6, సెప్టెంబర్ 2020, ఆదివారం

డోంట్ ట్రై టు సే "C U Soon" ఇన్ తెలుగు, ప్లీజ్!

సినిమా - నాకొక ఇష్టమైన వ్యసనం.

వారమంతా ఆఫీసు పనిలోనూ, ఇంటి పనిలోనూ ఎంత హడావిడిగా గడిచిపోయినా శుక్ర, శనివారాలు సాయంత్రాల్లో ఒక్క రెండు సినిమాలు చూస్తినా....  ఆ వారం నాకు నచ్చినట్టు వచ్చిపోయినట్టే.

అందులోనూ నాకు దొరికిన ఇంకో సినీ-మా-అదృష్టం ఏంటంటే నాతో పాటు నాకిష్టమైన సినిమాలు చూడడానికి అంతే ఇష్టంగా సిద్ధపడే బదరి సినీ-మా-సాంగత్యం.

మేమిద్దరం కలిసి - కంబైన్డ్ స్టడీ లాగా సినిమాలు చూసేస్తూ ఉంటాం.
మా ఇద్దరికీ టైం కుదిరి కొన్ని సినిమాలు చూస్తే - మా టైం బాలేక కొన్ని సినిమాలు చూడాలనుకోకపోయినా చూసేస్తాం.

సినిమా ఎలాంటిదైనా ఒక్కటే ఒప్పందం. ఆట మొదలెడితే ఆపకూడదు.

ఈ మధ్య చేసుకున్న ఇంకో అలవాటు ఏంటంటే వారం మధ్యలో కూడా ప్రతీ సాయంత్రం ఒక అరగంట ఏదో ఒక సినిమా చూడడం. అంటే సినిమాలని డైలీ సీరియళ్ళలా చూస్తున్నాం.

ఈ వారం సీరియల్‌గా చూసిన సినిమాలు రెండు - ఒకటి పాత హిందీ సినిమా ముఘల్-ఏ-ఆజం,  రెండోది కొత్త తెలుగు సినిమా శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట.

మొదటి సీరియల్-సినిమా  ముఘల్-ఏ-ఆజం లో నాకు నచ్చినవి - అక్బర్ ఇలాగే ఉండేవాడేమో అనిపించేలా చేసిన పృథ్వీరాజ్ కపూర్, లేలేత దానిమ్మ పూవులాంటి మధుబాల అందం, అనార్కలిగా అలరించిన ఆమె అభినయం. ముఖ్యంగా కంటికి విందుగా తళుక్కుమన్న ముఘల్ అద్దాల అలంకరణల grandeur. ఇవన్నీ కాకుండా ఇంకొక్క తమాషా విషయం ఏంటంటే మన పాత తెలుగు సినిమాల్లో ఉండే సినిమా-వకుళ శాంతకుమారిలా ఉండే దుర్గా ఖోటే ముఘల్-ఏ-ఆజం సినిమాలో అక్బర్ భార్య జోధాబాయి. ఆవిణ్ణి చూస్తున్నంత సేపూ ఇటీవలి జోధాబాయి ఐశ్వర్యా రాయ్ కూడా జ్ఞాపకం వస్తూనే ఉంది. 

రెండో సీరియల్-సినిమా శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లో కనిపించిన గోదారి-సీమ అందంగా ఉంది. అనాథగా పెరిగిన హీరో ఆర్నాల్డ్ ష్చ్వార్జ్‌నెగ్గర్ లాగా రెండరడజన్ల మందిని చితక్కొట్టేయడం, పల్లెటూళ్ళో ఉన్న ఆరున్నొక్క రోజుల్లోనే నాట్లేసేసి, అరక దున్నేసి, కుప్ప నూర్చేసి, తూర్పార పట్టేయటం - నేనిప్పటికీ అరిగించుకుని అర్థం చేసుకోలేకపోతున్న అద్భుతం. పైగా ఇంకెవరితోనో పెళ్ళి కుదిరిన అమ్మాయికి పాఠం చెప్పరా అంటూ హీరో లాంటి అబ్బాయిని హీరోయిన్ను తండ్రి బ్రతిమాలడం, వాళ్ళిద్దర్నీ ఊళ్ళో ఎక్కడ బడితే అక్కడ ట్యూషన్ చెప్పుకోండ్రా అని ఊరి మీదకి వదిలేయడం - అర్థం చేసుకుందామన్నా అరగని అపార్థం. చివరాఖరుగా చెప్పాలంటే ఈ సినిమా - ఎగిరెగిరి ఉట్టి కొట్టలేకపోతున్న హీరోని తన భుజాల మీదకి ఎక్కించుకుని ఉట్టి కొట్టించిన హీరోయిన్ నాన్నని చూసి అవాక్కయిన నేను - ఆ సినిమా అప్పటికప్పుడు కట్టేసి ఎందుకు walk-away చేయలేదూ అని అనుకుంటూనే - అనుభవించేసిన అనర్థం.

ఇంకొక్క సినిమా  - నిన్నంటే నిన్నే చూసిన "V" గురించి - మరీ ఎక్కువగా ఏమీ చెప్పను - కానీ.... నానీకో మాట...

నువ్వు విక్కీవో, విష్ణువో కానీ ... ఓ నానీ! నీ సినిమా నిండా అంత రక్తమేంటయ్యా బాబూ? నీ సినిమా అంటే ఎంచగ్గా పిల్లా-పాపలతో డ్రాయింగ్ రూంలో pillow లేసుకుని చూసే సినిమా అని తెగ మురిసిపోయేదాన్ని. ఇహిప్పట్నుంచీ అలా అనుకోవడానికి లేదని తెలిసిపోయింది.

నీ V కథ గురించి, అందులో ఇంట్లో కూడా కత్తులు పట్టుకు తిరిగే అమ్మాయీ, అమ్మ-నాన్నల గురించి, ఆ అమ్మాయి నాన్న మాట్లాడే తలా-తోకా లేని మాటల గురించి - ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో!

అసలయినా... మీరందరూ మాట్లాడిన డైలాగులేమిటో ఇప్పుడు సినిమా చూస్తే మీకైనా వినిపిస్తాయా? అర్థమవుతాయా?

చూసేది తెలుగు సినిమా, మన మాతృభాష - అనుకుంటూ సబ్-టైటిల్స్ పెట్టుకోవడానికి మొహమాట పడి - ఏం వింటున్నామో ఎంత సౌండ్ పెంచినా అర్థం కాక - ముందుకీ వెనక్కీ వెళ్తూ రెండున్నర గంటల సినిమాని మూడు గంటల సేపు చూశాం - నిద్రనాపుకుంటూ.

పోన్లే! మాలాంటి వాళ్ళం చూడకపోతే తెలుగు సినిమా పరిశ్రమకి పోయేదేం లేదు. ఇదే గొప్ప సినిమా అనుకుని తీసినవారికి వందనం! తెలుగు సినిమా ఇక మారదు అన్న నమ్మకాన్ని నిలబెట్టినందుకు అభివందనం!!


చిట్టచివరగా - ఈ వారం చూసిన ఇంకొక్క మలయాళం సినిమా "C U Soon" గురించి.

ఫహాద్ ఫాజిల్ సినిమా అని తెలియగానే చూడకుండా ఉండలేకపోయాం. చూశాక 'ఎంత బాగా తీశారు!' అనుకోకుండా ఉండలేకపోయాం. సినిమా టైటిల్స్ దగ్గర నుంచి సినిమా చివరివరకూ Google - Hangouts స్క్రీన్స్ లోనే కథని నడిపించిన - గంటన్నర సేపు సినిమాని ఎంతో imagination తో, creative గా తీసిన ఈ సినిమాని నిజ్జంగా కళ్ళార్పకుండా చూశాం.

అసలూ ... ఇదేం సినిమా అబ్బా?

మరీ కథే హీరో అనుకుంటూ గంటన్నరకే చుట్టేస్తారా? హన్నా! ఇదే మా తెలుగులో అయితేనా... కెవిన్‌కీ, వాళ్ళ ఆడబాస్ సంజనాకి ఓ డ్యూయెట్టు - జిమ్మీకి, అనూకి ఓ డ్యూయెట్టు - అనూకి ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ ప్రశాంతుతో ఓ కామెడీ ట్రాకూ - జిమ్మీ ఇల్లు సోదా చెయ్యడానికొచ్చిన దుబాయి పోలీసులతో ఇంకో కామెడీ ట్రాకూ -  అనూకి ఎఱ్ఱ జిగేల్, జిగేల్ గౌను వేసినప్పుడు ఓ క్లబ్బుదో, పబ్బుదో ఓ డాన్సూ - అనూ ఎక్కిన విమానం రెక్కలు పట్టుకుని కిటికీలోంచి దూకి జిమ్మీ అనూని చేరే ఏక్షన్-ప్యాక్డ్-సీను  - అబ్బబ్బా! ఎన్ని పెట్టేవాళ్ళో! ఇంకో గంటన్నర అయినా కథ సాగేది. 

మంచు కొండల్లో లేకపోతే పోయే దుబాయి ఎడారి ఇసుకలో డ్యుయెట్లు పెట్టలేరూ? సినిమాకి తీసుకున్న కథ ప్రకారం ఎంతెంత OTT-type సీన్లు చూపించడానికి ఎంతో అవకాశం ఉన్నా మరీ అంత చెప్పీ-చెప్పకుండా చెప్పినట్టు అంత decent గా సినిమాని నడిపించెయ్యడమే! అనూ పడ్డ కష్టాలు వీడియోలో చూస్తూ కెవిన్ ఒక్క చుక్క కన్నీరు కార్చేసి, కళ్ళెఱ్ఱబరచుకున్నట్టు - అంత బరువైన సీన్ అసలు అలా అంత చులాగ్గా ఎలా తీసేశారో!?

పాదాల దగ్గర మొదలుపెట్టి పైకి కెమెరా పోనిస్తూ హీరోని కథ లోకి పట్టుకు రాకపోతే సినిమాల్లో ఇంకేం చూసేట్టు? అంటే...కథ బావుంటే ఎలాగైనా చూసేస్తామనే కదా వాళ్ళ ధీమా!!

ఏ మాటకామాట చెప్పుకోవాలి - సినిమా అంతా చూసేశాక - పోన్లేబ్బా! ఈ సినిమా ఉన్నదున్నట్టుగా తెలుగులో ఎవ్వరూ తియ్యరు, తియ్యలేరు - అని నమ్మకంగా అనిపించింది. అంతే కాకుండా ఇలా కూడా చెప్పాలనిపించింది... డోంట్ ట్రై టు సే "C U Soon" ఇన్ తెలుగు, ప్లీజ్!

చివరాఖరుగా ఓ మాట...

నా మటుక్కి నాకు - సిట్టసివరిదాకా - నిద్దరోకుండా  - మాటాడుకోకుండా .... సూసేదే అసలు-సిసలైన సినిమా... 

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు

14 కామెంట్‌లు:

  1. అదగొట్టేశారు. ఇప్పుడు హడావుడిగా C U Soon చూడాలనిపించేలా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా చూడండి. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని అనుకుంటున్నాను :)

      తొలగించండి


  2. ఈ సినిమా ఉన్నదున్నట్టుగా తెలుగులో ఎవ్వరూ తియ్యరు, తియ్యలేరు

    తియ్యలేరని చాలెంజు చేయకండేం :)


    ఈ ంంంంంంంంంంంం మధ్య ఉగ్రరూపస్య సినిమా పేరు మాత్రం అట్టేసుకుని తెలుగు మళయాళం చిత్రరాజం రాలేదూ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆజ్యిలేబి గారూ! భలే! మీరన్నట్టు మక్కికి మక్కి తీయగలరనుకోండి... కానీ నేటివిటీ అనేది ఒకటుంది కదా? మలయాళానికి దుబాయి అయితే తెలుగు వారికి అమెరికా అవుతుంది. ఆ మాత్రం మార్పులైనా ఉంటాయి లెండి. మీ ఆజ్య-వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి

    2. :)

      పనిలో పనిగా బిజూ చిత్రము అయ్యప్పనుమ్ కోషియుమ్ కూడా చూడండి :)



      జిలేబి

      తొలగించండి
    3. "అయ్యప్పనుమ్ కోషియుమ్" చూడడమూ, రాయడమూ కూడా జరిగిందండి :) వీలయితే చదవండి : http://boldannikaburlu.blogspot.com/2020/04/blog-post.html

      తొలగించండి
  3. Nice,crisp write up ..👏👏🍬🌷🍭🦋🎬🏆


    C U soon after CU Later...

    రిప్లయితొలగించండి
  4. మనోళ్లూ మంచి సినిమాలు తియ్యగలరు. ఓ తెలుగోడు తీసిన ఆంగ్ల ఈ short film చూడండి, తెలుస్తుంది.

    https://youtu.be/ipVbeSuaoz8

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగు వాళ్ళు తలుచుకుంటే ఎంతో మంచి సినిమాలు తీయగలరు, కానీ తీయరు - తీసినా థియేటర్లలో రావు - వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు.

      I watched the short film that was shared here. It is a good attempt as a home based summer project production. But that doesn't come into the category of professional Telugu movies I am referring to.

      Thanks for sharing the youtube link.

      తొలగించండి
  5. Mughal e Azam to C U soon..ఒక్క week లో ఎన్ని decades సునాసాయంగా travel చేసేసావు లలిత! ఇది blogఆ? సినీమా travel-logఆ? అనిపించింది .. thanks for taking us, your readers, on this delightful journey!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అపర్ణే! ఇది ఈ మధ్య కాలంలో ప్రతీవారం చేస్తున్న సినీప్రయాణమే! కాకపోతే ఒక్కోసారి మాత్రమే రాయాలనిపిస్తుంది. Thank You for being a हम-सफ़र :)

      తొలగించండి
  6. Amaram Akhilam Prema is very good. Please watch if you have time

    రిప్లయితొలగించండి