మా ఊరి తెలుగు సంఘం వారు స్పాన్సర్ చేసే women-only event సఖి.
ఆకటి వేళల ఇంటిల్లిపాదికీ అన్నమవుతూ
పనివేళల కొలువుల్లో బాధ్యత నెరవేరుస్తూ
బడిలో PTA మీటింగులంటూ, వాలంటీరింగు అంటూ
అది చాలక పాపకి పాటని, బాబుకి ఆటని
తను నేర్వలేని విద్యని పిల్లలకి ముద్దార నేర్పిస్తూ
గాజులు తొడిగిన చేత్తో స్టీరింగ్ పట్టి అలుపెరగక అటూ ఇటూ తిరుగుతూ
అలసిన సొలసిన అమ్మలకో ఆటవిడుపు - సఖి.
నాకు "సఖి" గురించి తెలిసింది కిందటి ఏడాదే. అప్పుడే తెల్సిన ఇంకో సంగతేంటంటే "సఖి" లో రకరకాల పోటీలు వుంటాయని, గెలిచిన వాళ్లకి బహు మంచి బహుమతులుంటాయని.
సరే! నాకొచ్చిన విద్య కబుర్లు చెప్పడం ఒకటే. కానీ సఖి వారిచ్చిన విభాగాల్లో కబుర్లు చెప్పడమనే విభాగమే లేదు. నాకది మరీ మంచిది కదా! అసలు విభాగమే లేకపోతే పోటీ అన్నదే ఉండదు.
అందుకని నే గెలవలేని ఏ పోటీ జోలికీ వెళ్లకుండా ఓ కాయితం మీదో నాలుగు మాటలు పేర్చుకుని, దానికో "కవిత" అన్న పేరు పెట్టి వేదికనెక్కి గబగబా చదివేశా.
ఇల్లాంటి కాయితాలూ, కవితాపఠనాలూ అంతగా అలవాటు లేకపోయినా మా తెలుగు సఖులందరూ ఎంతో మంచివాళ్ళూ, సహనం కలవాళ్ళూ కాబట్టి ఓపిగ్గా నే చదివిందంతా విని గట్టిగా చప్పట్లు కొట్టేశారు. బహు బాగుందని మెచ్చేశారు.
కిందటేడాది నే చదివిన కవిత - ఇదో ఇలా... (అప్పుడు రాసుకోవడం మర్చిపోయా...ఇప్పటికీ రాసుకోకపోతే ఇంకెప్పటికీ కుదరదని ఇక్కడే రాసేశా!)
********************************************
అహం మైనస్ ఈగో = అమీగో
నేనొక అహం
నీవొక అహం
ఈ అహమిక అహరహం
నేనొక అహం
నీవొక అహం
ఈ అహమిక అహరహం
గెలుపు కానిదెపుడూ దుస్సహం
నింగిని రవ్వలు చిమ్ముతు ఎగసి
బూడిద రాల్చే తారాజువ్వది క్షణకాలపు గెలుపు
తాను నేలను పడి మొక్కను తలెత్తించే
నీటి చుక్కది పడి లేచిన జీవితకాలపు మెరుపు
ఆ గెలుపో ఈ మెరుపో - ఏది మరి మన ఎంపికో?
వినుకో మరి నా మాటొకమాటో
నేను నువ్వు మనమై మనే ఈ పూటో
నేనుండని నువ్వుండే రేపటి చోటో
నువ్వైనా నేనైనా నెర్చుకోవాల్సిందే...
కొత్త లెక్కల తీసివేతలు
అహం మైనస్ ఈగో అంటూ...
అప్పుడే… మనం… జనం మనం గెలిచే అమీగో!
నింగిని రవ్వలు చిమ్ముతు ఎగసి
బూడిద రాల్చే తారాజువ్వది క్షణకాలపు గెలుపు
తాను నేలను పడి మొక్కను తలెత్తించే
నీటి చుక్కది పడి లేచిన జీవితకాలపు మెరుపు
ఆ గెలుపో ఈ మెరుపో - ఏది మరి మన ఎంపికో?
వినుకో మరి నా మాటొకమాటో
నేను నువ్వు మనమై మనే ఈ పూటో
నేనుండని నువ్వుండే రేపటి చోటో
నువ్వైనా నేనైనా నెర్చుకోవాల్సిందే...
కొత్త లెక్కల తీసివేతలు
అహం మైనస్ ఈగో అంటూ...
అప్పుడే… మనం… జనం మనం గెలిచే అమీగో!
********************************************
"సఖి" ఏటేటా జరిగే వేడుక కదా మరి? నిరుటి లాగే ఈ ఏడాదీ పిలుపొచ్చింది మా తెలుగు సంఘం వారి నుంచి ఆగస్టు మూడో తారీఖు శనివారం వచ్చేయండొహోయ్ - ఆడుకుని, పాడుకుని ఆనందిద్దాం అంటూ.
శ్రావణమాసపు మధ్యాహ్నపు లేలేత బంగారు రంగు ఎండలో, వెండిజలతారుల గులాబీ రంగు చీరలో మళ్ళీ నేనూ, నా కవితా, కాయితమూ తయారు.
షి-కారు బయల్దేరిన నన్ను కారులో ఎక్కించుకుని నాపైన ఎండ కమ్మకుండా, నేను కందకుండా మహాత్మా గాంధీ సెంటర్ గుమ్మంలో దింపారు బదరి.
నే వెళ్ళేటప్పటికి లోపలంతా బోల్డు హడావిడి.
రంగురంగు చీరల్లో సీతాకోకచిలుకలు
పాడే కోయిళ్ళు, ఆడే నెమళ్ళు
పంచదార పలుకుల రాచిలకలు
ఎంత సందడో !
ఓ పక్క వంటల పోటీల కోసం వండిన వంటల ఘుమఘుమలు.
ఇంకో పక్క - అప్పుడెప్పుడో చరిత్రలో చదువుకున్న - విజయనగరపు విపణి వీధికి తీసిపోని - జలతారు చీరల, జిలుగు నగల అంగళ్ళు
ఆటపాటల్లో అలిసిన అమ్మలు సేదతీరడానికి తేనీరు
దాహం తీర్చుకోవడానికి పేర్చిన బాటిళ్ల నీరు
ఎటు తిరిగితే అటే కళ్ళు తిప్పుకోనివ్వని మిలమిలలు
వీనులవిందుగా వినిపించే మాటల కలకలలు, నవ్వుల కిలకిలలు
అదొక ప్రమీలా రాజ్యం - చూసిన నాకు పట్టరాని సంబరం.
మొట్టమొదటగా గడుల్లో అంకెలుండే Bingo ఆట ఆడించారు. అందులో ముందుగా జల్దీ-ఫైవ్ అంటూ గబగబా ఐదంకెలు కొట్టేసి నేనో బహుమతి కొట్టేశా. నాకొచ్చిన మొదటి బహుమతే ఈసారి "సఖి"లో ఇచ్చిన మొట్టమొదటి బహుమతి కూడా.
ఆ తర్వాత తెర మీద బొమ్మలు చూపించి వాటి ఆధారంతో సినిమా పేర్లు, పాటలు కనిపెట్టే ఆటొహటి ఆడుకున్నాం అందరం.
ఇంతలో నన్ను పిలిచి నా కవితని చదవమని నాకు వేదికనెక్కే అవకాశమిచ్చారు.
వెళ్తూనే అంతమంది అందమైన అమ్మలని చూసి మైమరచిన నేను వాళ్ళ కోసం ఒక్కటంటే ఒక్క లైను వాళ్లకి తారీఫ్ కోసం పాడా "దేఖా న కరో తుమ్ ఆయీనా ...కహీ ఖుద్ కీ నజర్ న లగే... చష్మే బద్ దూర్..." అంటూ.
ఆ తర్వాత నాకిష్టమైన పాట గురించో మాట అంటూ "పాట నా నవ్వు - పాట నా నొవ్వు ; పాట నా తోడు - పాట నా సైదోడు" అంటూ నే రాసుకెళ్లిన కొన్ని లైన్లు చదివా.
********************************************
పాట నా నవ్వు - పాట నా నొవ్వు
పాట నా తోడు - పాట నా సైదోడు
నా మాట పాట - నా మౌనం పాట
నా ఊసు పాట - నా ఊహ పాట
పెదవులు కదపగ అలికిడి నా పాట
పాట నా తోడు - పాట నా సైదోడు
నా మాట పాట - నా మౌనం పాట
నా ఊసు పాట - నా ఊహ పాట
పెదవులు కదపగ అలికిడి నా పాట
కదలని పెదవుల మఱగది నా పాట
ఒక్కో పాట వింటుంటే...
గొంతు కలిపి పాడమంటుంది
పాట రాని చోట, పాడలేని చోట, ఒప్పో-తప్పో పట్టని తననా-తానా-తంతననా తాళమౌతుంది
వేళ్ళ చివర చిటికెలూరుతుంది
పదం కదం తొక్కుతుంది
వంటింటిలో గరిట తిప్పేవేళ - కుతకుతలాడు కూరో, కళపెళలాడు చారో - ఏదోదాని లయకి కాలి చిందవుతుంది
పగలంతా ఉనికి-చాటింపుకో, మనుగడ-పాటింపుకో చేసే కొలువులో అలసిన మనసుకి విందవుతుంది
పాట నా నవ్వు.
ఒక్కో పాట పాడబోయి గొంతు విప్పితే...
ఏదో గుర్తు కదిలి - పాడబోయిన గొంతు పాడలేనంటుంది
నన్నిక పాడమనకంటుంది
మాట వినక పాట సాగించబోయిన నా మీద అలిగి డగ్గుత్తికయిడుతుంది
కంటిలోన ఉబికిన నీరవుతుంది
పాట ఆగి, పాట నోపని బాధవుతుంది
పాట నా నొవ్వు.
ఒక్కో పాట పాడుతుంటే...
మనసు నేల విడిచి నింగిమబ్బు అంచునచేరుతుంది, ఊగుతుంది, తూగుతుంది
ఏవేవో లోకాల సాగుతుంది
పాట లేని నేను ఏమౌతానో అనే బెంగ పుడుతుంది
పాట నొదిలి ఉండలేని ప్రేమవుతుంది
పాట నా తోడు.
పాటని నేనెంత ప్రేమించానంటే...
నేనే పాట పాడినా అది నాదవుతుంది
నన్ను నీకిచ్చేసుకున్నా - నన్ను పాడుకుంటూ నువ్వుండిపొమ్మంటుంది
నేనెలా పలికినా, పెగలక పిగిలినా - ఏం ఫర్లేదు నీతోనే నేనున్నానంటుంది
పాట నా సైదోడు.
పాట నా నవ్వు - పాట నా నొవ్వు
పాట నా తోడు - పాట నా సైదోడు.
********************************************
ముందే చెప్పాగా - మా "సఖి" కొచ్చిన సఖులు బహు మంచివారు. చప్పట్లు గా..,ఠిగా కొట్టి మెచ్చేసుకున్నారు.
ఈ లోగా మేమీ ఊరు వచ్చినప్పటినుంచీ, నేను ఎక్కడ కనిపించినా దగ్గరకొచ్చి కలుపుగోలుగా మాట్లాడే మా జంగారెడ్డిగూడెం అమ్మాయి పద్మ నాకోసం టీ కప్పోటి తెచ్చి నా చేతికిచ్చింది - "లలితా మీకోసం తెచ్చా"- అంటూ!
స్టేజ్ మీద కొన్ని పాటలు, ఆటలు అయింతర్వాత ఇండియా నుంచి వచ్చిన లక్ష్మిగారు ఓ పది నిముషాలు ధ్యానం గురించి మాట్లాడుతానంటూ వచ్చి, ఆవిడ వేణువు వాయిస్తూ మా అందర్నీ ఓ మూణ్ణిముషాలు కుదురుగా కూర్చోబెట్టినందుకు నేను వెళ్లి ఆవిణ్ణి అభినందించా. ఎందుకంటే ఆవిడ ప్రసంగం మొదలు పెట్టినప్పుడు కబుర్లతో గలగల్లాడుతున్న సఖులందరూ ఆవిడ ప్రసంగం ముగించే సమయానికి మాటరాని మౌనమిది అన్నట్లయారు. ఆవిడ సాధించింది అవాక్కు చేసే విజయమే - అభినందించదగ్గదే మరి!
ఈలోగా చిరు ఫలహార అంతరాయం.
అపర అన్నపూర్ణల్లా మా తెలుగు ఆడపడుచులు పద్మ, విప్లవ, వారికి తోడుగా సార్థక నామధేయ అన్నపూర్ణగారు వచ్చిన వాళ్ళందరికీ కాయితప్పళ్ళేల్లో మిరపకాయ బజ్జీలు, పుణుకులు, చనా ఛాట్ పెట్టిచ్చారు.
అవన్నీ గుటుక్కుమని కడుపారా తినేసి, చెవులారా పాడినవారి పాటలు వినేసి, కనులారా ఆడినవారి ఆటలు చూసేసి, నలుగురితో నవ్వులు పంచుకుని, భలే భలే సరదా జ్ఞాపకాల్ని మూట కట్టుకుని ఇంటికి వస్తూ వస్తూ అక్కడ మా ఊరి ఆడపడుచులు పంచుకున్న హస్తకళా నైపుణ్యాలని నా ఫోన్‌తో పట్టేసుకుని నాతో తెచ్చేసుకున్నా!
ఈ కింది బొమ్మల్లో వున్న బొమ్మలని చేసిన వాళ్లెవరో నాకు తెలీదు కానీ - వాళ్లందరికీ నా చప్పట్లు!
"సఖి"ని ఇంత చక్కగా నిర్వహించిన మా తెలుగు సంఘపు సాంస్కృతిక కార్యదర్శి అర్చనకి, తనతో కలిసి పని చేసిన, తనకి సహకారమందించిన ఇంకెంతో మంది సఖులకి జేజేలు!
గాజులతో చేసిన మంటపంలో తొండం దేవర:
పుచ్చకాయలో విప్పిన పురి...
పొరలు పొరలుగా విరిసిన గులాబీలు...
కూరగాయల - కూ ...ఛుక్... ఛుక్ ...
గాజుల ఊయలలో తూగుతున్న కొండపల్లి బొమ్మ...
సీమంతపు సంబరం...

చాలా అధ్బుతంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించారు🙏🏻👌
రిప్లయితొలగించండినా బ్లాగ్ చదివినందుకు ధన్యవాదాలు!
తొలగించండిWow chala bunnayi... mee Sakhi kaburllu.. and pictures 👏👏 Mee kavitha kuda AMIGO!
రిప్లయితొలగించండిThanks, Sarada!
తొలగించండిChala baga kallalu kattinattu rasaru, Lalitha garu. Nenu raleka poyanu, kani, vachinnutuga undi me post chadivina tarvatha!
రిప్లయితొలగించండిమన సఖి గురించిన ఈ పోస్ట్ మీకు నచ్చడం నాకు నచ్చింది :)
తొలగించండి