27, సెప్టెంబర్ 2020, ఆదివారం

మరలి రాలేని ఏ మజిలీలకి తిరిగి రాలేని నీ బదిలీ?

 దాదాపు ఓ నెల క్రితం ఒంట్లో బాలేదని హాస్పిటల్లో చేరుతున్నావని విని - "ఆ పెద్దాయన  అమితాబ్బచ్చన్ ఇలా వెళ్ళి అలా వచ్చెయ్యలేదూ... ? ఈయన ఆయన కన్నా చిన్నవాడు కూడానూ. ముందు జాగ్రత్తగా వెళ్తున్నాడు. అంతే!" అని పదేపదే అనుకున్నాను, అన్నాను కూడా. 

నీ గురించి అట్టే మాట్లాడకుండా ఉంటూ, నీ గురించి రోజురోజూ వచ్చే వార్తలు వినకుండా ఉంటే - ఏదో ఓ మంచిరోజు ఇంటికొచ్చేసి - టీవీలో పువ్వులా నవ్వుతూ కనిపించి - "నేనొచ్చేశానర్రా, ఇంతకు ముందు ఎక్కడ ఆపామో అక్కణ్ణించి మన పాట పాడేసుకుందాం - సరి సరి... పద పదండి !" - అంటూ గలగల్లాడుతూ మువ్వలా మోగిపోతావనుకున్నాను. 

ఇప్పుడొస్తావు, అప్పుడొస్తావు అని తేదీలు మార్చుకుంటూ, నీ పాటనే పలవరించుకుంటూ ఎదురు చూస్తుండగానే - నువ్వెళ్ళిపోయావు అన్న మాట తెలిసింది. 

ఆ మాట వినగానే చెప్పలేని ఉక్రోషం. 

చేతులు నులుముకుంటూ "ఇదేంటి? ఇలా అయ్యిందేంటి?" అనుకుంటూ, అనుకుంటున్నది పైకే గట్టిగా అంటూ - ఏదో చెప్పలేని helplessness తో, ఎక్కడ మొదలయిందో చెప్పుకోలేని నొప్పితో - చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన నీ మీద అలిగాను. 

మళ్ళీ - "నాకేమీ కాని నీ గురించి నేనెందుకు పట్టించుకుని ఏడవాలీ. అయినా... లోకంలో జరిగే ప్రతీ విషయం గురించి నాకో అభిప్రాయం ఉండాలీ అన్న పట్టింపే లేదు కదా నాకు! ఇంతకు ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళలాగే ఈయన కూడా. ఉంటేగింటే వాళ్ళింట్లో వాళ్ళకి బాధుండాలి కానీ ఏమీ కాని మనకేం బాధ!" అని నాలో నేను  అదే పనిగా అనుకుంటూ, నాకే నేను పదేపదే చెప్పుకుంటూ - దూర లోకపు మజిలీకి మారిన నీ బదిలీ వార్తని పట్టించుకోకుండా ఉందామని ఎంతో ప్రయత్నించాను. 

కానీ అది అంత సులువైన పనిలా అనిపించలేదు. 

అందుకే - నువ్వెళ్ళిపోయావని తెలియగానే - అప్పటివరకు చెంగటనే ఉన్న చుట్టమెవరో చటుక్కున చేయి వదిలేసి తరలిపోయినట్టు - చెప్పుకోలేని బాధేసి - తలారా స్నానం చేసి వచ్చానా ?! 

అప్పట్నుంచి ఏదో తెలియని నొప్పి. ఏ పని చేస్తున్నా - నీదే ఆలోచన. 

తడిసి కురవబోయే కన్నుని ఊరుకోబెట్టటానికి "పల్లవించవా నా గొంతులో... పల్లవి కావా నా పాటలో..." అంటూ  నీ పాటలే పాడుకున్నా. పాడుకుంటూ నువ్వెక్కడికీ వెళ్ళిపోలేదని నన్ను నేనే మభ్యపెట్టుకున్నా.  

నువ్వు పాడిన పాటేదో పాడుకుందామనుకున్న నా ప్రయాస పాడలేని పాటై, నవ్వులాటగా మిగిలింది. పలకలేని నా నోట నలిగి నీ పాట పొగిలి పొగిలి ఏడ్చింది. . 

పాడలేని ఈ పూట నువ్వు నాకు పరిచయమయిన మొదటి రోజులు నెమరేసుకుందామనుకున్నాను. 

ఇంట్లో - అమ్మను కన్న అమ్మమ్మో, అమ్మో, నాన్నో, మమత పంచిన మామో - ఎవరో ఒకరు పాడుతున్న పాటలు వింటూ పెరుగుతున్న నాకు మాటలతో పాటే పాటలొచ్చాయి. నాకు పాటలొచ్చిన మొదటి రోజు నుంచి - అప్పటికి నీ పేరు తెలియకపోయినా నువ్వు నాకు తెలుసు. నీ గొంతు నాకు తెలుసు. 

నీ గొంతు వింటూ, నీ గొంతుతో నేనూ గొంతు కలిపి పాడుతూ పెరిగాను. ఆడుకుంటూ నీ పాటలే పాడుకున్నాను. నీ పాటలే పాడుకుంటూ ఆడుకున్నాను. 

"ఇదే పాట - ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను" అని నువ్వన్నట్టే - నువ్వు పాడిన ఏదో ఒక పాట ప్రతీ పూటా నేనూ పాడుకున్నాను - ఆ పాటలో మాటలకి అర్థాలు తెలీకపోయినా. అప్పుడు అలా  మొదలెట్టిన నీ పాటలు ఇప్పటికీ పదేపదే పాడుకుంటూనే ఉన్నాను. 

 అలా అని నువ్వు పాడిన పాటే పరమానందమన్నట్టు ప్రతీ పాటకీ పరవశించిపోయాననుకోకు. "వాయించు ఆదితాళం - మెప్పించు నేటి మేళం.... రంగన్నా ... రంగన్నా... రసాభాస చెయ్యకురా" అని నువ్వు పాడితే "ఎబ్బే! ఇలాంటి పాటలు సుబ్బయ్య పాడకపోతే తనకేం తక్కువయ్యేది?" అని ఆ పాట విన్న ప్రతీసారీ విసుక్కుంటాను. 

అన్నట్టు - నిన్ను నేను "సుబ్బయ్య" అని పిలుచుకుంటాను. నాకెంతో ఇష్టమైన పాటలు పాడిన నీ గొంతు వింటూ పెరిగానేమో... అంత ప్రత్యేకమైన ఇష్టానికి నాకు నచ్చి నేను పెట్టుకున్నపేరు "సుబ్బయ్య". 

నీకు - "బాలుగారు, ఎస్పీబీ, బాలసుబ్రహ్మణ్యం గారు" - ఇలా ఎన్నో పేర్లు ఉండొచ్చు గాక - ఆ పేర్లూ, ఆ పేర్ల వెనకాల గార్లూ నాకు పట్టవు. 

అసలు నువ్వు నాకేమౌతావూ అని ప్రశ్నించుకుంటే - నేనెవ్వరో నీకు తెలిసే అవకాశమే లేదు అన్నది సత్యం. నువ్వు పాటగా నాకు బాగా తెలుసు అన్నది నా తరఫు నుంచి నిత్యసత్యం. 

ఒకట్రెండు సార్లు నిన్ను కలిసి, దగ్గరిగా చూసి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా నేను నీకు దగ్గరగా వచ్చి పలకరించను కూడా లేదు.  

ఒకవేళ వచ్చినా ఏం మాట్లాడతాను చెప్పు? 

సభామర్యాద కోసం "మీరు చాలా బాగా పాడతారండి! మీ పాటంటే నాకు బోల్డు ఇష్టమండి" అని ఏవో రెండు ముక్కలు ముక్కున పట్టుకొచ్చినట్టు మాట్లాడేశాననుకో - ఆ మాటలెంత పేలవం? ఆ శబ్దమెంత పలచన? 

ఎప్పుడూ ఆకాశంలో ఉండే ౘందమామ వాకిట్లో ఉన్న నూతి నీళ్ళలో చేతికందేలా కనిపిస్తే "నీ వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో! అది నాకెంత ఇష్టమో!" అని మామూలు మాటలు చెప్తామా? అలా చెప్తే మాత్రం నా ఉనికేమన్నా పెరుగుతుందా? నేనలా చెప్పకపోతే ఆ ౘందమామ విలువ ఏమన్నా తరుగుతుందా? 

గాలి బాటలో - అది సోకినంత మేరా - ఊగే చెట్టూ, కొమ్మా, రెమ్మా, ఆకూ, పువ్వూ, మొగ్గా - వాటికి తగిలిన గాలి - వాటిని మాత్రమే తాకిందనీ, వేటికి వాటికి ఆ గాలి తనదే అని మురిసిపోతాయి, కానీ వాటి మీదుగా వీచిన మలయమారుతానికి వాటి ఉనికి కూడా తెలియదేమో! నీ పాట కూడా ఆ గాలి లాంటిదే. అది తాకిందని మురిసిపోవడమే నాకు దక్కిన privilege.  

నీ పాట విన్న నేను - నువ్వు నాకు నేస్తమని - అనుకున్నాను - అంతే! కానీ అది తీసుకొచ్చి నీకు చెప్పగలిగే స్థాయి నాకు లేదు. 

నీళ్ళల్లో బెడ్డ వేస్తే కదిలే అలల్లాంటి నా లాంటి పరిచయాలు నీ దాకా రావక్కర్లేదు కూడా. 

అందుకే నీ దరిదాపుల్లోకి కూడా రాకుండా దూరంగానే ఉండి ఎప్పట్లాగే నీ మాటని, పాటని మాత్రం చెవుల్లో నింపుకెళ్ళాను. 

అన్నట్టు ఓ విషయం చెప్పాలి - ఇదొకలాంటి confession కూడా. 

ఓ పదేళ్ళుగా నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమాలూ నేను చూడట్లేదు. నువ్వు పాడిన పాటలే మళ్ళీ మళ్ళీ ఎందరో వేదికల మీద పాడి నిన్నే మెప్పిస్తున్నా - అవి నువ్వు తప్ప ఇంకెవరు పాడినా - ఈ కొత్తకొత్త గొంతుల్లో వినీవినీ - నీ పాతపాట మీద ఇష్టం తగ్గుతుందేమో అని బెంగేసి కూడా - పాడుతా-తీయగాలూ, స్వరాభిషేకాలూ చూడడం కూడా మానేశాను. 

ఏమాటకామాట చెప్పుకోవాలి... 

నీ పాటే లేకపోతే సినిమా-హీరోలు అంత అందంగా కనిపించేవాళ్ళు కాదేమో! 

నీ పాటే లేకపోతే కన్నెపిల్లల కళ్ళకు అంత మంచి కలలు వచ్చేవి కావేమో!

నీ పాటే లేకపోతే కుఱ్ఱాళ్ళు కవ్వించే సోగ్గాళ్ళై  ఊగకపొయ్యేవాళ్ళేమో! 

నీ పాటే లేకపోతే ఎన్నో ప్రేమకథలు మొదలవకుండానే ఆగిపోయ్యేవేమో! 


పాట పాడి నవ్వించి, ఏడిపించి, కవ్వించి, మరిపించి, మురిపించి - మైమరపించి - అంత హఠాత్తుగా - పాడుతున్న పాట ఆపి అలా ఎలా వెళ్ళి పోయావు? 

పుట్టిన ప్రతి ప్రాణానికీ వెళ్ళిపోవడానికి ఒక నెపం కావాలి అనుకుంటే నీకు నీ ప్రాణమైన పాటే ఒక నెపమయ్యింది. 

నువ్వు లేని ఈ పూట 

పాట మూగబోయింది

పెగలలేని ఆ పాట  

కనుల కరిగి నీరయ్యింది 


అవునయ్యా! నువ్వేమన్నావ్ - ఒక్కసారి గుర్తు తెచ్చుకో! 


పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు

విసుగు రాదు ఖుషీ పోదు 

వేసట లేనే లేదు

అసలు నా మరోపేరు ఆనంద విహారి  

- అనే కదా పాడావ్? 


అన్నట్టుగానే పాటే తోడుగా, సైదోడుగా -  మేఘాల్లో తేలిపోయే పక్షిలా "మనసైన చోట మజిలీ... కాదన్న చాలు బదిలీ"  అని పాడుకుంటూ పరవశించిపోయేవాడివి. 

అలా ఉన్నవాడివి ఉన్నచోట ఉండకుండా ఇప్పుడు మరి - మరలి రాలేని ఏ మజిలీలకి తిరిగి రాలేని నీ బదిలీ???


20 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అవునండి, నీహారికా! ఆయన ఆనందవిహారి!

      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  2. కలకాలం నిలిచే తన గాన మాధుర్యాన్ని మానవులకు అందించి , గంధర్వులు జయించటానికి వెళ్ళాడేమో ఈ గాన గంధర్వుడు.

    రిప్లయితొలగించండి
  3. చాలా ఆర్ద్రమైన నివాళి. నా మనసులోని మాటలు.

    // “ నీ పాటే లేకపోతే సినిమా-హీరోలు అంత అందంగా కనిపించేవాళ్ళు కాదేమో! ” //
    అక్షరసత్యం .... అలనాటి ఘంటసాల గారి కాలపు హీరోల విషయంలోనూ, ఈనాటి బాలు గారి కాలపు హీరోల విషయంలోనూ. ఆ హీరోల ప్రస్తావన వస్తే మొదట గుర్తొచ్చేది ... కథ కాదు, ఆ హీరోల నటన కాదు ... ఆ సినిమాల్లోని పాటలే, అవి పాడిన ఘంటసాల / బాలు గార్లే 🙏. ప్రధానంగా ఆ అజరామరపు పాటల వలనే ఆ హీరోలు అంతగా జనాలకు గుర్తుండిపోయారు. నిజానికి ఆ హీరోలు ఈ గాయకులకు థాంక్స్ చెప్పుకోవాలి, ఋణపడి ఉండాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పోస్టులోని మాటల్ని రాయించింది మా సుబ్బయ్య పాడిన పాటలే :( మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, నరసింహారావుగారు!

      తొలగించండి
  4. Very sorry for your loss!

    Extremely heavy feel, conveyed in
    Simple and honest words.

    రిప్లయితొలగించండి
  5. "...పలకలేని నా నోట నలిగి నీ పాట పొగిలి పొగిలి ఏడ్చింది..."

    "...పుట్టిన ప్రతి ప్రాణానికీ వెళ్ళిపోవడానికి ఒక నెపం కావాలి అనుకుంటే నీకు నీ ప్రాణమైన పాటే ఒక నెపమయ్యింది..."

    "...అవి నువ్వు తప్ప ఇంకెవరు పాడినా - ఈ కొత్తకొత్త గొంతుల్లో వినీవినీ - నీ పాతపాట మీద ఇష్టం తగ్గుతుందేమో అని బెంగేసి కూడా..."

    "...నీ పాట కూడా ఆ గాలి లాంటిదే. అది తాకిందని మురిసిపోవడమే నాకు దక్కిన privilege..."

    "...నీ వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో! అది నాకెంత ఇష్టమో!" అని మామూలు మాటలు చెప్తామా?..."

    గంగ వెల్లువ కమండలంలో - అలాంటి పోస్ట్!

    రిప్లయితొలగించండి
  6. చాలా బాగా రాసారు.
    Helplessness అనగా అసహాయత!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు, సూర్య గారు - నా రాతలు మెచ్చుకున్నందుకు, మాట అందించినందుకు.

      తొలగించండి
  7. చాలా బాగా రాసావ్, లల్లీ.
    "పుట్టిన ప్రతి ప్రాణి కి వెళ్ళి
    పొవడానికి ఒక నెపం కావాలి," అనుకుంటే,నీకు నీ పాటే ఓ నెప మయ్యింది." నిజం కదా!!!!
    బాలు గారితో చాలా చిన్న పరిచయం. మా బావగారికి అంకుల్ కి ,బాలుగారితొ చిన్న పరిచయం.మాబావగారి అమ్మాయి కౌసల్యతొ పాడింది, పాడుతాతీయగా కి. కౌసల్య విన్నర్, మాబావగారి అమ్మాయి రన్నర్.
    దాని వల్ల పరిచయం .మా,వారి కొరికమిద ,యానంలో , ఒకసారి పాడుతా తీయగా, ప్రోగ్రామ్ ఫైనల్స్
    పెట్టడం జరిగింది. అప్పటినుండి వరసగా మళ్ళీ వైజాగ్ లో కూడా
    చాలా ఫైనల్స్ పెట్టినప్పుడు అంకుల్ బాలుతొనె వుండేవారు.
    మాబావగారు పోయినప్పుడు,మా బావగారి ఇంటికి వచ్చి పరామర్స చేయడం . నిజానికి ఆయన స్థాయికి ఆయన మాఇంటికి రావలసిన పనిలేదు. అది ఆయన మంచితనం.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    - సరోజ ఆంటీ

    రిప్లయితొలగించండి
  8. నీ సుబ్బయ్యకు హృదయాంతరాళం నుండి రాసిన నిజమైన నివాళి ... చదివి మళ్లీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఏమీ చెప్పలేనంత, ఎంత చెప్పినా చాలనంత అందంగా విషాదాన్ని అక్షరాలలో అమార్చావు. This should find a place in every tribute to SPB.

    రిప్లయితొలగించండి
  9. చాలా బాగా నీ ఆవేదనని తెలియచేశావమ్మా మీ, మనందరి సుబ్బయ్యగారి గురించి.

    రిప్లయితొలగించండి
  10. చాలా ఆర్ద్రత నిండిన నివాళి లలితా. నాకు నచ్చిన భాగం:

    ఒకట్రెండు సార్లు నిన్ను కలిసి, దగ్గరిగా చూసి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా నేను నీకు దగ్గరగా వచ్చి పలకరించను కూడా లేదు.

    ఒకవేళ వచ్చినా ఏం మాట్లాడతాను చెప్పు?

    సభామర్యాద కోసం "మీరు చాలా బాగా పాడతారండి! మీ పాటంటే నాకు బోల్డు ఇష్టమండి" అని ఏవో రెండు ముక్కలు ముక్కున పట్టుకొచ్చినట్టు మాట్లాడేశాననుకో - ఆ మాటలెంత పేలవం? ఆ శబ్దమెంత పలచన?

    ఒకసారి (2014) నేను హైదరాబాదుకు వెళ్ళేప్పుడు కతార్ ఏర్వేస్ లో అట్లాంటా నుంచి హైదరాబాదు వరకు లౌంజులతో సహా నా ముందే కూర్చుని వున్నాడాయన. దాదాపు 25 గంటలసేపు సోషల్ డిస్టెన్స్ దూరంకన్నా దగ్గరలోనే వున్నా fear of rejection మూలాన కళ్ళు కలిసినప్పుడు చిరునవ్వులు పంచుకోవడం తప్ప వేరే ఏ మాటలు మాట్లాడలేదా. కనీసం ఫోటో కూడా తీసుకోలేదు. వీడెవడురా బాబోయ్ నన్ను గుర్తుపట్టలేదా అనుకునుంటాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొప్ప జ్ఞాపకం, కిషోర్ గారు! పంచుకున్నందుకు ధన్యవాదాలు !

      తొలగించండి