్యకి వందనాలు :)
తొలగించండిGreat! Really captures the mood of many voters. Add in the end the following:
రిప్లయితొలగించండిఓటమి నాదే
ఓటరికి ఓటమి implied :) Thanks for your comment.
తొలగించండిచాలా బాగుంది.
రిప్లయితొలగించండిఇటు ట్రంపరి - అటు ట్రంపారి అదిరింది.
కిషోర్ గారు! మీరు మెచ్చుకోవడం భలే బావుంది. ధన్యవాదాలు!
తొలగించండి
రిప్లయితొలగించండికలిగిన దాంట్లో కళకళలాడుతూ ఉండాలి.
కలకలలాడుతూ అంటే నవ్వుతూ ఉండడం అనే అర్థంలో వాడానండి, నీహారికా! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!
తొలగించండిఅర్ధం గురించి కాదు నా వ్యాఖ్య, కలకల అని వ్రాయాలా కళకళ అని వ్రాయాలా అని సందేహం.
తొలగించండికళ అనేది కాంతికి సంబంధించిన పర్యాయ పదం.కనక కళకళలాడుతూ ఉండటం అంటే మొహం వెలిగిపోయే అందం అని అర్ధం.అది అప్పటికప్పుడు వచ్చే నవ్వు వల్ల కావచ్చు,సుదీర్ఘ కాలపు ఆనందం వల్ల కూడా రావచ్చు.కాబట్టి, కళకళలాడుతూ ఉండటం అనది ఎక్కువ కాలం పాటు ఉండే నెమ్మదైన వెలుగుకూ కలకలలాడటం అనేది అప్పుడప్పుడు పొటమరించే నవ్వులకూ వాడటం విధాయకం!
తొలగించండిఅద్దరి ఇద్దరూ ఇద్దరే!
రిప్లయితొలగించండిఇద్దరి అందరూ అందరే!
అద్దరైనా, ఇద్దరైనా
అందరివారనేవారు అందనివారే!