మామూలుగా ఏ జలుబో, దగ్గో వచ్చి - మూలుగుతూ మందివ్వండి అని వెళ్తే - ఆ మూలుగుకి హీలుగా anti-biotics ఇస్తూ - కన్నడ దేశాన్నుంచొచ్చి - ఈ సిరిమిన్నల దేశంలో స్థిరపడ్డ మామంచి*-డాక్టర్ చంద్ర శేఖర్‌గారు ఇచ్చే dosage ఎలా ఉంటుందంటే - మొదటి నాలుగు రోజులు నాలుగు చొప్పున, తర్వాతి నాలుగు రోజులు ఒకటి చొప్పున.
(*మామంచి=మహా-మంచి మరియు మా-మంచి)
నాకు గత ఆరున్నొక్క వారాలుగా తానా కబుర్లు రాస్తూ ఉంటే - బోల్డంత సేపు రైల్లో ప్రయాణం చేసింతర్వాత - దిగాక్కూడా - ఇంకా అటూ ఇటూ ఊగుతున్నట్టనిపిస్తుందీ - అలా - ఇంకా తానా సంబరాల్లోనే ఉన్నట్టు, ఇంటికి రానట్టు అనిపించేస్తోంది. తెగ బెంగొచ్చేస్తోంది.
అందుకే తానా-కబుర్లు వరసగా చానా రాసేశాను కదా - ఇంకిప్పట్నుంచీ నెలకొకటి రాద్దామని - మా డాక్టరుగారి మోడులో, మోతాదులో
ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు బోల్డున్నాయి కానీ - తానా-కబుర్లకి తాత్కాలిక విరామం - ఎందుకంటే నాక్కొంచెం మామూలు కబుర్లు చెప్పేసుకుని రిఫ్రెష్ అవాలనివుంది.
అంతే - అంతకంటే మరేం లేదు.
తాత్కాలిక-తానా-వైరాగ్యం అన్నమాట.
తినగ తినగ వేము తీపి కానీ, అనగ అనగ ఒకే-కబుర్లు ఓకే కాదు మరి.
మర్చిపోయినవి ఎలాగూ మర్చిపోతాను - నాకు గుర్తుండాల్సినవే గుర్తుంటాయి - విన్నప్పుడైనా - విన్న ఆర్నెల్లకైనా.
అందుకని ఏదో సమాచార-loss ఉంటుందని అనుకోను.
ఇవాళ రాసినా - ఇంకో నెల తర్వాత రాసినా అవే కబుర్లు. అదీ నా ధైర్యం.
అసలు నిజం చెప్పాలంటే మొదట్లో నా కబుర్లెప్పుడూ extemporeగా రాసినవే తప్ప - ఏదో అనుకునీ, అనాలకునుకునీ - రాసేవీ - రాసినవీ కాదు.
అలాంటిదీమధ్య అనుకోకుండానే తెగ studiousగా - నా బుద్ధికి విరుద్ధమైనదేదో చేసేస్తున్న ఫీలింగ్.
ఏదో ఒక టాపిక్ లేకుండా ఫ్రీగా, కేర్-ఫ్రీగా, టాపిక్-ఫ్రీగా రాసినట్లు గానీ , ఏ విషయమూ లేకుండా అసలు విషయమే కాని విషయమే రాసినట్టు గుర్తు లేదు.
అందుకే మళ్ళీ నా గాలి-కబుర్ల mode లోకి వచ్చేశాను - సరదా కబుర్లు ఇవీ అంటూ - ఈ పోస్టుతో - ఒక్క కీ పోటుతో.
సరే! ముందుగా మున్ముందుగా ఓ బుల్లి వివరణ - ఈ పోస్టు పేరు గురించి.
ఆ కబురు ... ఈ కబురు ... ఓ కోతి కబురు ... అనగానేమి ?
ఆ కబురు - ఆపేసిన తానా-కబురు.
ఈ కబురు - ఈనాటి సరదా కబురు
ఓ కోతి కబురు - చదివిస్తాగా ...ఉందురూ!
అనగనగా ఓ బెద్ద-మామయ్య.
ఆ బెద్ద-మామయ్యకి ఓ బుల్లి మేనల్లుడు - బుజ్జి-బాబు.
రెండార్ల వయసువాడు - ఆరున్నొక్క క్లాసువాడు.
వాడే ఈనాటి కబుర్ల హీరో.
బెద్ద-మామయ్యకి వారం వారం టెలి-తీగల మీద భూమికి ఆవల ఉన్న చెల్లితో - అదే మన హీరో తల్లితో - మాట్లాడకపోతే, ఆ చెల్లి నవ్వుల రవ్వలు తీగల మాటున రాగాలై వినిపించకపోతే అస్సలంటే అస్సలు తోచదు - ఇది సిసలైన కబురు.
ఓ రోజలా కబుర్లాడుదామని టెలి-మీటలు నొక్కి పలకరించబోయేవేళ - బుజ్జి-బాబు ఎత్తాడు ఫోను.
"హలో మామయ్యా!'
"బుజ్జి-బాబూ! బావున్నావా? ఏం చేస్తున్నావు అమ్మేం చేస్తోంది?"
"బావున్నాను మామయ్యా! మరి మామయ్యా! బయట కోతులు వచ్చాయి. అందుకే అమ్మ అటు కొట్టడానికి వెళ్ళింది "
"అమ్మో! అవునా! నువ్వూ కొడతావా కోతుల్ని?"
"అవును మామయ్యా! ఒక స్టిక్కు తీసుకుని కొడతాను"
"అరె! అలా ఎవరైనా కోతుల్ని కర్రతో కొడతారా?"
"మరెలా కొట్టాలి, మామయ్యా?"
"కొబ్బరికాయతో. మరీ ... కోతి అంటే ఆంజనేయస్వామి కదా - గుళ్ళో ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొడతాం కదా - మరి కోతికీ అంతే - కొబ్బరికాయ కొట్టాలి"
"ఆంజనేయస్వామి సగం మనిషి - సగం కోతి కదా, మామయ్యా! ఇదేమో పూర్తి కోతి - తేడా వుంది కదా?!"
"సగం-కోతికన్నా పూర్తి-కోతి ఇంకా గొప్పకదా! ఇంకా ఎక్కువ గౌరవించాలి"
"అవును మామయ్యా!నాకూ అప్పుడప్పుడు డౌటు వస్తూ ఉంటుంది"
"ఏంటా డౌటు?"
"మనుషులు కోతి నుంచి పుట్టారని చెప్తారు కదా? అసలెలా పుట్టారూ అని?"
"భలే ఉందిరా ఇది? ఎవరు చెప్పారు నీకిది? మనిషి కోతి నుంచి వచ్చాడా? నాకు తెలీనే తెలీదే!"
"అవును మామయ్యా! మా స్కూల్లో చెప్పారు - పుస్తకాల్లో కూడా రాశారు"
"అలా అయితే మనకి ancestor కోతి కదా - మనింట్లో ఓ కోతి ఫోటో కూడా పెట్టుకోవాలేమో కదా?!"
"హహ్హహా ... హహ్హహా"
"నవ్వొచ్చేస్తోందా నీకు ? భలే. మరిది చెప్పు - మనం కోతి నుంచి పుడితే మరి తోకేమయ్యింది?"
"డెవలప్ అయ్యాం కదా, మామయ్యా! అందుకే తోక పోయింది"
" డెవలప్ అయితే తోక బో... ల్డంత పొడుగవ్వాలి - కానీ - మాయమై పోతుందేంటి?"
"డెవలప్ అంటే ఛేంజ్ మామయ్యా! అందుకే మరి తోక తగ్గిపోయి తగ్గిపోయి మాయమై పోయింది"
"ఓహో - డెవలప్ అంటే ఛేంజా - ఇది కూడా తెలీదురా నాకు - నీకు చాలా విషయాలు తెలుసే! ఇంతకీ నువ్వు మీ అమ్మకి చెప్పావా నువ్వు కోతికి పుట్టావని?"
"హహ్హహా ... హహ్హహా"
"అవునూ - కోతి నుంచి పుట్టాం అని చెప్పావు కదా - అందుకేనేమో ఒక్కోసారి మనం చేసే అల్లరి చూసి తే "కోతి వేషాలు వెయ్యకు" అని కోప్పడతారు - కదా ?"
"అవును మామయ్యా! కానీ అలా తిట్టేవాళ్ళు కూడా కోతులే కదా - ఎందుకంటే కోతులే కోతులతో మాట్లాడగలవు కదా?! అందరం కోతుల్లోంచే వచ్చాము కదా?!
"మంచి డౌటేరోయ్! నాకు తట్టనే లేదు - అందుకేనేమో కదా - మనం గోడలెక్కి ఆడుకుంటామూ, చెట్లెక్కుతామూ"
"అవును - మామయ్యా!"
"అవున్రా - నువ్వెప్పుడైనా చెట్లెక్కావా? నీకు చెట్లెక్కడం వచ్చా?"
"లేదు మామయ్యా "
"నాకూ చెట్లెక్కడం రాదురోయ్ - నీపోలికే వచ్చినట్టుంది నాకు - కానీ... మీ అత్త చెట్లెక్కేది తెలుసా?!"
అప్పుడెప్పుడో - సెలవులకి వచ్చినప్పుడు - లేపాక్షి గుడిలో - చెంగుమని చెట్టెక్కిన అత్తరూపు కళ్ళ ముందు వెలిగి - బుజ్జి-బాబు నోట పెటేల్మన్న నవ్వు - బెద్ద-మామయ్య పక్కనే నించుని కోతి-కబుర్లు విటున్న అత్త పెదవుల మీద పకాల్మంది. ఎండాకాలపు పగటిలో పండు వెన్నెలయ్యింది.
Nice one nijam ga refreshing aa undi kothi kaburu.
రిప్లయితొలగించండిThanks, Sarada!
తొలగించండి