23, నవంబర్ 2017, గురువారం

సౌజన్యానికో పూలపోగు...

తానా సంబరాలు ముగిసి దాదాపు ఆరునెలలు అయింది.
అప్పటి తానాలో పాల్గొన్నది నేనా?
అది నిజమేనా ?
నే కలగన్నానా?
ఆ కలని కలిమిలా దాచుకొందునా!
ఆ కలిమి పంచిన చెలిమిని కలలోనైనా మరువకుందునా !
ఆ చెలిమి పెంచిన కూరిమిని కలకాలం నిలుపుకుందునా?!

తానాని తలుచుకున్న ప్రతీసారీ ఇప్పటికీ ఇలాగే అనిపిస్తుంది ... 

తానా సమావేశాల్లో నాకు దక్కిన లాభం - కొన్ని అపురూప పరిచయాలు, ఇంకొన్ని ఆత్మీయ సాహచర్యాలు.

అందులో కొన్ని ఎదురెళ్ళి మరీ చేయి చాపి అందుకున్నవైతే - అనుకోకుండా దొరికిన వరాలు కొన్ని.

ఇంకొన్ని - అందుకుందామని మనసైనా - అవతలివారు పేరున్నవారు, పేరెన్నికగన్నవారు, సమావేశాల నిర్వహణలోనో, కార్యవర్గంలోనో సతమతమవుతున్నవారు - వెళ్ళి పలకరించాలా? పలకరించి ఏమని చెప్పుకోవాలి నా ప్రవర?

నేను ఫలానా ... నేను చేసేది ఫలానా ... ఇక్కడికొచ్చిన కారణం ఫలానా... అని చెప్పుకుని
మీ రాత ఇష్టం... అనో
మీ చేత ఘనం ... అనో
మీ పాట ప్రియం ... అనో - అని అన్న తర్వాత ఇంకేంటి?
ఇంకేం మిగిలింది?
అరె ...అసలేం గుర్తుకు రావే?
అసలేం చెప్పాలని ... ఏం అనిపించుకోవాలని వచ్చాను?

కొలనున రాయి వేస్తే చెదిరే అలలలాంటి పరిచయాలు, రెప్పపాటులో మది మరుగున మాటుమణిగే ఎఱుకలు - ఆ చిన్నపాటి అలజడి, కొన్ని కబుర్ల అలికిడి - నవ్వు పూసుకుని నాలుగు కబుర్లాడి వెనుదిరిగిన మరు నిముషంలో చెరిగిపోయే రూప-ముద్రలు, గడిచిపోయే భావ-ముద్రలు - అంతంత మాత్రపు సాంగత్యాలు అవసరమా?

అదిగో - అలా అనుకునే - ఉంటే కన్వెన్షన్ సెంటర్ - నూటముప్ఫైరెండవ గదిలో - లేకపోతే వచ్చిన సాహితీమూర్తులైన అతిథులకి కబురో - కాలక్షేపమో అందిస్తూ వారి వెంట నడవడమో తప్ప - తానాలో నా ఉనికిని ఎవరికీ తెలిపిందీ లేదు - ఇంకెవరి తానకి ఉరికిందీ లేదు.

అందులోనూ - అక్కడకు వచ్చిన వారు ఎవరి ప్రతిభాకాశానికి వారు తారలైనటువంటి వారు. మింటనున్న తారలను చూసి మురిసే నేను - ఈ భువి-తారలని చూసీ - చూశానని మురిశాను - అంతే!

తానా అయిపోయింది - నాకు తోచిన నాలుగు కబుర్లు రాయడం అయింది - ఇంకొన్ని రాయాలని పక్కన పెట్టడమూ అయింది. పక్కన పెట్టిన కబుర్లని జ్ఞాపకపు మాటు నుండి బయటికి తెచ్చి జ్ఞాపికగా రాసుకోవడానికి తగిన తీరిక దొరికే సెలవు రోజుల కోసం ఎదురు చూడడమూ - ఇంకా వుంది.

ఇలా తానా-తో నా జ్ఞాపకాలని నెమరు వేసుకున్న సందర్భాలెన్నో - ఈ ఆరు నెలల్లో.

నా తానా-తలుపుల ముచ్చటకి ఆసరాగా, ఆ సంబరానికి కొనసాగింపా అన్నట్లుగా రెండు వారాల క్రితం నా ఈ-మెయిల్లో ఒక ఆహ్వాన పత్రిక...






ఈ ఆహ్వానం చూడగానే - మళ్ళీ ఆలోచన.

పుస్తకాల మీద, తెలుగు అక్షరం మీద మక్కువతో - మంచి సాహిత్యాన్ని సృజించిన కవులని, రచయితలని ఒక్క చోట కలవగలిగే అపురూప వేదిక అని ఆశపడి - ఎదురొచ్చి మరీ పసుపులేటి రవిగారు అందించిన అవకాశాన్ని చాలా సంబరంగా అందుకున్నాను తానా-సాహిత్య సమితిలో ఒక చిన్న వలంటీరుగా.  ఒక్క రెండు రోజులు తానాలో పాలు పంచుకోగలగడమే పెద్ద achievement నాకు.

అందులోనూ ఆ రెండు రోజుల్లో కానీ, అంతకు ముందు కానీ చౌదరిగారి దంపతులని కలిసింది లేదు - వారికి నేను నామమాత్రంగా కూడా తెలిసే అవకాశమే లేదు. అందులోనూ వారిది మా వూరు కాదు - కారు-దారిలో వెళ్తే ఐదుగంటలు, కారు-మేఘపు దారిలో అయితే ఒక గంట లెక్కెట్టే దూరంలో ఉన్న షికాగో నగరం.  నాకందింది - షికాగో నుంచి వచ్చి మా ఊళ్ళో ఇవ్వబోతున్న విందుకి ఆహ్వానం.

నాకు అందిన ఈ ఆహ్వానాన్ని ఎలా తీసుకోవాలో నిజంగా తెలీలేదు నాకు. ముందు వెళ్ళొద్దనే అనుకున్నాను. మళ్ళీ బదరితో చెప్పినప్పుడు తను "వెళ్తే బావుంటుంది - మన తెలుగు వారినీ, తెలిసిన వారినీ కలిసినట్టు ఉంటుంది" - అంటే సరే! వెళ్దామంటే వెళ్దామని అనేసుకున్నాం.

ఎలాగూ వెళ్దామనుకున్నాం కదా - కొంచెం ముందుగా పరిచయం చేసుకుందాం అని - నా తానా బ్లాగ్ పోస్టుల లింకులు జంపాల చౌదరి గారికి పంపించాను. అంతకు ముందు ఒకసారి తెలుగునాడి గురించి రాసినప్పుడు పంపిన ఈ-మెయిల్‌ని గుర్తు చేస్తూ.

[తెలుగునాడి గురించి నేనెప్పుడో రాసిన కొన్ని కబుర్లు ఈ లింకులో చదవచ్చు: (ప్రవాసాంధ్ర భాషా జీవ నాడి - తెలుగు నాడి)]

తీరా వెళ్ళే సమయానికి బుజ్జిజింక రానన్నాడు - "నిజమే కదా పాపం వాడికి అక్కడ bore కొడుతుంది" అని వాడికి తోడుగా ఉండడానికి, వాడితో ఆడుకోవడానికి - తనింట్లో ఉంటానని చెప్పి - నన్ను మహాత్మాగాంధి సెంటర్ దగ్గర దింపి ఇంటికి వెళ్ళారు బదరి.

పన్నెండింటికి రమ్మని ఆహ్వానంలో ఉంటే - మరీ పన్నెండింటికే వెళ్తే - నేనొక్కదాన్నే అవుతానేమోనని - పన్నెండు దాటింతర్వాత పది నిముషాలకి - కొంచెం మొహమాట పడుతూనే వెళ్ళాను.

నన్నేమని చెప్పుకోవాలా అనుకుంటూ - ఆలోచిస్తూ గుమ్మం దగ్గరే ఆగాను.

అప్పటికే జంపాల చౌదరిగారు, వారి శ్రీమతి అరుణగారు - వచ్చిన వారిని పలకరిస్తూ, కుశలమడుగుతూ వున్నారు.

నేను కొంచెం పక్కగా నించుని వారిని పలకరించడానికి నా వంతు కోసం ఎదురుచూస్తున్నాను.

ఇంతలో చౌదరిగారు నా వైపు చూసి - అరుణగారిని పిలిచి నావైపుగా కదిలారు - "నమస్తే! నేను లలితనండి. సాహిత్య కమిటీలో వలంటీర్ని"- అనగానే - అరుణగారు - నా చేయి పట్టుకుని - "మనందరమూ వలంటీర్లమేనండి. రండి. ఇప్పటివరకు మిమ్మల్ని కలవలేకపోయాను" అని నొచ్చుకున్నారు.

పక్కనే వున్న appetizer తీసుకోమని చెప్పి - ఇంతలో వచ్సిన వారిని పలకరించడానికి ఆ దంపతులిద్దరూ జంటగా వెళ్ళారు.

నేను లోపలి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని తెలిసినవాళ్ళు ఎవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తూ వున్నాను.

ఇంతలో అరుణగారు ఒక ప్లేట్లో appetizer పెట్టి తీసుకుని నా దగ్గరికి వచ్చారు - "మీరిది తీసుకోకుండానే వచ్చారు - ఇప్పుడు తీసుకోండి" - అంటూ - అదేదో - నేను వారింటికి వచ్చిన ప్రత్యేక అతిథిలా.

నాకు నిజంగా ఆశ్చర్యంగా, సంభ్రమంగా అనిపించింది - ఆ క్షణం వరకు నేనెవరో కూడా ఆవిడకి తెలీదు. కానీ ఎంత ఆత్మీయంగా మాట్లాడారో మాటల్లో చెప్పలేను.

తానా సమావేశాలు జరిగిన ప్రతీ చోటా - అక్కడి వలంటీర్లందరితో కలిసి ఒక కుటుంబంలా పని చేసేవారో చెప్తూ సెయింట్‌లూయిస్‌లో - రకరకాల కారణాల వలన - అలా జరిగే అవకాశం లేకపోయినందుకు చాలా నొచ్చుకున్నరావిడ.

నేను కూడా ముందు రావాలనుకోకపోయినా - ఇప్పుడు వచ్చినందుకు, వారి దంపతులని స్వయంగా కలవగలిగినందుకు ఎంత ఆనందంగా వుందో చెప్తే చాలా సంతోషించారావిడ.

ఒక మూడున్నర గంటలసేపు అక్కడ అందరితో మనసారా మాట్లాడి, కడుపారా భోంచేసి  - వచ్చేసేముందు జంపాల చౌదరిగారికి, అరుణగారికి కృతజ్ఞతలు చెప్పి - ఒక మంచి-ఆదివారపు-జ్ఞాపకాన్ని నాతో తెచ్చుకున్నాను.

రాగానే బదరికి చెప్పాను - "తానా అయిపోయింది. అసలు జరిగిందన్న విషయమే ఒక జ్ఞాపకంలా మిగిలింది. తానా సమావేశాలని ఇష్టపడి, కష్టానికోర్చి నిర్వహించారు. వాళ్ళేమీ మన ఊరివాళ్ళూ కాదు - రేపెక్కడో కలిసి అడుగుతామేమో అన్న మొహమాటపడాల్సిన అవసరం ఉన్నవాళ్ళూ కాదు. కానీ ఏదో ఒక ఆత్మీయబంధాన్ని నెరవేర్చలేకపోయామన్న తలపుతో - వెనక్కి వచ్చి అందరినీ ఇంకొక్కసారి కలిసి - పేరుపేరునా పలకరించి, స్నేహపు-పన్నీరు చిలకరించి వెళ్ళారు. మరువలేనింక వాళ్ళని - వారి సౌజన్యాన్ని" - అంటూ.


ఘనమైన ఉనికి ఎందరిదో
మదికి సోకే ఆ ఉనికి యెఱుక - ఆ ఎందరినో ఎఱిగిన అందరిదీ
ఆ ఎఱుకలో మన్నికైన ఎన్నిక కొందరిదే  
ఆ ఎన్నికలో అనుపమైన ఎంపిక మాత్రం - అంతులేని సౌజన్యం ఉన్న వారికి...
అరుణగారు, చౌదరిగారి లాంటి - నూటికో కోటికో ఒకరిద్దరికి... 
అందరాని ఆకాశంలో ఉన్న చంద్రునికైతే నూలుపోగు -
మరి అంతులేని సౌజన్యం వున్నవారికేమివ్వగలం?
సౌజన్యానికో పూలపోగు ...


8 కామెంట్‌లు:

  1. మాటల్తో ఆటలాడటంలో మీరు మీకే సాటి. మంచి పోస్ట్ లలిత గారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి విషయాన్ని మెచ్చుకోవడంలో మీకు మీరే సాటి, పవన్ గారూ!

      తొలగించండి


  2. సౌజన్యానికి పూలపోగిది ప్రవాసాంధ్రుల్ భళారేయనన్
    ఆ జంపాలకుటుంబమెల్లరికి సన్నాహమ్ములన్ జేసి మా
    రాజుల్ కైపులటన్ జిలేబులయిరే! రమ్యాతి రమ్యమ్ము, చా
    లా చక్కంగను మంచి పద్ధతి, భళా లావణ్యముల్ దీర్చుచున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. జంపాల దంపతుల "ఆత్మీయ" ఆతిధ్యాన్ని అందుకున్నందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. లలిత గారు, మీ తానాలో తారలు ప్రోగ్రాం చదివిన తర్వాత నాకు సరిగ్గా అలాగే అనిపించింది. చాలా సార్లు ఏ తారనైనా చూస్తే వెళ్లి ఏమి మాట్లాడాలో తెలియక దూరంనుంచే చూసి ఆనందించేవాణ్ణి. జంపాల చౌదరి గారితో సహా. ఒకేఒక్కసారి మాత్రం శ్రీమతి బలవంతం చేస్తే తనికెళ్ళ భరణిగారితో ఒక నిమిషం ఉండి ఒక ఫోటో తీసుకుని బయటపడ్డాం ఆయనతో ఎక్కువ మాట్లాడకుండానే. చౌదరి గారి సాహితిసేవ తెలిసినా, ఒకటి రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా, ధైర్యం చేసి మాట్లాడలేదు. వారి సౌశీలత ముందే తెలిసిఉంటే ప్రయత్నం చేసేవాడినేమో. I could relate and identify to some of your lines hence wanted to share a little more.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామిగారు: మీరూ నాలాగే తారల విషయంలో దూర-వీక్షణాసక్తులన్నమాట :). మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి