13, ఆగస్టు 2016, శనివారం

వినండి ఇంకోసారి - కబుర్లు ఆఫ్ వూ-రీ


[అప్పుడెప్పుడో నేను పుట్టించిన నా అల్లారు ముద్దు పాత్రలు ఎసెస్. రీ , ఎసెస్. వూ లు ఎలా వున్నారా అని మొన్న గురువారం ఒకసారి వాళ్లింటి వైపుకి వెళ్లి వచ్చాను. అక్కడ నేను విన్నవీ - కన్నవీ కొన్ని కబుర్లు ఇక్కడ.  
ఎసెస్. రీ , ఎసెస్. వూ అసలెవరూ అనుకుంటే ఇక్కడకి వెళ్లి తెలుసుకోండి మరి :)]

"నాన్నమ్మ! నాన్నమ్మ!" - రైలు ఇంకా ఆగకుండానే కిటికీ లోంచి కనబడిన సుభద్రమ్మగారిని చూసి చప్పట్లు కొడుతూ గంతులేస్తున్నారు - వైదేహి, విరించీ.

ఎసెస్. రీ కి వరలక్ష్మీ వ్రతం అంటే బాగా పట్టింపు. ఎప్పటికైనా తన పూజలకు మెచ్చి ఏదో ఒక వరలక్ష్మీ వ్రతం రోజు  ఆ వ్రత కథలో చారుమతికి లాగా తనక్కూడా ఆ వరలక్ష్మీ దేవి నిలువెత్తు బంగారం ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకే ప్రతీ ఏడాది అమ్మనో, అత్తగారినో తన వ్రతం జయప్రదంగా నడిపించడానికి సాయంగా రమ్మంటుంది. మరి - వరలక్ష్మీ వ్రతం అంటే మాటలా - పొద్దున్నే లేచి చేయాల్సిన పూజా, వండాల్సిన తొమ్మిదిరకాల పిండివంటలూ, సాయంత్రం పిలవాల్సిన పేరంటాలూ  - ఎంత పనీ, ఎంత హడావిడీ ?! అందులోనూ ఈసారి అపార్టుమెంట్ వాళ్ళందరూ కలిసి సామూహికంగా వ్రతం చేద్దామని ప్లాన్ చేశారు. 

అదుగో - అదీ - ఎసెస్. రీ ఉరఫ్ సుందరి మేనత్త-కం-అత్తగారైన సుభద్రమ్మగారి రాకకి కారణం. 
--------------------------------------------------------------------------------------------------------

రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి రాగానే స్నానం అదీ పూర్తి చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని హాలులోకి వచ్చిన సుభద్రమ్మగారు -  సోఫాలో మఠం వేసుకుని కూర్చుని - రెండు పక్కలా తననానుకుని కూర్చున్న పిల్లలతో సమానంగా - టీవీలో  "కొట్టుకుంటే కోటా చీర" చూస్తూ - చిన్నపిల్లాడిలా చప్పట్లు కొడుతున్న ఎసెస్. వూని   చూసి " ఏంట్రా సుబ్బాయ్! అంత బావుందేంటి ఆ ప్రోగ్రాం ?!",  అంటూ తనూ పక్కనే వున్న మోడా మీద కూర్చున్నారు. 

టీవీ స్క్రీన్ మీద చూస్తే అక్కడ - ఆంధ్రుల అభిమాన ఛానెల్ అయిన మీ-టీవీ వాళ్ల ఏంకరుడు "కొట్టుకుంటే కోటా చీర" కార్యక్రమాన్ని అత్యుత్సాహంతో జరిపిస్తున్నాడు. అతని మొహం చూస్తే మహా-జాబ్-శాటిస్ఫాక్షన్ వున్నవాడిలా వున్నాడు. 

అటు అత్తలూ, ఇటు కోడళ్లూ - రెండు గ్రూపులుగా ఆడవాళ్లను నిలబెట్టి - వాళ్లకి - ఫేస్ బుక్ లో మీ చీరకి లైక్ కొట్టక పోతే మీకేం చేయాలనిపిస్తుంది, మీ వాట్సాప్ లో ఫార్వార్డ్ చేసిన మెసేజ్ కి ఓ దండమో, థంసప్పో రెస్పాన్స్ రాకపోతే ఎలా కొట్టాలనిపిస్తుందీ - అని వెరైటీ వెరైటీ సన్నివేశాలని ఊహించుకోమని చెప్పి - మొదటి రౌండ్ "ముక్కు గిల్లిపో",  రెండో రౌండ్ "లెంపకాయేసిపో" అయ్యాక చివరాఖరుది, ముత్యపు మూడో రౌండ్ "తుక్కు రేగ్గొట్టిపో" లో మొదటి రెండు రౌండ్లలో గెలిచిన గ్రూప్ చేత రెండో గ్రూప్ ని చీపుళ్లతో కొడుతూ తరిమిస్తున్నాడు. 

అది చూస్తూనే - "ఈ ఆడవాళ్ళ ప్రోగ్రాం నీకెందుకురా?" - సుభద్రమ్మగారు ఆశ్చర్యపోయారు.

ఎసెస్. వూ తల తిప్పి తల్లికేసి చూస్తూ 

"అమ్మా ! ముల్లుని ముల్లుతోనే తీయాలి కదా ?!" అన్నాడు 

"అవునూ... " - సుభద్రమ్మగారి ఆశ్చర్యపు ముల్లు కొంచెం పైకి కదిలింది

"మరి - వజ్రాన్ని వజ్రం తోనే కోయాలంటారు కదా?!"

"అబ్బా - అవునురా - సుబ్బాయ్ - చదవేస్తే వున్న మతి పోయిందని - టీవీలో ఆడవాళ్ల ప్రోగ్రాం ఎందుకు చూస్తున్నావురా అంటే ముల్లూ-వజ్రం అంటూ తలా-తోకా లేకుండా ఆ వాగుడేంటీ ?" - విసుక్కున్నారు ఆవిడ. 

"అదే చెప్పబోతున్నా - ఆ వరుసలోనే - ఆడవాళ్లని ఆడవాళ్లే కొట్టాలి - అని ఈ మీ-టీవీ షో చూస్తేనే తెలిసింది నాకు. అబ్బబ్బా! అటు చూడు - ఆ చీరలు లాక్కోవడం, ఒకళ్ళ జుట్టు ఒకళ్లు పీక్కోవడం - అసలే మొగాడన్నా అంత ధైర్యం చేయగలడా !?",  అంటూ మళ్లీ చప్పట్లు కొట్టుకుంటూ ఆ షో చూడ్డంలో మునిగిపోయాడు. 

"ఒరే సుబ్బాయ్ - మీ నాన్నా ఇంతే - గృహప్రవేశం సినిమాలో జయసుధ ఎస్వరలక్ష్మి మీద చెయ్యి ఎత్తే సీను మళ్లీమళ్లీ రివైండ్ చేసుకుని చూసి మరీ ఇలాగే నవ్వుకుంటూ వుంటారు - ఏం  చేస్తాం - సిరబ్బదు కానీ చిడుమబ్బుతుందంటే ఇదే కాబోలు" అనుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్లారు సుభద్రమ్మగారు. 

 -----------------------------------------------------------------------------------------------------------------------

వంటింట్లో బ్రేక్ ఫాస్ట్ కోసమని ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి పచ్చడి కోసమని పోపు వేయిస్తోంది ఎసెస్. రీ . 

వస్తూనే సుభద్రమ్మగారు, " అవునే సుందీ! ఆ మధ్య అమెరికా వెళ్లొచ్చినప్పట్నుంచీ మీ పేర్లవన్నీమార్పించేశావట కదా -  రీ, వూ, హీ, చీ - అని  ?" - అంటూ కోడలు తన కోసం కలిపి పెట్టిన కాఫీ గ్లాసు తీసుకున్నారు. 

ఎసెస్. రీ జవాబు చెప్పేలోగా - "నా మటుకు నాకు నచ్చాయి మీ పేర్లు - కానీ నన్ను మాత్రం అలా పిలవమని అడక్కు. అది సరే గానీ - నువ్వు చైనా వాళ్ళ చేత మన పంచాగం చదివించేస్తున్నావట కదా? అదెలా కుదిరిందే ?" - అని మళ్లీ ఆశ్చర్యపోయారు. 

"అవునత్తయ్యా ! ఏదో వర్క్ విషయంలో నాతో చాలా సేపు వాదించి నన్ను కన్విన్స్ చేయలేకపోయినప్పుడు మా టీమ్-లీడ్ చాంగ్ అడిగాడు - అసలు ఇలా తిమ్మిని-బమ్మి చేసే తెలివితేటలు నీకెలా వచ్చాయి - ఏం చదువుకున్నావూ అని. క్లాసు పుస్తకాలూ, ఏడాదికోసారి రాశి-ఫలితాల కోసం చదివే పంచాంగం తప్ప ఇంకేం చదవలేదని చెప్పాను. అంతే అప్పట్నుంచీ ఆ పంచాంగం చదివితే  నాలా - ఏదైనా, ఎవరినైనా - సాధించెయ్యొచ్చని మొదలుపెట్టి, ప్రతీ ఏడాది కొత్త పంచాంగం తెప్పించుకుని మన తిథులూ-నక్షత్రాలూ-వర్జ్యాలూ-రాహుకాలాలూ అన్నీ ఫాలో అయిపోతుంటాడు" - సంబరం గా చెప్పింది సుందరి 

"నీదీ నాదీ ఒకటే నక్షత్రం - భరణి - ధరణి నేలుతామని ఊరికే అన్నారా? మేనత్త చాలు నీది" - అచ్చు తన నోట్లోంచి వూడిపడ్డట్టు - "నోరారా" తననే పోలిన మేనకోడలి  ప్రతిభకి మురిసిపోయింది అత్తగారు. 

 టీవీ షో అయిపోయిందని కాలు కొంచెం సాగదీసుకుని రెండోసారి కాఫీ కోసమని వచ్చిన ఎసెస్. వూ  " అవునూ - మీ చాంగ్ ఏ విషయంలో నీతో ఓడిపోయాడు? అతను చాలా గట్టి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని విన్నానే ? - అనడిగాడు ఎసెస్. రీ ని.

కొడుకు-కోడళ్ల మధ్య తనెందుకన్నట్టు మనవలతో కబుర్లు చెప్పడానికి హాలులోకి వెళ్లారు సుభద్రమ్మగారు. 

పోపులో ఎండు మిరపకాయలు వేస్తూ - "చాంగ్ గట్టివాడే ! నా అప్లికేషన్ కి రిక్వైర్మెంట్స్- డిజైన్ ఇచ్చి టెస్ట్ కేసెస్ రాయమన్నాడు. అందులో - సర్వర్ కి రిక్వెస్ట్ పంపించకపోతే రెస్పాన్స్ రాదు - అన్నదానికి నేనొక టెస్ట్ కేస్ రాశాను. 

- Don't send a request to server
- Verify that no response is returned to the client - అని. 
అదెలా కుదురుతుంది వెరిఫై చేయడం అన్నాడు. అలా చేయడం కుదరకపోతే రిక్వైర్మెంట్ ఎలా రాశావు అని వాదించాను. ఒక గంట అయ్యాక "ఐ గివ్ అప్ " అని వెళ్ళిపోయాడు. అంతే !" -  పచ్చడిలో పోపేస్తూ గీరగా చెప్పింది ఎసెస్.రీ. 

అద్వితీయమైన ఆ టెస్ట్-కేస్ గురించి విన్నందుకో, పోపులో మిరపకాయ ఘాటుకో - మొత్తానికి ఎసెస్. వూకి పొలమారింది. 

"సరే గానీ,  వూ ! ఈ సాయంత్రం మన అపార్టుమెంట్ కమిటీ అంతా  కలిసి రేపటి  సామూహిక వరలక్ష్మీ వ్రతానికి మంటపం కడుతున్నారు. దానికి డెకరేషన్ కి  వాలంటీర్ గా నీ పేరు ఇచ్చాను. "

"అదేంటీ? నన్నడక్కుండా నన్నెలా వాలంటీర్ చేస్తావు?" - వూ ఉక్రోషంతో కూడిన ఆక్రోశం 

"వాలంటీర్ అవ్వాలంటే ఎంతో పుణ్యం చేసివుండాలి . అసలు వాలం అంటే ఏంటి? భజే వాయుపుత్రం-భజే వాలగాత్రం - హనుమంతుడి గుర్తు. త్రేతాయుగంలో  శ్రీరాముడు సీతాదేవిని వెతకడానికి వానరుల సహాయం అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా "నేను సీతామాతను వెదకడానికి వెళ్తాను" అని ముందుకొచ్చిన ఆంజనేయుడి పేరు మీదుగా ఈ వాలంటీర్ అనే పదం వచ్చింది. నువ్వెళ్లి ఆ మంటపం కట్టడానికి హెల్ప్ చేస్తే వరలక్ష్మీ-కటాక్ష-లిస్ట్ లో మన పేరు ముందుంటుంది కదాని ఆశ పడ్డాను" అని ఎసెస్.రీ ముక్కు చీదుతూ ఉంటే ఏం చెప్పాలో తోచక  - తక్షణమే వెళ్లి పరోపకారార్థం "ఇతని" శరీరం - అన్న రీ మాట నిలబెట్టటం కోసం "వాలంటీరింగ్ ఫర్ వరలక్ష్మీ వ్రతం" టీంలో చేరిపోయాడు.

10 కామెంట్‌లు:

  1. 'వాలంటీర్' అంటే అర్ధం ఇదన్నమాట!
    పరోపకారార్ధం 'ఇతని' శరీరం కూడా కుంచెం రూపం మార్చుకుని 'పరోపకారార్ధం ఇదం శరీరం' గా చలామణి ఐపోతోందన్నమాట!
    ఎసెస్ రీ గారు కూడా కూడా ఏదైనా టీ. వీ ఛానల్లో, 'పురాణాలు- అంతరార్ధాలు, పరమార్ధాలు' లాంటి ప్రోగ్రామ్ ఏదైనా మొదలెట్టేయచ్చు :)
    మరి, వారి సామూహిక వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఏంటో కూడా చెప్పెయ్‌!
    Enjoyed thoroughly. Especially the tv program part. It had me in stitches.
    Actually, why don't you develop the plot into a series of posts with these characters?
    Will surely be hilarious.
    Yeh dial mange more! Aha!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాలంటీర్ అంటే అదే మరి :)
      ఎసెస్ రీ కి నువ్వు కొత్త ఐడియాలు ఇవ్వకు - ఎసెస్ వూ ఇప్పటికే కష్టాల్లో వున్నాడు ;)
      సామూహిక వరలక్ష్మీవ్రతం చూడడానికి వెళ్లలేకపోయాను - అందుకే రాయలేదు ;)
      Definitely there will be more episodes of Ree-Voo - when the situation demands :))

      తొలగించండి
  2. "కొట్టుకుంటే కోటా చీర" ప్రోగ్రాం పేరు భలే ఉంది నిజ్జంగా ఎవడైనా ఛానల్ క్రియేటరుడు ఈ బ్లాగ్ చూసి నువ్వు తయారు చేసిన పాత్రలు రచనలు కాపీ కొట్టి వాడి పేరు వేసేసుకుని trp పెంచుకుంటే అమ్మో !!!!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదొక్కటే కాదు - ఇంకా చాలా ఐడియాలు వున్నాయి - రేటింగ్స్ ఏమో కానీ తీసిన వాళ్లకి తప్పకుండా బీటింగ్స్ పెరుగుతాయి :))

      తొలగించండి
  3. హహహ ఆ టెస్ట్ కేసూ.. వాలంటీరు డెఫినిషనూ సూపరండీ :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలాంటి అద్భుతమయిన టెస్ట్ కేసెస్ చూడడం - వినడం - నాకు దక్కిన నవ్వు-అదృష్టాల్లో ఒకటండీ. నా వాలంటీరు మీకూ నచ్చిందీ - థాంక్ యూ ! (మీరెవరో తెలిస్తే బావుండేది :) )

      తొలగించండి
  4. పోస్ట్ కడుపుబ్బా నవ్వించింది లలితా గారు. పార్ట్-3 కోసం వెయిటింగ్. వాలంటీర్ గురించి మీరిచ్చిన డెఫినిషన్ అదుర్స్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను రీ-వూ లని కలిసినప్పుడల్లా తప్పకుండా ఒక పార్ట్ వుంటుందండీ :)Thanks a Lot for your comment!

      తొలగించండి
  5. :)వాడుకున్నవారికి వాడుకున్నంత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఔనండీ - నవ్వుకున్నంత వారికి నవ్వుకున్నంత కూడా :) ధన్యవాదాలు !

      తొలగించండి