24, జూన్ 2018, ఆదివారం

ఆ గాలి... ఆ నేల....ఆ ఊరు...(దేశీ మజిలీ కబుర్లు) - 1 - వీడు వీడాం!

2017 ఆగస్టులో మొదలు - ఇండియా వెళ్దాం అన్న ఆలోచన. కానీ పడలేదు. అన్నజింక ఆగస్టులో వెళ్తే రెండు వారాలు మాత్రమే వుంటాను అన్నాడు. ఇంక బుజ్జిజింక అయితే ఆగస్ట్ 21, 2017 న ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం చూడడానికి ప్రపంచంలో ఎక్కడ వున్నా సెయింట్ లూయిస్‌కి తిరిగి రావాల్సిందే అని చెప్పనే చెప్పేశాడు.

అలా ఆ ఆగస్టు ప్రయాణం వాయిదా పడింది. డిసెంబర్ సెలవుల్లో అన్నజింక జపాన్ వెళ్లి వచ్చాడు. వస్తూనే వాడి undergrad గ్రాడ్యుయేషన్ సెరమనీ తేదీలు చెప్పాడు మే 12 (యూనివర్సిటీ లెవెల్లో), మే 15 (ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ లెవెల్లో).

అప్పుడు మొదలయింది - బదరి పంచమాస-ప్రయాణ-ప్రణాళిక. అదేంటంటే మే 11కల్లా బయల్దేరి కాలిఫోర్నియా వెళ్ళి అన్నజింక గ్రాడ్యుయేషన్ చూసేసుకుని అట్నుంచటే ఇండియా వెళ్ళాలీ అని. అలా చేస్తే సెలవులు కలిసి వస్తాయి అని. అనుకున్నదే తడవు కాలిఫోర్నియాకి, అక్కణ్ణుంచి హైదరాబాదుకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేశారు.

ఆ తర్వాత ఇండియాలో ఉండబోయే నాలుగు వారాలు ఎలా ప్లాన్ చేశారంటే - నేను చూడాలనుకున్న పెద్దలనూ, వెళ్లాలనుకున్న ప్రదేశాలనూ, కలవాలనుకున్న స్నేహితులనూ దృష్టిలో పెట్టుకుని 95 శాతం ట్రిప్పుని నాకనుగుణంగా ఉండేలా.

ఇంతకు ముందు ఇండియా వెళ్లి తిరిగి వచ్చిన ప్రతిసారీ 'అరె! ఆ వూరు వెళ్ళలేదు' అనో, 'అయ్యో-వాళ్ళని పలకరించలేదు' అనో ఏదో ఒకటి మిస్ చేశాను అన్న బాధ ఉండేది. అందుకే ఈసారి బదరి ముందే చెప్పారు - 'ఏ ఊరు వెళ్ళాలో, ఎవరిని కలవాలో అన్నీ ముందే రాసుకుందాము - దాని ప్రకారమే ప్రయాణాలు ప్లాన్ చేసుకుందాము. ఈసారి వెనక్కి వచ్చాక నువ్వు గడిచిపోయిన రోజుల్ని తలుచుకుని హాపీగా ఉండాలి తప్పితే బెంగ పెట్టుకోకూడదు' అని. అలా చెప్పడమే కాదు అన్నట్లుగానే ట్రిప్ మొత్తాన్ని ఒక స్ప్రెడ్‌షీట్‌లో స్టార్టింగ్ & ఎండ్ పాయింట్స్ - బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ, లంచ్ ఎక్కడ, నైట్‌హాల్ట్ ఎక్కడ - వెళ్లిన చోట ఎవరిని కలవాలి - ఇలాంటివన్నీ రాసి ఒక కాపీ నాన్నకి, ఒక కాపీ బాలాజీకి, ఒక కాపీ మా మరిది విజయ్‌కి మెయిల్ చేశారు. ఒక రకంగా మా ఇండియా ట్రావెల్-2018 ఒక డిజైనర్-ట్రావెల్ - డిజైన్డ్ బై బదరి.

అలా తయారు చేసుకున్న ప్రయాణ-ప్రణాళికను బట్టి ఇండియాలో మేము వెళ్లే ఊర్లలో వుండే వాళ్లకి మేమొస్తున్నట్లు చెప్పి - వీలైతే కలుద్దామని ముందే చెప్పి ఉంచాము. అందులో భాగంగా జూన్ 2వ తారీఖుకి అన్నపూర్ణమ్మగారు గణపవరంలో వుంటారని అపర్ణా మెహర్‌తో అడిగి confirm చేసుకున్నాను. జూన్ 3 న టంగుటూరులో స్నేహితులని కలవాలని వస్తున్నామని వీలైనంత మందికి చెప్పమని హరికి చెప్పాను. హరికి చేసినప్పుడే ఒంగోలులో పేరున్న డాక్టరు, నాకు చిన్ననాటి స్నేహితురాలు కృష్ణకుమారికి (కృష్ణ), పిల్లలకి పాఠాలు చెప్తూ వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్న ఉపాధ్యాయినులైన నా ఒకప్పటి సహాధ్యాయినులు ఈశ్వరమ్మ, ఎలిజబెత్, ఇందుమతిలకూ ఫోన్ చేసి చెప్పాను - జూన్ 3 కి టంగుటూరులో కలుద్దామని. ఇంకా పూర్ణశ్రీ, పుట్టా శ్రీనివాసులకి కూడా ఫోన్ చేసి చెప్పాను.

ఇందుమతి టంగుటూరు రాలేనని చెప్పింది. కృష్ణ అదేరోజు వాళ్ళమ్మాయికి విజయవాడలో JIPMER exam ఉందనీ - సాధ్యమైనంతవరకూ సాయంత్రానికైనా రావడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. 

అలాగే అపర్ణకి ఫోన్ చేసి ఈసారి బెంగళూరు రావడం కుదరదని చెప్తే - నీ ట్రావెల్ ప్లాన్ చెప్పు. వీలు చేసుకుని నువ్వున్న చోటుకే నేనొస్తాను - అంది. అలా అయితే మేమిద్దరం ఎక్కడ కలవాలో ఇండియా చేరాక మాట్లాడుకుందాము అనుకున్నాము.

మేము నలుగురం (బదరి, నేను, బుజ్జిజింకలు) కలిసి ఇండియా వెళ్లి 10 ఏళ్ళు అయింది. ఈ సారి ట్రిప్ ముఖ్య ఉద్దేశ్యం పెద్దవాళ్ళని చూడడంతో పాటు - బదరి, నేను చిన్నప్పట్నుంచి పోస్ట్-గ్రాడ్యుయేషన్ దాకా చదివిన స్కూళ్ళు, కాలేజులు పిల్లలకి చూపించాలని. అందులో భాగం గానే గుంటూరు, గణపవరం, టంగుటూరు, తిరుపతి వెళ్లాలని అనుకున్నాము. తీరా తిరుపతి ప్లాన్ లోకి వచ్చేటప్పటికి అన్నజింక కోసం అమ్మ చిన్నప్పుడు వాడెత్తు పటికబెల్లం ముడుపుగా ఇస్తానని తిరుపతి వేంకటేశ్వర స్వామికి మొక్కిన మొక్కు జ్ఞాపకం వచ్చింది. పైగా అత్తయ్య కూడా గుర్తు చేశారు ఫోన్ చేసినప్పుడు. దాంతో అందరం కలిసి వెళ్దామని - చిన్నా పెద్దా అందరితో కలిపి 18 మందితో తిరుపతి ప్రయాణం ప్లాన్ చేశాము. దర్శనం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుతానికి మూడు వందల రూపాయల దర్శనం బాగానే వుంది - అది బుక్ చేసుకోమని బాలాజీ చెప్పారు. అదే చేశాము. తిరుమలలో ఉండడానికి గెస్ట్-హౌస్ బాలాజీ బుక్ చేస్తానని చెప్పారు. ఎందుకైనా మంచిదని హనుమాన్‌కి ఫోన్ చేసి అడిగాను - ఒక మూడు రూములు ఎక్కడైనా దొరుకుతాయా అని. వెంటనే - అక్కా! నువ్వంతగా అడగాలా అని - వాళ్ళ పుష్పగిరి మఠం తరఫున ఒక మూడు గదులు బుక్ చేశాడు. 

మా ప్లానుని బట్టి ఇండియాలో బస్సులు, ట్రెయిన్లు ఎక్కడం కుదరదని - వెళ్లిన ప్రతిచోటా టాక్సీ మాట్లాడుకుందామని ముందుగానే అనేసుకున్నాము.

ప్రయాణం హడావిడి ఏప్రిల్ నుంచి మొదలయింది. ఇండియా నుంచి ఎవ్వరూ ఇది కావాలని అడగలేదు. పైగా అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి - మీరు రండి చాలు అన్నారు. పిల్లలకి చాకొలెట్స్, మొట్టమొదటిసారిగా చూడబోతున్న బుజ్జి జైత్రకి ప్ర్రాక్స్, బొమ్మలు - ఇలా ఏవో చిన్నపాటి షాపింగ్ చేశామంతే. అయినా ఏంటో హడావిడి - ఎప్పుడూ బయటికీ, ఇంట్లోకి తిరుగుతున్నట్లే ఉండేది.

ఈలోగా స్ప్రింగ్ అలెర్జీస్ మేమూ నీతో వస్తామంటూ తయారు - ముక్కు, కళ్ళు సొంతం చేసేసుకుని.

అప్పటికి పదమూడేళ్ల నుండి వేసిన ప్రతి మొక్కా జింకలు తినేస్తున్నాయని ఇంటి ముందు చిన్నపాటి తోట కూడా పెంచని మేము - ఈ ఏడాది ఎలాగైనా కొన్ని deer-resistant మొక్కలు వేసి చూద్దామనుకుని ఇంటి దగ్గరే వున్న Matt అనే అతనితో ల్యాండ్-స్కేపింగ్ చేయిద్దామని అనుకున్నాము - అది కూడా మా ప్రయాణపు చివరి నిముషం దాకా సాగింది. అదొక హడావిడి. 

ఈ సందడిలో ఇంకా సందడి ఏంటంటే ఆఫీసులో జరిగిన రీ-ఆర్గ్. మారిన టీములు. వెళ్ళేలోగా పూర్తి చేయాల్సిన డాక్యుమెంట్లు.

అంతకన్నా మహా సందడి - మేము ఇండియాలో అడుగు పెట్టే సమయానికి పూర్తయి బుక్ చేతికి రావాలి అని ముచ్చటపడి బదరి ప్లాన్ చేసిన నా బ్ల్లాగ్-బుక్ ప్రింటింగ్. దానికోసం మేమిద్దరం - ప్రయాణపు హడావిడి, ఆఫీస్ పని ఒత్తిడి మధ్య దొరికిన ప్రతీ నిముషం నా బ్లాగ్-బుక్ ఎడిటింగ్ కోసం పని చేశాం.

ప్రయాణానికి ముందు పెట్టాల్సిన అప్పగింతలు - అంటే నా వంటింటి-కల్పభూజమైన కరివేపాకు మొక్క, అప్పుడే మొలక-నవ్వులు రువ్వుతున్న తులశమ్మ - రెంటినీ నా వాకింగ్-నేస్తం హేమకి అప్పజెప్పాను. ఇంట్లో వున్న మనీ-ప్లాంట్, అలో-వెరాలకి ఐదు వారాలకి సరిపడా నీళ్లు పోశాను.

అనుకున్నట్లుగా మే 11 న మా ఆస్థాన-క్యాబ్ డ్రైవర్ ఎఫిమ్ చోదనంలో - ముగ్గురు మనుషులు (బదరి, నేను, బుజ్జిజింక), మూడ్రెళ్ళారు సూట్కేసులు, రెండు క్యారీ-ఆనులతో సెయింట్ లూయిస్ ఎయిర్-పోర్ట్ చేరి విమానమెక్కి సాయంత్రానికి ఓక్‌లాండ్-కాలిఫోర్నియా చేరాము. అన్నజింక వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. మా అంతర్జాతీయ-ప్రయాణపు సామాను పట్టగలిగే, ఇంకొంచెం పెట్టగలిగే అంత రథాన్ని రెంట్ చేసుకుని ఎమరీవిల్‌లో వున్న - ముందుగానే బుక్ చేసుకున్న Mariott కి వెళ్ళాము. అప్పటి నుంచి మే 16 దాకా ఆ Mariott-ఎమరీవిల్‌ మా ఇల్లన్నమాట.

మేము వెళ్లిన సమయానికి హోటల్ రూమ్ కిటికీ లోంచి కనిపించినవి - నీలిరంగులో మిలమిలలాడుతున్న మిన్ను- సూర్యుడి వెలుగులో తళతళలాడుతున్న సముద్రపు నీరు - అటూ ఇటూ  తిరుగుతున్న కార్లతో కళకళలాడుతున్న రోడ్డు... 




<< మరిన్ని దేశీ మజిలీ కబుర్లు తరవాతి పోస్టులో >>


12 కామెంట్‌లు:

  1. ఓహో, అయితే ఇటీవలే భారతదేశానికి వచ్చివెళ్ళారా? మీ వెకేషన్ని పూర్తిగా ఆనందించారని తలుస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహారావుగారు: అవునండి. మే-జూన్ నెలల్లో ఓ నాలుగు వారాలు అక్కడే వున్నాము. బాగా ఎంజాయ్ చేశాము. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  2. అందరినీ గుర్తుపెట్టుకున్నారు కానీ బ్లాగర్లు గుర్తుకురాలేదా ? మమ్మల్ని కలవాలనిపించలేదా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో అలా కాదండి, నీహారికగారు. మాకున్న కొంచెం టైంలో ఎవరిని కలవగలమో వారికే తెలియజేశాం- మిగిలిన వాళ్లకి చెప్పి మరీ నిరుత్సాహపరచడం ఇష్టం లేక.

      తొలగించండి
  3. గుర్తుకు రాని బ్లాగరుల కోసమెగా ! గుది గ్రుచ్చి పోష్టులన్
    వర్తిల రాసి , సీరియలు పధ్ధతిలో మన ముందు నిల్పుటల్ ,
    గుర్తుకు వచ్చు పాఠకుల కోసమెగా ! లలితోక్త చాతురీ
    నర్తిత భావ భూషణ ఘణం ఘణ భాషణ రామణీయముల్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాష్టారూ! అందరూ గుర్తు వున్నారండి. సమయమే లేదు. మీ పద్యవ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  4. మహానటి సినిమాలో జెమినీగణేష్ లాంటి వాళ్ళు పాఠకులు...ఎందుకు గుర్తుకురారూ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు భలేవారండి :) ఎక్కడి నుంచి ఇంకెక్కడికో కలిపేశారు.

      తొలగించండి
  5. నిన్ను బంగారం బావగార్ని జింకపిల్లలని కలసినదుకు నీ కబుర్ల పుస్తకం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
    కానీ హైదరాబాద్ లో చా...లా...తక్కువ సమయం ఉన్నారు అది నాకు బోల్డంత నచ్చలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తమ్ముడూ! నీ అంతట నువ్వే అడిగి వచ్చి మరీ కలిశావు - చాలా సంతోషం! ఇంకోసారి నీకు నచ్చేలా ప్లాన్ చేద్దాం - సరేనా?!

      తొలగించండి
  6. ఇంకో కొత్త సిరీస్ మొదలు పెట్టావన్నమాట. ఈ సిరీస్ లో రాబోయే పోస్ట్ ల కోసం వెయిట్ చేస్తుంటా.
    అంత మంచి టైటిల్ కు న్యాయం చేయాలంటే క్లుప్తంగా; అలా touch and go లా కాకుండా డీటెయిల్డ్ గా రాయాలి మరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకో కొత్త సిరీసే, లక్ష్మీ! ఇన్నేళ్ల తర్వాత వెళ్ళినందుకు కొన్ని అపురూపమైన జ్ఞాపకాలు అనుకోని బహుమతులుగా దొరికాయి. వాటిని రాసుకోకపోతే మరుగున పడిపోతాయేమోనని భయం. చదువుతున్నందుకు, వీలు చేసుకుని కమెంట్ పెడుతున్నందుకు చాలా థాంక్స్!

      తొలగించండి