కన్నడనాట విడుదలైన తుళునాటి సినిమా - నాడుల ఎల్లలు దాటి ఎల్లరి చేత "వల్లె" అనిపించుకున్న సినిమా "కాంతార".
కదా!?
కానీ నేను "కాంతార" చూద్దామనుకోలేదు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఈ మధ్య కాలంలో బోల్డు హిట్టైపోయి పాన్-ఇండియా సినిమాలు అనిపించుకున్నవి చూసి - ఒక్కటే అనుకున్నా. అవి బిర్యానీ-టైపు సినిమాలని, అవి నేను చూడక్కరలేదని.
ఈ బిర్యానీకి, సినిమాలకి వున్న సంబంధం ఏంటో చెప్పే ముందు - నేనొక్క మాటు ఆ పక్క బ్రౌజర్ విండో లోకి వెళ్ళి - ఒక మాటకి అర్థమేంటో చూసొస్తానుండండే!
ఇంతకీ నేను వెతుకుతున్న మాట ఏంటీ అంటే PAN-India.
PAN అంటే Presence Across Nation అట.
హమ్మయ్య! ఇన్నాళ్ళూ ఈ మాట నన్ను తెగ సతాయించింది. ఇప్పుడు అర్థమై కొంచెం హాయిగా వుంది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇప్పుడు నాదైన ఒక మాట. నేనెప్పుడూ అనుకునే మాట - "నాల్కకో చవి - కంటికో చూడ్కి"
నాల్కకో చవి.
వండిన వంట ఒకటే అయినా అది తిన్నప్పుడు - ఎవరికి అనిపించిన రుచి వారిదే.
ప్రపంచానికంతా ఘుమఘుమలాడే బిర్యానీ అంటే "అబ్బా! ఏం రుచి" అనిపిస్తుంది కదా! నాకు మాత్రం అలవాటు లేకో, అలవాటు చేసుకోలేకో ఆ రుచే సొక్కదు.
కంటికో చూడ్కి.
చూసిన సినిమా అదే అయినా అది చూసినప్పుడు - ఎవరి అనుభూతి వారిదే.
స్టార్లూ, స్టారు-డైరెక్టర్లతో తళతళలాడే పాన్-ఇండియా సినిమాలూ అందరికీ నచ్చుతాయి. నాకెందుకో అవంతగా ఎక్కవు.
అందుమూలంగా నాకనిపించినదేంటంటే మంది బావుందన్న సినిమా నా మదికి నచ్చాలని లేదని.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అందుకే "కాంతార" కూడా చూడాలనుకోలేదు. అందులోనూ అది కన్నడ సినిమా. మా ఊళ్ళో థియేటర్లోకి ఎలాగూ రాలేదు. ఎప్పుడో ఓటీటీ లోకి వచ్చినపుడు చూద్దాంలే అనుకున్నా.
కానీ ఈ లోగా ఏమైందంటే మా ఊరి థియేటర్లో "కాంతార" తెలుగులో వచ్చిందని బద్రికి తెలియగానే "కాంతార చూద్దామా?" అని నన్నడగ్గానే "కన్నారా నను కన రా" అని కాంతార నన్ను పిలుస్తున్నట్టనిపించింది.
నిజానికి నాకు డబ్బింగ్ సినిమాలు అసలు నచ్చవు. అసలు భాషలో పలికితే ముత్యాలు జాలువారుతున్నట్టుండే మాటలు, పాటలు పరాయి భాషలో అతకని పలుకురాళ్ళలా తోస్తాయి.
కానీ "కాంతార" డబ్బింగ్ సినిమా అయినా కూడా - ఎంత వద్దనుకున్నా పదేపదే వచ్చి పలకరిస్తున్నట్టనిపించి - ఈ ఒక్కసారికి - కంటి దాకా వచ్చిన సినిమా - కాదనకుండా చూద్దామా అనిపించింది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అనుకున్నదే తడవు కిందటి ఆదివారం వెళ్ళాం. "కాంతార" చూశాం.
ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా ఎప్పుడూ అనిపించనిదేదో అనిపించింది.
"అద్దిరబన్నా! ఇద్దిరా సినిమా అంటే" అనీ అనిపించింది.
మళ్ళీ చూద్దామా అనిపించింది.
మళ్ళీ మొన్న శుక్రవారం ఆరుగంటలాటకి వెళ్ళి "కాంతార" కన్నారా చూసి వచ్చాం.
అస్సలు చూద్దామనే అనుకోని "కాంతార" ఇప్పటికి రెండుసార్లు చూసి వచ్చాం.
రెండోసారి చూసినప్పుడు కూడా అదే మొదటిసారేమో అనిపించిన సినిమా మాత్రం ఇదే.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ಕಾಂತಾರ - ಒಂದು ದಂತಕಥೆ!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇంతకీ ఈ "కాంతార" ఏంటి?
ఒక కాడు కథ
తుళునాడు కథ
ఒక నాటి కథ
తరతరాల కథ
రిషభ్ షెట్టి అనే దర్శకుడు తనకు తెలిసిన కథని తరతరాలకి నిలిచిపోయేలా తెర మీద తీరుగా తెలిపిన కథ.
తెలుగులో సినిమా పేరు "కాంతార - లెజెండ్" అని రాశారు కానీ కన్నడలో అది "కాంతార - ఒందు దంతకథె". "దంతకథె" అంటే నమ్మలేని విషయాలని నమ్మించే గాథగా మలచిన కథ.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అసలు సినిమా మొదలవుతూనే పిల్లల పైన అమ్మ-(మేన) మామలకి వుండే ప్రేమకి సంబంధించిన మాటలు కొన్ని వుంటాయి. అవేంటో అర్థం కాలేదు.
దాని తర్వాత పంజుర్లి దేవుడు ఎవరో, గుళిగ అనే క్షేత్రపాలకుడు పంజుర్లికి ఏమవుతాడో, ఆ కథానాయకుడు శివ ఎందుకు అన్నేసి చేపలు వండించుకుని తింటూ వుంటాడో - సినిమా చూస్తున్నంత సేపూ అదే ఆలోచన.
"కాంతార" సినిమా వెనకాల చాలా కథలున్నాయి. ఆ కథని తెలుసుకుంటే సినిమా ఇంకా మజాగా అనిపిస్తుంది.
అసలు ఒక సినిమా చూశాక ఆ కథ వెనక కథలు ఏమైవుంటాయా అని అనుకోవడం, ఆ కథలని వెతుక్కుంటూ వెళ్ళడం ఇదే మొదటిసారి.
సినిమా కథ సినిమానే చెప్పుకుంది కాబట్టి సినిమా చెప్పని కథ నేను చెప్తా. వినేయండి మరి!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
తుళునాడులో పాడుకునే సంప్రదాయ జానపదగీతాల ప్రకారం...
పంజుర్లి అంటే పంజిద కుర్లి - అంటే పందిపిల్ల అని అర్థమట.
కైలాసంలో శివుడు ఓ ఐదు వరాహ మూర్తులని సృష్టించాడట.
అందులో ఓ బుజ్జి వరాహం విడిపడగా దాన్ని చూసి ముచ్చట పడి పార్వతీదేవి పెంచుకుంటుంది. ఆ బుజ్జి అడవిపందిపిల్ల ఇంతైంది, అంతైంది.
దానికి బుల్లిబుల్లి కోరలు కూడా వచ్చేశాయి. పళ్ళొచ్చేటప్పుడు పసిపాపలకి చిగుళ్ళు దురదొచ్చినట్టు - ఈ బుల్లి సూకరానికి కూడా దాని బుల్లి కోరలు దురద పెట్టడం మొదలుపెట్టాయి.
అది వెళ్ళి వెళ్ళి పార్వతీదేవి పెంచుకుంటున్న అరటి తోట (కదళీవనం) మీద పడి అరటి చెట్లన్నీ చీరేసిందట.
అది చూసి శివుడికి కోపమొచ్చి మూడోకన్ను తెరవబోతే పెంచిన ప్రేమతో పార్వతీదేవి వద్దని వారిస్తుంది.
అప్పుడు శివుడు ఆ బుల్లి చక్రదంష్ట్రాన్ని కైలాసం విడిచి భూమి మీదకి వెళ్ళి పంటల్ని రక్షించమని ఆదేశించాడట. ఆ వరాహమూర్తే తుళునాటి పంజుర్లి దేవర.
ఇక గుళిగ క్షేత్రపాలకుడు ఎవరో చూద్దాం.
కైలాసవాసి శివుడు భస్మధారి కదా!
ఆయన ఇల్లాలు పార్వతీదేవికి ఓ మూలగా వున్న భస్మంలో ఒక రాయి దొరికిందట.
ఆ రాతిని అమ్మవారు అయ్యవారికి చూపెడితే ఆయన దానిని నేల మీదకి విసరగానే ఆ రాతి లోంచి పుట్టినవాడే గుళిగ.
ఆ గుళిగ పుడుతూనే మహా ఆకలితో పుట్టాడట, ఎంత ఆకలీ అంటే మహావిష్ణు చుట్టూ వున్న క్షీరసాగరంలో వున్న చేపలన్నిటినీ తినేసేంత. (సినిమాలో శివ ఈ గుళిగ అంశ అన్నమాట - అందుకే ఆ చేపల కూర మీది ప్రీతి.)
ఆ ఆకలి తీరని గుళిగని భూమి మీదున్న భూతాలని తిని ఆకలి తీర్చుకోమని చెప్పి మహావిష్ణు భూమి మీదకి పంపించాడట.
అలా వచ్చిన గుళిగని ఏడుగురు జలదుర్గలు తమ నెలవులకి రక్షకుడిగా క్షేత్రపాలకుడిగా వుండమని కోరారట.
"సరే" నని రాతి రూపంలో తుళునాట క్షేత్రపాలకుడుగా వున్న గుళిగ ఊరికే ఉన్నాడా?
ఉహూ! అంతకు ముందే వచ్చి వున్న పంజుర్లితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడట.
అప్పుడు జలదుర్గలు వచ్చి "మీరిద్దరూ కొట్టుకోకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వుండి జనులని, వారి పంటలని దుష్టశక్తుల నుంచి కాపాడాల"ని చెప్తే అప్పట్నుంచి పంజుర్లి, గుళిగ తుళునాట రక్షకులుగా వుండిపోయారట.
వారి పేరు మీదుగా భూతకోల / దైవకోల జరిపినప్పుడు ఎవరైతే ఆ కోల ఆడతారో వారి ఒంటి మీదకి పంజుర్లి వచ్చి ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాడని తుళునాట ఓ నమ్మకం.
అదీ పంజుర్లి-గుళిగల కథ - మహా స్థూలంగా - నాకు తెలిసిన ఒక మంగళూరు నేస్తం పుణ్యమా అని నాకు అర్థమైనంతలో.
ఇందులో మళ్ళీ ఒక కల్లుర్తి అనే స్త్రీ-వరాహమూర్తి ప్రసక్తి కూడా వచ్చింది. ఆ కల్లుర్తి పంజుర్లి దేవరకి సోదరీ-సమానురాలు. ప్రజలకి కల్లుర్తి అమ్మ అయితే, పంజుర్లి మేనమామ వరస కదా! వాళ్ళిద్దరూ తుళునాడుని కాపాడుతూ వుంటారట. (ఇదంతగా అర్థం కాకపోయినా సినిమా మొదట్లో వచ్చిన "అమ్మ-మామ" డైలాగేదో కొంచెం అర్థమైనట్టు అనిపించింది.)
నా మీద ప్రేమతో నా తుళు-నేస్తం పంచుకున్న ఒక పంజుర్లి విగ్రహం ఫోటో ఈ కింద...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇప్పుడిక కాంతార సినిమా దగ్గరికొస్తే...
ఒక్కసారి కూడా చూడకూడదనుకున్న సినిమా ఇప్పటికి తెలుగు dubbing version రెండు సార్లు చూశాను. కానీ కన్నడ original version చూడాలన్న ఆశ ఇంకా అలాగే వుంది.
అమెజాన్‌లో ఈ నెల 18 నుంచి కన్నడ వెర్షన్ వస్తుందట. అప్పుడు తప్పకుండా చూస్తాను. తెలుగు లోనే ఇంత బావుంటే కస్తూరి-కన్నడ మాటలు తుల లేని తుళు యాసలో వింటూ చూస్తే ఇంకెంత బావుంటుందో ఈ "కాంతార"!!
"కాంతార"ని నిర్మించిన వారు "హొంబాళె ఫిల్మ్స్" వారట.
"హొంబాళె"మాట ముందు నేను "హొంబళె" అన్నట్టు చదివాను. తర్వాత అపర్ణని అడిగితే అది "హొంబాళె" అంటే "బంగారపు (హొన్ను) అరటి (బాళె)" అని అర్థమని చెప్పింది. భలే వుందీ పేరు!
ఇక సినిమాలో శివ, లీల, మురళి, దేవేంద్ర (దొర పేరది) - పేర్లు ఎన్నుకోవడంలో కూడా కథ రాసిన రిషభ్ షెట్టి లోతైన ఆలోచన (నాకనిపించినది) కనిపిస్తోంది.
శివ పేరు మీద నాకు తోచినది ఇది.
ఈ సినిమాలో శివ అలవాట్లు, వ్యవహారం అంతా చూస్తుంటే నాకైతే ఒకటే పాట గుర్తుకొస్తూ వుంది.
అది దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి పాట...
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయా?
నీ అల్లరి చేతలు
ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయా?
మిత్రగణాన్ని వెంటబెట్టుకుని ఆకతాయిగా వూరంతా తిరుగుతుంటాడు శివ.
తనకి ఆవేశం వచ్చినప్పుడల్లా ఇచ్చకపు మాటలతో బుజ్జగిస్తూ, స్కాచ్ విస్కీతో తనని మత్తులో ముంచి సముదాయిస్తున్నట్టు నటిస్తున్న దుష్టుడైన దొరని అమాయకంగా తన మేలు కోరేవాడేమో ననుకునే శివ భస్మాసురుడికి వరాలిచ్చిన భోళా శంకరుడి లాగే అనిపిస్తాడు.
చివరిలో దొర మోసం తెలుసుకుని - గుళిగ ఆవహించగా వీరంగం ఆడిన శివ ప్రళయకాలరుద్రుడిలా అచ్చెరువొందిస్తాడు.
శివని అడ్డుకుంటున్నవాడుగా, శివ ఆవేశాన్ని అదుపులో పెడుతున్నవాడుగా - శివకి దీటుగా వ్యవహరించాలంటే కేశవుడి అంశ వున్నవాడు మాత్రమే సరితూగుతాడు. అలాంటివాడే రిజర్వ్ ఫారెస్ట్‌ని సంరక్షించే మిషతో ప్రకృతి పరిరక్షకుడిగా కనిపించే ఫారెస్ట్ ఆఫీసర్ - మురళి.
సినిమా మొదట్లో మురళి శివకి, గ్రామస్తులకి చేటు చేసేవాడిలాగా, వాళ్ళకి వ్యతిరేకంగా వుంటున్నట్టు కనిపించినా - రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమణకి సంబంధించిన గొడవల్లో గ్రామస్తుల బదులు దొర దేవేంద్ర దగ్గర్నుంచి కోర్ట్ తాఖీదు రావడం, అంతకు ముందు దొర తనని ఇంటికి పిలిచి తనని మంచి చేసుకోవడం కోసం కానుకలు ఇవ్వబోవడం - వీటితో మురళికి అడవిని కాజేస్తున్నది దొర అని అర్థమై శివకి, గ్రామస్తులకి అండగా నిలుస్తాడు - అచ్చు పురాణాల్లో వరాలిచ్చి చిక్కుల్లో పడ్డ శివుణ్ణి మహావిష్ణు ఆదుకున్నట్టుగా.
ఇక పోతే "లీల". శివకి దొర చేసిన మోసం తెలియడానికి దారి తీసిన దైవలీలలో మొట్టమొదటి మెట్టు లీలని శివ దొర సహాయం తోనే ఫారెస్ట్ గార్డుగా మురళి దగ్గర చేరడం. ఆమె చేతనే భూమి సర్వే చేయించి, కంచె వేయించడం వల్ల - తమ పూర్వీకులు దానమిచ్చిన భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దొర ఆడిన నాటకం బయట పడుతుంది.
ఇందులో దొర పేరు - దేవేంద్ర. మన పురాణాల్లో ఇంద్రుడు తన పదవి నిలుపుకోవడం కోసం మాయోపాయాలు చేసినట్టే - ఈ దొర దేవేంద్ర కూడా మంచిగా కనిపిస్తూనే - మందిని మోసం చేసైనా సరే అడవి భూములని లాక్కోవాలనుకుంటాడు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఈ సినిమా - చూస్తున్నంతసేపూ రెప్పవేయనీయని అబ్బురం.
చూసొచ్చిన తర్వాత గుర్తు చేసుకుంటూ వుంటే ఏదో ఎక్కడో కుదురుగా వుండనీయని తలపు.
చూసిన రెండోసారి కూడా అదే మొదటిసారి చూస్తున్నట్టనిపించడం ఇంతకు ముందెప్పుడూ నేనెరుగని వింత అనుభవం.
తెర నిండా కంటికి కనిపించినంత మేరా కమ్ముకున్న పచపచ్చని పల్లెదనం - పచ్చిదనం - rawness - rusticness.
చెవికి సోకినంతనే చుట్టుముట్టి ఇంకేమీ వినబడనీయని - వెంటాడే haunting నేపథ్యసంగీతం.
పాటల్లోనే కాదు ఫైటుల్లో కూడా సంగీతం ఎంత బావుందో!
ముఖ్యంగా మహదేవ కొలిమి దగ్గర శివ వున్నప్పుడు - అక్కడికి దొర మనుషులు శివని చంపడానికి వచ్చినపుడు వర్షంలో జరిగిన పోరాటానికి నేపథ్యంలో "టకు-చికు-టకు-చికు" మంటూ వినిపించిన శబ్దం భలే బావుంది.
ఇందులో మొదట్నుంచీ చివరి దాకా ఒకటితో నొకటి ఏకీభవించని పరస్పరవైరుద్ధ్యాలు పక్కపక్కనే పడుగూ-పేకల్లా కలనేతగా సాగిపోతుంటాయి.
శివ - ధైర్యం చాటున భయం.
ఎంతమందినైనా ఎదుర్కొని గెలిచే శివకి అమ్మ కమలంటే మాత్రం భయం.
పంజుర్లి కనుల ముందుకొస్తూ - వెంటాడే కలకి దడిచి దిగ్గున లేచే శివకి అమ్మ పక్కనుంటేనే ధైర్యం.
ఫారెస్ట్ ఆఫీసర్ మురళి - శిక్ష దాపునే రక్ష.
అడవి లోని చెట్లని తాకినా , పక్షులని, జంతువులని కలవరపరిచినా ఊరి ప్రజలని శిక్షిస్తానంటాడు డెప్యూటీ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళి.
అడవిని దొర దోచుకోబోతే ఎదురు నిలిచి అదే అడవిని ప్రజలకి అందించడానికి రక్షణగా ఉంటానంటాడు అదే ఫారెస్ట్ ఆఫీసర్ మురళి.
దొర - ఇష్టం మాటున అనిష్టం.
ఒక పక్కన శివనీ, అతని స్నేహితులని తనకి ఇష్టులన్నట్టుగా చేరదీసి వారిని తనవారిగా, వాళ్ళ సంక్షేమం కోసమే తానున్నట్టు నమ్మిస్తాడు దొర.
కోల చేసుకోండి ఎంత డబ్బయినా ఇస్తాను - అంటూ ఇస్తున్న డబ్బును శివ చేతులు తనకి తాకకుండా ఎత్తి పడేస్తాడు దొర.
తమ్ముడు గురవని చంపిన వాడి అంతు చూస్తానని దూకుడుగా వెళ్ళబోతున్న శివని వారిస్తున్నట్టుగా చేయి పట్టుకునాపి - శివని తాకినందుకు అదే చేతిని నీళ్లతో కడుక్కోవాలంటాడు దొర.
తన ఇంట్లోకి శివ అడుగు పెట్టాడని ఇల్లంతా పసుపు నీళ్లతో శుద్ధి చేయమంటాడు దొర.
ఆద్యంతం మిరుమిట్లు గొలిపిన "కాంతార"లో నాక్కనిపించిన, నాకనిపించిన చిరు-చిరు-మెరుపులు కొన్నున్నాయి.
అడవి-బాటలో దేవర ఊరేగింపులో పట్టిన దివిటీలు పగటి-వెలుగులో పుష్యరాగాల్లా, రాత్రి-అంచున పద్మరాగమణుల్లా మెరిశాయి.
సినిమా మొదట్లో దేవ-కోల జరిగే సమయంలో చిన్నారి-లీలని చూసిన వెంటనే రెండు కనుబొమలు ఎగరేసి తన సంబరాన్ని చూపిస్తాడు చిన్ని-శివ.
మళ్ళీ చివర్లో దైవ-కోల ఆడుతున్న శివకి పంజుర్లి అంశగా మారిన తండ్రి కనిపించగానే - మళ్ళీ చిన్నప్పటి లాగే - కనుబొమలెగరేసి సంతోషాన్ని ప్రకటిస్తాడు. ఆ రెంటినీ కనిపెట్టి సరిపోల్చుకున్నందుకు నాలో నేనే మురిశా.
సినిమాలో దొర భార్య అమ్మక్క ఎప్పుడు కనిపించినా - ఆవిడ శివుడి పక్షమే నన్నట్టు తోస్తుంది. సినిమా మొత్తానికి వినిపించిన "శివా...టార్చ్‌లైట్ తీసుకెళ్ళు" లాంటి ఏవో కొన్ని మాటలు తప్ప వినిపించని కంటి-భాషే ఎక్కువగా మాట్లాడింది
జైల్లో వున్నప్పుడు తమ్ముడు గురవని ఎవరో చంపేశారని లీల చెప్పగానే చటుక్కున వెనక్కి తిరిగి తన ప్రాణాన్ని ఎవరో లాగేసుకున్నట్టు - నిస్సత్తువతో - నడిచేది తను కాదన్నట్టు వేలాడుతూ జైలు గదికి వెళ్లి గోడకి జారగిలబడి కూర్చున్న శివతో పాటు - గురవ కోసం - నేనూ ఏడ్చా.
శివ జైల్లో వున్నపుడు తనకో కల వస్తుంది. అందులో దైవ-కోల చేసేటప్పటి ఆహార్యంతో - వెనక్కి తిరిగి కూర్చుని గురవ ఎలుగెత్తి ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దృశ్యం, ఆ రోదన శబ్దం - ఊహించడం, వాటిని సినిమాలో అంత హృద్యంగా చూపించగలగడం - జయహో, రిషబ్ షెట్టీ - అది నీకే తగు!
పదేపదే శివకి కలలో కనిపిస్తూ, అడవి దారుల్లో ఎదురుపడుతున్నది పంజుర్లి రూపమనీ, తేపతేపకి చేపలు తెచ్చి వండించుకున్న శివది క్షేత్రపాలికుడు గుళిగ అంశ అనీ అర్థమయ్యేటప్పటికి కళ్ళ ముందు కనిపిస్తున్నది శివ రూపంలో రిషభ్ షెట్టి నటవిశ్వరూపం.
చివర్లో శివ దైవ-కోల ఆడుతూ ఫారెస్ట్ ఆఫీసర్ మురళిని తన దగ్గరికి రమ్మని చేతితో సైగ చేస్తే - వీటన్నిటిలో నమ్మకం లేని నన్నెందుకు పిలుస్తున్నట్టో - అన్నట్టు చూసిన మురళి చూపుని మాటల్లో రాయడానికి భాష చాలదేమోననిపించింది.
అలా అభావంగా చూస్తూనే దగ్గరకొచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ మురళి చేతులతో పాటు తనవారి చేతులన్నీ కలిపి తన హృదయం మీద ఆనించుకుని ఒకరికొకరు అండగా వుండమని శివ అప్పగింతలు పెట్టడం ఎప్పుడు గుర్తొచ్చినా మనసనంతా సంతోషంతో పొంగుతున్నట్టు, అంతలోనే చెప్పలేని దుఃఖంతో పొంగిపొర్లుతున్నట్టు అనిపిస్తోంది.
శివ తల్లి కమల, శివ మిత్రగణం - బుల్ల, రంప, అబ్బు, సుందర్, లచ్చు, శివ తమ్ముడు గురవ, శివ ప్రణయిని లీల, లీల తండ్రి సుందర్ భార్య శీల, శివ చిన్నాన్న, కత్తులకి సాన పెట్టే మహదేవ, దొర దేవేంద్ర, దొర భార్య అమ్మక్క, లీల ఇంటి పక్కింటి ఆమె వసంత, దొర దగ్గరుండే సుధాకర్ - సినిమాలో కనిపించేదే వారి నిజజీవితపాత్రేమో అన్నట్టు, ఇది తప్ప వేరే కానట్టు ఎంత బాగా కనిపించారో!
ఇక శివ, మురళి సంగతి చెప్పనే అక్కర్లేదు. శివ-కేశవ స్వరూపాల్లా ఎవరికి వారే సాటి అన్నట్టనిపించారు.
అన్నిటికన్నా మెచ్చుకోదగ్గ సంగతేంటంటే చెప్పదలుచుకున్న విషయానికి కొంచెం కూడా అటూ-ఇటూ జరగలేదు సినిమా కథ. అక్కర్లేని ఏడుపులు, బీద అరుపులూ - లేనే లేవు. దొర కుటిలబుద్ధికి చిహ్నమేమో అన్నట్టు చూపించిన దొర కొడుకు పాత్ర కూడా కనిపించీకనిపించనట్టుండి ఆట్టే ఇబ్బంది పెట్టలేదు.
ఈ "కాంతార" రిషభ్ షెట్టి తను నమ్మిన సంప్రదాయాలని, ఆచారాలని - తన ఊరి జీవనచిత్రాన్ని - తన వారి చరిత్రని - అందరికీ చెప్పాలని - ఎంతో ఇష్టంగా, భక్తిగా, గర్వంగా - చెప్పుకున్న కథ.
కాంతార...
ఈ లోకపు పోకడ కాదిది అనిపించే అలౌకికానుభవం.
శివలీలా చిద్విలాసం
శివలీలా చిన్మయ లాస్యం
శివలీలా ప్రకృతి విలాసం
శివ-లీలా ప్రణయ కలాపం
వెరసి ...
కాంతార చిత్రం... దృశ్య విశిష్టం!
~ సినీ-మా-లక్ష్మి


రిప్లయితొలగించండిఆ గుళిగ పుడుతూనే మహా ఆకలితో పుట్టాడట, ఎంత ఆకలీ అంటే మహావిష్ణు చుట్టూ వున్న క్షీరసాగరంలో వున్న చేపలన్నిటినీ తినేసేంత...:-)
కదా! :) క్షీరసాగరంలో చేపలేంటా అని కూడా ఆలోచించలేదు నేను - మా తుళు-ఫ్రెండ్‌తో గుళిగ కథ చెప్పించుకున్న ఆనందంలో. ఏ సముద్రానికి తగ్గ చేపలు అక్కడ వుండకపోవు కదా అనుకున్నా :)
తొలగించండిసినిమా చెప్పని కథ ముందు చదివాను. భలే ఉంది.
రిప్లయితొలగించండిఈ పోస్ట్ కూడా ఒక గొప్ప కథ లా ఉంది.
నాకూ ఆ సినిమా చెప్పని కథ భలే నచ్చింది. మీకూ నచ్చడం ఇంకా నచ్చింది.
తొలగించండిಲಲಿತಾ... ಕಾಂತಾರ ಚಲನ ಚಿತ್ರದ ಮೇಲೆ ಇಷ್ಟು ಒಳ್ಳೆ review ನಾನು ಕನ್ನಡದಲ್ಲೂ ಓದಿಲ್ಲ ... ಇದು ನೀನು ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ ಇಂದ ಬರೆದದ್ದು ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ವಾಯಿತು. ನೋಡಿರುವ ಕಥೆಗೆ ತಿಳಿಯದೇ ಇರುವ ಹಿನ್ನೆಲೆ ಕಥೆ ಕೊಟ್ಟಿದ್ದು ನಿಜವಾಗಿಯೂ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ, ಇದು ಎಂದೋ ಯಾರೂ ಮಾಡಿಲ್ಲ - ಈ ಹೆಮ್ಮೆ ನಿನದೇ!!
రిప్లయితొలగించండిನೀನು ಹೇಳಿದ್ದು ನಿಜ ... ಎಂದೂ mass movies ನೋಡದೆ ಇರುವ ಅಕ್ಷತಳು ಇದನ್ನು ನಾಲ್ಕು ಬಾರಿ ನೊಡಿದ್ದಾಳೆ.. ಪ್ರತಿ ಸಲವೂ ಹೊಸದಂತೆ ಇತ್ತು ಈ ದಂತ ಕಥೆ ಅಂತ ಅವಳು ಸಹಾ ಹೇಳಿದಳು. ನೀನು ಬರುವ ತಿಂಗಳು ಇಲ್ಲಿ ಬಂದಾಗ ನಿನ್ನ ಒಟ್ಟಿಗೆ ಇದನ್ನು, OTT ಯಲ್ಲಿ ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನೋಡುವ ಆಸೆ ಇಟ್ಟುಕೊಂಡಿದೀನಿ... ತುಳುನಾಡಿನ ಕನ್ನಡ ವನ್ನು (sub titles ಹಾಕ್ಕೊಂಡು ಆದರೂ ಸರಿ) ನೋಡಿ ಖುಷಿ ಪಡೋಣ.
కొంపదీసి ఇది paid ప్రమోషన్ కాదు కదా ?
తొలగించండిಅಪರ್ಣೆ ! "ಕಾಂತಾರ"ನು ಕನ್ನಡ ದಲ್ಲೇ ನೋಡುವ ಆಸೆ ನಾನೂ ಇಟ್ಟುಕೊಂಡಿದಿನಿ. ಅದು ನಿನ್ನ ಜೊತೆ ಆದ್ರೆ ಇನ್ನೂ ಖುಷೀ. ನಾವಿಬ್ಬುರೂ ಸೇರಿ ಖಂಡಿತ ನೋಡೋಣ!
తొలగించండిపైన కమెంట్‌లో "కొంపదీసి ఇది paid ప్రమోషన్ కాదు కదా ?" అన్న ఓ పేరులేని వారూ!
తొలగించండిభలే వారండీ మీరు!
రెండుసార్లు టికెట్టు డబ్బులు pay చేసి కొనుక్కుని మరీ చూసిన సినిమా గురించి రాసినది "paid" ప్రమోషన్ కాక ఇంకేమవుతుంది?
మీరెవరో పేరు చెప్పకుండా మంచి పనే చేసారు - లేకపోతే మీ ఈ కమెంట్ పోస్ట్ చేసినందుకు కూడా paymenT అడిగి వుండేదాన్ని.
ఔనండీ, ఈ పాన్ ఇండియా సినిమాలు నాకు కూడ నచ్చటం లేదు. KGF, RRR, విక్రమ్... ఈ మూడు నాకు బోర్ కొట్టాయి. బహుశా యూత్ కోసం తీస్తారేమో?
రిప్లయితొలగించండికాంతారా చూడాలి.
నాకైతే ఈ మధ్య సినిమాలు "రాజు గారి కొత్త బట్టల్లా" అనిపిస్తున్నాయండి. కొన్ని సినిమాలు చూడనేకూడదు - చూస్తే మాత్రం అందరితో పాటు అర్థమైనట్టు తలూపేస్తేనే అపార్థాలు తప్పుతాయని అనిపిస్తోంది.
తొలగించండికాంతార చిత్రం గురించి అనేక విశేషాలతో , దాదాపు పరిశోధన పత్రం లాగా అద్భుతం గా వ్రాశారు ఈ పోస్టు. Simply superb.
రిప్లయితొలగించండిసినిమా చూశాక ఆ కథ వెనకాల కథ తెలుసుకోకుండా వుండలేకపోయాను. తెలిశాక రాయకుండా వుండలేకపోయాను. మీకు నచ్చినందుకు సంతోషం! థాంక్స్!
తొలగించండిPAN is not an acronym. Presence across nation may not be the right expansion. When we say Pan American, pan African, Pan India etc. it connotes common for all of America, Africa, India etc.
రిప్లయితొలగించండికదా! నాకసలు అది "pan-" అయుండొచ్చు అన్న ఆలోచన కూడా రాలేదు. గుర్తు చేసినందుకు మీకు థాంక్స్!
తొలగించండికానీ PAN=Presece Across Nation అని ఎవరన్నారో కానీ అది కూడా సరిగ్గా సరిపోయింది - అది నిజానికి acronym కాకపోయినా.
హమ్మయ్యో, సినిమా కథ కన్నా నువ్వు రాసిన సమీక్ష చదువుతుంటేనే ఒళ్ళు జలదరించింది అమ్మాయ్!
రిప్లయితొలగించండిAtta nenu Charan ni
రిప్లయితొలగించండిAmma ippude chadivi vinipinchindi....adi vinnaka ee point of view lo inkosari (3rd time) cinema ni chodali Ani vundi atta .......assalu chaala baaga describe chesav atta..... Goosebumps kooda vachayi 🫡😍
Atta in your blog the indescribable hidden features has been unveiled !!
Huge respect 🙇🏻
PAN India ante telisindi, review bagundi. Memu chudali velli. Ads chustunte interesting ga vundi. 👌
రిప్లయితొలగించండిలలితోవాచ "ప్రపంచానికంతా ఘుమఘుమలాడే బిర్యానీ అంటే "అబ్బా! ఏం రుచి" అనిపిస్తుంది కదా! నాకు మాత్రం అలవాటు లేకో, అలవాటు చేసుకోలేకో ఆ రుచే సొక్కదు."
రిప్లయితొలగించండిలలితగారూ, ఇన్నాళ్ళూ నేనొక్కడినేనా అనుకున్నాను. నాక్కూడా బిర్యానీ ఏమాత్రమూ నచ్చదు. ఒకసారి మాఆఫీసులో లంచ్ పార్టీ అని కేవలం బిర్యానీ ఏర్పాటు చేశారు నేను ఆభోజనం ఉన్నాను కాని ఎవరెంత బలవంతం చేసినా బిర్యానీ ముట్టలేదు.