10, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1

అప్పటిదాకా పెళ్లిపందిరిలా కిలకిలమంటూ కళకళలాడిన మా నూటముప్పైరెండో గది - ఒక్కసారిగా - రైలెళ్ళిపోయింతర్వాత ఖాళీ అయిన ప్లాటుఫారంలా వెలవెలబోయింది.

వెనక్కి తిరిగి ఎవరున్నారో, ఎవరు లేరో చూడడానికి కూడా మొహమాటం వేసింది.

వేదికమీద తదుపరి కార్యక్రమానికి ఒక్కరొక్కరుగా చేరుతున్న- తానా-అతిధులైన - వారి వారి రంగాల్లో తమదంటూ ముద్ర వేసుకున్న వక్తలని చూస్తూ - వారి కనులకి బోల్డన్ని శ్రోతలుగా కనిపించి ప్రోత్సహించగలిగేలా - నేను ఇంకొన్ని పెక్కు-నేనులుగా మారగలిగే విద్య ఏమన్నా నాకు తెలిస్తే బాగుండుననుకున్నాను.

అసలే అంతకు ముందు జరిగిన బహుళ-జనాదరణ-సంప్రాప్తిత-సాహిత్య కార్యక్రమం మొదలు-ముగింపు రెండూ ఆలశ్యం అవడంతో ఈ సాహిత్య - ప్రక్రియల-ప్రసంగాల కార్యక్రమం  - వక్తలకి, వారికి లభించబోయే సమయానికి - విలోమానుపాతంలో మొదలయింది. 



ఏదైతేనేం - డాక్టర్ చందు సుబ్బారావుగారి అధ్యక్షతన నేటి సాహిత్యం - తీరుతెన్నులు అనే సాహితీ ప్రసంగాల కార్యక్రమం మొదలయింది.


ఆయన ఖంగుమంటున్న గొంతుతో అధ్యక్షోపన్యాసం మొదలు పెట్టి - "ఇంతకుముందు ఇక్కడ మాట్లాడి వెళ్ళినవారు వారివారి వృత్తుల్లో పదిశాతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి మాటలు విని అబ్బో - మన తెలుగు బతికేస్తుంది అనుకోవడానికి లేదు. నేటి సాహిత్యం అని తెలుగు గురించి  మాట్లాడుకోవడానికి మిగిలిందేమీ లేదు. ఇంక మనమంతా నిన్నటి సాహిత్యం గురించే మాట్లాడుకోవాలి" - అంటూ మాట్లాడుతుంటే -  నాకనిపించి, నేననుకున్న మాట - "పెద్దాయనకి కోపం వచ్చింది".  కానీ అది ధర్మాగ్రహమే అనిపించింది కూడా.

దాదాపు నూటయాభై మంది సౌకర్యంగా కూర్చోగలిగిన మా నూటముప్పైరెండులో - అందులో పదిశాతం మంది మాత్రమే - అక్కడక్కడా - ఖాళీ కుర్చీల దారంలో గుచ్చిన పూలలా కనిపిస్తుంటే - తానా - అనగా తెలుగు ఎసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా - ఒక విరోధాభాసాలంకారమే (oxymoron) సుమీ - అనింకొక్కసారి అనిపించింది.

వాసిరెడ్డి నవీన్‌గారి - మారుతున్న కథా వస్తువు: 

మొదటగా వాసిరెడ్డి నవీన్‌గారు కథ గురించి, కథల్లో మారుతున్న వస్తువు గురించీ మాట్లాడారు. పూర్తిగా ఆయన మాట్లాడినది - విన్నది - వున్నట్లుగా - అంతా చెప్పలేకపోతానేమో - కానీ ఆయన ప్రసంగ సారాంశం ఇది:

"ఉరుముల పిడుగుల వానలాంటి చందు మాటలు విన్నాం - చందు సుబారావుగారిని ప్రేమగా చందు అని పిలుస్తాము. భావజాలాల్లో ఒకదానికి, వేరొకదానికీ జరిగే సంఘర్షణే చందు ఆవేదన. తన బాధంతా సాహిత్యానికి విలువైన స్థానం లేదని. 

మానవ, సామాజిక ఆర్ధిక సంబంధాలు మారితే విలువలూ మారతాయి. వాటి ఆధారంగా రాసే సాహిత్యమూ మారుతుంది. తెలుగు సాహిత్యపు పరిస్థితి అంత నిరాశాజనకంగా లేదు కానీ మేలుకోకపోతే చచ్చిపోతుంది. ఒకటే ఆశ ఏంటంటే పల్లెల్లో ప్రజల నాలుకల మీద వున్నంతకాలం తెలుగు ఎక్కడికీ పోదు. 

కథ తనకున్న పరిధిలో ఒక సంఘటన గురించి  "ఎందుకు, ఏమని, ఎలా" అనే ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.  

నేను కథల మీద పనిచేస్తాను కానీ కథా రచయితనని చెప్పుకోలేను. 

గురజాడ కాలంలో మొదలైన కథలు ఎప్పటికప్పుడు ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులని ప్రతిబింబిస్తూ తదనుగుణంగా మారుతూ వచ్చాయి. 

గురజాడ దిద్దుబాటు కథలో స్త్రీ విద్య వస్తువైతే, కందుకూరి వీరేశలింగంగారి కాలంలో, ఆ తర్వాత వచ్సిన కథల్లో  వితంతు వివాహం ప్రధాన వస్తువయింది. అటుపైన స్త్రీల పక్షాన గొంతు వినిపించిన చెలం కథలు, ఇటీవల గ్లోబలైజేషన్ అంశంగా రాస్తున్నపెద్దింటి అశోక్‌కుమార్, కుప్పిలి పద్మ, ఖదీర్‌బాబు కథలు - ఇవీ క్రమంగా మార్పు చెందిన కథా రూపానికి ఆనవాళ్లు. 

<<<ప్రసంగం మధ్యలో కొత్తపాళీ - నారాయణస్వామిగారి టైం చెక్ - సమయం తక్కువుంది - ఇంకా మాట్లాడాల్సిన వక్తలున్నారు అని. >>>

వైయక్తిక జీవితానికి, మానసిక పరిస్థితికి సంబంధించిన ఘర్షణ, సంఘర్షణే కథ, కథకి వస్తువు. 

ఇటీవల సత్యవతి గారి స్త్రీవాద కథ ఒకటి చదివాను.  సూపర్ మామ్ సిండ్రోమ్ అని. ఒక చనిపోయిన స్త్రీ తెల్లగా సున్నంలా మారిపోతుంది. డాక్టర్లు పరిశోధించి - రకరకాల పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్లు - బిళ్ళలు మింగి తానే బిళ్ళగా మారిపోయింది అని చెప్తారు. ఇది అధివాస్తవిక కథ. ఇలాంటి కథల్లో సంక్లిష్టత, అస్పష్టత ఉంటాయి. 

మొన్నొక రోజు ఎవరిదో ఒక కథ చదివి రాసినతన్ని అడిగాను - ఈ కథ అర్థం కాలేదు - మీరేం చెప్పదలచుకున్నారు అని. వెంటనే అతను "మీకో, ఇంకెవరికో అర్థమయ్యేట్లు నేనెందుకు రాయాలి? నేనెందుకు రాశానో నాకే తెలీదు. నా ఘర్షణ చెప్పాలనుకున్నాను. రాశాను" అన్నాడు. 

ఒక మాటలో చెప్పాలంటే కథలకిది సంధికాలం. ఆలోచనల్లో స్పష్టత రావాలి - వస్తుంది. కథ స్వరూపం మారుతుంది. 

 - అంటూ నవీన్‌గారుమారుతున్న కథావస్తువు గురించి తమ ప్రసంగం ముగించారు.

చందు సుబ్బారావుగారు గారు - వాసిరెడ్డి నవీన్‌గార్ని లివింగ్ లైబ్రరీ ఆఫ్ AP అని ప్రశంసిస్తూ - తాము చదివిన మళ్ళెప్పుడొస్తావక్కా అనే కథ గురించి ఇలా చెప్పారు:

విశాఖలో అంధబాలికల పాఠశాలకి గీతమ్స్ కాలేజ్‌లో పని చేసే ఒకావిడ వచ్చి చనిపోయిన వాళ్ళ అబ్బాయి జ్ఞాపకంగా బట్టలు, స్వీట్స్ పంచుతానంటుంది. అప్పుడు అక్కడ వున్న అంధబాలికల్లో ఒక పిల్ల - మాకు స్వీట్స్ వద్దక్కా - అంటూ ఆవిడ చెవిలో - వ్యక్తురాళ్ళైన ఆడపిల్లలకికావలసిన వస్తువులు కావాలని చెప్తుంది. ఆవిడ అలాగే వాళ్ళకవసరమైనవి కొని తెచ్చిస్తే అవి చూసి వార్డెన్ - ఎవరిచ్చారు - అనడుగుతుంది. మొన్నొచ్చిన అక్క ఇచ్చిందని ఆ పిల్లలు చెప్తే - వార్డెన్ ఆ ఇచ్చినావిడని ఇంకెప్పుడూ రావద్దని చెప్తుంది. అలా వెళ్ళిపోతున్న ఆవిణ్ణి ఆ అంధబాలికలు " మళ్ళెప్పుడొస్తావక్కా" అనడగడం - ఇదీ కథ 

ఈ కథని ఏ పత్రికల వాళ్ళూ వేసుకోలేదు. 

ఈ కథ కళ్ళు లేని ఆడపిల్ల పెద్దదయే కష్టం కథ. ఇలాంటి కథలు రాయాలి. 

విషయం చిన్నదైతే ఇలా కథ - అదే పెద్దదైతే నవల. 

ఇప్పుడలాంటి నవల గురించి సాయిబ్రహ్మానందం గొర్తి గారు మాట్లాడతారు -

- అంటూ తర్వాతి వక్త సాయిబ్రహ్మానందం గొర్తి గారిని నవల గురించి మాట్లాడమని ఆహ్వానించారు.

సాయిబ్రహ్మానందం గొర్తి గారి - ఇటీవలి నవల:

సాయిబ్రహ్మానందంగారు తన మృదుసామగ్రి అయిన లాప్‌టాప్ తెచ్చుకున్నారు కానీ చెవులప్పగించాల్సిన చోట కళ్లప్పగిస్తామేమో అని ప్రొజెకర్లేవీ మేము అమర్చలేదేమో - పాపం - లాప్‌టాప్‌ని మాట్లాడే మైక్ దగ్గరే పెట్టుకుని  కొంచెం ఇబ్బంది పడుతూనే ప్రసంగించారు.

ఆయన చెప్పిన మాటలు -నాగ్గుర్తున్నంతవరకూ ఇవి -

"నేను కొన్ని కథలు, రెండు నవలలు రాశాను. 

నవల అనేది విస్తృతమైన వస్తువు. నాకు కేటాయించిన పదిహేను నిముషాల్లో - ఇటీవల నవలల్లో వచ్చిన మార్పులు, నా పరిశీలన - సాధ్యమైనంత వరకూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. 

ప్రపంచ సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. అందులో నవలది పెద్ద స్థానం. 

సాహిత్యం జీవితం నుంచి పుడుతుంది. కథ ఒక సంఘటన అయితే  నవల  జ్ఞాపకాలని గుదిగుచ్చి చూపిస్తుంది. మనిషి జీవితానికి దగ్గరగా వుండే వస్తువు. 

నవల పాశ్చాత్య ప్రక్రియ. నావెల్ అనే మాటలోంచి నవల వచ్చింది.

తెలుగులో వేల నవలలు వున్నాయి. ఏ కాలపు నవలది  ఆ కాలపు ఆలోచన. ఇప్పుడు నవల తీరు మారింది. స్త్రీవాద నవలలు వచ్చాయి - ఇవి వెస్టర్న్ టైప్. ఆలోచనల నవలలు - యండమూరివి ఈ తరహాలో ఉంటాయి. 

సాంకేతిక ప్రగతి వచ్చాక నవలలు తగ్గాయి - పత్రికలు తగ్గాయి - పాఠకులు తగ్గారు. నవలలకి పబ్లిషర్స్ లేరు. USలో నవలలు చాలా ముఖ్యమైనవి. USలో 30-40 శాతం సినిమాలు నవలల ఆధారంగా తీస్తారు. మన తెలుగు సినిమాలెలాగూ వెస్టర్న్ సినిమాలకి కాపీలు కాబట్టి నవలల అవసరం లేదు. 

ఇటీవల వచ్చిన - నేను చదివిన - కొన్ని మంచి నవలలు: వి. చంద్రశేఖర్ రాసిన నల్ల మిరియం చెట్టు, నక్కా విజయరామారావు - నాగమ్మ కథ, నామిని - మూలింటామె, కల్పనా రెంటాల - తన్హాయి.  

<<<మళ్ళీ ఇంకొక్కసారి  కొత్తపాళీ - నారాయణస్వామి గారి టైం చెక్  - ఈ టైం చెక్కులెలా గుర్తున్నాయీ అంటే - అసలు సమయం లేదు అని ఒక్కొక్క వక్తకీ పది-పదిహేను నిముషాలు కేటాయించినప్పుడు అసలింతమందికి  ఆ పది-పదిహేను నిముషాలైనా అందుతాయో లేదో పాపం అంత దూరం నుంచి వచ్చారు అని నాలో నేనే అనుకునేవేళ  నారాయణస్వామిగారు టైం చెక్ చేయడం - దాన్ని పైకి బిగ్గరగా అనడం నాకు నిజంగా నచ్చింది - గుర్తు పెట్టుకున్నాను కనుక :) >>> 

నిన్న సంజనాపద్మం మాట్లాడుతూ 2000 పేజీల నవల రాస్తున్నాను అనగానే సంతోషించాను. 

కలకత్తాలో ఒక ఇండియన్ అబ్బాయి అనాధగా తిరుగుతూ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటుండగా ఒక ఆస్ట్రేలియన్ కుటుంబం అతన్నిఅడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర పెరిగి పెద్దయిన తరవాత ఆ అబ్బాయి తన మూలాల్ని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు. ఆ అనుభవాలన్నింటినీ ఒక నవలగా రాస్తే 30 భాషల్లోకి అనువదించారు. దాన్ని Lion అనే సినిమాగా తీస్తే ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. 

మనుషుల జీవితాన్ని పట్టి చూపుతుంది నవల అనడానికి ఇది మంచి ఉదాహరణ -

- అంటూ తన ప్రసంగాన్ని ముగించారు సాయిబ్రహ్మానందం గారు.

-------------------------------------------------------------------------------------------------------------------

అసలు ఈ ప్రసంగాలు వీడియో రికార్డ్ చేద్దాం - మా ఇంట్లోంచి వీడియో cam తీసుకెళ్లి అన్న ఐడియా చాలా ఆలస్యంగా వచ్చినందుకు నన్ను నేనే బోల్డంత "హన్నా!" అనేసుకున్నాను.

ఈ ప్రసంగాల విశేషాలన్నీ పైపైన రాసేద్దామనుకున్నాను కానీ మనసొప్పలేదు.

రాయడం మొదలు పెట్టేదాకా తెలియలేదు - నేను రాయాలనుకున్నదీ, రాయాల్సిందీ ఎంత ఉందో!

నేను విన్నదంతా నా ఆత్మీయులైన మీతో  - నాతో పాటు మీరూ వినివుంటే బాగుండును అనుకుని - అలా జరగలేదు కాబట్టి గుర్తున్నంతవరకూ నేను విన్న మంచి కబుర్లు మీతో చెప్పేసుకోవాలని - ఈ తానా-కబుర్ల సిరీస్ మొదలుపెట్టాను.

చివరికి నేననుకున్నట్టే - నా తానా-సిరీస్ మెమెంటో సినిమా లాగే ముందుకీ వెనక్కీ - నడుస్తోంది.

మే 28 మధ్యాహ్నపు కార్యక్రమ విశేషాలు ఒక పోస్టులో వచ్చేస్తాయి అనుకున్నాను కానీ - రెండు మూడు భాగాలు అయ్యేలా వున్నాయి.

కబుర్లు మొదలు పెట్టడానికి స్టార్టింగ్ ట్రబుల్ 
మొదలుపెట్టాక ఆపడానికి స్టాపింగ్ ట్రబుల్ 
- వెరసి డబుల్-ట్రబుల్ :)
ఒకటి ముందో - ఇంకోటి వెనకో 
అపేక్షకో - ఆక్షేపణ లేకో 
మీ కాలక్షేపానికో  
తప్పక - కొనసాగిస్తాను కబుర్లు 
Stay Tuned !

17 కామెంట్‌లు:

  1. Very nice summary of our guests' presentations! I am looking forward to see other postings. I missed couple of talks during our first session when I attended Gogineni Babu's keynote speech.

    రిప్లయితొలగించండి
  2. This is a good summary. I missed many of the talks. Thanks for putting this in the blog.

    రిప్లయితొలగించండి
  3. వర్ణన చాలా బాగుంది. కార్యక్రమాన్ని చూడలేకపొయిన వాళ్ళు, చూసే విధంగా రాశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా తానా సిరీస్ చదువుతున్నందుకు ధన్యవాదాలు, వెంకట్‌గారు!

      తొలగించండి
  4. లలితా! నీ బోల్డన్ని కబుర్ల స్టార్టింగ్ ట్రబుల్ విలోమానుపాతంలో, స్టాపింగ్ ట్రబుల్ అనులోమానుపాతం లో ఇలాగే కొనసాగాలి.
    సాహిత్య గోష్టిల సమీక్ష కూడా ఇంత సరదా సరదాగా, ఇంట్రెస్టింగ్ గా రాయడం నీకే సాధ్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంతలా క్రమం తప్పకుండా నా రాతల్ని మెచ్చుకుంటూ కమెంట్ పెట్టడం నీకే సాధ్యం :)

      తొలగించండి
  5. నేను ఎప్పుడూ తానా సభలకి వెళ్ళను. మరి అదేంటో కానీ ఈసారి వెళ్దాం అనుకుంటే నేను వస్తానేమో అనుకున్నారేమో మరి, మే లోనే పెట్టేసారు :). జులై లో అయితే తప్పకుండా వచ్చేదాన్ని. మీ ఆతిథ్యం కూడా తీసుకునేదాన్ని. అయినా అన్నీ కళ్లకికట్టినట్లు మీరు వ్రాస్తుంటే తానా కి వెళ్ళలేదు అన్న బాధ లేదు లెండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తానా కబుర్లు మీకు నచ్చుతున్నందుకు సంతోషంగా వుంది, చంద్రికా!

      తొలగించండి
  6. కొన్నేళ్ల క్రితం మొదటిసారి, చివరి సారి వాషింగ్టన్ డీసీలో తానా సభలకెళ్ళాను. మేడసాని మోహన్ గారి అష్టావధానానికి వెళ్లి చూస్తే, మీరు చెప్పినట్టే స్టేజి మీద ప్రేక్షకుల కంటే ఎక్కువమంది ఉన్నారు. మీ తానా ఆక్సీమోరోన్ అన్న జంట పదాలు సరైనవే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓహ్! ఆ జనాభావ-తానానుభవం మీకూ అయిందన్నమాట :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, అన్యగామిగారు!

      తొలగించండి
  7. సాహిత్యచర్చలకు ఇద్దరుముగ్గురు సినిమావాళ్ళను కూడా స్టేజ్ మీద కూర్చోబెడితే సరి, ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరగచ్చు 😀.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహారావుగారు: ఆ విశేషాలూ వున్నాయండి :)

      తొలగించండి
    2. ప్రేక్షకులు పెరుగుతారు, అమ్మగారికి, అయ్యగారికి జై జైలతో అక్కడ సాహిత్యచర్చ ఏమి ఉండదు

      తొలగించండి
  8. మీరు వీడియో రికార్డింగ్ చేశారో లేదో గాని మీ జ్ఞాపకశక్తి మట్టుకు అద్భుతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాదంతా మెమొరీ-రికార్డింగే నండి :) ధన్యవాదాలు - మీ ప్రశంసకి.

      తొలగించండి