27, ఫిబ్రవరి 2011, ఆదివారం

అనాతవరం సంక్రాంతి - అందమైన జ్ఞాపకం

పండగకి నాలుగురోజుల ముందే బయల్దేరి
గుంటూరు-అమలాపురం బస్సు దిగి
గుర్రబ్బండిలో ఇంటికి బయల్దేరితే
అనాతవరం గేటు దగ్గర్నుంచీ
చేతి వూపుతోనే ఊరివారు వేసే కుశలప్రశ్నలు
అవి అన్నీ అందుకుంటూ
మునసబుగారి ఇంటి సందు మలుపు తిరగగానే
బాబిగారొచ్చేస్తున్నారన్న కబురు  ఇంటికి చేరుతుంది
దివాణం మెట్లెక్కి అలసిన మొహాలకి నవ్వులద్దేలోగా
"ఆహ! ఆహ! వచ్చారా పిల్లలూ!" అని ఉయ్యాలబల్ల దగ్గర్నుంచి
కళ్ళజోడు సర్దుకుంటూ కచ్చా పోసి కట్టిన చీరలో నాన్నమ్మ పలకరింపు
రేడియోగదిలోంచి చిరునవ్వుతో
వినీ వినిపించకుండా "ఇప్పుడేనా రావడం?" అంటూ వచ్చే అప్ప
"పొద్దున్నే కాకి అరుస్తే అనుకున్నాను - మీరే వస్తారని..."
అని ఇంటి మహాలక్ష్మిలా ఎదురొచ్చే లలిత దొడ్డ
"బాబయ్య, పిన్ని, పిల్లలు వచ్చారు - గుంటూరు నుంచి.
రవికి, శ్రీనుకి శలవు దొరకలేదట - పెద్ద పండగ రోజుకి దిగుతారు
భద్రు, బావగారు రేపు వస్తున్నారు"
అని వీధిలో వాళ్లకి సంబరంగా చెప్పే ప్రసాదు
నాన్న ఎప్పుడు బయటికి వస్తారా అని
ఆతృతగా ఎదురు చూసే బాల్యస్నేహితులు-
సత్తికొండ, శీనప్ప, కన్నప్ప, భూషిబాబు, భాస్కరం, నాగన్నలు
రామరాజుగారింట్లోంచి ఎదురొచ్చి పలకరించే సూరిబాబు, వెంకన్నలు
"కుట్టి! షటిల్ ఆడతావా?" అని అప్పట్నించే కవ్వించే
సత్తికొండగారి రాంబాబు, చంటిలు
పండగకి ఒకరోజు ముందు దిగే లలిత అత్తయ్య, స్వాతిలు
రాగానే "ఎప్పుడెళ్లిపోతారత్తయ్యా" అనడగడం -
వెళ్ళేటప్పుడు లలితత్తయ్య ఇచ్చే డబ్బులకోసం
లల్లి, పప్పీ, కుట్టి, స్వాతిలు చేసిన పొలంలో షికార్లు
లేతచలిలో శివాలయంలో, విష్ణాలయంలో
ధనుర్మాసపు పూజలు
నెలపట్టిన సందడిలో ఇంటిముందు వేసిన ముగ్గులు
లల్లి ముగ్గు పోత బావుంది అంటే పొంగిపోయి  వేసిన ముగ్గులతో
ముస్తాబైన అనాతవరం రాజుల లోగిళ్ళు
"పిల్ల ముగ్గులేసి నలిగిపోతోందంటూ " ముద్దుగా విసుక్కున్న నాన్నమ్మ ప్రేమలు
ఆ ముగ్గులలో పెట్టిన గుమ్మడిపూల సొగసుల గొబ్బెమ్మలు
భోగిరోజు ఇంటిముందు వేసిన భోగిమంటలో
భోగిదండలతో పాటు వేసిన వెనకవీధినుంచి దొంగిలించిన పెరటి తలుపులు
ఇంట్లో చంటి పిల్లలకి పోసిన భోగిపళ్ళలోంచి ఏరుకున్న పైసలు
పెద్దపండగ రోజు "దండాల పండగ" అని
పెద్దలందరికీ దండాలు పెట్టి దండుకున్న డబ్బులు
బాంకులోంచి తెప్పించి  నాన్నమ్మ మనవలకి పంచిన పది కొత్త రూపాయి కాసులు
సంక్రాంతి సాయంత్రం "సుబ్బీ గొబ్బెమ్మా! సుబ్బడ్నీయవే!" అని ముసిముసిగా నవ్వుతూ
తట్టిన గొబ్బిపాటలు - తర్వాత ప్రసాదంగా తిన్న శనగల పాఠోళి
కనుమనాడు అల్లంపచ్చడితో తిన్న మాషచక్రాలు
సాయంత్రం రెండెడ్ల బళ్ళలో వెళ్ళిన మురమళ్ళ ప్రభల తీర్థం
కొనుక్కున్న రంగు కళ్ళజోళ్ళు
ఇంతలో గొడవలకి పగిలిన గోళీసోడాబుడ్లు
బెదిరిన రెండెడ్ల బండిలో
బింకంగా వున్న ఫ్రం-హైదరాబాద్ సిటీ-కొత్త అల్లుళ్ళు
"భయపడకండి - ఇవన్నీ మామూలే  బావగారూ" ఆరిందాలా  ధైర్యం చెప్పిన చిట్టిమరదళ్ళు
ఆడుతూ పాడుతూ ఇంటికి చేరిన పిల్లబ్యాచులు
ముక్కనుమనాడు ప్రయాణం కూడదంటే
విరిసే పిల్లల మొహాలు
ఆరోజు తులసికోట దగ్గర అమ్మ వేసే జడతో పాటు
ఇంకోరోజు వుంటే బాగుంటుందని లల్లి పెట్టే మెలికలు
స్కూల్ పోతుందమ్మా మళ్ళీ వేసంగిలో వద్దువుగాని
అనే  నాన్నమ్మతో పాటు సాగనంపే పాకపక్కన నేవేసిన చేమంతిమొక్కలు
తడిసిన కళ్ళతో - నేవెళ్ళనంటూ ఎన్నిసార్లు పంపినా
తలుపు చాటున నక్కే ఇంటి ఆడపడుచు అమ్మవారి గరగలా-
వదలలేక వదలలేక
మళ్ళీ రాబోయే వేసవి శలవులని తలుచుకుంటూ
మళ్ళీ అమలాపురం-గుంటూరు బస్సు ఎక్కే బాబిగారి ముగ్గురాడపిల్లలు....
















4 కామెంట్‌లు:

  1. అనుకోకుండా మీ బ్లాగ్ లోకి వచ్చేసాను లలిత గారూ. ఇంకాసేపట్లో ఇంటర్వ్యూ వుందని తెలిసి కూడా రెండు గంటల నుంచి సిస్టం ముందు నుంచి కదలలేదు. ఈ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో కళ్ళ లో నుంచి నీళ్ళు ఆగట్లేదు. చిన్నతనం అంతా ఎంత సందడిగా ఉండేదో. ఇలాంటి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు కళ్ళు తడి అవుతూ వుంటాయి. ఎంత బాగా రాసారో. నేనెప్పుడూ అంటూ వుంటాను నాన్న గారితో, మన ఊళ్ళు ఇంకా అంత స్వచ్చం గా ఉంటే ఈ అమెరికాలు రాకపొదుము అని. భలే రాసారండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా అనాతవరం ఇప్పటికీ అలానే వుందండీ.

      ఎప్పుడో రాసిన పాత పోస్ట్ ఓపికగా చదివి కామెంట్ పెట్టినందుకు Thank You!

      I hope your interview went well & My Best Wishes for you!

      తొలగించండి
  2. బుల్లెమ్మత్తయ్య గార్ని, అప్పాని, లలితక్కని అందర్నీ మల్లీ ఒకసారి కళ్ళముందుకి తీసుకొచ్చేసారండీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పటిదో పాత పోస్టు చదివి - మీ వ్యాఖ్యతో మళ్ళీ నేను కూడా తిరిగి చదువుకునేలా చేశారు- థాంక్సండి శ్రీనివాస్! అప్ప, లలిత దొడ్డలని తలుచుకోవడం, నాన్నమ్మని బుల్లెమ్మత్తయ్య అని మీరు సంబోధించడం చాలా ఆత్మీయంగా అనిపించింది.

      తొలగించండి