ఇంతకు ముందు చెప్పిన బోల్డన్ని కలిమితో కబుర్లు
- కాఫీ విత్ కలిమి - 1 - ఫస్ట్ సిప్
- కాఫీ విత్ కలిమి - 2 - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ...
- కాఫీ విత్ కలిమి - 3 - "కలి-మి"తో కబుర్లు
- కాఫీ విత్ కలిమి - 4 - టీనేజ్ vs. బీనేజ్
- కాఫీ విత్ కలిమి - 5 - అనగా వంచించారు - తినగా వంచినచారు
- కాఫీ విత్ కలిమి - 6 - హింసధ్వని విని ఆయె హంసానంది!
- కాఫీ విత్ కలిమి - 7 - A friend in teens is a friend in beens అన్న ఓ Guyయాళి
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆ హోటల్మేడలో
ఇరవైనాలుగో అంతస్తులో
ఇరునాలుగుల గదిలో...
నింగిలో చూపు సారించినంతటా కమ్ముకున్న నల్లనల్లని మొయిళ్లు
నేల మీద చూపానినంత మేరా పరచుకున్న నీలినీలి సంద్రపు నీళ్లు
ఆ నీటి మధ్య దీపాల దీవిలా మెరుస్తున్న అంతస్తుల మేడలు
ఆ నింగినీ - ఈ నేలనీ
మేడల కొమ్మున వేలాడే మిలమిలలాడే దీపాల దండల్నీ
కనులెదుట చిత్తరువులా నిలిపింది
నిలువెత్తు కిటికీ అద్దం...
చూపుకందినవి చేతికందక
గాలి సోకనీయని గాజు తెరల మాటున
ఒంటికంబపు మేడలో చిక్కిన చిలకప్రాణంలా వుంది నా పరిస్థితి...
"కభీ తన్‌హాయియోం మే యూఁ
హమారీ యాద్ ఆఏగీ...
అంధేరే చా రహే హోంగే
కి బిజ్‌లీ కౌంధ్ జాఏగీ..."
ముబారక్ బేగం - ఓ... తెగ - పెదవుల మీద మూగి మోగిపోతోంది.
అప్పుడు మోగింది నా చేతిలో వున్న ఫోన్ - కలిసొచ్చే కాలానికి కలిమితో కబుర్లన్నట్టు.
ఇహ ఇవాళ్టి నా blog కబుర్లు... ఆరోజు - కలిమితో - మాటాడుకున్న - మాటలతో ఆడుకున్న కబుర్లు...
"హలో! ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్?"
"నేను బావున్నా. నువ్వూ?"
"నేనూ బాగుగానున్నానూ...బాగుగానూ, నున్నగానూనూ"
"నువ్వు మరీనూ... నువ్వు నున్నేంటీ?"
"నేన్నున్న కాక సన్నేంటీ? అద్సరే గానీ... మధ్యాహ్నం రెండయ్యింది....ఏమన్నా తిన్నావా?"
"హ్మ్... తింటున్నా"
"ఏం తింటున్నావ్?"
"అన్నం"
"ఏం వేసుకునీ?"
"పచ్చడి"
"ఏం పచ్చడీ?"
"ఆవకాయ"
"అబ్బా! 'ఏమన్నా తిన్నావా?' అన్న ప్రశ్నే సవివరముగా వివరింపుము అన్నట్టు లేదూ? దానికెంతైనా చెప్పొచ్చు కదా! అలా అడిగితే ఒక్క వాక్యంలో 'ఇప్పటి దాకా తినలేదూ, ఇప్పుడే నీ ఫోన్ వచ్చేముందే మొదలుపెట్టి ఆవకాయ కలుపుకుని అన్నం తింటున్నాన'ని చెప్పొచ్చు కదా?! ఇలా బిట్టు పేపర్లో సమాధానాల్లా ఒమాజలు ఇస్తావేంటీ?"
"ఒమాజలు...? అంటే?"
"ఓ పద్నిమిషాలు పోనీ...నీకే అర్థమౌతుంది. నేను ఫోన్ చేసి ఏమడుగుతానో, దానికి ఏం జవాబిస్తే దానికి ఇంకేమంటానో, ఎందుకొచ్చిన తలనొప్పని ముందే ఆలోచించుకుని - నేనేదడిగినా ఒక్కటంటే ఒక్క మాటలో మాత్రం బదులిద్దామనుకున్నట్టున్నావ్ కదూ!"
"ఛా...అలా ఏం కాదు."
"ఆ 'ఛా' అని ఒత్తి పలకడంలోనే తెల్సిపోతోంది - అది అలానే అని"
"నువ్వైతే ఎలా చెప్తావు తల్లీ?"
"నేనా...?! ఒక మార్కు ప్రశ్నక్కూడా పది మార్కుల జవాబు రాసే రకం"
"క్లుప్తంగా చెప్తే బావుంటుందని. నువ్వే అంటుంటావు కదా Beauty lies in simplicity అని."
"అంటుంటాలే - కానీ అవి నా మాటలు కాదు. ఎవరో అన్నవి. నచ్చాయని అంటుంటా. నేనైతే 'క్లు...కు....మీ...తె....' అంటా"
"హహ్హహ్హహ్హా! "క్లు...కు....మీ...తె...." అంటే...?"
"అంటే క్లుప్తత కుత్తుక మీదికి తెస్తుంది? నీకు చీమ కథ తెలుసు కదా?"
"ఏ చీమ కథా?"
"అనగనగా ... అనేకానేక చీమల్లో ఓ అనామక చీమ. శివుడాజ్ఞ లేందే కుట్టలేకపోతున్నానని కోపమొచ్చి ఆ శివుడి తోనే తేల్చుకుందామని తపస్సు చేసింది. శివయ్యొచ్చి 'చీమా ...చీమా ...! ఏం కావాలీ?' అనడిగితే బెట్టుకి పోయి క్లుప్తంగా 'కుట్టాలీ, చావాలీ' 'అంది. శివయ్య 'అలాక్కానీ' అన్నాడు. అంతే! అప్పటికప్పుడు కంటిక్కనిపించి-కాలికడ్డొచ్చినవాణ్ణొకణ్ణి కుట్టింది. వాడు చెయ్యెత్తి-చెళ్లున-చరిస్తే కిక్కురుమనకుండా టిక్కుమంది. అదే ఆ పిచ్చిమొహం చీమ అంత పోజు కొట్టకుండా 'నేను కుట్టాలీ, నే కుట్టినవాడు చావాలీ'' అనుంటే అంతటి చీమా అప్పట్నుంచీ ఇప్పటిదాకా బోల్డుమందిని కుట్టుకుంటూ బతికిపోయేది కదా?
"హహ్హహ్హహ్హా! భమే బావుంది నీ చీమ-కథ. అవునూ... ఇంతకీ నువ్వు తిన్నావా?"
"నేనా...నేను ఇవాళసలే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చెయ్య లేదు. బాగా ఆకలేస్తోందని కొంచెం తొందరగా పదకొండింటికే భోంచేసేద్దామని అనుకున్నానా? అనుకోకుండా ఆఫీసు కాల్ ఒకటి బాగా సాగి అదయ్యేటప్పటికి దాదాపు పన్నెండున్నరైపోయింది. పోనీ అప్పుడైనా తిందామనుకుంటే ఇంతలో ఇంట్లో కిచెన్ సింక్ కుళాయి బాగు చెయ్యటానికి - అంటే అచ్చంగా ఇవాళే బాగు చెయ్యడానికి కాదూ - అసలు బాగు చెయ్యడానికి ఎంతవుతుందో ఎస్టిమేట్ ఇవ్వడానికి ప్లంబర్ ఒకతను వచ్చాడు. అతను అటు ఒంగీ, ఇటు ఒంగీ - ఆ కుళాయిని ఇటు వంచీ, అటు తిప్పీ అన్ని కోణాల్లోంచి పరీక్ష చేసి అదింక బాగుపడదూ, ఏ హోండిపోకో వెళ్లి కొత్తది తెచ్చుకున్నాక కబురు చెయ్యి , అప్పుడొచ్చి ఈ పాతది తీసి ఆ కొత్తది బిగించడానికి ఎంతవుతుందో చెప్తా అని చెయ్యూపి వెళ్లిపోయాడు. అప్పటికి గడియారం ముళ్లు పెద్దదీ, చిన్నదీ కూడా ఒకటి మీద ఒకటిగా కలిసిపోయాయి. అంటే అర్థమయింది కదూ...ఒంటిగంట దాటి ఐదు నిముషాలయింది. అంటే నీ కర్థం కాదని కాదూ...M.S. చేశావు, ఆ మాత్రం తెలీకుండా వుంటుందా? ఇంతకీ ...నువ్వడిగిన దానికి నేనింకా జవాబు చెప్పనేలేదు కదూ! ఇంకప్పటికి ఆకలి కూడా అటకెక్కినట్టనిపించింది - ఓ అరటిపండు తిని ఓ కప్పుడు పాలు తాగాను. అదీ నా భోజనం ఈ పూటకి."
"ఊఁ "
"హహ్హహ్హ! ఇంతవరకు చెప్పిందంతా అర్థమయిందని 'ఊఁ' అన్నావా? లేకపోతే ఇప్పటికైనా ఆపానని 'ఊఁ' అని నిట్టూర్చావా?"
"నువ్వు మరీనూ...నీతో మాట్లాడుతుంటే ఊపిరి తీసుకోవడానికే gap ఉండదు - ఇంక నిట్టూర్పుల మాటెక్కడా?"
"అవునూ...నువ్వు గమనించావా?"
"ఏంటి?"
"అదే ... 'నువ్వు తిన్నావా?' అన్న నీ చిన్ని ప్రశ్నకి 'అవునూ, కాదూ' అని ఒక్క మాటలో జవాబు చాలు కదా? కానీ అతి-సంకల్పిత-ప్రతీకారచర్యలా ఇంత పొడుగున పమాజ చెప్పా"
"పమాజ...అంటే?"
"అంటే...నీది ఐదు మార్కుల ప్రశ్నకి ఒమాజ ఐతే నాది ఒక మార్కు ప్రశ్నకి పమాజ."
"అర్థం కాలే!"
"అంటే ...ఇప్పుడు ఎవడైనా నన్ను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నకి సమాధానం రాయమని అడిగాడనుకో...
ప్రశ్న: అన్నం తిన్నావా?
ఆప్షన్ ఎ) తిన్నా,
ఆప్షన్ బి) తింటా,
ఆప్షన్ సి) తినబోతున్నా
ఆప్షన్ డి) నన్ అఫ్ ది ఎబౌ
నేనేం చేస్తానో తెలుసా 'ఆప్షన్ డి) నన్ అఫ్ ది ఎబౌ' మీద టిక్కు పెట్టి ఆ ప్రశ్నకి పైనా కిందా వున్న ఖాళీల్లో నేనా పైన చెప్పిందంతా ఇరికించి ఇరికించి మరీ రాస్తా. అడిగినవాడు తిండీ-తిప్పలు మర్చిపోయి నానుంచి తప్పించుకోవడానికన్నట్టు కుదిరితే తీర్థయాత్రకి , కుదరకపోతే తీహార్ జైలుకైనా వెళ్లిపోవడానికైనా సిద్ధపడి అడ్డదారిలో పరిగెట్టుకుని పారిపోతాడు."
"హహ్హహ్హ....నువ్వున్నావే !"
"ఆ...ఆ...వున్నానూ, వుండాల్సిందాననూనూ"
"ఇప్పుడర్థమైందిలే ! అందరూ పదిమార్కుల ప్రశ్నకి ఒక మార్కొచ్చే జవాబు రాస్తే నువ్వు మాత్రం ఒకమార్కు ప్రశ్నక్కూడా పదిమార్కుల జవాబు రాస్తానంటావ్, అంతేనా?"
"అంతే...అంతే...ఈ రోజుకి ఈ ప్రసారం సమాప్తమంతే ...మళ్లీ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామంటే ఫర్వాలేదంటావా ఐతే?!"
"సరే... సరే ... నువ్వలా అంటే నేను 'ఊఁ' అంటానంతే"
"Bye మరి!"
"Bye...Bye"
చివరాఖరి సిప్పు:
Thank You, Life, for the kind of teacher you are! ~meSayIt
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి