26, జూన్ 2024, బుధవారం

ఈ ఏటికి హాల్లో సినిమావలోకానికో చెల్లుచీటీ...అను చలనచిత్రోపాఖ్యానం-2024 AD

    2024 AD - మొదలై రెండు మూళ్లు ఆరు నెలలు పూర్తవుతూ వున్నాయి ఇంకో మూడు రోజుల్లో. 

    ఇప్పటికి ముత్యంగా మూడు సినిమాలు థియేటర్లో చూశాం. 

    ఇహ ఈ ఏడాదికి హాలుకెళ్లి సినిమా చూడద్దు బాబూ అనుకుని సినిమాలకో  చెల్లుచీటీ ఇచ్చుకున్నాం. 

    ఆ ఖబరే ఇవాళ్టి కబుర్లు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ ఏడాదికి హాలులో చూసిన మొట్టమొదటి సినిమా టిల్లు స్క్వేర్.  

    ఆ టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డకి ఎవరు పెట్టారో కానీ Star Boy అనే పేరు  -   "టిల్లు స్క్వేర్" సినిమా చూస్తున్నంత సేపూ "ఈ   సిద్ధు  స్టార్ బోయ్ కాదు చాలా స్మార్ట్-బోయ్" అనిపించాడు. 

    చాలా తెలివిగా - "డీజే టిల్లు" లో బావున్నాయి అనిపించిన సీన్లని పట్టుకొచ్చి "టిల్లు స్క్వేర్" లో అక్కడక్కడా పేర్చేశాడు. 

    దాంతో అంతకు ముందు "డీజే టిల్లు" చూసిన వాళ్లకి  తలా-తోకా లేని "టిల్లు స్క్వేర్" సినిమా బావుందేమో అని డౌటొచ్చేస్తుంది. 

    "డీజే టిల్లు" చూడని వాళ్ళకెలాగూ అందులో మిస్సైన ఆ కొన్ని సీన్లూ "టిల్లు స్క్వేర్" లో కనిపించడంతో ఇదేదో బానే వుందే అనిపిస్తుంది. 

    అంతే ! అంతకు మించి ఇంకేం లేదు. 




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    థియేటర్‌కి వెళ్లిన రెండో సినిమా "ప్రసన్న వదనం". 

    సుహాస్ హీరో. 

    కొత్త కథ. 

     తన మొహం తనకే తెలియని హీరో. 

    జుట్టుకి రంగేసుకుంటేనే స్నేహితులని గుర్తు పడతాడు. 

    సినిమా చివర్లో జుట్టుకి ఒకేలాంటి రంగేసుకున్న ఇద్దరమ్మాయిల్లో తన హీరోయిన్ ఎవరో కనుక్కోవడానికి తంటాలు పడతాడు. 

    సినిమా చాలా బావుంది. 

    కానీ థియేటర్లో పట్టుమని పది మంది కూడా లేరు. 

    ఈ సినిమా చూసి బయటికి రాగానే బద్రి, నేను ఏమనుకున్నామంటే ... "ఇంత కొత్త concepts తో సినిమాలు తీస్తున్నారు ఈ కొత్త దర్శకులు. ఇదే మలయాళంలో తీసి dub చేస్తే గొప్ప సినిమా అని పొగుడుతారు కానీ మన తెలుగు సినిమా అయేటప్పటికి ఎవరో స్టార్ హీరో వుంటే తప్ప థియేటర్లో చూడ్డానికి రారు. ఇప్పట్నుంచి మనిద్దరం చిన్న హీరోల సినిమాలు థియేటర్లోనే చూద్దాం" అని. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ప్రసన్న వదనం" చూసిన ప్రసన్న హృదయంతో వెళ్లిన మూడో సినిమా "గం గం గణేశ". 

    తమ్ముడు దేవరకొండ హీరో. 

    సినిమా మొదలవుతూనే ఓ చిన్న అనుమానం - మనం రావల్సిన సినిమాకే వచ్చామా - లేకపోతే పొరపాట్న వేరే దానికి వచ్చామా - అని! 

    సినిమా మొదలైన పది  నిముషాలకి  ఇన్నేళ్ల నా సినీ-వీక్షణ-కాలంలో మొట్టమొదటి సారిగా - నాకు తెలియకుండా నిద్రపోయా. 

    ఓ అరగంట తరవాత నిమెలకువ వచ్చింది. 

    నేనెప్పుడు లేస్తానా అని ఎదురు చూస్తున్న బద్రి నేను కళ్ళు తెరవడం చూసి "బుజ్జాయ్! ఇంటికి వెళ్లి పోదామా?" అనడిగారు. 

    అమ్మో ! ఇప్పుడు ఇంటికెళ్ళిపోతే ఇంకేమన్నా వుందా? 

    ఏం జరిగి వుంటుందా అని మళ్ళీ ఏ OTT లోనో వెతుక్కుని మరీ చూస్తాం. మళ్ళీ అదో time waste - ఇంకో తలనొప్పి. 

    ఆ మిగిలిన కొంచెం సినిమా కూడా ఎలాగో ఓపిక పట్టి చూసేస్తే - ఇప్పటిది సరి అనుకుని - "ఉహూ! వద్దు. చూసేద్దాం." అన్నాను.  

    మొత్తానికి "గం గం గణేశ" చూసి బయటికి వచ్చి కారెక్కగానే బద్రి అన్న మొట్టమొదటి మాటలు "ఈ ఏడాదికి ఇక థియేటర్లో సినిమాలకి రావద్దు. చాలు". 

    అంత కన్నా ఇంకొక్క మాట చూసిన సినిమా గురించి మాట్లాడుకున్నా అది ఎక్కువే అనుకున్నాం. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఏప్రిల్  నెలలో "టిల్లు స్క్వేర్" చూసి రాగానే రాసుకున్న ఓ పుంజీడు కబుర్లు అప్పుడు పోస్ట్ చేయడానికి కుదరలేదు. రాసినంత వరకు చాల్లే అనుకుని అలాగే వదిలేశాను.  అవిప్పుడు ఈ కింద పోస్ట్ చేశాను. 

 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

"టిల్లు స్క్వేర్"  అనబడు ఓ ఎంటర్టెయిన్మెంటు టిల్లర్ 


    పుష్ప, కాంతారా సినిమాలకి తరువాయి భాగాలు వస్తాయని తెలిసినప్పుడు అవి తప్పకుండా థియేటర్లో చూడాలని గట్టిగా అనుకున్నా. 

    అవి రెండూ కూడా అప్పుడొస్తాయి, ఇప్పుడొస్తాయి అని వింటుండగానే "టిల్లు స్క్వేర్" అనే ఇంకో టిల్లు-సినిమా మార్చ్ 29 న వస్తోందని తెలియగానే నాకు అంతకు ముందు చూసిన డీజే టిల్లు సినిమా గుర్తొచ్చింది. 

    ఆ  సినిమా బద్రీకి, నాకు బాగా నచ్చింది కూడా. అది చూసిన ఉత్సాహంలో రాసుకున్న బ్లాగ్ కబుర్లు గుర్తుకొచ్చాయి. 


    ఈలోగా టిల్లు స్క్వేర్ సినిమా మా వూళ్ళో వున్న థియేటర్కి వచ్చేసిందని తెలిసింది. నాకు చూస్తే బావుండుననిపించింది. 

    ఏదైనా సినిమా చూసే ముందు ఆ సినిమాకి సంబంధించిన రివ్యూలు చదవను, వినను. 

    సినిమా చూస్తే నాదైన fresh view తో చూడడమే నాకిష్టం. ఈ "టిల్లు స్క్వేర్" కూడా అలాగే చూశాను. 

    ఆ సినిమా చూడడానికి ముందు ఏం జరిగిందో, చూసేటప్పుడు ఏమనిపించిందో, చూశాకా ఎందుకిది రాయలనిపించిందో - ఆ విశేషాలే ఈ రోజు కబుర్లు.

టిల్లు స్క్వేర్ సినిమాకి వెళ్లే ముందు... 

    ఏప్రిల్ 1 సోమవారం నాడు రాత్రి  ఎనిమిదింపావు ఆటకి బద్రి టికెట్లు తీసుకున్నారు. 

    తీరా సోమవారం వచ్చేటప్పటికి - ఆ రోజు మధ్యాహ్నం నుంచి మా ఊళ్ళో severe weather alerts రావడం మొదలుపెట్టాయి. 

    ఆ రోజు సాయంత్రం ఏడుంపావు దాకా టోర్నెడో వార్నింగ్ వుంది అని టీవీలో, ఫోనుల్లో హెచ్చరికలు వస్తూనే వున్నాయి. 

    నేను మాత్రం ఆఫీస్ అయిపోగానే రాత్రి వంట చేసేసి సినిమాకి వెళ్ళడానికి తయారవుతున్నా. 

    కాకపోతే టోర్నెడో వార్నింగ్ వుంది కాబట్టి బద్రీది, నాదీ ఆఫీస్ లాప్‌టాపులు రెండూ వాటి వాటి bags లో  పెట్టి బేస్మెంటులో పెట్టొచ్చా. 

    టోర్నెడో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఇంట్లో వున్న విలువైన వస్తువులు పట్టుకుని బేస్మెంటు లోకి వెళ్ళడం మా కలవాటు. 

    అవి అక్కడ పెట్టి పైకొచ్చి ఇంట్లో వున్న సుహాస్‌తో "జాగ్రత్త నాన్నగాడూ... టోర్నెడో అంటున్నారు" అనగానే వాడు వెంటనే "అమ్మా! ముందు మీరు జాగ్రత్త. బయటికి వెళ్తున్నారు" అన్నాడు. 

    "థియేటర్లో వుండగా అక్కడ టోర్నెడో వస్తే మేమొక్కళ్ళమే కాదుగా. అక్కడింకా చాలా మంది వుంటారు. అదో రకమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది" అంటూనే నేను కారెక్కేటప్పటికి టైము ఏడుంపావు. 

    అప్పటికి ఆ టోర్నెడో కూడా నా మీద దయ తలిచినట్లు మా వూరు దాటిపోయింది. 

    సినిమా మీద నాకున్న మక్కువకి ప్రకృతి కూడ మద్దతిచ్చింది. 

    అలా బయల్దేరి - మధ్యలో AT&T స్టోర్ దగ్గర ఆగి అక్కడ పని చూసుకుని - థియేటర్‌కి చేరేటప్పటికి ఎనిమిది గంటలు.  

    చిప్పులూ -చీజూ కొనుక్కుని సరిగా ఎనిమిది గంటల ఐదు నిముషాలకి కుడికాలు పెట్టి హాలు-ప్రవేశం చేయబోతుండగా అక్కడున్న ద్వారపాలకుడొకడు ఆపేశాడు. 

    "ఏంట్రా - ఎందుకాపేడూ?" అనుకుంటూ, అదే పైకనబోతుండగా ఇంతలో అతనే చెప్పాడు "ఇందాక టోర్నెడో సైరన్ రావడం వల్ల ఇంతకు ముందు షో కాసేపు ఆపాలసి వచ్చింది. అదే ఇంకా నడుస్తోంది. మీ సినిమా ఎనిమిదింపావుకి కదా. అప్పుడే రండి" అని.

    మొత్తానికి ఎనిమిదింపావుకి లోపలికెళ్ళి సీట్లలో కూర్చున్నాము. 

    ముందేవో రాబోయే ఇంగ్లీషు సినిమాల ట్రైలర్లు ఓ మూడో నాలుగో వేశారు. అవేమీ కూడా అంత ఆసక్తికరంగా అనిపించలేదు. 


టిల్లు స్క్వేర్ సినిమా చూస్తున్నప్పుడు, చూశాక ...

    ఓ పది నిముషాల తర్వాత టిల్లు స్క్వేర్ సినిమా మొదలయింది. 

    సినిమా చూశాం. 

    బయటికి వచ్చాం. 

    మామూలుగా సినిమా చూడడం అయిపోయాక ఇంటికి వస్తూ చూసిన సినిమా గురించి నచ్చిందనో, నచ్చలేదనో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చే బద్రి, నేను ఈ సారి మాత్రం అసలు సినిమా గురించే మాట్లాడుకోలేదు.

    సినిమా అస్సలు బాగాలేదు అని మాలో మాకు చెప్పుకోవడానికే మొహమాట పడ్డట్టున్నాం. 

    ఇంతకు ముందు "డీజే టిల్లు" సినిమా చూశాక - తడుముకోకుండా మాట్లాడే సిద్దు జొన్నలగడ్డ spontaneity ని అంతగా ఇష్టపడ్డ మాకు టిల్లు స్క్వేర్‌లో డైలాగులు అంత గొప్పగా అనిపించలేదు. ఏదో అక్కడక్కడా తప్ప అంతగా నవ్వు రాలేదు. 

    సినిమా మొత్తానికి నాకు గుర్తున్నది టిల్లు మాత్రమే. 

    టిల్లుగా చేసిన సిద్దు జొన్నలగడ్డ screen presence బావుంది. 

    పసుపు రంగు మీద గుల్లబీ రంగు పూలపూల చొక్కా, పైడ్-పైపర్ లాగా ఒక పక్కంతా తెలుపు, ఇంకో పక్కంతా ఎరుపూ వున్న పేంటూ-చొక్కా,  మెరిసే చెమ్కీల పసుప్పచ్చ కుర్తా - ఇలా ఏ బట్టలు వేసుకున్నా ఇవి సిద్దు జొన్నలగడ్డ వేసుకున్నాడు కాబట్టి బావున్నాయి, ఇంకెవరికైనా అయితే అంతగా నప్పేవి కాదేమో అనిపించేంతగా నచ్చాడు టిల్లు. 

    కానీ ఒక సినిమా చూడాలంటే హీరో బావున్నాడనిపిస్తే చాలదు. 

    ఈ సినిమాలో సిద్దు తప్ప వున్న అందరూ వున్నారంతే - అన్ని చోట్లా వుండలేని సిద్దు వుండని చోట ఖాళీలు పూరించడానికి వున్నట్లు. 

    ఇందులో వున్న ఇద్దరమ్మాయిల కన్నా సిద్దునే బాగా వున్నట్టు అనిపించాడు, కనిపించాడు నాకు. 

    టిల్లు జీవితంలో అంతకు ముందు జరిగిన సంఘటనలని గుర్తు చేయడానికన్నట్టు అక్కడక్కడా చూపించిన "డీజే టిల్లు" సినిమా నుంచి ఎత్తుకొచ్చి చూపెట్టిన సీన్లు తప్ప "టిల్లు స్క్వేర్" సినిమాలో నాకు గుర్తుంచుకోదగ్గవి కానీ, ఇప్పుడిది రాస్తుండగా గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తున్నవి కానీ ఏమీ లేవు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఎండలో ఎండిన కొత్త వడియాల్లా గలగల్లాడాల్సిన కబుర్లు చప్పగా చల్లారిపోయిన వడల్లా సాగితే ఆ తప్పు నాదే - ఎప్పటి కబుర్లు అప్పుడు చెప్పలేక ఇప్పుడు చెప్పాలనుకోవడమే! 


~ సినీ-మా-లక్ష్మి 





7 కామెంట్‌లు:

  1. కబుర్లు బాగున్నాయి! అప్పుడే 2024 ఖాతా close చెయ్యకండి .. let's keep hoping for good movies!!
    End లో Disclaimer భలే కొత్తగా ఉండి, నవ్వు తెప్పించింది...
    Crunchy or Soft, your కబుర్లు are always entertaining!! Keep it up Lalita!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2024 ఖాతా మూసేసింది తెలుగు థియేటర్‌కి మాత్రమే. ఇప్పట్నించీ వచ్చే కొత్త తెలుగు సినిమాలన్నీ OTT లో మాత్రమే చూద్దామని అనేసుకున్నాం. మళ్ళీ 2025 లో తప్పకుండా హాలుకెళ్తాము. నా కబుర్లు ఎలా వున్నా నచ్చుతాయని అన్నావు చూడూ - అది నాకు చాలా నచ్చింది. Thanks, Aparne!

      తొలగించండి
  2. -

    "ఇప్పట్నుంచి చిన్న హీరోల సినిమాలు థియేటర్లోనే చూద్దాం" అని తీర్ మానించి నందులకు మెచ్చు కోళ్ళు

    కొత్తగా అదేదో ఏడీ అట 2024 AD లా అందరూ చిన్‌ చిన్ హీరోలతో నే బెరీ బెరీ లో బడ్జెట్ తో తీసేరట అదొచ్చేస్తోందని లో కమ్ అంతా చికనై కొక్కొరకో అందరూ చూడాలె అని చెబ్తున్నారు.

    మీ డిసషన్ కి సూట బల్ గా వుంది కాబట్టి మరౌ ఆవ కా సమ్
    భలే మంచి‌ డీలు చూసేయండి సినీ మీ హాలు లో :)



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీజీ! మీరు మేము "ఇప్పట్నుంచి చిన్న హీరోల సినిమాలు థియేటర్లోనే చూద్దాం" అని తీర్ మానించిన దగ్గరే ఆగిపోయి ఆ తర్వాత చూడడం మానివేద్దామని ఇంకో మారు తీర్ మానించినది చదవడం మానినట్టున్నారు.

      ఈ ఏడాదికి చిన్ చిన్ హీరోలతో తీసినా పెద్ పెద్ స్టార్హీరోలతో తీసినా - ఇహ థియేటర్కి వెళ్ళొద్దు బాబోయ్ అని తీవ్ర-తీర్ మానించేసుకున్నాం. ఏ AD సినిమా అయినా ఇక 2025 AD లోనే.

      మీ చమత్-కార పూరిత వ్యాఖ్‌యకి బోల్‌డన్ని ధన్‌యవాదాలు!

      తొలగించండి
  3. ఏదో ఆశ చావదు కనుక థియేటర్కి వెళ్ళటం. శుభ్రంగా ఇంట్లో కూర్చుని చూసినంత సుఖం మరో చోట లేదు. నచ్చకపోతే కట్టేసి అవతలకి పోతాము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతే...అదే సుఖమండీ, రాముడు గారూ! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  4. ఫస్ట్ మూవీలో టిల్లు అన్న డీజే పెడితే అనే పాట బాగుంటుంది. చాలా పాపులర్ అయింది. రామ్ మిరియాల సింగర్ మ్యూజిక్.

    రిప్లయితొలగించండి