15, సెప్టెంబర్ 2019, ఆదివారం

సెబాసు, పెన్సిల్ పార్థసారథీ! భలే గ్యాంగ్ నీది...

హలో పెన్సిల్ పార్థసారథీ!

నిన్ననే నిన్నూ, నీ గ్యాంగునీ మా ఊరి సినిమా తెర మీద చూసొచ్చా. మీరందరూ నాకు భలే నచ్చారు. మరి నచ్చినవి నచ్చినట్టు నచ్సినవారికి చెప్పకపోతే నాకు నిదరట్టదు.

ముందుగా నాకై నాకున్న ఓ రూలు గురించి చెప్పాలి. అదేంటంటే దేని గురించైనా చెడుగా విన్నా, కన్నా, ఎవరైనా నాతో అన్నా నేను కిమ్మన్ను. ఎందుకంటే వినీ విననట్టు, చూసీ చూడనట్టు ఉంటే చెడు ఆట్టే దూరం వెళ్ళలేదు. వున్న చోటే సమసిపోతుంది. అదే మంచి గురించి చెప్పలేదనుకో "మంచి అన్నది పెంచుమన్నా" అన్న గురజాడ గారి అడుగుజాడ అజా-పజా లేకుండా పోతుంది. అందుకే విషయమేదైనా నాకు మంచిగా అనిపిస్తే చెప్పేయాలబ్బా - అది పాటైనా, మాటైనా, సినిమా అయినా! 

సరే! ఇక నీ విషయానికి వస్తే నాకు నీ గురించి ఏం నచ్చిందో చెప్పాలి కదా!

అన్నిటికన్నా ముందుగా నువ్వూ, నీ పేరూ భలే వున్నాయి. నువ్వున్న ఇల్లూ, అందులో నువ్వు పేర్చిన డొల్ల-పుస్తకాలు ఇంకా బావున్నాయి. నీ ఇల్లున్న మేడ చుట్టూ వున్న పూల-పూల ఇనప గ్రిల్లు భలే వుంది. నువ్వు నీ నవలలకి పెట్టుకున్న పేర్లు - రసీదుని చంపు, వృద్ధులకు దేశం లేదు - లాంటి పేర్లు నాకు నచ్చేశాయి. పైగా సినిమాలు చూస్తూ సస్పెన్స్ నవలలు మక్కికి మక్కి దింపి మరీ రాస్తావు చూడు - ఆ ఐడియా ఎంత బావుందో!

అవునూ! పెన్సిల్ పార్థసారథి అని పేరు పెట్టుకుని ఎప్పుడూ బాల్‌పెన్ను టిక్కుటిక్కులాడిస్తూ కనిపించావే కానీ నీ పేర్లో వున్న "పెన్సిల్" చేతిలో ఏది? ఏదో ఉండబట్టలేకఅడిగాను. ఏమీ అనుకోకు. అది పెద్ద పట్టించుకోదగ్గ విషయమేమీ కాదులే!

అన్నట్టు నీకు భలే గ్యాంగ్ దొరికింది. మెట్లెక్కాలంటే నీ చేత ఎత్తుకు మోయించుకునే ఓ బామ్మ, ఆకలేసినప్పుడల్లా పులిహార కలిపే ఓ అమ్మ, నీ కోసం ఉంగరం వేలు ఖాళీ చేసుకునే ఓ అందమైన అమ్మాయి, తనకేం అనిపించినా నీకు టెక్స్ట్ చేసి మరీ చెప్పే చెల్లాయి, గిరజాల జుట్టుతో ముద్దొచ్చే ఓ పాపాయి... అందరూ భలే వున్నారు. ఈ ఐదుగురి బాక్‌గ్రౌండూ, వాళ్ళందరూ నీ దగ్గరికి ఎందుకు చేరారో నేనిక్కడ చెప్పనులే. అవి అందరికీ తెల్సిపోతే మజా ఏముంది కదా?!  కానీ వాళ్లందరితో పాటు నీకు నీ "శ్రావణి" కూడా నీకు తెలియకుండానే నీ గ్యాంగ్ తయారవడానికి, నువ్వు ఆ గ్యాంగ్‌కి లీడర్ అవడానికి ఒక కారణమైంది చూడు... అది నాకు భలే థ్రిల్ అనిపించింది. కానీ నీకు ఆ విషయం ఎప్పటికీ తెలీదేమో అని కూడా అనిపించింది.

వీళ్ళే కాకుండా నీ సస్పెన్స్ నవలలని పబ్లిష్ చేసి అసలు నవ్వడమే మర్చిపోయి, నువ్వొస్తున్నానంటే తను లేనని తన ఎసిస్టెంట్ మాణిక్యం చేత చెప్పించే నీ ఫ్రెండు, నువ్వు రాసిన నవలని ఐదు గంటలు వినలేక అయ్యగారు పైనున్నారని నిజం చెప్పేసే మాణిక్యం - ఇదో చిన్న సైడ్ గ్యాంగ్ - మరి వీళ్ళూ నీ వాళ్ళేగా!

ఇంకో విషయం మర్చిపోయాను. ఆ సంతూర్ శనక్కాయల వున్నాడు చూడూ అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా వుండు బాబూ! ఎందుకైనా మంచిది. వాడు చూడ్డానికి బానే వున్నాడు కానీ వాడి వాలకమే నాకు నచ్చలేదు "పెన్సిల్ గాడూ, పెన్సిల్ గాడూ" అనుకుంటూ.

మీ గ్యాంగుకి వాళ్ళ ఆశయం ఫలించేలా సహాయం చేస్తూ, వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ కథనే రాస్తూ, ముందేం జరగబోతోందో ఊహించి రాస్తూ, అందులో రాబోయే కష్టమేదైనా ముందే తెలిస్తే ఆ రాతని చెరిపేస్తూ, వాళ్లకి ఏ కష్టమూ రాకుండా చూస్తూ భలే నడిపావబ్బాయ్ నీ ఇరవై తొమ్మిదో నవలని! అది ప్రింటులో ఎప్పుడొస్తుందో చెప్పు నేనూ కొనుక్కుంటా.

అవునూ ... నువ్వు నీ నవలని నీ అభిమానులకి సంతకం చేసి ఇచ్చే టైంలో ఆ డైరెక్టర్ సుకుమార్ వచ్చాడు కదా? అదే... నువ్వు ఆయన తీసిన "డ్రామాలాండ్" గురించి కూడా అడిగావూ... గుర్తొచ్చిందా? ఆయనేంటీ ...  నీ తర్వాతి నవలని సినిమా తీస్తానన్నాడా? అలా అయితే నువ్వే హీరోగా వుండాలని డిమాండ్ చెయ్యి. ఏం... ?

మీ ఇద్దరూ కలిసి మళ్ళీ ఓ డ్రామాలాండో, గుంపు నాయకుడో తీశారనుకో కళ్లారా చూసి నోరారా పొగుడుతా.  ఆలోచించుకో మరి! అవునూ... నీ ఇరవై తొమ్మిదో నవలకి ఇంతకు ముందు రాసిన ఇరవై ఎనిమిది నవలలకీ పెట్టినట్లు అచ్చతెలుగు పేరు "గుంపు నాయకుడు" అని పెట్టావా? లేకపోతే మీ గ్యాంగ్ గుర్తుగా "గ్యాంగ్ లీడర్" అనే ఉంచేశావా?

అద్సరే గానీ... ఆ కార్ రేసర్ దేవ్ ఎత్తులకు పైయ్యెత్తులు భలే వేశావ్! ఎంతైనా బోల్డన్ని సస్పెన్స్ నవలల "కాపీ-రైటు" నీది కదా! ఇక్కడో మాట చెప్పాలి మళ్ళీ నే మర్చిపోకముందే. అదేంటంటే ఆ దేవ్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నటిస్తూ రేసులు జరిగే చోటికి వెళ్ళినప్పుడు అక్కడో టీవీ కంపెనీ వేన్ వుంది కదా - "గీతా టీవీ" అంటూ?! ఆ వేన్ మీద ఓ పక్కగా గీతాచార్యుడు కృష్ణుడు - అదే పార్థసారథి - ఎక్కిన రథం లాంటి లోగో భలే వుందోయ్!

ఆ అనిరుద్ధుడెవరు బాబూ? చివర్లో ఒచ్చి నీతో పాటు పాట పాడుతూ గంతులేసిన ఆ పిల్లాడేనా? ఆయన చేసిన సంగీతమేంటబ్బా నీ కథకి? ఒక్క పాట పాటలా లేదు... మాటలని సాగదీసుకు పోయిన పడరాని పాటులా వుంది తప్ప. పైగా ఎక్కడ పడితే అక్కడ Peanuts theme music తెగ వాడేశాడు. ముఖ్యంగా నువ్వేదో కబుర్లు చెప్తూ ఉంటే మీ గ్యాంగ్ అంతా నీతో పాటు బాత్రూంలోకి వచ్చేస్తారు చూడు - అక్కడ వెనకాల వస్తున్న Peanuts వారి సంగీతం భలే వుంది కానీ దాని క్రెడిట్ మీ అనిరుద్ధుడు తాను కొట్టేయడం మాత్రం నాకు నచ్చలేదు. అదిమా ఇంట్లో మేం పదేపదే చూసే comic series, పైగా మా బుజ్జిజింకల కిష్టమైన ట్యూన్. అనిరుద్ధుడికి చెప్పు సంగీతాన్ని పీడించే  "కొలవెరి" తగదని.

అన్నట్టు ఇంకో విషయం - నువ్వూ, నిన్నిష్టపడీ పడనట్టున్న హీరోయిన్ను ఎక్కడికో వెళ్ళిపోయి చలిలో ఉల్లిపొర పరికిణీ-స్లీవులెస్సు జాకెట్టు వేసుకుని ఆవిడా, ఫుల్లుగా కోటూ-జాకెట్టూ తొడుక్కుని నువ్వూ ఒణుక్కుంటూ మంచుకొండల్లో స్టెప్పులేయలేదు చూడు - నాకది తెగ నచ్చేసింది.

ఆ చిన్నపాపాయి చిన్నూ పుట్టింరోజుకి తనాశ పడ్డ బుల్లి సైకిలు కొన్నావు. చాలా సంతోషం. అలా చెప్పీ చెప్పని విషయాల్ని చూసి గ్రహించి నువ్వు అందర్నీ సంతోషపెట్టడం భలే బాగా అనిపించింది.

మొత్తానికి భలే గ్యాంగ్ నీది...! ఆ దేవ్‌కి ఎంత కుళ్ళో చూడు... ఎంతసేపూ నిన్ను "గ్యాంగ్‌లో ఒకడు, గ్యాంగ్‌తో ఒకడు, గ్యాంగ్‌కి ఒకడు" అంటాడే కానీ నువ్వే "గ్యాంగ్ లీడర్ " అనడానికి వాడికి నోర్రాదే ! హన్నా! మొత్తానికి వాడికి బానే బుద్ధి చెప్పావ్! సెబాసు, పెన్సిల్ పార్థసారథీ!

ఇదిగో ... నువ్వూ, నీ గ్యాంగూ భలే నడిపారు కథ. నవ్వించేటప్పుడు నవ్వించారు, మీతో పాటు ఏడ్చేలా చెయ్యకపోయినా "అయ్యో! పాపం!" అనిపించేలా చేశారు. భలే తెలివైనవాళ్లు వీళ్ళు అనిపించారు. బామ్మ భలే వుంది. అమ్మ హాయిగా వుంది. అమ్మాయిలు పద్ధతిగా చూడముచ్చటగా ఆడపిల్లల్లా వున్నారు. ఆ చిన్నూ ముద్దుగా వుంది. ఏమాటకామాట చెప్పుకోవాలి - అంటా బానే వుంది కానీ - మీరంతా ఆ రేసర్ దేవ్ గాడి కంట్లో మీరు పడే వరకూ అలా బైనాక్యూలర్స్ పట్టుకుని మరీ చూస్తూ నించోవడం అంతవసరమా? అదేదో పాత సినిమాల్ లోహీరోయిన్ను గోడ చాటుగా నిలబడి విలన్ ప్లాన్ అంతా విని కిటికీలోంచి ఆ విలన్ కంట్లో పడి "నే వెళ్లి నీ సంగతి మా హీరోతో చెప్పేస్తా" అని కష్టాల్లో పడ్డ సీన్లు నువ్వెన్ని చూసుండవ్? మరి నువ్వూ అలా చేశావేంటా అనుకున్నా కానీ పోన్లే అలా చెయ్యకపోతే నీ కథ ఎలా నడిచేదీ అని సర్దేసుకున్నా!

ఇంకో మాట - ఇంత బావున్నా, ఎంత బాగా చేసినా "అంతా బానే వుంది కానీ..." అనే వాళ్ళు ఉంటూనే వుంటారు. వాళ్ళని ఆట్టే పట్టించుకోకు. నీకు "If you give a pig a pancake... " కథ తెలుసా? ఇచ్చే కొద్దీ ఇంకేదో కావాలని అడిగే వాళ్ళెప్పుడూ వుంటారు... అవన్నీ ఇవ్వాలంటే మూడుగంటలు సరిపోదు. అలాంటి వాళ్ళకి పిగ్గూ-పేన్కేకూ కథ చెప్పి  దండమెట్టెయ్.

మొత్తానికి నే చెప్పొచ్చేదేంటంటే ... సెబాసు, పెన్సిల్ పార్థసారథీ! భలే గ్యాంగ్ నీది...!!!

ఇట్లు,
సినీ-మా-లక్ష్మి వ్రాలు


6 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నీకలా అనిపించినందుకు, నీకనిపించింది వచ్చి నాకు ఇలా చెప్పినందుకు బోల్డన్ని థాంక్స్, ఉమా!

      తొలగించండి
  2. భలే బాగుంది రివ్యూ లలిత గారు. ఇలా తీసి ఉంటే బాగుండేది అలా తీసి ఉంటే బాగుండేది అనే రొటీన్ రివ్యూ లకు భిన్నంగా.

    రిప్లయితొలగించండి
  3. బావుందండీ మీరు గాంగ్-లీడర్ని వీక్షించిన విధం. నాని "భక్తులు"గా మేం కూడా చూసేశాం. ఈ సినిమా చూశాక చాలామంది "Ooops" అనేమాట మర్చిపోడానికి ట్రై చెయ్యడం మాత్రం గారంటీ 😄.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. YVR గారు! భలే! Oops గురించి భలే పట్టారు! నాకు తట్టనేలేదు :)

      తొలగించండి